20 March 2018

హ్యాపీ వరల్డ్‌ స్లీప్‌ డే

తీరిక లేకుండా చేసే ఉద్యోగాలు, జీవితంలో మోసే బాధ్యతలు మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురిచేస్తుంటాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేము. ఫలితంగా సహజ సిద్ధంగా చక్కటి ఆరోగ్యం లభించే పరిస్థితిని కోల్పోయి నిత్యం ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటాము. బహుశా అందుకేనేమో.. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండంటూ ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజులు పెట్టారనుకుంటా. వివధ దినోత్సవాల మాదిరిగానే మార్చి 16కు కూడా ఒక ప్రత్యేకత ఉంది.

అదే ప్రపంచ నిద్ర దినోత్సవం (వరల్డ్‌ స్లీప్‌ డే-మార్చి 16). మన దేశంలో దీనికి పెద్దగా ప్రాధాన్యత, గుర్తింపు లభించనప్పటికీ వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని తప్పకుండా పాటిస్తారు. ఆ రోజు భిన్నచర్చలు జరుపుతుంటారు. వాస్తవానికి శరీరానికి విశ్రాంతి లేకుంటే ఏం చేయలేము.. చేసినా అది స్పష్టంగా ఉండదు. శరీరంలోని ప్రతి భాగం సమన్వయం కావాలంటే నిద్ర తప్పనిసరి. అందుకే ప్రతి మనిషి రోజు కనీసం 8గంటలైనా నిద్రపోవాలని ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెబుతుంటారు. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిద్రతో వచ్చే లాభాలుపలువురు, వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పారు.. వాటిని ఒకసారి పరిశీలిస్తే..

1.ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఉత్పాదక శక్తి పెరుగుదల
మెదడు సక్రమంగా పనిచేయడంలో నిద్రనే కీలక పాత్ర పోషిస్తుంది. అది సరిగా పనిచేస్తే మంచి ఉత్పాదక శక్తి, ఏకాగ్రత లభిస్తుంది. గొప్పగా, తెలివిగా పనిచేయడంలో సహకరిస్తుంది. మంచి జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా నిద్ర ఉపయోగపడుతుంది.

2.క్రీడల్లో, వ్యాయామాల్లో రాణింపజేస్తుంది
సరైన నిద్ర అథ్లెటిక్స్‌లో బాగా రాణించేలా చేస్తుంది. అలాగే, దేహదారుఢ్యం చక్కగా ఉంచుకునేందుకు చేయాల్సిన వ్యాయామానికి సహకరిస్తుంది. మానసిక చలనత్వం వేగంగా చేస్తుంది.

3.రోగ నిరోధకశక్తి పెంపొందుతుంది
చక్కటి నిద్రతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిర్ణయించిన 8గంటల లోపుకంటే ఎవరు తక్కువగా నిద్రిస్తారో వారిలో జలుబు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎదుర్కోవడం 8గంటలకంటే ఎక్కువ నిద్రపోవడంతోనే సాధ్యం అవుతుంది.

4. ఒళ్లు నొప్పులు తగ్గిస్తుంది
గాఢమైన నిద్ర శరీరంలోకి కలిగే నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. సరిగా నిద్రపోకుంటే శరీరంలోని కణాలు దెబ్బతినే అవకాశం ఎక్కువవుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నొప్పులకు సంబంధించిన  రోగాలు బయలుదేరతాయి.

5. నిద్రలేమితో కష్టమే
నిద్రలేమితో శరీరంలో అమితంగా కొవ్వుపేరుకుపోతుంది. ఒబేసిటీకి నిద్రలేమి ముఖ్యకారణం. నిద్ర తక్కువగా పోవడం మూలంగా హార్మోన్లలో సమన్వయం పోతుంది. పైగా వ్యాయామం చేయాలనే ఆలోచనను కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర కూడా అవసరం.

6. భావోద్వేగాల నియంత్రణ, సామాజిక సంబంధాలు
మంచి నిద్ర వ్యక్తులను భావోద్వేగాల పరంగా బలమైనవాడిగా మారుస్తుంది. అలాగే, తన చుట్టూ ఉండేవారితో చక్కటి సంబంధాలు కొనసాగించేందుకు కూడా సహకరిస్తుంది.

7. నిద్రలేమి వల్లే మానసిక ఒత్తిడి
నిద్రలేమి కారణంగానే మానసిక ఒత్తిడిలు వస్తాయి. 90శాతం ఒత్తిడితో బాధపడే రోగులు తగినంత నిద్రపోని వారే ఉంటారని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. చాలినంత నిద్ర పోకుంటే అప్నియా, ఇన్సోమ్నియా, ఒత్తిడివంటి సమస్యలు వస్తాయి.
ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే సహజ సిద్ధంగా లభించే నిద్రను ఆస్వాధించండి.. చక్కటి ఆరోగ్యంతో జీవించండి.. హ్యాపీ వరల్డ్‌ స్లీప్‌ డే..

No comments:

Post a Comment