17 January 2018

సముద్ర మార్గాన హజ్ యాత్ర


.Image result for indians hajj pilgrimage by ships



2022 నాటికి విమానం  ద్వారా ప్రయాణించే హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని రద్దు చేయాలని 2012 సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని 2018 జనవరి లో రద్దు చేసిన సందర్భం లో సముద్ర మార్గాన హజ్ యాత్ర తిరిగి తెర మీదకు వచ్చింది.


సముద్ర మార్గాన హజ్ యాత్ర – చారిత్రాత్మక పూర్వాపరాలు:

అరేబియా లోని హేజాజ్ ప్రాంతం మరియు ఇస్లాం యొక్క రెండు అతి పవిత్ర నగరాలు - మక్కా మరియు మదీనాలు  గొప్ప ఇస్లామిక్ వారసత్వం కలిగి ఉన్నవి. హేజాజ్ ఇస్లాం యొక్క చరిత్రలో అనేక మతపరమైన మరియు రాజకీయపరమైన  ముఖ్యమైన సంఘటనలకు సాక్షిగా ఉంది మరియు ఇది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు గొప్ప ఆకర్షణ స్థలం గా ఉంది.

జెడ్డా నౌకాశ్రయం మక్కాకు మరియు రెడ్ సీ వర్తకానికి ప్రధానమైన ఓడరేవుగా ఉన్నoడున  ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వ్యాపారులు మరియు యాత్రికులు అక్కడకు వస్తారు.  భారతదేశపు  సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, పట్టు, గంధం,సాంబ్రాణి మరియు పరిమళ ద్రవ్యాల అక్కడి ప్రజలను  విశేషంగా  ఆకర్షించుతాయి మరియు భారత నౌకల రాక కోసం వారు   ఎదురు చూస్తారు.
హజ్ కోసం మక్కాకు భారతీయుల రాక 664-712 AD లో సింధ్ పై ముస్లింల విజయాలకు ముందుగానే ప్రారంభం అయ్యిందని తెలుస్తుంది. 

మొగల్ కాలం నుండి  18 వ శతాబ్దం వరకూ, భారతీయ హజ్ యాత్రికులు మక్కాకు ప్రయాణo భూభాగ వర్తక కారవాన్ల ద్వారా  లేదా సముద్ర మర్గాన ప్రయాణ నౌకల ద్వారా జరిగేది. భారతదేశానికి వాయువ్య దిశలో ఉన్న భూభాగ ప్రయాణ మార్గం  కష్టమైనది మరియు ప్రమాదకరమైనది మరియు శత్రు భూభాగాలను దాటుతుంది. భారతీయ యాత్రికులు సాధారణంగా సముద్రం ద్వారా ప్రధానంగా ఎర్ర సముద్రం ద్వారా మరియు అరుదుగా పెర్షియన్ గల్ఫ్ ద్వారా వెళ్ళడానికి ప్రాధాన్యతనిస్తారు.

 16 వ శతాబ్దంలో బయoకరమైన సముద్రపు బందిపోటు దొంగల వలన  మరియు హిందూ మహాసముద్రంపై కఠినమైన పోర్చుగీస్ నియంత్రణ ఉండటం వలన ఎర్ర సముద్రం గుండా జెద్దా చేరటం సమస్యగా ఉండేది. భారతదేశం నుండి ఎర్ర సముద్రం గుండా  ప్రయాణిస్తున్న చాలా నౌకలు పోర్చుగీస్ వారి అనుమతి తిసుకు వెళ్లేవి. ఈ ఇబ్బందుల వలన  ఒక సమయంలో మొజుల్ ఆస్థానం లోని మత పండితులు ఈ పరిస్థితులలో మక్కా ప్రయాణం తప్పనిసరి కాదు  అని ప్రకటించారు.  

మొగల్ పాలకులు హజ్ ను  ప్రోత్సహించారు మరియు యాత్రికుల సౌకర్యార్ధం వసతులను మరియు వారి ప్రయాణం కోసం  అనేక నౌకలను  పంపించారు. గుజరాత్ లోని పురాతన నౌకాశ్రయం సూరత్, బాబూ-ఉల్-మక్కా (Bab-ul-Makkah) గా వర్ణించబడింది. అది భారతీయ భక్తుల కోసం హజ్ ప్రయాణానికి  ఒక ప్రముఖ నౌకాశ్రయంగా ఉండేది. చక్రవర్తి అక్బర్ హజ్ తీర్ధయాత్రను ప్రభుత్వ వ్యయంతో నిర్వహించిన  మొట్టమొదటి పాలకుడు మరియు అక్బర్ యాత్రికులకు సబ్సిడీలను అందించాడు. అతను మక్కాలో యాత్రికులకు ఒక ధర్మశాలను స్థాపించాడు. అక్బర్ 1570 లలో మిర్ హజ్ (యాత్రికుల నాయకుడు) గా ఒక సీనియర్ ప్రభుత్వాదికారిని  నియమించాడు మరియు తన ప్రభుత్వ అధికారి అయిన అబ్దుర్ రహీమ్ ఖాన్-ఎ-ఖానన్  ను అతని నౌకలను - ది రాహిమి, ది కరీమి మరియు ది సలారి లను  యాత్రికుల ఉచిత రవాణా కోసం కేటాయించమని కోరాడు. 

జహంగీర్ మరియు షాజహాన్ల హయాంలో హజ్ తీర్థయాత్రకు మద్దతు తక్కువ స్థాయిలో కొనసాగింది. షా జహాన్ మక్కా యాత్ర కోసం  మీర్ హజ్ ను నియమించినాడు.  

మొగల్ చక్రవర్తులలో అత్యంత ప్రముఖుడు మరియు సనాతనవాది గా ఖ్యాతి గడించిన చక్రవర్తి ఔరంగజేబ్ హజ్ యాత్రను విశేషంగా ప్రోత్సహించినాడు. అతని కాలం లో  ప్రతి సంవత్సరం రాచరిక నౌకల్లో రెండు వందల మంది హజ్  యాత్రికులు  ఎర్ర సముద్రం గుండా  హజ్ యాత్రకు వెళ్ళేవారు. ఔరంగజేబు కుమార్తె, జెబున్నిసా, కూడా  హజ్ యాత్రకు తన మద్దతు ప్రకటించినది.  1676 AD లో సఫీ బిన్ వాలి అల్-ఖాజ్నావి  హజ్ యాత్ర వివరాలను  తన గ్రంధమైన అనీస్-అల్- హజ్ లో నమోదు చేశాడు నేడు అది ముంబైలోని వేల్స్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంలో దొరుకుతుంది. 

మొగల్ కాలంలో ప్రజలు వివిధ కారణాల వలన హజ్ కు  పంపబడ్డారు: మతపరమైన బాధ్యత, మతపరమైన అధ్యయనాలు, మంచి సేవలకు ప్రతి ఫలం గా  మరియు వైఫల్యాలకు శిక్షగా .మరియు విరోధులను రాజకీయ ప్రవాసంలోకి పంపించడానికి హజ్ ను సమర్థవంతమైన పరికరంగా ఉపయోగించారు. చక్రవర్తి హుమయూన్ అతని సోదరుడి కళ్ళు తీసి అతనిని 1553 లో హజ్ కు  పంపాడు. అక్బర్ చక్రవర్తి తన సలహాదారు అయిన బైరమ్ ఖాన్ యొక్క క్రూర ప్రవర్తనతో విసిగి అతనిని హజ్ కు పంపాడు. చక్రవర్తి జహంగీర్ తన పెర్షియన్ వైద్యుడు అయిన హకీమ్ సద్రను సరైన చికిత్స అందించ లేదని మక్కా కు బహిష్కరించాడు. చక్రవర్తి ఔరంగజేబ్ ఖాజీ ఉల్-ఖజ్జట్ ను  Qazi ul-Quzzat రాజీనామా చేసి హజ్ కు వెళ్ళమన్నాడు. దీనితో హేజాజ్ తిరుగుబాటుదారులకు మరియు సింహాసనాన్ని ఆశించే  అభ్యర్థులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది.

భారీ వనరులను కలిగి ఉన్నప్పటికీ, ముస్లిం పురుష పాలకులు లేదా అత్యంత శక్తివంతమైన చక్రవర్తలు  లేదా అతి తక్కువ ప్రాధాన్యం గల స్థానిక నాయకులు  హజ్ యాత్ర ఎన్నడు  చేయలేదు. దానికి బదులుగా, హజ్ మరియు వాణిజ్య కార్యక్రమాలకు గా రాచరిక ( రాయల్) మహిళలను పంపడం సాధారణoగా జరిగేది.

హజ్ యాత్ర చేసిన  మొదటి మొఘల్ రాణి చక్రవర్తి హుమాయున్ భార్య  బెగ బేగం లేదా హాజీ బేగం. బాబర్ కుమార్తె గుల్ బదన్  బేగం కూడా హజ్ యాత్ర నిర్వహించారు. ఆమె 1576 లో సలిమా బేగం (అక్బర్ భార్య) తో కలిసి 40 మంది రాణివాస స్త్రీల తోడుగా సలిమి(Salimi) అనే నౌక లో రాయల్ నౌక ఇలాహి పర్యవేక్షణలో  మక్కా యాత్ర కు వెళ్లారు. ఆమె మక్కా లో 1582 వరకు ఉండి నాలుగు సార్లు హజ్ అనేక సార్లు ఉమ్రా చేసారు. 

హజ్ యాత్ర మరియు ఇతర ముస్లిం పాలకులు: బీజాపూర్ రాణి (1661 AD) మరియు భోపాల్ యొక్క రాణులు , సికందర్ బేగం (1863 AD) మరియు సుల్తాన్ జహాన్ (1903 AD) లు హజ్ చేసారు.  సికందర్ బేగం హజ్ నిర్వహించిన  మొదటి పురుష లేదా స్త్రీ పాలకులు. ఆమె తన తల్లి మరియు మాజీ రాణి క్యుడ్సియా బేగంతో పాటు 1,500 మంది మనుషులతో కలిసి హజ్ చేసారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సుల్తాన్ జహాన్ ఎస్ఎస్ అక్బర్ ఓడలో హజ్ కోసం 300 మందితో కలిసి వెళ్లారు. ఆమె జఫర్ నుండి యన్బుకు ప్రయాణించి, అక్కడి నుండి మొదట మదీనాను సందర్శించి ఆతరువాత  మక్కా వెళ్లి 1904 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. 

రాంపూర్ యొక్క నవాబ్, కల్బ్ అలీ ఖాన్, 1872 AD లో హజ్  యాత్ర చేసారు మరియు అనేక దుర్లభమైన రాత ప్రతులు  మరియు 4 వ కాలిఫు అలీకి చెందినదిగా భావిస్తున్న7 వ శతాబ్దం యొక్క  దివ్య ఖురాన్ యొక్క ఏకైక పార్చ్మెంట్ మాన్యుస్క్రిప్ట్తో సహా అనేక అరుదైన లిఖిత ప్రతులను తీసుకువచ్చారు.ప్రముఖ  ఉర్దూ కవి, దాఖ్ డెహ్లావి, అతనితో పాటు ఉన్నారు.

బ్రిటీష్ ఇండియాలో హజ్ యాత్ర:  1885 లో, బ్రిటీష్ ప్రభుత్వం ప్రసిద్ధ పర్యాటక సంస్థ థామస్ కుక్ను హజ్ తీర్ధయాత్రకు అధికారిక యాత్ర ఏజెంట్ గా  నియమించింది. "మక్కా మరియు కర్బాల లోని పవిత్ర స్థలాలకు వెళుతున్న ముహమ్మద్ యాత్రికులను కాపాడడానికి ప్రత్యేక ఏర్పాట్లను బ్రిటిష్ ప్రభుత్వం చేసింది.  1927 లో, పోలీసు కమిషనర్ బాంబే అద్యక్షతన  10 సభ్యుల హజ్ కమిటీని ఏర్పాటు చేశారు. 1932 లో పోర్ట్ హజ్ కమిటీ మరియు 1959 లో మరొక హజ్ కమిటీ నియమించ బడినది. 

1959 లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హజ్  యాత్రికుల కోసం 10 మరియు 100 రూపాయల రెండు ప్రత్యేక "హజ్ నోట్లు" జారీ చేసింది. ఈ నోట్లు భారతదేశంలో చట్టబద్ధమైనవి కావు, అయితే అవి సౌదీ బ్యాంకులతో  ఒప్పందాల ద్వారా భారత రూపాయలు లేదా పౌండ్ స్టెర్లింగ్ రూపంలోకి మార్చబడతాయి. 1959 లో, ఓడ ద్వారా ప్రయాణిస్తున్న హజ్ యాత్రికులు "డెక్ క్లాస్" లో 1,200 రూపాయలు  మరియు "ఫస్ట్ క్లాస్" లో ప్రయాణిస్తే 1,800 రూపాయలు, విమానం ద్వారా ప్రయాణం చేస్తే, "1700 రూపాయలను వెంట  తీసుకువెళ్లారు.

1950 మరియు 1960 లలో హజ్ యాత్ర యొక్క ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రస్తుతం వలే కాకుండా, మోయలిమ్లు లేదా మ్యుత్వావిఫ్స్ (moallims or mutawwifs) (యాత్రికుల మార్గదర్శకులు) ఎంపిక అధికారo యాత్రికులకు ఉండేది. మోలిమ్స్ భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు వెళ్లి యాత్రికులను  బుకింగ్ చేసే వారు. మోసాస (Moassasa) లేదా యాత్రికుల స్థాపన సంస్థ లేనందున, మోలిమ్స్ (moallims) పని పర్యవేక్షణ కు ఒక షేక్ ఉల్ మోఅల్లిమీన్ (Shaikh-ul Moallimeen), ఉండేవాడు. 1970 ల మధ్యకాలం వరకు సౌదీ ప్రభుత్వం హజ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్కౌట్స్ సేవలను ఉపయోగించింది మరియు వార్షిక ఇస్లామిక్ స్కౌట్ జంబోరీ మక్కాలో జరిగింది, దీనిలో ఇండియన్ ముస్లిం స్కౌట్స్ కూడా ఎల్లప్పుడూ పాల్గొనేవారు .

భారతీయ నౌకాశ్రయాల నుండి నడిపే అతిపెద్ద రవాణా వ్యవస్థ మొఘల్  లైన్, ఇది 1888 లో స్థాపించబడింది మరియు బ్రిటీష్ సంస్థ టర్నర్ మొర్రి సన్ చే  నిర్వహించబడేది. మొగల్ లైన్ నౌకల్లో పురాతనమైనది ఎస్ఎస్ అలవి (1924 లో నిర్మించబడింది), తరువాత SS రిజ్వాని (1930 లో నిర్మించారు). ఈ నౌకలు వరుసగా 1958 మరియు 1959 లో రద్దు చేయబడ్డాయి. ఇతర మొఘల్ లైన్ నౌకలలో ఎస్ఎస్ సౌదీ (సామర్ధ్యం 999), ఎస్.ఎస్.మహమ్మది, ఎస్ఎస్ ముజాపారి (సామర్ధ్యం 1,460), ఎస్ఎస్ ఇస్లామీ (సామర్ధ్యం 1,200), ఎం.వి. అక్బర్ (సామర్ధ్యం 1,600), ఎస్ఎస్ నూరోజిన్ (సామర్ధ్యం 1,756), ఎస్ఎస్ నికోబార్ (సామర్ధ్యం 1,170) కలవు.   1962 లో జాతీయీకరణ తరువాత, మొగల్ లైన్ నియంత్రణ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) కు వెళ్ళింది మరియు చివరకు 1987 లో ఇది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SCI తో విలీనం చేయబడింది.

సౌదీ కంపెనీ, హాజీ అబ్దుల్లా అలీరేజా & కో. లిమిటెడ్, జెడ్డాలోని మొగల్ లైన్ ఏజెంట్ మరియు ప్రవాస ఇండియన్ రఫీయుద్దిన్ S. ఫజుల్బాయ్ దాని సహాయక జనరల్ మేనేజర్. 1927 లో, మొగల్ లైన్ షిప్స్ భారత్ నుండి వచ్చిన 36,000 హజీలలో సుమారు 20,000 మందిని రవాణా చేసినవి.. 1930 ల చివరలో భారతదేశం నుండి 70 శాతం యాత్రీకుల నౌకలు మొగల్ లైన్ నాకలు. 1969 లో సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రచురించిన ఒక ఆసక్తికరమైన గణాంక అధ్యయనం ప్రకారం 1958 నుండి 1968 వరకు 10 సంవత్సరాల కాలంలో, హజ్ కోసం భారతదేశం నుంచి 200,100 మంది యాత్రికులు వచ్చారని తెలిపినది. ఈ దశాబ్దంలో హజ్ యాత్రికుల సంఖ్యలో మూడవ స్థానంలో భారతదేశం ఉంది.  యెమెన్ మరియు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ వరుసగా 321,268 మరియు 232,070 మంది యాత్రికులు పంపారు.

1960 దశకం లో  సుమారు 14,500 మంది భారతీయ హాజిలు  సముద్ర మర్గాన  ప్రయాణించినారు మరో 1,000 మంది ఎయిర్-ఇండియా చార్టర్డ్ విమానాల ద్వారా వచ్చారు. "ట్రేడ్ వింగ్స్" సంస్థ ద్వారా హజ్ కమిటీ చేత విమానాలను చార్టరింగ్ చేయడం జరిగింది. వాయు మరియు సముద్ర ఎంబార్కేషన్లు బాంబే నుంచి మాత్రమే జరిగేవి . రౌండ్ ట్రిప్ నౌక ఛార్జీల కోసం "మొదటి" తరగతికి 1,000 రూపాయలు మరియు "డెక్" తరగతికి 500 రూపాయలు గా నిర్ణయిoచబడినది.  సముద్రం ద్వారా వచ్చే  యాత్రికుల సంఖ్య క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది, 1994 నాటికి అది 4,700 కు పడిపోయింది. చివరగా 1995 లో, సముద్రయానం పూర్తిగా నిలిపివేయబడింది మరియు అందరు భారతీయ యాత్రికులు విమానయానం ద్వారా చేరుకోవడం ప్రారంభించారు. 2006 నాటికి, భారత యాత్రికుల సంఖ్య 157,000 గా ఉంది. , ఇండోనేషియా తరువాత రెండవ స్థానంలో ఉంది.





No comments:

Post a Comment