2 May 2014

అరేబియన్ నైట్స్ కధలు (‌ వేయిన్నొక్క రాత్రులు‌)




స్కూళ్లకు వేసవి సెలవలు ఇచ్చేసారు. పిల్లలకు సంతోషం! పిల్లలు హాయిగా,సంతోషంగా ఆటపాటలతో సమయం గడుపుతారు. పల్లెలో,పట్టణాలలోని మైదానాలు, ఆటస్థలాలు పిల్లలతో నిండి పోతాయి. గోలీల ఆటనుంచి, కర్రా- బిళ్ళ,క్రికెట్ ,క్యారమ్ బోర్డు,పిన్-బోర్డు  వంటి ఆటలతో పిల్లలు సమయం గడుపుతారు. వీటితో పాటు లైబ్రరీ కి వెళ్ళి కధల  పుస్తకాలు,నవలలు. పేపర్ల్లు చదువుతుంటారు.సినిమాలు షికార్లతో కాలం గడుపుతారు. అమ్ముమ్మ,తాతయ్య,అత్తయ్య,మామయ్య,బాబాయి వంటి బంధువుల ఇళ్లకు వెళుతుంటారు. కొంతమంది విహార యాత్రలకు వెళ్తుంతారు. 
బాలలు కధల పుస్తకాలు చదివారు కథ! చందమామ,బాలమిత్రా,బొమ్మరిల్లు,బాలానందం వంటి పిల్లల కధల పుస్తకాలు, తెనాలి రామలింగడు, దాన హకిమ్,బీర్బల్ కధలు,  ముల్లా నాసిరుద్దీన్ కథలు వంటివి చదివి ఉంటారు. కామిక్స్, అమర్ చిత్రా కధలు చదివి ఉంటారు. మంచిది మీరు ఎప్పుడైనా అరేబియన్ నైట్స్ కధలు చదివారా? ఇవాళ ప్రపంచంలో అత్యధిక ప్రచారం పొంది పండితులను, పామరులను, వృద్ధులను, పిల్లలను, స్త్రీ పురుష భేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తూ, అందరిచేత చదువబడుతూ ఉన్న గ్రంథాల్లో అరేబియన్ నైట్స్ఒకటి. దానికే తెలుగులో ఇంకో పేరు వేయిన్నొక్క రాత్రులు' దానిలోని హతింతాయి,ఆలీబాబా-40దొంగలు, బాగ్దాద్ గజదొంగ, అల్లావుద్దీన్ అత్భుత దీపం సింద్ బాద్ సాహసయాత్రలు వంటి కదలు చదివారా? చదవక పోతే వెంటనే లైబ్రరీ కి వెళ్ళి చదవండి? 
అరేబియన్ ఒక బృహత్ కథల భండాగారం. దీని గ్రంథకర్త ఎవరో తెలియదు. శతాబ్దాల తరబడి ఎందరో రచయితలు సేకరించి ఒకచోట చేర్చిన కథల సముదాయం ఇది. ఈ కథల మూలాలు అరేబియా, పర్షియా, ఇండియా, ఈజిప్టు మొదలైన దేశాల అతి ప్రాచీన కాలపు కదలు. వీటిని క్రీ.శ. ఎనిమిదో శతాబ్దిలో అరబీ భాషలోకి తర్జుమా చేశారు.
తొమ్మిది, పది శతాబ్దాల్లో అరబీ కథలు కొన్నింటిని వీటిలో చేర్చారు. పదమూడో శతాబ్ది వచ్చేసరికి ఈజిప్టు, సిరియా కథలు కలిసినవి. ఆధునిక కాలంలో మరికొన్ని కథలను కలుపుకొని, ఇవి మొత్తం పేరుకు తగ్గట్టు వేయిన్నొక్క రాత్రులకు సరిపడా తయారైనవి
వేయికి మించిన ఈ కథలు వేటికవి స్వతంత్రమైన కథలుగా పైకి కనిపించినా, వీటన్నింటిని
కలుపుతూ ఒక ప్రధాన కథ. ఆ ప్రధాన కథలో అంతర్భాగంగా అనేకమైన ఉపకథలు ఉంటవి. ఒక్కో ఉపకథలో అంతర్భాగంగా ఇంకో చిన్న కథ ఉంటుంది.
అనగా అనగా పర్షియా అనే ఒక దేశం. ఆ దేశానికో రాజు. ఆ రాజు పేరు షహెరియార్.
ఆయనకో భార్య. ఆ భార్య అంటే అతడికి ప్రాణం. అట్లాంటి భార్య, రాజు కళ్ళుగప్పి ఇంకొకడితో సుఖించటానికి అలవాటు పడింది. ఇది అతడికి తెలిసింది. తట్టుకోలేకపోయాడు. నమ్మకద్రోహం చేసిన ఆమెను క్షమించలేకపోయాడు. అప్పటికప్పుడే తలారుల్ని పిలిపించి ఉరితీయించాడు. మనసుకు తగిలిన పెద్ద గాయం, స్త్రీల పట్ల అతని దృక్పథాన్నే మార్చివేసింది. అందరు స్త్రీలు అటువంటి వారే అనే తప్పుడు నిర్ణయానికి వచ్చాడు.  దాంతో ఆగలేదు. వరుసబెట్టి కన్యల్ని వివాహమాడటం, వివాహమాడిన మరుసటి ఉదయమే ఆమెను ఉరితీయటం చేస్తున్నాడు.  చివరకు దేశంలో కన్యలు మిగలకుండా పోయారు.
రాజుకు ఓ మంత్రి (వజీరు) ఉన్నాడు.అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పేరు షెహెరాజాద్, అతిలోక సుందరి. అత్యంత తెలివిగలది. తండ్రి దగ్గర నుండి విషయం తెలుసుకొని, ఈసారి తనను రాజు దగ్గరకు పంపమని అడిగింది. ఇష్టం లేకపోయినా కూతురు బలవంతం మీద ఒప్పుకున్నాడు. వివాహం నాటి రాత్రి షెహెరాజాద్ రాజుకు కథ చెప్పటం మొదలుపెట్టింది. తెల్లవారుతున్నా చెబుతున్న కథను ముగించేది కాదు. రసవత్తర ఘట్టం మధ్యలో ఆపేది. రాజుకు ఉత్కంఠ తర్వాత ఏమవుతుందో, ముగింపు ఎట్లా ఉంటుందో అని. అది వినటానికి రాజు ఆమె ఉరిని వాయిదా వేసేవాడు. మర్నాడు రాత్రి మళ్ళీ అలాగే. కిందటి రాత్రి కథ ముగించి వెంటనే కొత్త కథ ఎత్తుకొనేది. తెల్లవారుతున్నా ఆ కథనూ ముగించేది కాదు. మాంఛి రసవత్తర ఘట్టంలో ఆపేది. రాజుకు మళ్లీ ఉత్కంఠ. తర్వాత ఏమవుతుందో అని. అది తెలుసుకోవటానికి రాజు ఆమె ఉరిని వాయిదా వేసేవాడు. మర్నాడు రాత్రి మళ్ళీ అట్లానే. ఇట్లా ఒక రాత్రి కాదు, రెండు రాత్రులు కాదు, వేయిన్నొక్క రాత్రులు గడుస్తవి. చివరికి ఆ రాజు షెహెరాజాద్‌ను క్షమించెయ్యటంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ కథలలో చారిత్రక గాధలు, ప్రేమగాధలుహాస్య గాధలు, పద్యాలు, ధార్మిక పరమైన గాధలు, అద్భుత శక్తులు, భూతాలు, రాజుల సాహస గాధలు, నౌకాయానాలు-ప్రమాదాలు వగైరాలు ఉన్నాయి.  ఒకటేమేటి అరేబియన్ నైట్స్ కధలు అనేక విచిత్ర గాధల సమాహారం. సాహాస గాధలు, మంత్రగత్తెల తంత్రాలు, జిన్నుల కథలు, మంత్రతంత్రాల కథలు, ప్రాముఖ్యంగల ప్రదేశాల గాధలు, సాంస్కృతిక చరితలు, భౌగోళిక ప్రదేశాలు మరియు ప్రజల గాధలు ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు, కోతులు, మంత్రగత్తెలు, ఇంద్రజాలికులు ఎందరో వస్తారు. జంతువులు మనుషుల్లా మాట్లాడటం, అలా ప్రవర్తించటం ఈ కధల లో జరుగుతాయి. చాలా కథలు, కథానాయకుడు చిక్కుల్లో పడినప్పుడో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడో అర్థాంతరంగా ముగిసి ఉత్కంఠను రేపుతాయి  ఖలీఫా యైన హారూన్ అల్-రషీద్ అతని ఆస్థాన కవి అబూ నువాస్ మరియు మంత్రి జాఫర్ అల్ బర్మకీ ల గాధలు సర్వసాధారణం. కొన్ని సార్లు అయితే షెహ్ర్ జాది, తన స్వీయ గాధలనే కథలుగా అల్లి చెప్పేది.
అరేబియన్ నైట్స్ గాధలలో  ఎక్కువ ప్రాచుర్యం పొందినవి, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ ‘సింద్‌బాద్ సాహస యాత్రలు’.కీలుగుర్రం, బాగ్దాద్ ఖలీఫా రాత్రి వేల చూసిన విచిత్ర కదలు ముఖ్యమైనవి.
ఈ కధలను తెలుగు, ఇంగ్లిష్, ప్రపంచంలోని అన్నీ భాషలలోనికి తర్జమా చేసి ప్రచురించారు. అరేబియన్ నైట్స్ కథల ఆధారంగా ఎన్నో సినిమాలు, టీ.వీ. సీరియళ్ళు నిర్మింపబడ్డాయి.
 సినిమాలు:
బాగ్దాద్ గజ దొంగ  (తెలుగు) ,అలీబాబా నలభై దొంగలు (తెలుగు) అల్లావుద్దీన్ అత్భుతదీపం (తెలుగు)  సింద్ బాద్ సాహసయాత్రలు (ఇంగ్లీషు) ప్రిన్స్ ఆఫ్ పర్షియా (ఇంగ్లిష్) మొదలగునవి.
'The Thief of Bagdad',వాల్ట్‌డిస్నీ కంపెనీ వారు తీసిన కార్టూన్ సినిమా బహుళ ప్రజాదరణ పొందినవి
టీ.వీ. సీరియళ్ళు:  అలీఫ్ లైలా (హిందీ)
ఆటలు: ఎన్నో ఆటలూ ప్రవేశ పెట్ట బడ్డాయి, ఉదాహరణ కంప్యూటర్ గేమ్ అయిన 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా', 'అలాదీన్' లాంటి ఆటలు వచ్చాయి.
ప్రపంచ సాహిత్యంలో అరేబియన్ నైట్స్ కధలకు ఒక ప్రత్యేకమైన స్థానముంది.ఈ కధలు స్త్రీ, పురుషులకు, పండిత పామరులకూ కూడా ఎంతో వినోదాన్ని కలిగించేవిగా, ఆశ్చర్యచకితుల్ని చేసేవిగా రచింపబడి శతాబ్దాల తరబడి ప్రపంచంలో అధిక ప్రాచూర్యాన్ని పొందాయి.
పిల్లలు ఈ సెలవలలో తప్పని సరిగా అరేబియన్ నైట్స్ కధలు లేదా వెయ్యినొక్క రాత్రి కధలు చదువుతారు గదా! పాత చందమామ, బొమ్మరిల్లు వంటి వాటిని వెతికితే ఈ కథలు కొన్ని అయినా వాటిల్లో దొరుకుతవి.





















1 comment:

  1. Ee kada chala bagundi.
    Naku inka..
    Full story kavali friend
    Please.. Please..

    ReplyDelete