26 January 2023

మహమ్మద్(స) ఒక ఆదర్శనీయమైన వ్యక్తి MUHAMMAD the Ideal Character

 

మానవజాతికి, సార్వత్రిక ప్రామాణిక నైతిక సూత్రాలు కలిగి, నిజమైన నైతిక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అవసరం ఉంది. దీనికి సమాధానం మహమ్మద్ ప్రవక్త(స). ముహమ్మద్ ప్రవక్త(స) దైవిక ప్రామాణికత కలిగి సంపూర్ణ  నైతికత కలిగి ఉన్న వ్యక్తి.  ముహమ్మద్ ప్రవక్త (స)సంపూర్ణ మానవాళికి,  పరిపూర్ణ వ్యక్తిత్వ ప్రవర్తన యొక్క నమూనాగా నిలిచారు.

ఈ పుస్తకం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క జీవితం మరియు బోధనలను మానవాళికి ఆదర్శంగా చూపుతుంది.  సంపూర్ణ నైతికతకు చారిత్రక ఉదాహరణగా నిలిచిన ఆదర్శవంతమైన ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్(స)అని రచయిత విశ్వసించారు.

అరేబియాలో ఏప్రిల్ 571న జన్మించిన ముహమ్మద్ (స) జూన్8, 632లో మరణించారు. బాల్యం నుంచే ప్రవక్త ముహమ్మద్ (స)ఉత్కృష్టమైన మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం ప్రదర్శించారు. ముహమ్మద్ (స)తెల్లగా, అందమైన మరియు  శక్తివంతమైన స్వభావం కలిగి ఉన్నారు. ముహమ్మద్ (స) ఎల్లప్పుడూ చాలా మృదువుగా మాట్లాడేవారు   మరియు సదా ఉత్సాహంగా ఉండేవారు. ముహమ్మద్ (స) సహనం, నిజాయితీ వంటి లక్షణాలను, లౌకిక వ్యవహారాల గురించి చక్కటి అవగాహనతో పాటు సమతుల్య వ్యక్తిత్వం మరియు గొప్పతనాన్ని కలిగి ఉండేవారు.

డాయుద్ ఇబ్న్ హుస్సేన్ అభిప్రాయం లో ముహమ్మద్ (స) నాటి అరేబియా  ప్రజలందరిలో అత్యుత్తమ మర్యాదగలవాడు అనే ఖ్యాతిని కలిగి ఉన్నాడు.    తన పొరుగువారి  నమ్మకము పొంది  వారి పట్ల    దయ తో ఎల్లప్పుడూ వివాదరహితునిగా ముహమ్మద్ (స)ఉండేవారు. ప్రజలు తమ విలువైన వస్తువులను ముహమ్మద్ (స) కు అప్పగించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు  ఎందుకంటే ముహమ్మద్ (స)విశ్వసనీయత తిరుగులేనిది మరియు  ముహమ్మద్(స)ను ప్రజలందరూ  ‘అల్-ఆమిన్’ అనే పిలిచేవారు.

ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో ముహమ్మద్(స)వివాహం సందర్భంగా, ముహమ్మద్ (స)మేనమామ, అబూ తాలిబ్ "నా మేనల్లుడు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా ఉన్నత వంశస్థుడు మరియు  సౌమ్యత, గొప్పతనం, జ్ఞానం తో నిండిన వాడు. ముహమ్మద్(స) కి గొప్ప భవిష్యత్తు ఉంది మరియు త్వరలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటాడు అని అన్నాడు.

అబూ తాలిబ్ అన్న మాటలను తరువాతి కాలం లో సంభవించిన సంఘటనలు రుజువు చేసాయి. సద్గుణాలు, బహుముఖ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ముహమ్మద్ బిన్ అబ్దుల్లా ప్రాపంచిక వ్యవహారాలలో ఎదగాలని మరియు విశిష్ట స్థానాన్ని పొందాలని అబూ తాలిబ్ కోరుకొన్నారు. కాని మరోప్రపంచపు మరియు భౌతికేతర కోణంలో ఇవన్నీ నిజమవుతాయని అబూ తాలిబ్ గ్రహించలేదు.

కాబోయే ప్రవక్త(స)ముహమ్మద్  యొక్క మంచి  లక్షణాలు ఖాదీజా అని పిలువబడే ధనిక, నలభై సంవత్సరాల వితంతువును బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ముహమ్మద్(స) మరియు ఖాదీజాకు మద్య  వివాహం జరిగింది. ముహమ్మద్ (స) వివాహానంతరం విజయవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ప్రతి అవకాశాన్ని పొందాడు. కానీ ముహమ్మద్ (స) ప్రపంచ సంపదకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. సత్యం మరియు వాస్తవికత కోసం అన్వేషణలో పడిపోయాడు.

ముహమ్మద్ (స) కొండలు మరియు గుహలలో తిరుగుతూ సృష్టి, జీవితం మరియు మరణం, మంచి మరియు చెడు యొక్క రహస్యాల గురించి  ఆలోచిoచసాగాడు. గందరగోళం మరియు చీకటి మధ్య క్రమం మరియు కాంతిని కనుగొనడానికి ప్రయత్నిoచసాగాడు.

తరచుగా ముహమ్మద్ (స) హిరా పర్వతం మీద ఉన్న ఒక గుహ లో ఒంటరిగా ధ్యానం చేసేవాడు మరియు తెచ్చుకొన్న ఆహారం మరియు నీరు  అయిపోయే వరకు అక్కడే ఉండేవాడు. కేవలం ఆహార సామాగ్రిని తీసుకోవడానికి మాత్రమే ఇంటికి తిరిగి వెళ్తాడు, తరువాత ఏకాంతoగా ధ్యానంచేయడానికి తిరిగి గుహకు  వస్తాడు. ముహమ్మద్ (స)తెలియని  ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో నిమగ్నమయి ఉన్నాడు.

ఒక యువకుడు ఈ రకంగా ఉండడం చిన్న విషయం కాదు. ప్రాపంచిక ఆనందాన్ని త్యజించి,  కష్టం మరియు దుఃఖంతో నడిచే మార్గంలో నడవడం,  సౌకర్యవంతమైన జీవితం విడనాడం మామూలు విషయం కాదు. సౌఖ్యప్రాప్తికి  అన్ని మార్గాలు మరియు అవకాశాలు ఉన్న ముహమ్మద్ (స) అల్లకల్లోలమైన ఆత్మ వాటితో  సంతృప్తిని పొందలేదు. ముహమ్మద్(స) అశాంతితో మునిగిపోయాడు. విషయాల యొక్క వాస్తవికతను కనుగొని, సృష్టి యొక్క రహస్యాలను పరిష్కరించే వరకు ముహమ్మద్(స) ఆత్మ ప్రశాంతతను సాధించలేదు. అంతులేకుండా తనలో ఎదురయ్యే - నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఏ లక్ష్యాన్ని సాధించాలి? నా జీవితానికి ఉద్దేశపూర్వక లక్ష్యం ఉందా? అన్ని బాహ్య రూపాల వెనుక ఏదైనా అంతిమ వాస్తవికత ఉందా? అన్నప్రశ్నలకు  ముహమ్మద్(స)సమాధానాలు కోసం వెతికాడు.

చివరకు ఈ అనంతమైన అన్వేషణ ముహమ్మద్ (స)  జీవితం పై భారాన్ని కలిగిoచే  స్థితికి చేరుకుంది. దేవుడి తన అనంతమైన దయతో, ముహమ్మద్(స)కు  జ్ఞానోదయం మరియు మార్గదర్శక ద్వారాలు తెరిచాడు. "ఆయన నిన్ను మార్గాన్వేషకునిగా కనిపెట్టి, నీకు మార్గం చూపాడు.” (దివ్య ఖురాన్, 93: 7)

ముహమ్మద్(స) తన  జీవితంలోని  నలభైవ సంవత్సరంలో ఒక రోజు, గుహలో ఏకాంతంలో కూర్చున్నప్పుడు, దేవుని దూత జిబ్రయీల్ మానవ రూపంలో ముహమ్మద్(స) ముందు కనిపించాడు మరియు దేవుని మాటలను ఇలా వినిపించాడు : చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. మనిషిని ఆయన నెత్తుటి గడ్డతో సృష్టించాడు. చదువు! నీ ప్రభువు పరమ ఉద్దాతుడు. ఆయన కలము మూలంగా జ్ఞానభోద చేసాడు. " (ఖురాన్, 96:1-5)

ముహమ్మద్(స) ప్రవక్త తన ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు. "(ప్రవక్తా!)ఏమిటి, మేము నీ ఆంతర్యాన్ని నీ కొరకు విప్పలేదా? నీమీద ఉన్న ఆ బరువును కూడా దిoచివేసాము.అది నీ వీపును కృoగదీసేది. " (ఖురాన్ 94:1-3).

ముహమ్మద్ ప్రవక్త(స) చంచలమైన ఆత్మ ఇప్పుడు విశ్వ ప్రభువు అల్లాహ్ సహవాసంలో ఉంది. అల్లాహ్ ఇప్పుడు ముహమ్మద్ (స) ను తన ప్రత్యేక దూతగా ఎన్నుకున్నాడు మరియు మార్గదర్శకత్వం ఇచ్చాడు. దేవుని దోత్యకం(వహి) అతనిపైకి రావడం ప్రారంభించి ఇరవై మూడు సంవత్సరాల పాటు కొనసాగింది, ఆ సమయంలో దేవుని అంతిమ గ్రంథమైన దివ్య ఖురాన్ పూర్తి అయింది.

ముహమ్మద్ ప్రవక్త(స) సత్యాన్ని కనుగొన్నాడు. ముహమ్మద్ ప్రవక్త(స) కనుగొన్న సత్యం ఏమిటంటే, మనిషి సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిలో ఉన్నాడు. భగవంతుని అత్యద్భుతమైన సర్వశక్తి ముందు మనిషి నిరాడంబరుడు  మరియు శక్తిహీనుడు. విశ్వాసికి ఈ లోకంలో బాధ్యత తప్ప హక్కులు లేవన్నది వాస్తవం.

ప్రవక్త(స) కనుగొన్న ఈ సత్యం  ప్రవక్త(స)సూక్తులలో స్పష్టంగా పేర్కొనబడింది:

·        ప్రతి దశలోనూ  బహిరంగంగా మరియు రహస్యంగా దేవునికి భయపడటం,

·        ప్రశాంతంగా లేదా కోపంగా ఉన్న న్యాయాన్ని అనుసరించవలె,

·        ధనికుడైనా, పేదవాడైనా మితవాదాన్ని పాటించాలి.

·        చెడిపోయిన సంబందాలు మళ్లీ కలపవలె,

·        దోచుకునేవాడికి ఇవ్వడానికి, అణచివేసేవారిని సంతోషంగా క్షమించడానికి సిద్దంగా ఉండవలె.

·        భగవంతుని నామ స్మరణకు ధ్యానం యొక్క నిశ్శబ్ద మార్గాలను వెతకండి

·        మరియు మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి.

పైన పేర్కొన్న ఉత్కృష్టమైన ఆలోచనలు మనిషివి అంతరంగాన్ని మారుస్తాయి మరియు మనిషి నైతిక స్థాయికి స్పష్టమైన సూచన. ప్రవక్తత్వానికి ముందు కూడా  ప్రవక్త(స) యొక్క జీవితం సహజంగా మరియు వివాదరహితం గా ఉంది. సత్యం యొక్క ఆవిష్కరణ ప్రవక్త(స) వైఖరి మరియు ప్రవర్తనకు వివేచనను ఇచ్చింది మరియు ప్రవక్త(స) ఆలోచనావాదిగా మారినాడు. ఇప్పుడు ప్రవక్త(స)ఆలోచనలు, చర్యలు మరియు జీవనశైలి తోటి పురుషుల నుండి పూర్తిగా భిన్నమైన నమూనాను కలిగి ఉన్నవి. శారీరక రూపంలో ప్రవక్త(స)ఈ ప్రపంచంలో జీవించాడు, కానీ, ఆధ్యాత్మికంగా వేరే ఉన్నత స్థానం లో ఉన్నాడు.

ఈ సమయంలో ప్రవక్త(స) చేసిన ఒక ముఖ్యమైన ప్రకటన వివేకవంతుల జీవితంలో ఉండవలసిన ప్రత్యేక క్షణాలకు సంబంధించినది: ఒకరి స్వంత క్షణాలు, సృష్టి యొక్క రహస్యాలను ప్రతిబింబించే క్షణాలు, జీవిత అవసరాలను పొందే క్షణాలు మరియు భగవంతునితో సంభాషించాల్సిన సందర్భాలు అయి ఉండాలి.

మరో మాటలో చెప్పాలంటే, మానవుడు దేవుని సేవకుడు, దేవునికి దగ్గరగా ఉంటాడు.దేవునితో దైవిక సహవాసంలో ఉంటాడు, తీర్పు దినానికి భయపడతాడు మరియు తన సమయాన్ని నిరంతరం స్వీయ-విశ్లేషణలో గడుపుతాడు. భగవంతుని అద్భుత సృష్టి ప్రతిచోటా తన వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసి తన ప్రభువును కలుసుకోవడం, తనను తాను కలుసుకోవడం, ప్రపంచాన్ని కలుసుకోవడం మరియు తన శారీరక అవసరాలను తీర్చుకోవడం వంటిది.  ఈ అనుభవాలకు  ఒక ప్రత్యేక లక్షణం ఉంది.

పై పలుకులు ప్రవక్త(స) వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అవి విశ్వసించే మరియు నమ్మకమైన ఆత్మను చూపుతాయి మరియు ఇతర-ప్రపంచ వ్యవహారాలలో ప్రవక్త(స) మార్గదర్శకత్వానికి సూచనగా ఉంటాయి. అటువంటి మార్గదర్శకత్వం ను అనుభవించ లేని వ్యక్తి దానిని వర్ణించలేడు. ఇది పరిపూర్ణ ఆత్మ  మంచితనమును ఇతరులకు  మార్గనిర్దేశం చేయాలనే దానికి  ఉదాహరణ.  

ప్రవక్త(స) భగవంతుని ద్యోతకం/వహి పొందక ముందు  ప్రపంచం లోపాలు, పరిమితులతో అర్థరహితంగా కనిపించింది. కానీ  ప్రవక్త(స)కి ప్రస్తుతం ఉన్న ప్రపంచం కాకుండా మరొక పరిపూర్ణమైన మరియు శాశ్వతమైన ప్రపంచం ఉందని దేవుడు వెల్లడించినప్పుడు, ప్రవక్త(స)ఈ జీవితంలో మరియు విశ్వంలో కొత్త అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని కనుగొన్నాడు. ప్రవక్త(స)ప్రపంచాన్ని ఆశ్చర్యం మరియు ఆకర్షణీయమైన ప్రదేశంగా కనుగొన్నాడు. దాని అశాశ్వతతను కూడా పరిగణనలోకి తీసుకుంటాడు.

ఇప్పుడు ప్రవక్త(స) కోసం, ప్రపంచం అనేది మానవులు పరలోకంలో వారి ప్రతిఫలాలను పొందగలిగేలా కృషి  చేయవలసిన ప్రదేశం. ప్రవక్త(స) చర్యలన్నీ ఈ దిశగానే సాగాయి. ప్రవక్త(స) ఈ ప్రపంచం మన అంతిమ గమ్యం కాదు, భవిష్యత్తు జీవితానికి దారితీసే ప్రారంభ స్థానం మరియు మార్గం మాత్రమే అనే వాస్తవాన్ని బాగా తెలుసుకున్నాడు.

మానవుడు ఈ ప్రపంచంలో చేసినదంతా కేవలం ప్రారంభం మాత్రమె. పరలోకం లో మానవుని స్థానం మానవుని ఆలోచన ద్వారా నిర్ణయించబడుతుంది. మానవునికి సంతోషం లేదా దుఃఖం, విజయం లేదా వైఫల్యం, ఆధిపత్యం లేదా అణచివేత, ప్రశంసలు లేదా అసభ్యత, ప్రేమ లేదా ద్వేషం వంటి వాటికి సంబంధించిన సందర్భం ఎల్లప్పుడూ పరలోకానికి సంబంధించినది అయి ఉండాలి. మానవుని మనస్సు పరలోకంతో అనుసంధానించబడిన విషయాలకు మాత్రమే విలువనిస్తుంది మరియు అలాంటి సంబంధం లేనప్పుడు, పూర్తిగా ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపడం కష్టo.

ఇహలోక విషయాల పట్ల ఉదాసీనంగా ఉన్న వారితో, "మీ ప్రాపంచిక విషయాలు నాకంటే మీకు బాగా తెలుసు" అని ప్రవక్త(స)తరచుగా చెప్పేవారు. ప్రవక్త(స) యొక్క ఈ నమ్మకం కేవలం అతని మేధోపరమైన ఊహ కాదు. అది మనిషి యొక్క మొత్తం జీవిత గమనం మరియు జీవన విధానం మారుస్తుంది మరియు అది మనిషిని పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారుస్తుంది.

ప్రవక్త(స) జీవిత పాఠం ఏమిటంటే, వ్యక్తి  జీవన విధానం సమూలంగా మారితే తప్ప, ఒకరి చర్యల నాణ్యతలో మెరుగుదల ఉండదు. ప్రవక్త(స) ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, దాని ప్రచారం ప్రవక్త(స)కు   గొప్ప ఆందోళనగా మారింది. స్వర్గం మరియు నరకం పట్ల ప్రవక్త(స)అంతర్గత ఆందోళన అతని ఆహ్వానాలలో మరియు హృదయపూర్వక పశ్చాత్తాపంలో వ్యక్తమవుతుంది.

 ప్రవక్త(స) జీవన విధానం అతని సమకాలీనుల నుండి ఎలా భిన్నంగా ఉందో క్రింద వివరించిన  కొన్ని సంఘటనల నుండి ఊహించవచ్చు.

ప్రవక్త(స) భార్య ఉమ్ సలామా,  ప్రవక్త (స) తన ఇంటికి వచ్చినప్పుడు, ప్రవక్త(స) పనిమనిషిని పిలవడం గమనించినది.  పని అమ్మాయి కనిపించలేదు. ఉమ్మ్ సలామా తన పనిమనిషి  బయట ఉంది అని   తెలపడం కోసం బయటి ద్వారం తెరిచినది. ప్రవక్త(స) చిరాకుపడ్డారు. ప్రవక్త (స) తన చేతిలో పట్టుకున్న చిన్న కర్రను  పనిమనిషికి చూపిస్తూ, తీర్పు దినాన దైవిక ప్రతీకారంకు  భయపడి ఉండకపోతే, తానూ దానితో ఆమెను కొట్టేవాడినని చెప్పారు. చిన్నపాటి శిక్షను కూడా దేవునికి భయపడి వేయరాదు.

బద్ర్ యుద్ధంలో బందీగా తీసుకున్న యుద్ధ ఖైదీలలో  (రమదాన్, 2.A.H.) ప్రవక్త(స)బద్ధ శత్రువులలో ఉన్నారు. అయినప్పటికీ, ప్రవక్త(స)వారికి అత్యుత్తమ చికిత్స అందేలా చూశారు. వారిలో సుహైల్ ఇబ్న్ అమ్ర్ ఒక ఆవేశపూరిత వక్త మరియు ప్రవక్త(స)ను తీవ్రంగా తిట్టేవాడు.  సుహైల్ ఇబ్న్ అమ్ర్ దంతాలు రాలకోట్టమని ప్రవక్త(స)సన్నిహిత సహచరులలో ఒకరైన ఉమర్ ఫరూఖ్,  ప్రవక్త(స)కు  సూచించాడు. అప్పుడు ప్రవక్త(స) ఇలా జవాబిచ్చారు, "నేను అలా చేస్తే, దేవుడు తీర్పు రోజున నన్ను బాధిస్తాడు. దానిని దేవుని దూత అయిన నేను తట్టుకోలేను."

ప్రవక్త(స) కూడా ఇతర పురుషుల వలే ఒక సాధారణ వ్యక్తి. సంతోషకరమైన విషయాలు ప్రవక్త(స)ను సంతోషపరుస్తాయి, విషాదకరమైన విషయాలు ప్రవక్త(స)కు బాధిస్తాయి. ప్రవక్త(స)కు ఒక అందమైన, ఆరోగ్యకరమైన కుమారుడు జన్మించాడు. ప్రవక్త(స) కుమారుడికి  ఇబ్రహీం అని పేరు పెట్టారు. పుట్టిన వార్త అబూ రఫీ ద్వారా తెలియజేయబడింది మరియు ప్రవక్త(స) ఎంతగానో సంతోషించి వెంటనే రఫికి ఒక బానిసను బహూకరించారు. ప్రవక్త(స)కూడా అందరు  తల్లితండ్రుల్లాగే తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ముచ్చటించేవారు. 

అరబ్ ఆచారం ప్రకారం ఇబ్రహీం కు పాలు ఇవ్వటానికి ఒక దాయి(పాలు ఇచ్చే స్త్రీ) కి అప్పగించారు. పాలు ఇచ్చే దాయి పేరు ఉమ్ బర్దా (ముంధీర్ కుమార్తె)మరియు ఉమ్ బర్దా ఒక కమ్మరి భార్య. ఉమ్ బర్దా నివసించే చిన్న ఇల్లు తరచుగా పొగతో నిండి ఉంటుంది. అయినప్పటికీ ప్రవక్త(స) తన కొడుకును చూడటానికి తరచుగా ఆమె ఇంటికి వెళ్ళేవారు. విషాదకరంగా బాల్యం లోనే ప్రవక్త(స) కుమారుడు ఇబ్రహీం మరణించినాడు. ప్రవక్త (స) మదీనాకు వలస వెళ్లిన తర్వాత పదవ సంవత్సరంలో ప్రవక్త(స) కుమారుడు ఇబ్రహీం ఒకటిన్నర సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇతర సాధారణ మనిషిలాగే, ప్రవక్త(స) కూడా తన కుమారుడి మరణంతో విలపించారు. ఏ తండ్రి కి అయిన కలిగి ఉండే భావాలు మరియు ఆకాంక్షలు ప్రవక్త(స)కి ఉన్నాయి. కానీ ఇవి దేవునిపై ప్రవక్త(స) నమ్మకాన్ని ఏ విధంగానూ తగ్గించలేదు. ప్రవక్త(స)బాధలో ఇలా అన్నారు: భగవంతుడా!నాకుమారుడు  ఇబ్రహీం, మరణంతో నేను చాలా బాధపడ్డాను. నా కన్నుల నుండి కన్నీళ్లు రాలుతున్నాయి మరియు నా హృదయంలో వేదన ఉంది, కానీ నేను నా ప్రభువుకు  ఇష్టం లేనిది ఏమీ అనను?

ప్రవక్త(స) కుమారుడు ఇబ్రహీం మరణించిన రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. ముఖ్యమైన వ్యక్తుల మరణాల వల్ల సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తాయని పురాతన కాలం నుండి ఒక నమ్మకం ఉంది. మదీనా ప్రజలు, ప్రవక్త(స) కుమారుడి మరణానికి  సూర్యగ్రహణo  కారణమని మాట్లాడటం ప్రారంభించారు. అప్పుడు ప్రవక్త(స) ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు: ఏ ఒక్క  మానవుడి మరణం వల్ల సూర్యచంద్రుల గ్రహణాలు ఏర్పడవు. అవి భగవంతుని సూచనలలో రెండు సూచనలు. గ్రహణం సంభవించినప్పుడు, మీరు ప్రార్థనలలో నిమగ్నమయి ఉండాలి”.

ప్రవక్త(స) ఒకసారి  తన ప్రయాణంలో ఒక మేకను కాల్చమని తన అనుచరులను అడిగాడు. జంతువును వధిస్తానని ఒకరు, తోలు తీస్తానని మరొకరు, వంట చేస్తానని మూడోవాడు అన్నారు. అప్పుడు ప్రవక్త(స) కాల్చటం కోసం కలపను సేకరిస్తానని చెప్పారు. అంతట ప్రవక్త(స)అనుచరులు ఓహ్, దేవుని దూత! మేము అన్నీ చేస్తాం” అని అన్నారు. ప్రవక్త(స) మీరు చేస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ వంతులు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అలాగే దేవుడు తన సేవకుల్లో ఎవరైనా తన సహచరులపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడం ఇష్టం లేదు” అని అన్నారు.

"భగవంతుని సాక్షిగా,  నేను దేవుని దూతని అయినప్పటికీ, తరువాతి ప్రపంచంలో నా గతి ఎలా ఉంటుందో నాకు తెలియదు, నీగతి   ఏమిటో నాకు తెలియదు" అని ప్రవక్త(స) తరుచుగా అంటుండేవారు.

ఒక రోజు ప్రవక్త(స) సహచరుడు అబూధర్ ఘిఫారీ, తనతో కూర్చొన్న నల్లని రంగు కలిగిన మరొక ప్రవక్త(స)సహచరుడిని  "ఓ నల్లవాడా" అని సంబోధించాడు. ప్రవక్త(స) ఈ విషయం విన్నప్పుడు, చాలా అసంతృప్తి చెందారు   మరియు ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని మరియు అందరిని సమానంగా గౌరవించమని, “నల్లజాతి మనిషి కంటే తెల్లవాడికి ఎటువంటి ఆధిక్యత లేదు." అని అబూధర్‌ను హెచ్చరించారు.

ప్రవక్త(స) ఒకసారి ఒక సంపన్న ముస్లిం,  తనకు  మరిఒక పేద ముస్లింకు మధ్య కొంత దూరం ఉండేటట్లు వదులుగా ఉన్న తన వస్త్రాన్ని సర్దుకోవడం  చూశారు. అప్పుడు అతని పేదరికం మీకు అంటుకుపోతుందని మీరు భయపడుతున్నారా?’’ అని సంపన్న ముస్లింతో  వ్యాఖ్యానించారు.

మదీనాలో ముస్లిం రాజ్యం స్థాపించబడినప్పటికీ, ప్రవక్త(స)సాధారణ వ్యక్తిలా జీవించారు  మరియు ఎటువంటి ఉన్నతమైన హక్కులను పొందలేదు. ప్రవక్త(స) ఒకసారి జైద్ ఇబ్న్ సనా అనే యూదుడి నుండి కొంత డబ్బు తీసుకోవలసి వచ్చింది. చెల్లించవలసిన గడువు ముగియడానికి కొన్ని రోజుల ముందు రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని కోరటానికి యూదుడు వచ్చాడు. ప్రవక్త (స) భుజాల చుట్టూ ఉన్న వస్త్రాన్ని లాగుతూ, అబ్దుల్ ముత్తలిబ్ సంతానం ఎప్పుడూ బాకీ చెల్లించేవారు కాదని అన్నాడు. యూదుడి ఈ దుష్ప్రవర్తనను తట్టుకోలేక ఉమర్ ఫరూక్ యూదుడిని దూషించడం ప్రారంభించాడు మరియు యూదుడిని కొట్టే స్థాయికి చేరుకున్నాడు. ప్రవక్త(స) యూదుడితో నవ్వుతూ చెల్లించటానికి    ఇంకా మూడు రోజుల గడువు మిగిలి ఉంది.” అని అన్నారు.

ఆపై ఉమర్ ఫరూఖ్‌తో, “రుణాల వాపసు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మీరు నాకు సలహా ఇచ్చి ఉండవచ్చు మరియు తిరిగి చెల్లించమని డిమాండ్ చేయడంలో మరింత మర్యాదగా ఉండమని మీరు యూదుకు సలహా ఇచ్చి ఉండవచ్చు" అని అన్నారు. అప్పు తిరిగి చెల్లించడానికి మరియు మీరు యూదువ్యక్తిని మందలించినందుకు  గాను యూదువ్యక్తికి  అదనంగా నలభై కిలోలు ఇవ్వాలని ప్రవక్త (స)ఉమర్‌తో అన్నారు.

ప్రవక్త(స) అరేబియాకు పాలకుడు అయినప్పుడు, దేవుని దూతగా ప్రవక్త(స) ఏది చెప్పినా అది చట్టమే. ప్రవక్త(స)తన ప్రజలచే గౌరవించబడ్డాడు. హుదైబియా ఒప్పందం సమయంలో ఖురైష్‌ల దూత ఉర్వాహ్ ఇబ్న్ మసూద్, ప్రవక్త (స) వజూ చేయడానికి ఉపయోగించిన నీరు ఎప్పుడూ నేలపై పడకుండా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజూ చేసిన నీరు క్రింద పడక ముందే  దానిని పట్టుకుని తమ ముఖాల మీద అనుచరులు రుద్దుకునేవారు. ప్రవక్త(స) పట్ల తమకు ఉన్న అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ, తాము ప్రవక్త(స)ముఖంలోకి   మరియు కళ్లలోకి సూటిగా చూడలేకపోయామని    ప్రవక్త(స)సన్నిహిత సహచరుడు అనస్ చెప్పారు. అంతేకాదు ఎవరైనా సహచరుడు ప్రవక్త(స)తలుపు తట్టవలసి వస్తే, అతను తన చేతివేళ్లతో మెల్లిగా తట్టుతాడని ముగీరా చెప్పారు. హునైన్ యుద్ధంలో, ముస్లింలు ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు, శత్రు సేనలు ప్రవక్త(స)పై బాణాలు కురిపించారు కాని ప్రవక్త(స)అనుచరులు ప్రవక్త(స) చుట్టు కవచం లాగా ఏర్పడి  ఆ బాణాలను తమ శరీరాలపై తీసుకున్నారు.ఇటువంటి భక్తి మరియు ఆరాధన ఏ మనిషినైనా వ్యర్థం చేస్తుంది. వారు ప్రత్యేకమైన ఆధిక్యత యొక్క భావనను కలిగి ఉంటారు. కానీ ప్రవక్త(స)ప్రవర్తన ఎప్పటిలాగే నిరాడంబరంగా ఉంది.

ఒక సందర్భం లో ఒక పల్లెటూరి మోటైన వ్యక్తి, ప్రవక్త(స) ఒంటేపై ఉండగా వచ్చి ప్రవక్త (స) మెడపై గుర్తు పడేవిధంగా తాడును లాగి ప్రవక్త(స)ను రెండు ఒంటెల సరుకు తనకు ఇవ్వమని అడిగాడు.  ఆ వస్తువులు అతనికి చెందినవి కావు.  ప్రవక్త(స) నవ్వుతూ వాటికి  సరైన యజమాని దేవుడని మరియు తానూ కేవలం దేవుని సేవకుడిని మాత్రమే అని బదులిచ్చారు. ఇలా ప్రవర్తించినందుకు తనకు భయం లేదా! అని గ్రామీణ వ్యక్తిని ప్రవక్త(స) అడిగారు. తనకు భయం లేదు ఎందుకంటే ప్రవక్త(స) ఎప్పుడు పరుషంగా వ్యవహించరు అని  ఆ మోటు వ్యక్తి బదులిచ్చాడు. ప్రవక్త(స) చిరునవ్వు నవ్వి, తన ఒంటెలలో ఒకదానిని బార్లీ మరియు మరొకటి ఖర్జూరంతో నింపి, ఆ రెంటినీ మోటైన వ్యక్తికి ఇచ్చారు.

ప్రవక్త(స) సదా దైవభీతి కలిగి వినయం మరియు సౌమ్యత కలిగి ఉండేవారు,  మితంగా మాట్లేడేవారు మరియు వంగి నడిచేవారు.ఎల్లప్పుడూ తనను తాను దేవుని సేవకునిగా పిలుచుకునేవారు. ఇతర మానవుల వలె దుస్తులు ధరించేవారు  మరియు తినేవారు.

ప్రవక్త(స)సహచరులలో ఒకరు ఒకసారి “దేవుని చిత్తమే, ప్రవక్త చిత్తం" అనగా ప్రవక్త (స) ఆ వ్యక్తిని గట్టిగా మందలించారు.మీరు నన్ను దేవునితో సమానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 'దేవుడు సంకల్పిస్తే' అని చెప్పడానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవాలి."అన్నారు.

ప్రవక్త(స)కు నలుగురు కుమార్తెలు ఉన్నారు, వీరిలో చిన్నది మరియు అత్యంత గౌరవనీయురాలు  ఫాతిమా(ర). హజ్రత్ అలీ వివాహం ఫాతిమా(ర) తో జరిగింది మరియు ఇంటి పనులన్నీ ఫాతిమా(ర) స్వయంగా చేయాల్సి వచ్చింది.జొన్నలు దంచడం, నీళ్ళు తేవడం, ఇల్లు ఊడ్చడం వంటి ఇంటిపనులు చేయాల్సి వచ్చింది.ఫాతిమా(ర) ను  సేవకుని కోసం తన తండ్రిని సంప్రదించమని అలీ(ర) సలహా ఇచ్చారు. ఫాతిమా(ర) సేవకుడిని ఇమ్మని అడగటానికి తన తండ్రి ప్రవక్త(స)ఇంటికి వెళ్ళింది, కానీ అక్కడ గుమిగూడిన జనం కారణంగా ప్రవక్త(స)తో మాట్లాడే అవకాశం దొరకలేదు.

మరుసటి రోజు ప్రవక్త (స) వారి ఇంటికి వచ్చి, హజ్రత్ అలీ, ఫాతిమా(ర)ను తన వద్దకు ఎందుకు పంపాడని అడిగారు. కారణం విని ప్రవక్త(స), “ఓ ఫాతిమా! దేవునికి భయపడండి, మీ బాధ్యతలను నెరవేర్చండి మరియు ఇంటి పని చేయండి. మీరు నిద్రపోయేటప్పుడు, 'దేవుని మహిమ' 33 సార్లు, 'దేవునికి స్తోత్రం' 33 సార్లు మరియు 'దేవుడు గొప్పవాడు' అని 34 సార్లు పఠించండి. సేవకుని కలిగి ఉండటం కంటే ఇది చాలా మంచిది. దేవుడు మరియు ప్రవక్త(స) సంతోషించేది తనకు సంతోషం అని ఫాతిమా సమాధానం చెప్పింది.

సృష్టికర్త లేకుండా విశ్వం స్వతహాగా ఉద్భవించలేదని, సర్వశక్తిమంతుడైన దేవుడే అన్నిటికీ యజమాని అని, మానవులందరూ అతని జీవులు మరియు సేవకులు మరియు అతనికి బాధ్యత వహిస్తారని ప్రవక్త(స)కు వెల్లడి చేయబడిన సత్యం.  మరణం అంటే వినాశనం కాదు, ఆనందంతో నిండిన మరొక ప్రపంచంలో శాశ్వత జీవితానికి ప్రవేశ ద్వారం.

మంచివారికి స్వర్గం యొక్క ఆశీర్వాదం మరియు దుర్మార్గులకు నరకం యొక్క వేదన ఉంది. మానవాళి మార్గదర్శకత్వం కోసం ఈ సత్యాన్ని ప్రకటించాలని దేవుడు ప్రవక్త(స)ను ఆదేశించాడు. ప్రవక్త(స) సఫా శిలలను అధిరోహించి, అక్కడ సమావేశమైన జనసమూహాన్ని ఉద్దేశించి ఇలా అన్నారు: దేవుని ఆశీస్సులతో, మీరు నిద్రపోతున్నప్పుడు మరణించాలి మరియు మీరు మేల్కొన్నప్పుడు మరణం నుంచి లేవాలి. దీని ప్రకారం, మీరు మీ పనులను నిర్ధారించుకోవాలి. మంచి పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు చెడు పనులకు కఠినంగా శిక్ష ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆనంద ఉద్యానవనంలో లేదా నరకంలోని అగ్నిలో నివసిస్తారు."

మనిషి కాలానికి  విరుద్ధంగా నడుస్తుంటే అతనికి  అడుగడుగునా కష్టాలే ఎదురు అవుతాయి.అలాగే  వ్యక్తి దావా ప్రచారం ప్రారంభించినప్పుడు అతనికి అడుగడున కష్టాలే ఎదురు అవుతాయి.  తమ మార్గంలో స్థిరపడిన వ్యక్తులు మార్పు యొక్క స్వరాన్ని వినడానికి చాలా అరుదుగా ఇష్టపడతారు.

ప్రవక్త(స) దైవవాణి బోధిస్తూ, తన స్వంత ప్రజల అసంతృప్తికి లోను  అయ్యారు. ప్రవక్త(స) తనపై బౌతిక దాడులను కూడా అనుభవించవలసి వచ్చింది. ప్రవక్త(స)అనుచరులకు మరియు అవిశ్వాసుల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రవక్త(స)వలస వచ్చిన మూడవ సంవత్సరంలో, ప్రవక్త(స)ప్రత్యర్థులు మదీనాపై దాడి చేశారు మరియు ఉహుద్ యుద్ధం జరిగింది. యుద్దప్రారంభంలో, ముస్లింలు పైచేయి సాధించారు, కానీ, ప్రవక్త(స)అనుచరులలో కొంతమంది అనుసరించిన  తప్పుడు వ్యూహం కారణంగా, శత్రు దళాలు వెనుక నుండి దాడి చేసి, ప్రవక్త(స) సైనిక పట్టికలను బలహీన పరిచినారు. ఇది చాలా దారుణ పరిస్థితి. ప్రవక్త(స) అనుచరులు చాలా మంది యుద్దరంగం నుండి పారిపోవటం ప్రారంభించారు మరియు ప్రవక్త(స)శత్రువుల శ్రేణులచే చుట్టుముట్టబడ్డాడు. ప్రవక్త(స)తన సత్తాను చాటుకోవడానికి, స్వర్గ మహిమ కోసం పోరాడాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. మరణానంతర జీవితంలో తన సహచరులుగా ఉండాలని ప్రవక్త(స)వారికి పిలుపునిచ్చారు.

ముస్లిం సైనికులలో కొందరు ప్రవక్త(స) ను రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ప్రవక్త(స) యుద్ధం లో  తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్బా ఇబ్న్ అబీ వక్కాస్ ప్రవక్త(స)ముఖంపై ఒక రాయిని విసిరాడు. ప్రవక్త(స) దంతాలు కొన్ని విరిగినాయి మరియు అబ్దుల్లా ఇబ్న్ ఖుమయ్య అనే  ఖురేషీ మల్లయోధుడు ప్రవక్త(స)ను తన యుద్ధ గొడ్డలితో ప్రవక్త(స) తలపై చాలా క్రూరంగా కొట్టాడు. ప్రవక్త(స) హెల్మెట్ యొక్క రెండు లింకులు తొలగి  ప్రవక్త(స)ముఖాన్ని గుచ్చుకున్నాయి. ఇంతలో అవిశ్వాసి అబ్దుల్లా ఇబ్న్ షహబ్ జుహ్రీ ప్రవక్త(స)నుదిటిపై రాయితో కొట్టాడు మరియు ప్రవక్త(స) తీవ్ర రక్తస్రావం తో ఒక గొయ్యిలో పడిపోయారు.

ప్రవక్త(స) చంపబడ్డారని శత్రువులు విజయగర్వంతో కేకలు వేశారు మరియు ముస్లిం దళాలలో నిరుత్సాహం ఆవహిoచినది. వారు తమ ధైర్యాన్నికోల్పోయారు. అయితే, ఒక సహచరుడు గోతిలో పడి ఉన్న ప్రవక్త(స) చూచి ప్రవక్త(స) జీవించి ఉన్నాడని అరిచాడు.

అది ప్రవక్త(స)తనను గాయపరిచిన వ్యక్తులు మోక్షాన్ని ఎలా పొందుతారు  అని ఆశ్చర్యపోయేంత భయానక స్థితి. అప్పుడు దేవుడు, తన దూత గాబ్రియేల్ ను  వహి/ద్యోతకంతో పంపాడు: మీకు విషయాలపై అధికారం లేదు. వారి ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందేలా మరియు వారిని అణచివేసి, శిక్షించేలా దేవుడు వారిని నడిపిస్తాడు”.

ప్రవక్త(స) కోపాన్ని తగ్గించడానికి ఈ వహి/ఉపదేశం సరిపోతుంది. ప్రవక్త (స)తన గాయాల నుండి కారుతున్న రక్తాన్ని తుడుచికొని, ప్రజల కోసం ఇలా ప్రార్థించాడు: ఓ దేవా! నా ప్రజలను క్షమించండి ఎందుకంటే వారు ఏమి చేస్తారో వారికి తెలియదు!

హదీసులలో ఇటువంటి సంఘటనలు అనేకం కలవు. అవి ప్రవక్త(స) యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి, అదే సమయంలో మనిషి దేవుని సేవకుడని మరియు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితులలో అలాగే ఉండాలని చెబుతాయి.

భగవంతుడు మరియు మనిషి యొక్క సంబంధం అనేది మానవుని దైవభీతి మరియు పరలోకం పట్ల అతని అవగాహన ఆదర్శంగా ఉండాలి. విశ్వంలోని ప్రతి ఒక్క వస్తువు విశ్వాసికి భగవంతుని గుర్తుకు తెచ్చేలా ఉండాలి.విశ్వాసి ఉనికిలో ఉన్న ప్రతి కణంలో తన సంకేతాలను గుర్తించాలి. అన్ని ప్రాపంచిక విషయాలలో భగవంతుడు చివరి మధ్యవర్తి అని ఎప్పటికీ మరచిపోకూడదు.

నరక భయం విశ్వాసి లో వినయం మరియు ఇతరుల పట్ల మర్యాదపూర్వక వైఖరిని కలిగిస్తుంది. స్వర్గం కోసం ఆత్రుత, ప్రపంచాన్ని అవాస్తవంగా మరియు అల్పమైన ప్రాముఖ్యతను కలిగిస్తుంది. దేవుని గొప్పతనం విశ్వాసిని ఎంతగానో ఆకర్షిస్తుంది. తన గొప్పతనాన్ని ప్రదర్శించే ఏ ఆలోచన అయినా చాలా పనికిమాలినదిగా కనిపిస్తుంది. ఎలాంటి విమర్శలు విశ్వాసిని రెచ్చగొట్టవు. పొగడ్తలు  విశ్వాసిని సంతోషపెట్టావు.

ప్రవక్త(స) జీవితం లో అనేక విషయాలు జరిగాయి.  ఒక వైపు, అతి ప్రశంశలు  మరియు పెద్ద సంఖ్యలో ప్రజలను విశ్వాసులుగా మార్చడం లో విజయం మరోవైపు  ప్రవక్త(స) బోధనలను చాలా మంది ప్రజలు మొదట్లో తిరస్కరించడం, అతని నిస్సహాయత కన్పిస్తాయి. కానీ ప్రవక్త(స)తన విజయాన్ని అహంకారంగా మార్చడానికి ఎన్నడూ అనుమతించలేదు లేదా అతనిని కష్టాలు నిరాశపరచలేదు.

ప్రవక్త(స)జీవితం పూర్తిగా దైవభక్తి మరియు దైవభీతితో కొనసాగుతుంది. ప్రవక్త(స) న్యాయం మరియు నైతిక నిబద్ధత యొక్క దృఢమైన ఛాంపియన్‌గా మిగిలిపోయారు. ప్రవక్త(స) తన జీవితాంతం ప్రదర్శించిన ఆదర్శవంతమైన మానవ లక్షణం ఇది.

No comments:

Post a Comment