10 January 2023

ఇస్లామిక్ క్రియాశీలత/ఇస్లామిక్ యాక్టివిజం Islamic Activism

 


ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి, దివ్య ఖురాన్ ఇలా ఆజ్ఞాపిస్తుంది: కనుక(ఓ ప్రవక్తా! స్థిర సంకల్పులైన ప్రవక్తలు ఓర్పు వహించినట్లే నీవు కూడా ఓర్పు వహించు.  వారి విషయం లో తొoదరర పెట్టకు.”)-(46:35)

ప్రతికూల పరిస్థితుల్లో సంయమనం చూపడం మరియు ప్రతికూల ప్రతిచర్యలకు దూరంగా ఉండటం అనేవి ఇస్లామిక్ క్రియాశీలత యొక్క ప్రాథమిక సూత్రాలు. అననుకూల పరిస్థితులలో, ప్రతిచర్య మరియు ప్రతీకారం విడిచి పెట్టాలి. ఈ సూత్రాన్ని సానుకూల క్రియాశీలత అని పిలుస్తారు.

ప్రస్తుత పరిస్థితులలో జోక్యం చేసుకోకుండా, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. సానుకూల చర్య తీసుకోవడం అనగా యథాతథ స్థితిని కొనసాగించడం మరియు అన్ని అవకాశాలను వినియోగించుకోవడం. ఈ పద్ధతిని పాజిటివ్ స్టేటస్ క్వోయిజం అని పిలుస్తారు. దీని కోసం ప్రవక్త యొక్క సీరా (జీవితచరిత్ర) వెలుగులో పూర్తి ప్రణాళికను రూపొందించవచ్చు.

1. మతపరమైన వ్యవహారాలలో సానుకూల స్థితిగతులు:

ప్రవక్త ముహమ్మద్(స) 610A.D లో మక్కాలో తన మొదటి వహి/దైవవాణి అందుకున్నారు. వివిధ అరేబియా తెగలకు చెందిన 360 విగ్రహాలను కాబాలో ఉంచిన విగ్రహారాధకులు మక్కా నగరంపై ఆధిపత్యం చెలాయించారు. కాబా ఈ విగ్రహారాధక తెగలందరికీ మత కేంద్రంగా మారింది. కాబాలో ఈ విగ్రహాల ఉనికి ప్రవక్త(స) యొక్క ఏకేశ్వరోపాసన విశ్వాసానికి  పూర్తిగా విరుద్ధం.

మక్కాలోని కాబాలో విగ్రహాలు ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ, ప్రవక్త(స)దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేసే తన పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఆ రోజుల్లో కాబా, మక్కా నివాసుల సమావేశ కేంద్రంగా ఉండేది, దాదాపు ప్రతిరోజూ అక్కడ సమావేశాలు జరిగేవి. ప్రవక్త(స) ఈ సమావేశాలను దావా ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ప్రవక్త(స)తన కాబా సందర్శనలో, విగ్రహాలకు అంతరాయం కలిగించే బదులు, ప్రజల వద్దకు వెళ్లి, వారికి దివ్య ఖురాన్ వినిపించేవారు. చాలా మంది ప్రజలు, దివ్య ఖురాన్ ద్వారా ప్రభావితమై, ఇస్లాంను స్వీకరించారు మరియు ఇది ప్రవక్త(స) యొక్క ధార్మిక సందేశ ప్రయత్నాలకు అదనపు ఊపునిచ్చింది.

 

2. సాంఘిక వ్యవహారాలలో సానుకూల స్థితిగతులు:

మక్కాలో, దార్ అల్-నద్వా అని పిలువబడే ఒక బహిరంగ ప్రదేశం ఉంది. దీనిపై  విగ్రహారాధకుల ఆధిపత్యం కలదు. ప్రవక్త ముహమ్మద్(స) దావా/సందేశ ప్రబావం  తీవ్రం అయినప్పుడు, మక్కా వాసులు ప్రవక్త(స)ను, ఆయన కుటుంబాన్ని, అనుచరులను బహిష్కరించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బహిష్కరణ కూడా విఫలం అయినప్పుడు ప్రవక్త(స) ప్రత్యర్థులు ఇదే దార్ అల్-నద్వా నుండి  ప్రవక్త(స) పై డెత్ వారెంట్ జారీ చేశారు.

అయితే ప్రవక్త(స) దార్ అల్-నద్వా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి తన అనుచరుల మద్దతుతో నిరసన తెలుపలేదు. బదులుగా  ప్రవక్త మక్కా నుండి 300 మైళ్ల దూరంలో ఉన్న మదీనాకు వలస  వెళ్లారు. మదీనా చేరుకున్న తర్వాత ప్రవక్త(స) దావా/సందేశ ప్రచారం పై  తన పూర్తి దృష్టిని పెట్టారు. ఇది సానుకూల స్థితిగతులకు ఉదాహరణ. ప్రవక్త(స) ప్రస్తుత పరిస్థితులతో ప్రత్యక్ష ఘర్షణను నివారించడం ద్వారా, తన శాంతియుత కార్యకలాపాలను కొనసాగించడానికి మరొక విశాలమైన క్షేత్రాన్ని కనుగొన్నారు.

 

3. రాజకీయ వ్యవహారాలలో సానుకూల స్థితిగతులు:

ప్రవక్త(స) మదీనాకు వలస వెళ్ళినప్పుడు, మదీనా లోని సమాజం ముస్లింలు, విగ్రహారాధకులు మరియు యూదులు అనే మూడు సమూహాలతో కూడి ఉంది. ఆ సామాజిక స్థాపనను యథాతథంగా అంగీకరించి, ప్రవక్త(స) బహుళత్వం ఆధారంగా ఒక వ్యవస్థను స్థాపించారు. ఈ వ్యవస్థలో మదీనా  నగర రాజ్యం మరియు ప్రవక్త(స) దేశాధిపతి. మదీనాలోని ఇతర సామాజిక సమూహాలకు వారి వారి మతాలు మరియు సంస్కృతుల ప్రకారం వారి ఇష్టానుసారం వారి జీవితాలను నడిపించే మరియు వారి సమస్యలను పరిష్కరించుకునే హక్కు ఇవ్వబడింది. ప్రవక్త(స) యథాతథ పరిస్థితిని అంగీకరించడం ద్వారా తన శాంతియుత దావా మిషన్‌ను ప్రారంభించారు. ఫలితం అద్భుతం. మొదటి దశలో ఉన్న బహుళ-సాంస్కృతిక సమాజం రెండవ దశలో క్రమంగా ఏకసంస్కృతి సమాజంగా రూపాంతరం చెందింది.

 

4. ప్రతిష్టకు సంబంధించిన విషయాలలో సానుకూల స్థితిగతులు:

ప్రవక్త (స) మదీనా కోసం తన స్వస్థలమైన మక్కా నుండి వలస వెళ్ళిన తర్వాత కూడా, మక్కావాసులు ప్రవక్త(స)పై సాయుధ దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. పలితంగా బద్ర్ మరియు ఉహుద్ అనే రెండు ప్రధాన యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు దావా కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాయి. అందువల్ల ప్రవక్త(స) మక్కావాసులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లన్నింటినీ అంగీకరిస్తూ, హుదైబియా ఒడంబడికగా పిలిచే 10 సంవత్సరాల యుద్ధ రహిత ఒప్పందం కుదుర్చుకొన్నారు.ఇది సానుకూల స్థితి క్వోయిజానికి మరొక ఉదాహరణ.

హుదైబియా ఒడంబడిక నిబంధనల ప్రకారం, ప్రవక్త(స) మక్కావాసుల  డిమాండ్లను  అంగీకరించారు. దీనితో ప్రవక్త(స) దావా పని కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకోగలిగారు. దీనిని  దివ్య ఖురాన్ 'బహిరంగ విజయం' (48:24) గా  పేర్కొంది.

 

5. అనంతర విషయాలలో పాజిటివ్ స్టేటస్ క్వాయిజం:

ప్రవక్త ముహమ్మద్ (స) తన జీవతాంతం దేవుని దూత మరియు దేశాధినేతగా వ్యవరించారు. ప్రవక్త ముహమ్మద్ (స) మరణానంతరం ఆ తర్వాతి స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలనే ప్రశ్న తలెత్తింది. "దేశాధినేత, ఖురేషీల నుండి ఎంపిక చేయబడతారు." అని ప్రవక్త (స) ఇచ్చిన మార్గదర్శకoను అనుసరించడం ద్వారా ఈ సమస్య పరిష్కరించబడింది.

స్పష్టంగా, ఇది అసాధారణమైన ఉత్తర్వు, ఎందుకంటే ఇస్లాం బోధనల ప్రకారం మానవులందరూ సమానమే. ఎవరూ, మరొకరిపై ఎలాంటి ఆధిక్యతను పొందరు. అందువలన  ఖురైష్‌ల నుండి నాయకుడిని ఎన్నుకోవాలనే సలహా ఒక రకమైన వివక్ష. కానీ అది వివక్షతో కాకుండా వాస్తవికంగా ఉంది.

నిజానికి, శతాబ్దాలుగా, ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా, ఖురైష్‌లు అరేబియాలో నాయకత్వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ పరిస్థితిలో ఆకస్మిక మార్పు,  అధిగమించలేని సమస్యలను సృష్టిస్తుంది. అందుకే ప్రవక్త(స) ముస్లింలకు ప్రస్తుత రాజకీయ వ్యవస్థను అంగీకరించమని సలహా ఇచ్చారు. ఫలితంగా, అరబ్ ఐక్యత చెక్కుచెదరకుండా ఉండిపోయింది మరియు ప్రవక్త(స) మరణం తర్వాత కూడా ఇస్లామిక్ మిషన్ పురోగతి ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగింది. ఇది సానుకూల స్థితిగతులకు మరొక ఉదాహరణ.

6. రాజ్య వ్యవహారాలలో సానుకూల స్థితిగతులు:

ప్రవక్త ముహమ్మద్(స) మరణానంతరం కూడా, ఇస్లాం యొక్క ప్రారంభ దశలో సానుకూల స్థితిగతుల విధానం కొనసాగింది.దీనికి  ఉమయ్యద్ కాలం యొక్క చివరి భాగంలో మరియు మొత్తం అబ్బాసిడ్ యుగంలో మత పండితులు అనుసరించిన విధానం ఒక అత్యుత్తమ ఉదాహరణ. ఈ కాలంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. అయినప్పటికీ దాదాపు ఆ కాలంలోని గొప్ప ముస్లిం పండితులందరూ (ఉలమాలు, సంప్రదాయవాదులు, న్యాయనిపుణులు) అధికారంలో ఉన్న వారితో ఢీకొనేందుకు దూరంగా ఉన్నారు. ఆ విధంగా ముస్లిం పాలకుల ఎదురుదెబ్బ నుండి మత పండితులు రక్షించబడ్డారు. అయితే పాలకులతో ఘర్షణకు దిగిన వారు పీడనకు గురి అయ్యారు.

రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకోని ఈ విధానం వల్ల లైబ్రరీ ఆఫ్ ఇస్లాం అని పిలవబడే గొప్ప సంపదను పండితులు  స్వేచ్ఛగా అందించినారు. దాదాపు మొత్తం శాస్త్రీయ ఇస్లామిక్ సాహిత్యం ఈ కాలంలోనే తయారు చేయబడింది. అరబిక్ భాష అభివృద్ధి, దాని వ్యాకరణం, దాని కాలిగ్రఫీ, ఖురాన్ యొక్క వివరణ, హదీసుల సేకరణ మరియు సవరణ, పౌర మరియు మతపరమైన చట్టాల (ఫిక్హ్), కలాం సాహిత్యం (వేదాంతం) తయారీ మొదలైనవి  అన్ని ఈ కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి.

 

భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నాటి ముస్లిం పండితులు, ఉలమాలు విబేదించి ఉంటే అమూల్యమైన ఇస్లామిక్ సాహిత్యమంతా ఎప్పటికీ వెలుగులోకి వచ్చేది కాదు. ఇస్లాంలోని రెండవ మూలం అయిన హదీసులలోని  ప్రధాన భాగo తరువాతి తరాలకు సురక్షితంగా బదిలీ చేయబడేదికాదు. పండితులు పాలకులతో రాజకీయ ఘర్షణలకు పాల్పడి ఉంటే, ఇస్లామిక్ ఆలోచన మరియు ఆచరణ వారితో పాటు సమాధి చేయబడి ఉండేవి.

సాంఘిక విషయాలలో, సానుకూల స్థితి వాదం ఇస్లాం యొక్క విధానం. ఈ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రవక్త(స) మరియు అతని సహచరులు ఇస్లాం యొక్క గొప్ప చరిత్రను రూపొందించారు, ఇది మానవ నాగరికత యొక్క మతపరమైన మరియు లౌకిక రంగాలలో కొత్త శకానికి నాంది పలికింది.

 

సహనం యొక్క అపరిమిత పరిధి:

ప్రవక్త ముహమ్మద్(స) పురాతన మక్కాలో తౌహిద్ (దేవుని ఐక్యత) యొక్క మిషన్‌(ఇస్లామిక్)ను ప్రారంభించినప్పుడు, అక్కడ ఖురేషులు మక్కా పట్టణానికి నాయకత్వం వహించారు మరియు వారి నమ్మకాల ప్రకారం, వారు విగ్రహారాధన వ్యవస్థను స్థాపించారు.

ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) తన పనిని ఎలా ప్రారంభించాలి అనే ప్రశ్న తలెత్తింది? ఖురేషుల ఆధిపత్యం కింద ఉన్న స్థితిని రద్దు చేయవలసి ఉంటుందని మరియు అప్పుడే ప్రవక్త(స) యొక్క మిషన్‌కు మార్గం సుగమం అవుతుందని కనిపించింది. ఆ సమయంలో, ప్రవక్తకు ప్రాథమిక మార్గదర్శకత్వం వెల్లడి చేయబడింది.

దేవుడు దివ్య ఖురాన్‌లో ఇలా ప్రకటించాడు:కనుక నిశ్చయంగా కష్టం తో పాటే సుఖం కూడా ఉంది. నిశ్చయంగా బాధతో పాటే సౌఖ్యం కూడా ఉంది. (94:5-6)

దీనర్థం ఏమిటంటే, మక్కాలోని స్థితి అడ్డంకిగా కనిపించినప్పటికీ, ప్రవక్త (స)లక్ష్యాల పురోగతికి అవకాశాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. అందువల్ల, ప్రస్తుత పరిస్థితికి భంగం కలగకుండా, ఇతర రంగాలలో అందుబాటులో ఉన్న అవకాశాలను ఇస్లామిక్ మిషన్‌ను ప్రోత్సహించడానికి ఉపయోగించుకోవాలి.

మన లక్ష్యాల సాధనకు ఇస్లాం నిర్దేశించిన పద్దతి మరియు ప్రవక్త(స) జీవితంలో మనం కనుగొనే నమూనా సహనంపై ఆధారపడిన పద్ధతిగా వర్ణించవచ్చు. అంటే, యథాతథ స్థితితో సామరస్యంగా ఉంటూ, సాధ్యమయ్యే రంగంలో తన పోరాటాన్ని ప్రారంభించడం. దీనిని సానుకూల స్థితి క్వోయిజం అని పిలుస్తారు.

 

1.  అడ్డంకి, విజయానికి ముందు అడుగు గా మారింది:

ప్రవక్త ముహమ్మద్(స)మక్కాలో తన మిషన్ ప్రారంభించినప్పుడు, కాబా లో  వందలాది విగ్రహాలు ఉంచబడ్డాయి. ఏకేశ్వరోపాసనకు కేంద్రంగా నిర్మించబడిన కాబా వాస్తవంగా షిర్క్ (బహుదేవతత్వం) కేంద్రంగా మారింది. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్(స) అవలంబించిన పద్ధతి సానుకూల స్థితిత్వానికి సరైన ఉదాహరణ.

ప్రవక్త ముహమ్మద్(స) విగ్రహాలు మరియు విగ్రహారాధనలో జోక్యం చేసుకోలేదు  బదులుగా, ప్రవక్త(స) ప్రతిరోజూ కాబాను సందర్శించే వ్యక్తులకు ఏకేశ్వరోపాసన యొక్క పిలుపును అందించడం ప్రారంభించారు. ప్రవక్త(స) ప్రతి రోజు అక్కడికి వెళ్లి దివ్య ఖురాన్ పారాయణం చేయుట ద్వారా పెద్ద సంఖ్యలో విశ్వాసులను  పొందారు. ఈ విధంగా అరేబియాలో ఇస్లాం క్రమంగా వ్యాప్తి చెందడం ప్రారంభమైంది

 

2. నిరసనను నివారించడం క్రమంగా స్థితిని మారుస్తుంది:

ప్రవక్త(స) తన ప్రవక్త పదవిని పొందిన తర్వాత పదమూడు సంవత్సరాలు మక్కాలో నివసించారు. ఈ కాలంలో, ఒక సమూహం ఇస్లాంను స్వీకరించింది, కానీ మెజారిటీ దానిని పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉంది.

ఆ సమయంలో మక్కాలోని దార్-అల్-నద్వా దాని రాజకీయ కేంద్రంగా ఉండేది. మక్కా నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహించారు మరియు ప్రవక్త ముహమ్మద్ ను బహిష్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అది కూడా విఫలం అయితే ప్రవక్త(స) ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో, ప్రవక్త ముహమ్మద్(స) తన వ్యతిరేక కేంద్రమైన దార్-అల్-నద్వా లేదా మక్కా నాయకులపై శత్రుత్వం  పెంచుకోలేదు. బదులుగా ప్రవక్త(స) యథాతథ స్థితిని అంగీకరింఛి  మదీనాకు వలస వెళ్లారు. మదీనా నగరం ప్రవక్త (స) కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఈ అద్భుతమైన మరియు దూరదృష్టి వ్యూహం ద్వారా అసాధారణ ఫలితాలు వచ్చాయి.

 

3.బాహ్య విస్తరణలో అంతర్గత సామరస్య ఫలితాలు:

ఆ సమయంలో మదీనాలో మూడు మత సమూహాలు ఉండేవి-ముస్లింలు, విగ్రహారాధకులు మరియు యూదులు. ప్రవక్త ముహమ్మద్(స) ఇస్లాం చరిత్రలో సహీఫా-అల్-మదీనా అని పిలువబడే ఒక చార్టర్‌ను జారీ చేశారు. మదీనా లోని  ప్రతి మత సమూహం, మతపరమైన మరియు సాంస్కృతిక విషయాలలో పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తుందని, మదీనాలోని వ్యవస్థలు పరస్పర గౌరవం యొక్క విధానం ఆధారంగా నడుస్తాయని ప్రకటించారు.

పర్యవసానంగా, ప్రవక్త(స) తన మిషన్‌ను ఏకీకృతం చేసే అవకాశాన్ని కనుగొన్నారు. ప్రవక్త(స) తన మాతృభూమి మక్కాని విడిచిపెట్టిన తర్వాత కూడా, మక్కావాసులు అతనిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. వారు ప్రవక్త (స)పై తమ శత్రు కార్యకలాపాలను కొనసాగించారు. ఫలితంగా అనేక చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి.

ప్రవక్త యథాతథ స్థితిలో జోక్యం చేసుకోకుండా మక్కా వాసులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు, దీనిని హుదైబియా శాంతి ఒప్పందం అని పిలుస్తారు. పదేళ్లపాటు రెండు వర్గాల మధ్య ఎలాంటి యుద్ధం జరగకూడదనే షరతుతో సంధి కుదుర్చుకున్నారు. దీంతో ఇస్లామిక్ దావా కు అవసరమైన శాంతియుత వాతావరణం లబించినది.

హుదైబియా శాంతి ఒప్పందం సానుకూల స్థితి వాదానికి విజయవంతమైన ఉదాహరణ. ఇది దివ్య ఖురాన్ (48:24) లో "స్పష్టమైన విజయం" గా పిలువబడినది.

 

ఇస్లామిక్ క్రియాశీలత సూత్రం దివ్య ఖురాన్‌లో క్లుప్తంగా ప్రస్తావించబడింది:

కనుక(ఓ ప్రవక్తా! స్థిర సంకల్పులైన ప్రవక్తలు ఓర్పు వహించినట్లే నీవు కూడా ఓర్పు వహించు.  వారి విషయం లో తొoదరర పెట్టకు.”)-(46:35)

పై ఆయతు ప్రకారం, ఏ పరిస్థితిలోనైనా ప్రచారాన్ని ప్రారంభించేందుకు రెండు మార్గాలు ఉన్నాయిసహనం మరియు అసహనం. రెండోది భావోద్వేగానికి సంబంధించినది అయితే మొదటిది ప్రతిస్పందనగా పరిగణించబడుతుంది.

సహనo వహించిన వ్యక్తి  పద్ధతిని అనుసరించేవాడు యథాతథ స్థితితో ఘర్షణను నివారించేవాడు మరియు తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలడు. ఈ పద్ధతి సమాజంలో ఎలాంటి కొత్త సమస్యలను సృష్టించకుండా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

సంక్షిప్తంగా, వారి అన్ని వ్యవహారాలలో సహనం వహించే అనుసరించే వ్యక్తులు లేదా సమూహాలకు అపరిమితమైన పరిధి ఉంది. వారు  విజయాలు సాధిస్తారు. ప్రతికూల పరిస్థితిలో మనం విధ్వంసక చర్యలో పాల్పడకుండా దీర్ఘకాలిక నిర్మాణాత్మక ప్రణాళికల సాధనపై దృష్టి కేంద్రీకరిoచాలి.

అంతేకాకుండా, మీరు ఇస్లాం కోసం పని చేయాలనుకునే లేదా ముస్లిం ఉమ్మా పునరుజ్జీవనం కోసం పోరాడాలనుకునే వారిలో ఒకరైతే, సహనం యొక్క మార్గాన్ని నడపడం మరియు సానుకూల స్థితిగతుల సూత్రానికి కట్టుబడి ఉండటం తప్పనిసరి. దివ్య ఖురాన్‌లో ఇది బాగా సిఫార్సు చేయబడింది మరియు ఇదే పద్ధతిని అనుసరించడం ద్వారా ఇస్లాం తన శత్రువులందరిపై అప్రతిహత విజయాన్ని సాధించింది, ఫలితంగా ఇస్లాం యొక్క ప్రారంభ కాలo ఆదర్శ ముస్లిం సమాజం ను ఉనికిలోకి తెచ్చింది.

సంరక్షణ, నవీకరణ, దావా:

ప్రవక్త ముహమ్మద్ (స) ను ఉద్దేశించి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా ప్రకటించాడు: (ప్రవక్తా!)మేము నిన్ను లోకవాసుల కోసం కారుణ్యంగా పంపాము. (21:107)

అదేవిధంగా, దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది:

లోకవాసులనoదరిని సావదానపరిచేపరిచేవానిగా ఉండేటoదుకు తన దాసునిపై గీటురాయి (ఖురాన్) ని అవతరింపజేసిన దేవుడు ఎంతో శుభకరుడు. (25:1)

 

మరొక చోట దివ్య  ఖురాన్ ఇలా చెబుతోంది: "(ఓ ప్రవక్తా!)మేము నిను సమస్త మానవులకు హెచ్చరిక చేసేవానిగా పంపాము.కాని చాలామందికి తెలియదు" (34:28)

ప్రవక్త ముహమ్మద్(స) మొత్తం మానవాళి కోసం మరియు ప్రస్తుత మరియు భవిష్యత్ తరాల కోసం పంపబడ్డారని దివ్య ఖురాన్‌ తెలియజేస్తుంది, సర్వ మానవాళికి దైవిక మార్గం చూపడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రవక్త ముహమ్మద్(స) ను నియమించాడు మరియు ఈ ప్రక్రియను తరతరాలుగా, ప్రపంచంలోని చివరి రోజు వరకు కొనసాగుతుంది. ప్రవక్త ముహమ్మద్(స) తన జీవితకాలంలో ఈ బాధ్యతను ప్రత్యక్షంగా నెరవేర్చాడు మరియు ప్రవక్త ముహమ్మద్(స) మరణానంతరం, ఈ పనిని తన ఉమ్మా ద్వారా పరోక్షంగా కొనసాగించవలసి ఉంటుంది.

తరువాతి తరాలు నిర్వహించాల్సిన పనిని ప్రాథమికంగా మూడు వర్గాలుగా విభజించారు:

 (ఎ) సంరక్షణ ప్రక్రియ,

 (బి) నవీకరణ ప్రక్రియ,

(సి) దావా ప్రక్రియ

ప్రవక్త(స) తీసుకొచ్చిన పుస్తకం (దివ్య ఖురాన్) ను తరతరాలుగా అసలు రూపంలో అలాగే ఉంచడం మొదటి ప్రక్రియ లక్ష్యం. మానవ కల్పితాలు ఏమి ఉండకూడదు మరియు పుస్తక (దివ్య ఖురాన్)భాగాలు ఏవీ నాశనం కాకూడదు.

పరిరక్షణ ప్రక్రియలో మొదటి ప్రధాన అడుగు, ప్రవక్త(స) మరణించిన తర్వాత, మొదటి ఖలీఫా అబూ బకర్ సిద్ధిక్ కాలం లో జరిగింది. ఆ సమయంలో ప్రవక్త (స)యొక్క సహచరులు పదివేల మంది పూర్తి ఖురాన్‌ను హృదయపూర్వకంగా నేర్చుకున్నారు. ఆ విధంగా ఇది పూర్తిగా మానవ స్మృతిలో భద్రపరచబడింది.

మొదటి ఖలీఫా దివ్య  ఖురాన్ యొక్క ఒకే సంపుటిని సిద్ధం చేయడానికి సహచరుల నుండి దివ్య ఖురాన్ పండితులను నిమగ్నం చేశారు. డబుల్ చెకింగ్ సిస్టమ్‌ని ఉపయోగించడం ద్వారా, అనగా దివ్య ఖురాన్ కంఠస్థం చేయబడిన భాగం,  దాని వ్రాత రూపంలో ఉన్న దివ్య ఖురాన్‌తో తనిఖీ చేయబడింది మరియు మానవ స్మృతిలో భద్రపరచబడిన దివ్య ఖురాన్‌తో లిఖిత రూపంలో ఉన్న దివి ఖురాన్ తనిఖీ చేయబడింది. ఆ విధంగా మొదటి ఖలీఫా దివ్య  ఖురాన్ యొక్క మొదటి బౌండ్ వాల్యూమ్‌ను తయారుచేశాడు, ఇది ప్రామాణిక కాపీగా పనిచేసింది. దివ్య ఖురాన్ యొక్క తరువాతి కాపీలన్నీ ఈ అసలు సంపుటం నుండి తయారు చేయబడ్డాయి.

దివ్య ఖురాన్ రెట్టింపు చెకింగ్ పద్ధతిని అనుసరించడం ద్వారా భద్రపరచబడింది.తరాల తర్వాత తరానికి, ప్రింటింగ్ ప్రెస్ వచ్చే వరకు, టెక్స్ట్‌ లో మానవ ప్రమేయానికి అవకాశం లేకుండా పోయింది.

ముహద్దీతిన్ (హదీసు పండితులు) సహకారం:

ఇస్లాం యొక్క మొదటి కొన్ని తరాలలో పెద్ద సంఖ్యలో ప్రముఖ ముస్లిం పండితులు హదీస్, సిరా మరియు మాఘాజీ అని పిలవబడే పూర్తిగా ప్రామాణికమైన మరియు అసమానమైన చారిత్రక రికార్డును సిద్ధం చేశారు. ముస్లిం పండితులు ప్రవక్త(స) చెప్పిన దాదాపు ప్రతి పదం, చేసిన ప్రతి చర్య, ఆమోదించిన లేదా ఆమోదించని పనులు, సహచరుల గురించి కాలక్రమ వివరాలతో సహా తరువాతి తరాల కోసం  విస్తారమైన మరియు క్రమబద్ధమైన సాహిత్యాన్ని రూపొందించారు. ఈ సాహిత్యం (హదీసులు) దివ్య ఖురాన్ తర్వాత ఇస్లాం యొక్క రెండవ ప్రాథమిక మూలంగా పరిగణించబడుతుంది. దివ్య ఖురాన్‌తో పాటు హదీత్ ఇస్లామిక్ భావజాలం ను ప్రతిబింబిస్తుంది. ఇస్లామిక్ సాహిత్యం  సంపూర్ణంగా మరియు శాశ్వతంగా భద్రపరచబడింది.

మతపరమైన సంస్థలు:

ప్రవక్త (స) యొక్క సహచరుల కాలం నుండి నేటి వరకు పాలకులు మరియు పరిపాలించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలు తమ సంతానానికి ఇస్లాం యొక్క సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించడంలో అత్యంత ఆసక్తిని మరియు శ్రద్ధను కనబరుస్తున్నారు. రోజువారీ జీవితంలో ఇస్లాంను ఎలా ఆచరించాలో భోదించడానికి  అనేక సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. సాంప్రదాయ రకానికి చెందిన మత పాఠశాలలను మదర్సా అని పిలుస్తారు, ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాన్ని టక్యా అని పిలుస్తారు. సుదూర గతం నుండి మొదలై నేటి వరకు కొనసాగుతోంది, అటువంటి మతపరమైన సంస్థలు  ముస్లిం ప్రపంచం అంతటా విస్తరించబడినవి.  ఈ సంస్థలు ఇస్లాం యొక్క ఆచరణాత్మక రూపాన్ని తరం నుండి తరానికి సంరక్షించడం మరియు ప్రసారం చేయడం చేసినవి. ప్రస్తుత శతాబ్దంలో, అనేక ఇతర మత సంస్థలు మరియు ఉద్యమాలు కూడా అదే ప్రయోజనం సాధించాయి. తబ్లీగ్ ఉద్యమాన్ని ఇక్కడ ఉదాహరణగా పేర్కొనవచ్చు.

నవీకరణ ప్రక్రియ:

ప్రవక్త(స) అందించిన మతం ఒక్కటే. అయితే, మానవ సమాజంలోని పరిస్థితులు మార్పుకు లోనవుతాయి కాబట్టి, మారుతున్న పరిస్థితులకు మతాన్ని (అల్-దిన్) అన్వయించడం చాలా అవసరం. ఉదాహరణకు, అబ్యుషన్(వజూ) సమయంలో సాధారణ పాదాలను కడుక్కోవడానికి బదులుగా శుద్దీకరణ కోసం తడి చేతులతో తోలు సాక్స్‌ లను తాకడాన్ని షరియా అనుమతించింది. ఇప్పుడు కృత్రిమ ఫైబర్‌లతో తయారు చేసిన సాక్స్‌లను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, ఈ సాక్స్‌లపై మసాహ్ (నీటితో రుద్దడం) చేయడానికి అనుమతి ఇవ్వబడింది

ప్రతి యుగంలో దైవిక ఆదేశాలను తిరిగి వర్తింపజేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మరియు ఇది ఆధునిక కాలంలో పెద్ద ఎత్తున జరిగింది. పురాతన కాలంలో, యుద్ధం అనేది సంఘర్షణలను పరిష్కరించే సాధనంగా ఉండేది. కానీ నేడు యుద్ధం ఎటువంటి సానుకూల ప్రయోజనాన్ని అందించదు. ఇప్పుడు అధికారం శాంతిలో మాత్రమే ఉంది. గత రోజుల్లో, పాలకుడు ఏకపక్షంగా సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు  కాని నేటి ప్రజాస్వామ్య యుగం లో ఆధికారం ప్రజల చేతి లో ఉంది.

ప్రతి యుగంలో మారిన పరిస్థితులు, కొత్త అవసరాలను తీర్చడానికి ఇస్లామిక్ షరియత్ అప్‌డేట్ (నవీకరణ ప్రక్రియ) అవుతూనే ఉంది. నవీకరణ/అప్‌డేట్ చేసే ఈ పని ఇజ్తిహాద్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇస్లాం సృజనాత్మక ఆలోచన మరియు పూర్తి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఇస్లాం ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చింది. సృజనాత్మక మనస్సులు మాత్రమే ఇజ్తిహాద్ యొక్క పనిని అత్యున్నత స్థాయిలో నిర్వహించగలవు. అటువంటి బహిరంగ మేధో వాతావరణం లేని చోట, మానసిక అభివృద్ధి ప్రక్రియ ఆగిపోతుంది మరియు నవీకరణ(అప్-డేటింగ్) కూడా జరుగదు.

నవీకరణ : షరియత్ యొక్క పునఃప్రయోగం:

దివ్య ఖురాన్ ప్రకారం, ఇస్లాంలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి-మతం (దిన్) మరియు చట్టం (షరియా). దిన్ లేదా అల్-దిన్ ప్రాథమికమైనది మరియు సంపూర్ణమైనది, చిన్న మార్పు లేకుండా ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఏ పరిస్థితులలోనైనా విశ్వాసులందరికీ ఇది విధిగా ఉంటుంది మరియు ఒకే దేవుడిపై నమ్మకం మరియు ఆయనను మాత్రమే ఆరాధించడం. మరోవైపు, షరియత్ కాలాలు మరియు ప్రదేశాలను బట్టి భిన్నంగా ఉండవచ్చు.

అల్-దిన్ విషయంపై దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: ఏ ధర్మాన్ని స్థాపించామని ఆయన నుహ్  కు  ఆజ్ఞాపించాడో అదే ధర్మాన్ని మీ కోసం కూడా నిర్ధారించాడు. దానినే (ఓ ప్రవక్తా!) మేము నీకు వహి (దివ్యవాణి) రూపంలో పంపాము. దీని  గురించి మేము ఇబ్రహీం (అబ్రహీం),ఈసా (యేసు)లకు కూడా ఆజ్ఞాపించాము.- మీరు  ధర్మాన్ని స్థాపించండిఅందులో విభేదిoచుకోకండి. (42:13).

మరోవైపు, వేర్వేరు ప్రవక్తలకు ఇవ్వబడిన షరియత్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని చెప్పే దివ్య ఖురాన్ యొక్క మరొక ఆయత్ ఉంది.

దివ్య ఖురాన్ ఇలా పేర్కొంది:

మేము ఈ గ్రంధాన్ని నీ వైపు సత్యం తోపాటే పంపాము. ఇది తనకు పూర్వం ఉన్న గ్రంధాన్ని ద్రువపరిచేది.అందలి అంశాలను పరిరక్షించేదిగా ఉంది. కనుక నీవు వారి పరస్పర వివాదాలపై దేవుడు అవతరింప జేసిన దాని ప్రకారమే తీర్పు ఇవ్వు. నీ వద్దకు వచ్చిన సత్యాన్ని వీడి, వారి మనోవంఛలను అనుసరించకు. మేము మీలోని ప్రతి ఒక్కరికి ఒక శాసనాoగాన్ని, ఒక విధానాన్ని నిర్ధరిoచాము. దేవుడే కనుక తలచుకొంటే మిమ్మల్లి అందరిని ఒకే సముదాయంగా చేసి ఉండేవారు. అయితే తాను ఇచ్చి ఉన్న ఆజ్ఞలలో మిమ్మల్లి పరిక్షిoచాలన్నది ఆయన అభిమతం. కనుక మీరు సత్కార్యాల వైపు శరవేగం తో దూసుకుపొండి. ఎట్టకేలకు మీరంతా దేవుని వైపునకు మరలిపోవలసి ఉంటుంది. తరువాత ఆయన మీరు విభేదించుకున్న దాని గురించి మీకు తెలియపరుస్తాడు (5:48)

షరియా, మరియు మిన్హాజ్ లేదా పద్ధతి ప్రవక్త నుండి ప్రవక్తకు పాక్షికంగా మారుతూ ఉంటాయి, కానీ ఇలాంటి వ్యత్యాసాలు మారిన పరిస్థితులకు సంబంధించినవని గుర్తుంచుకోవాలి. షరియత్ మరియు మిన్హాజ్ పరంగా వైవిధ్యాలు ఆచరణాత్మక జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. అందుకే షరియత్ సూత్రం నేటికీ చెల్లుబాటు అవుతుంది.

షరియత్ మరియు మిన్హాజ్‌లలో పాక్షిక మరియు తాత్కాలిక మార్పులను నియంత్రించే పరిస్థితులలో  మార్పు గతంలో ప్రవక్త ద్వారా జరిగింది, ఇప్పుడు మార్పులు ఇజ్తిహాద్ ద్వారా వచ్చాయి మరియు ఇస్లామిక్ పండితులచే అమలులోకి వచ్చాయి. వాస్తవానికి ఆ పని మార్చబడిన పరిస్థితుల పరంగా షరియత్‌ను తిరిగి వర్తింపజేయడం మాత్రమే. ఇది ఇస్లాంను శాశ్వతంగా అప్‌డేట్ చేయడానికి సహాయపడే నిరంతర సర్దుబాటు ప్రక్రియ.

దావా:

దావా పని అంటే, ప్రవక్త సందేశాన్ని అన్ని వయసుల ప్రజలందరికీ తెలియజేయడం.ఈ దావా పని మానవులచే నిర్వహించబడినప్పటికీ, వాస్తవానికి ఇది దైవిక కార్యం. అందుకే దివ్య ఖురాన్ దీనిని నస్రత్ ఆఫ్ గాడ్ అని పిలిచింది, అంటే సర్వశక్తిమంతుడికి సహాయం చేయడం (3:52).

దివ్య ఖురాన్ ప్రకారం, దావా పని అంటే తనను తాను నాసిహ్ మరియు అమీన్‌గా మార్చుకోవడం, అంటే అందరికీ నిజాయితీగా మరియు హృదయపూర్వక శ్రేయోభిలాషిగా మారడం. (7:68)

సంక్షిప్తంగా, ఇది దేవునికి సంబంధించి పూర్తిగా నిజాయితీగా మారడం మరియు తోటి పురుషులందరి పట్ల సంపూర్ణ సద్భావనను అనుభవించడం మరియు నిరూపించుకోవడం. ఈ ప్రమాణాన్ని పాటించడం ద్వారా మాత్రమే దావహ్ పని సరిగ్గా నిర్వహించబడుతుంది. దావహ్ పనిని నిర్వహించడానికి ఒక ముఖ్యమైన షరతు సహనం. "మనపై కలిగించే హానితో సంబంధం లేకుండా మేము సహనంతో వ్యవహరిస్తాము." (ఖురాన్, 14:12)

దివ్య ఖురాన్‌లోని పై ఆయత్ దాయీ పాత్ర గురించి చెబుతుంది. మద్‌యుకు సంబంధించి దాయి సహన వైఖరిని అవలంబిoచాలి. దాయి మరియు మదుయుల మద్య దావా పని శాంతియుత పద్ధతిలో కొనసాగిoచాలి. దావా కార్యాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణం అవసరము.

దావా పని లోని అతి ముఖ్యమైన అంశం దేవుని సందేశం ప్రతి యుగంలో ప్రజలకు తెలియజేయబడుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఇస్లాం లోకి ప్రవేశిస్తున్నారు. ఇది విశ్వాసిలో కొత్త రక్తాన్ని ప్రవేశపెట్టడం లాంటిది. ముస్లిం సమాజం తనను తాను క్షీణత ప్రక్రియ నుండి రక్షించుకొని  ముస్లిం సమాజాన్ని ఎల్లవేళలా పునరుజ్జీవింపజేసేందుకు దావా ఒక్కటే మార్గం.

ప్రపంచవ్యాప్తంగా దావా ప్రక్రియ ద్వారా ఇస్లాం యొక్క నిజమైన సందేశం ఎంత ఎక్కువ వ్యాప్తి చెందుతుందో, దాని వచన, సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక పరిరక్షణ అంత ఎక్కువగా నిర్ధారింపబడుతుంది.దావా అనేది  రాబోయే తరాలకు ఇస్లాం బోధనలను నవీకరించే అంశం.

మూలం:మౌలానా మౌలానా వాహిద్దీద్దీన్ ఖాన్

తెలుగు సేత: ముహమ్మద్ అజ్గర్ అలీ.

 

 

No comments:

Post a Comment