5 April 2013

హుగో చావేజ్ (1954-2013)


ప్రజల మనిషి, వెనిజులా అధ్యక్షుడు ఆయిన58 సంవత్సరాల హ్యూగో చావెజ్ గత 14 సంవత్సరాలుగా వెనుజులా అధ్యక్షుడిగా కొనసాగుతూ , పీడిస్తున్న కేన్సర్‌ వ్యాధితో కారకాస్ లోని ఆసుపత్రిలో 5-3-2013  మంగళవారం నాడు మరణించినాడు. చావేజ్ స్టానంలో మడురో తాత్కాలిక అద్యక్షుడిగా ఎన్నికైనారు
1999 నుంచి ఆయన వెనిజులా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడిగా 1999 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. 1997లో రిపబ్లికన్ మూవ్‌మెంట్ పార్టీని స్థాపించారు. వెనిజులాకు నాలుగో సారి అధ్యక్షుడిగా 2012 అక్టోబర్ 7న ఎన్నికయ్యారు. 1954 జులై 28న ఆయన జన్మించారు. 2013 మార్చి 5న తుదిశ్వాస విడిచాడు
 వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అమెరికన్‌ సామ్రాజ్యవాదమనే కొండతో నేరుగా డీ కొని విజేతగా నిలబడి తన ప్రజల గుండెల్లో చిర స్థానం సంపాదించుకొని, పధ్నాలుగేళ్ళు వెనిజులాను పరిపాలించిన సోషలిస్టు ప్రజాస్వామిక విప్లవ వీరుడు చావెజ్‌. కుటిల నీతిని పాటిస్తూ అమెరికా, దాని సోదర దేశాల కూటమి సాగిస్తున్న కుట్రలను తట్టుకోవడంలో క్యూబన్‌ విప్లవ సారథి ఫెడల్‌ కాస్ట్రోకు వెన్నుదన్నుగా నిలిచిన ధైర్యశాలి, సాహసి చావెజ్‌.
వెనుజులలోని బారినాస్ రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో1954 జులై 28న  జన్మించి,అమ్మమ్మ రోసా ఇనెస్ ఇంటిలో పెరిగిన చావెజ్ యుక్త వయసులో చిత్రకారుడు గానీ అమెరికాలోని ప్రధాన క్రీడా జట్లలో సభ్యుడు గానీ కావాలని కాంక్షించాడు. ఆ తర్వాత బేస్‌బాల్ క్రీడవైపు ఆకర్షితుడైన చావెజ్ 16వ ఏట సైనిక దళంలో చేరి లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి పొందాడు. 1992లో అప్పటి నాయకుడు ఆండ్రెస్ పెరెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించి,తిరుగుబాటు విఫలం కావటంతో జైలు జీవితం గడిపినాడు. 1994లో వెనెజులా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన రాఫెల్ కాల్డెరా క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదలైన చావెజ్ దేశంలో అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బొలీవరియన్ రివల్యూషన్పేరుతో సొంత పార్టీని ప్రారంభించచారు. 19వ శతాబ్ధపు వెనెజులా స్వాతంత్రోద్యమ యోధుడు సైమన్ బొలీవర్ పేరుతో ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు ఏకంగా దేశం పేరునే బొలీవరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనెజులాగా మార్చేశారు. చావెజ్ స్వంత రాజకియ సిద్ధాంతం-బొలివియనియం.  చావెజ్ యునైటెడ్ సోషలిస్ట్ పార్టి ఆఫ్ వెనిజులా పార్టీకి చెందినవారు-- హ్యూగో చావెజ్ వెనిజులా అధ్యక్షుడిగా 1999 లో అధికారంలోకి వచ్చారు
వెనిజులా దేశాధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలినాళ్లలో 80 శాతానికి పైగా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ముఖ్యంగా రాజధాని కారకస్ మురికివాడల్లోని ప్రజలంతా చావెజ్‌ను దైవంలా ఆరాధించారు. 2002లో సైనికాధికారుల కుట్రకు పాల్పడి చావెజ్‌ను అధ్యక్ష పీఠం నుంచి దించేసినప్పటికీ ప్రజల మద్దతుతో ఆయన కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత లాటిన్ అమెరికా నుంచి మధ్యప్రాచ్యం వరకూ ప్రతి ఇంటా చావెజ్ పేరు మార్మోగిపోయింది. హల్లో ప్రెసిడెంట్‌ అనే టెలివిజన్‌ కార్యక్రమం ద్వారా ప్రజలతో సాన్నిహిత్యాన్ని పోషించుకున్న జన నేత చావెజ్‌. 
 విదేశాలు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలు చావెజ్‌ను అపార్ధం చేసుకున్నాయని ఆయన మిత్రులు చెబుతుంటారు స్వప్రయోజనాలనే పరమావధిగా ఎంచుకున్న వ్యాపారులు, పెట్టుబడిదారుల నుంచి ఎన్నో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న చావెజ్ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేయడంతో పేద ప్రజలు నిరంతరం ఆయనను ఆరాధ్య దైవంగా కొలిచారు. కమ్యూనిస్టు దేశమైన క్యూబాను, ఆ దేశాధినేత ఫిడెల్ క్యాస్ట్రోను ఎప్పుడూ ప్రశంసలతో ముంచేసే చావెజ్‌కు ఇరాన్ వంటి అమెరికా వ్యతిరేక దేశాలు కూడా ఎంతో అండగా నిలిచాయి. కాస్ట్రో సలహా మేరకే చావెజ్‌ తన దేశంలో పేదలకు ఇళ్ళు, ఉచిత ఆరోగ్య సేవలు, సబ్సిడీపై ఆహారం వంటి కార్యక్రమాలు అమలు పరిచి వారి హృదయాలను చూరగొని వరుసగా దేశాధికారాన్ని చేజిక్కించుకుంటూ వచ్చాడు
సైన్యంలో చేరి వామపక్ష తిరుగుబాటు భావజాలం వైపు ఆకర్షితుడై పేదల పక్షపాతిగా పేరొంది ప్రజాస్వామ్య మార్గంలో అధికారం చేజిక్కించుకొని వెనిజులా ఆయిల్‌ సంపదనే ఆయుధంగా చేసుకొని తన సోషలిస్టు స్వప్నాన్ని సాకారం చేసుకున్న ఘనుడతడు. సైమన్‌ బొలివర్‌ను ఆదర్శంగా తీసుకొని లాటిన్‌ అమెరికన్‌ దేశాలను సమైక్య పరచి అమెరికన్‌ పెట్టుబడిదారీ పడగ నీడ నుంచి వాటిని కాపాడడానికి నడుం బిగించిన అకుంఠిత దీక్షాపరుడు. అమెరికా ఆధిపత్య పోకడలు మానవజాతి మనుగడకే ముప్పు కలిగించేవిగా తయారయ్యాయని ఐక్యరాజ్య సమితి వేదిక మీదినుంచే ప్రపంచాన్ని హెచ్చరించిన వాడు, ప్రెసిడెంట్‌ జార్జి డబ్ల్యు బుష్‌ను మానవ ద్వేషిగా, దయ్యంగా వర్ణించినవాడు. వెనిజులాలో తిష్ఠ వేసుకున్న అతి పెద్ద అమెరికన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ల ఆస్తులను జాతీయం చేసి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ డిపోల ద్వారా చౌక ఆహారాన్ని అందించి క్యూబా నుంచి డాక్టర్లను రప్పించి మురికి వాడలలో క్లినిక్‌లు నిర్వహించి పేదల పెన్నిధి అనిపించుకున్న విలక్షణ జన హిత నేత చావెజ్‌.
అమెరికా పెరటిలోనే దానికి కొరకరాని కొయ్యగా తయారైన ఈక్విడార్‌, బొలివియా వంటి దేశాలతో కలిసి ఐక్య సంఘటనను రూపొందించాడు. తనలాగే అవికూడా తమ దేశాల్లోని అమెరికా రాయబారులను బహిష్కరించేలా చేశాడు

అమెరికా విధానాలతో విభేదిస్తున్న ఇరాన్‌, చైనా, రష్యాలు చావెజ్‌ స్మృతికి నివాళులర్పించి ఆయనను అసాధారణ నేతగా కొనియాడడం గమనార్హం.
·       చావెజ్‌ మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఇరాన్‌ ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది.
·       చావెజ్‌ అసాధారణ బలమైన నేత అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నివాళులర్పించారు.
·       వేలు లక్షల సంఖ్యలో చావెజ్‌లు పుట్టుకు రావాలని ఆయన వామపక్ష విప్లవ సారథి అని కాస్ట్రో కీర్తించాడు
·       చావెజ్‌ గొప్ప నాయకుడు, గొప్ప మిత్రుడు అని చైనా కొనియాడింది.
·       వర్ధమాన దేశాల మధ్య మైత్రీ బంధాన్ని పెనవేసిన నాయకుడని భారత  ప్రధానిఅన్నారు.
·       2005, 2006లలో టైమ్ మేగజైన్ చే ప్రపంచాన్ని ప్రభావితం చేసే 100 మంది ప్రముఖులలో చావెజ్ స్థానం పొందినాడు. 
ముగింపు:
వెనెజులా అధ్యక్ష పదవిని చేపట్టడమే కాకుండా అనేక లాటిన్ అమెరికా దేశాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఘనత హ్యూగో చావెజ్‌దే. 14 ఏళ్ల పాటు వెనెజులాను పరిపాలించిన ఆయన నాయకత్వ౦ దేశ ప్రజలపై చెరగని ముద్ర వేసింది.
 మాటలకూ, చేతలకూ మధ్య తేడాలేని నేతగా వెనెజులాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అధినాయకుడిగా చావెజ్ సాధించిన విజయాలు అనేక దేశాలకు స్ఫూర్తిదాయకం. ఎంతటి పదునైన మాటలు, సైద్ధాంతిక భావనలు వెళ్లగక్కగలరో అంతే స్ఫూర్తిదాయకంగా హాస్యోక్తులను రంగరించే చైతన్యం ఆయనలో కనిపించేంది. ఆయన ప్రతి ప్రసంగం కూడా వెనెజులా ప్రజలను అనూహ్య రీతిలో ప్రభావితం చేసింది. భావోద్వేగాలను రగిలించింది. తన 14 ఏళ్ల అధ్యక్ష పదవీ కాలంలో వెనెజులాను ఆర్థికంగా తీర్చిదిద్దారు. అనేక విధాలుగా దానిని గట్టెక్కించారు. అలాగే తాను అనుకున్న సంస్కరణలను ఏటికి ఎదురీది మరీ అమలు చేశారు. తనను నియంతగా ప్రత్యర్ధులు అభివర్ణించినప్పటికీ వెనెజులా ప్రజల అభిమానాన్ని, ఆదరణను ఆయన చూరగొన్నారు.
చావెజ్‌ నాయకత్వంలో దాదాపు దశాబ్దిన్నర పాటు నడచిన వెనిజులా సాధారణ ప్రజానీకం చైతన్యమే సోషలిస్టు పంధాలోని వెనిజులాను అదే దారిలో నడక కొనసాగించేలా చేయవలసి ఉన్నది. ప్రజలు నేలకు వేసిన బంతుల్లాంటివారు. అణచివేత, దోపిడీలు దుర్భరంగా మారినప్పుడెల్లా చావెజ్‌లు వారినుంచి పుడుతూనే ఉంటారు






. 

No comments:

Post a Comment