15 February 2013

భారత దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీ లెదా ప్రత్యక్ష ప్రయొజన బదిలీ పథకంవర్ధమాన భారత దేశంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నగదు బదిలీ పథకాన్ని ముందుకు తెచ్చింది. మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో ఆయా సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న సబ్సిడీ మొత్తానికి సమానమైన నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. 2013 జనవరి 1 నుంచి ఎంపిక చేసిన 51 జిల్లాల్లో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మీ డబ్బు మీ హక్కు’ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకాన్ని యూపీఏ-2 ప్రభుత్వం 2013 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

నగదు బదిలీ
సంక్షేమ పథకాలకు చెందిన సబ్సిడీ నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేయడమే నగదు బదిలీ పథకం ప్రధాన ఉద్దేశం. విశిష్ట గుర్తింపు సంఖ్య ‘‘ఆధార్’’ ఆధారంగా దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 51 జిల్లాల్లో 2013 జనవరి ఒకటి నుండి నగదుబదిలీ పథకం ప్రారంభమవుతుంది. అనంతరం 2013 ఏప్రిల్ నాటికి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇక 2014 ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా ఈ పథకం అమలవుతుంది. నగదు బదిలీ పథకాన్ని మొత్తం 35 పథకాలకు వర్తింపజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ, పేదలకు, రైతులకు, విద్యార్థులకు, ఇతర బలహీనవర్గాలకు ఇచ్చే సబ్సిడీ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక మొదలు పంపిణీ వరకు చోటుచేసు కుంటున్న అక్రమాలు, అవినీతి, ప్రజాధనం దుర్విని యోగాన్ని నివారించేందుకుగాను నూతనంగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు.
దారిద్య్ర నిర్మూలనకు ప్రవేశ పెట్టిన పలు పథకాలు అవినీతి కారణంగా తగిన సత్ఫలితాలు ఇవ్వలేదు. అమలులో లోపాలు, నిర్వహణ వైఫల్యాల వల్ల అవినీతి పెరిగిపోయి లక్షిత ప్రజానీకానికి వాటి ప్రయోజనాలు చేరడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగానే ప్రత్యక్ష నగదు బదిలీ(డీసీటీ), షరతులతో కూడిన నగదు బదిలీ(సీసీటీ) ముందుకొచ్చాయి.
రేషన్, గ్యాస్, ఎరువులపై ఇచ్చే ప్రభుత్వ రాయితీలను నగదు రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడమే నగదు బదిలీ పథకం. ఇక నుంచి నగదు బదిలీ పథకం ద్వారా ఉపాధి హామీ, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లను అమలు చేయనున్నారు.కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అమలవుతున్న 35 పథకాలను నగదు బదిలీ కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది..ప్రస్తుతం సబ్సిడీ బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసరాలతోపాటు ఎరువులు, విత్తనాలను రాయితీ ధరలకు లబ్దిదారులకు అందించడం జరుగుతున్నది. ఇకపై ఈ సబ్సిడీ మొత్తాన్ని నగదు రూపంలో లెక్కించి ఆధార్ సంఖ్య ఆధారంగా లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ చేయడం జరుగుతుంది. నగదు బదిలీ వల్ల బోగస్ కార్డుల భాగోతాలు, రేషన్ డీలర్ల అక్రమాలు, అవినీతి తగ్గుతుంది. అదేవిధంగా రేషన్ వస్తువుల నిల్వ, రవాణా ఖర్చులు కూడా తగ్గి ప్రజాధనం ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.
దేశంలో అవినీతి, పేదరికం విరుగుడుగా నగదు బదిలీ పథకం ప్రవేశ పెడుతున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ చెబుతున్నారు. 2012 అక్టోబరు 20న రాజస్థాన్‌లోని దూదూలో ఆధార్ అనుసంధానిత సేవల పంపిణీని ప్రధాని ప్రారంభించారు. ఆధార్ కార్డు ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ఇకపై దేశ ప్రజలు నేరుగా పొందవచ్చని, గ్యాస్ సబ్సిడీలు, పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపులు, ఉపకార వేతనాలు వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. సంక్షేమ నిధుల విషయంలో అవినీతి, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు.
విదేశాల్లో ఇలా: 
ప్రపంచంలో పలు దేశాలలో పేదరిక నిర్మూలనకు నిర్దేశిత లక్ష్యాల సాధనకు నగదు బదిలీ పథకాలు అమలు అవుతున్నాయి.. ప్రపంచంలోని పలు దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో పదిహేనేళ్ల క్రితం నుంచే ఈ నగదు బదిలీ పథకం అమలవుతోంది. రెండు రకాల నగదు బదిలీ పథకాల్లో ఏదో ఒకదాన్ని దాదాపు 30 దేశాలు ప్రవేశ పెట్టాయి. షరతులతో కూడిన నగదు బదిలీ కార్యక్రమాన్ని 1997లో మెక్సికోలో ప్రొగెసాపేరుతో ప్రారంభించారు. తర్వాత ఆపర్చునిడెన్స్అని పేరు మార్చారు. బ్రెజిల్‌లో 1995లో బోల్సా ఎస్కోలా’ 2003లో బోల్సా ఫ్యామిలియాకార్యక్రమాలను ప్రారంభించారు. హోండురాస్, నికరాగ్వా, ఈక్వెడార్, డొమినికన్ రిపబ్లిక్, పనామా, పెరూ, జమైకా వంటి దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలే అమలవుతున్నాయి. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాలూ ఇటీవల షరతులతో కూడిన నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టాయి. షరతులతో కూడిన నగదు బదిలీ కార్యక్రమాన్ని మొదట 2007 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో ఆపర్చునిటీ ఎన్‌వైసీపేరుతో ప్రారంభించారు. ఈ దేశాలన్నింటిలోకి బ్రెజిల్‌లో మాత్రమే సమర్థంగా అమలవుతోంది. ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద దారిద్య్ర నిర్మూలన కార్యక్రమంగా దీన్ని పేర్కొంటున్నారు. ఆ దేశ జనాభాలో నాలుగో వంతు అంటే కోటి పది లక్షల మందికిపైగా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మెక్సికోలో 25 శాతం మంది ఈ పథకం పరిధిలో ఉన్నారు.
భారత దేశంలో నగదు బదిలీ
నగదు బదిలీ అన్న పేరు వాడకపోయినా ప్రత్యక్షంగా లబ్ధిదారులకు నగదు చెల్లించే పద్ధతి మన దేశానికి, రాష్ట్రాలకి కొత్తకాదు. వాస్తవానికి ప్రత్యక్ష నగదు బదిలీకి సంబంధించి వృద్ధాప్య పింఛన్ల వంటి పథకాలు 1960 నుంచే మన దేశంలో అమలవుతున్నాయి జీవనభద్రత కోసం సంక్షేమ పథకంగా ఇస్తున్న పెన్షన్‌లు,  మాతా శిశు సంరక్షణకు ప్రవేశపెట్టిన పలు పథకాలు నగదు బదిలీ పథకాలే. ఒకనాడు నిర్వహించిన .పనికి ఆహారంపథకం వస్తు బదిలీ పథకం అయితే, ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం అతిపెద్ద నగదు బదిలీ పథకంగా ఉంది..
.కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న నగదు బదిలీ పథకం మొదటిదశ 2013 జనవరి 1 నుంచి 20 జిల్లాల్లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందేందుకు అర్హులైన లబ్దిదారులకు నేరుగా నగదును బ్యాంకు ఖాతాల ద్వారా బట్వాడా చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. తొలి దశలో ఇప్పుడు అమలయ్యే పథకాలు చాలా వరకు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్టయపెండ్‌లకు సంబంధించినవి, ఇందిరా మాతృత్వ యోజన, ధనలక్ష్మి పథకాలకు సంబంధించినవే ఉంటాయి. మిగిలిన 18 పథకాల కింద నగదు ప్రయోజనాలు దేశవ్యాప్తంగా మిగతా 23 జిల్లాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలు చేసిన తర్వాత లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ తొలి దశలో 20 జిల్లాల్లోనే ప్రారంభిస్తున్నా 2013 చివరి నాటికి దేశంలోని అన్ని జిల్లాల్లోను నగదు బదిలీ పథకం అమలవుతుందిని వెల్లడించారు. దేశంలో పేదలకు సంబంధించిన మూడు ముఖ్యమైన పథకాలైనౌ ఆహారం, ఇంధనం, ఎరువులకు సంబంధించిన సబ్సిడీల స్థానంలో నగదును అందించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం అంటోంది.
నగదు బదిలీ పథకాన్ని తొలుత మానవ వనరుల అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం తదితర మంత్రిత్వ శాఖల్లో అమలు చేస్తారు. సంక్లిష్టమైన ఆహారం, ఎరువుల సబ్సిడీ, వంట గ్యాస్ తదితరాలకు సంబంధించి తర్వాత దశలో అమలు చేయాలని నిర్ణయం. ఈ నగదు బదిలీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో దేశవ్యాప్తంగా ఇరవై క్లస్టర్లను ఏర్పాటు చేసి, ‘బిజినెస్ కరస్పాండెంట్అనే వ్యవస్థను రూపొందించనుంది. వీరు లబ్ధిదారుల చెంతకు మొబైల్ ఏటీఎంలను తీసుకువెళ్లి ఆధార్ కార్డు గుర్తింపుతో నేరుగా నగదు అందజేస్తాయి. బ్యాంకుల శాఖల్లేని మారుమూల పల్లెల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సబ్సిడీలకు బదులుగా ఈ నగదు చెల్లింపులు ఉంటాయి
ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రజలకు సాలీనా గరిష్ఠంగా రూ.3,20,000 అందజేయాలని ప్రభుత్వ యోచన. లక్షిత కుటుంబాలకు సగటున ఏడాదికి రూ. 40 వేలు అందుతాయని మరో అంచనా. ఉపకార వేతనాలు, ఎరువుల సబ్సిడీ వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, మహిళా, శిశు సంక్షేమ పథకాల ద్వారా చెల్లించే మొత్తాలు ఇకపై ఈ పథకం నుంచే లబ్ధిదారులకు చేరుతాయి.
నగదు బదిలీ పథకం అమలుకు తగిన కార్యాచరణ రూపకల్పనపర్యవేక్షణకు ప్రధాన మంత్రి నేతృత్వంలో అక్టోబర్ 26నేషనల్ కమిటీ ఆన్ డెరైక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ని ప్రకటించారు.
నగదు బదిలీ పథకం మన దేశంలో సాధ్యాసాధ్యాలుఎన్నెన్నో సందేహాలు.
·       మన దేశంలో ఈ పథకాన్ని ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ స్వలాభం కోసం ముందుకు తెస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
·       నగదు బదిలీ అనే మాటలను 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రస్తావించినా.. ప్రచారంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం కూడా రాహుల్ గాంధీ క్రెడిట్‌గా 2014 ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి తాపత్రయమే తప్ప పేదలకు సేవ చేద్దామనే చిత్తశుద్ధి మాత్రం కాదనే విమర్శలు వస్తున్నాయి
·       .సాధారణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నగదు బదిలీ రూపంలో లంచాలను ఎర వేస్తోందని బీజేపీ ఆక్షేపించింది.
·       ప్రజల కోసం తీసుకొచ్చిన పథకమని కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. ప్రభుత్వ సబ్సిడీలలో అవినీతి జరగకుండా చూడటమే నగదు బదిలీ పథకం లక్ష్యంమని, లబ్దిదారులు ఈ పథకం ద్వారా లాభపడుతారని చెబుతున్నారు. అదేవిధంగా పంపిణీ వ్యవస్థలో అవినీతి జరగడానికి వీలు ఉండదని చెబుతున్నారు.
·       ఈ పథకం అమలులో ఆచరణాత్మక సమస్యలు అనేకం ఎదురవనున్నాయి. ముఖ్యంగా అసలైన లబ్ధిదారుల గుర్తింపే ప్రధాన సమస్య అవుతుంది. వీరిని ఆధార్ కార్డుల ప్రాతిపదికన గుర్తించాలనేది పథకం ఉద్దేశం. వాస్తవానికి దేశంలో ఆధార్ కార్డుల జారీ ఈ ప్రక్రియ అధ్వానంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ప్రజలకు ఆధార్ కార్డులు అందలేదు దరఖాస్తు చేసుకున్న వారికి నెలలు గడిచినా కార్డులు అందని దుస్థితి. ఇంత గందరగోళం మధ్య ఈ కార్డుల ఆధారంగా ఈ నగదు బదిలీకి పూనుకోవడం పెద్ద సాహసమే. ఆధార్ కార్డు ద్వారా పేదల గుర్తింపు సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదు.  
·        బ్రెజిల్‌, మెక్సికో వంటి లాటిన్ అమెరికన్ దేశాలలో దేశాల్లో ఈ పథకం సమర్థంగా అమలవుతోంది. అయితే ఈ దేశాలలో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధిచెంది ఉండటం, బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో విస్తరించి ఉండటంవల్ల, అక్షరాస్యత గల చైతన్యవంత సమాజం ఉండటాన్ని ప్రధానంగా గమనించాలి.
  • ప్రస్తుతం దేశంలో 51.7 శాతం కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.  
·       పేదల నిర్వచనంపై ప్రభుత్వానికే ఒక స్పష్టత లేదు.
·       సబ్సిడీ పథకాల లబ్ధిదారుల్లో అత్యధికులు గ్రామీణులు, నిరక్షరాస్యులే. ఈ కుటుంబాల్లో పురుషులదే పెత్తనం. నగదు బదిలీ మహిళల పేరిట చేసినా.. ఆ డబ్బు చేరేది పురుషునికే. వ్యసనాలకు బానిసైన పురుషులు నగదుబదిలీ సొమ్మును నిత్యావసరాలకు ఖర్చు చేస్తారా? అనే సందేహం తలెత్తుతుంది.
·       సబ్సిడీకి ప్రత్యామ్నాయంగా ఇస్తున్న నగదు ఆ అవసరాలకు కాకుండా ఇతరత్రా వినియోగాలకు ఖర్చయ్యే ప్రమాదం కూడా ఉంది. చివరకు సబ్సిడీపై ఆహార పదార్థాలు దొరక్క పస్తులుండే దుర్భవస్థను ఎదుర్కొనాల్సి వస్తోంది. దీంతో పేదరికం తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఏర్పడతుంది. పోషకాహార లేమి సమస్య కూడా తీవ్రమవుతుంది. ఇప్పటికే దేశంలో పౌష్టికాహార లేమితో ఉన్న చిన్నారుల సంఖ్య దాదాపు 40 శాతం అని అంచనా. 
·       ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యంఅవడానికి కారణంగా చెబుతున్న అవినీతి అనే జాఢ్యం నగదు బదిలీకి సోకే ప్రమాదం కూడా ఉత్పన్నమవుతుందంటే కాదనలేని పరిస్థితి ఉంది.
·       ఇప్పటి వరకు ప్రభుత్వ విభాగాలకే పరిమితమైన ఈ అవినీతి ఇకపై బ్యాంకుల సిబ్బందికీ సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాల గురించి అందరికీ తెలుసు. ఇదే తరహా అవినీతి నగదు బదిలీలోనూ చోటుచేసుకుంటుందనడంలో సందేహం లేదు.
·       మన పర్యవేక్షణ, నిఘా విభాగాలూ పూర్తి నిర్లిప్తత, అవినీతిలో కూరుకుపోయిన విషయం సుస్పష్టం.
·       1957 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించె పథకాల ప్రయోజనం లబ్ధిదారులకు అతి తక్కువగానే చేరుతోందని, అంతా అవినీతి నోటికి చిక్కుతుందనే విమర్శ ఎన్నాళ్లగానో ఉంది. ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తున్న ఖర్చులో 16 శాతం కూడా ప్రజలకు చేరట్లేదని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం.
·       ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దలేని పాలకులు నగదు బదిలీలో ఎదురయ్యే సమస్యలు, అక్రమాలను ఎలా సరిచేయగలరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణిచేస్తున్న నిత్యావసరాల విషయంలో మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోవడమే కాదు మరిన్ని కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా లేక పోలేదని పరిశీలకులు భావిస్తున్నారు
·       పీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. నగదు బదిలీ పథకం వద్దంటున్న రేషన్ డీలర్లు.
·       రైతు (ఉత్పత్తిదారుడు), వినియోగదారుడు(పేదలు)కి మేలు చేసే పీడీఎస్ గాడి తప్పితే దేశంలో మార్కెట్ ద్రవ్యోల్బణం అదుపు తప్పడానికే దారి తీస్తుందని ఆర్థికవేత్తల అభిప్రాయం.
·       లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం, అధికారుల అవినీతి, నిర్లక్ష్యం ఫలితంగా అనేక రాష్ట్రాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య వాస్తవ సంఖ్య కన్నా చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో అనర్హులు లబ్దిదారులుగా మారడంవల్ల అర్హులకు నష్టం జరగడంతోపాటు ప్రభుత్వానికి సబ్సిడీ భారం మరింత పెరిగి పోతున్నది.
·       .సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమ స్యలకు పరిష్కార మార్గంగా రూపొందించిన నగదు బదిలీ పథకం అమలు వల్ల ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చు.
·        లబ్ధిదారులకు ఇన్నాళ్లూ సబ్సిడీలతో నిత్యావసర సరుకులు అందేవి. ఇప్పుడు నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా డబ్బు చేతికి అందుతుంది. ఒక్కసారిగా పెద్ద మొత్తం చేతికి అందడంతో వృధా కార్యక్రమాలకు ఖర్చు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో నగదు బదిలీ పథకం ద్వారామేలుకంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది
·       విద్యార్థుల ఉపకార వేత నాలు, ఉపాధి హామీ పథకం, ఆరోగ్యబీమా వంటి కార్యక్రమాలను నగదు బదిలీ కిందకు తేవడంవల్ల మంచి ఫలితాలే రావచ్చు.
 
నగదు బదిలీ మంచి ఫలితాన్నిస్తుందా?
నగదు బదిలీ... పథకంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సబ్సిడీల ప్రయోజనాలు లబ్ధిదారులకు అందడంలో జరుగుతున్న వైఫల్యం కారణంగా నగదు బదిలీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సరుకులకు బదులుగా చేతికందే నగదు ఎంతవరకుఉపయుక్తంగా ఉంటుంది... ప్రజలకు ఏ మేరకు మేలుచేస్తుందన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగామారుతున్నాయి. నగదు బదిలీ పథకాలు ప్రభుత్వ వ్యయాన్ని, దుబారాని తగ్గించేవిగా, లబ్ధిదారులకు నేరుగా సబ్సీడీని అందించేవిగా ఉన్నప్పటికీలక్ష్యసాధనకు మార్గాలుగా షరతులతో కూడిన నగదు బదిలీలను అత్యంత లోపరహితంగా రూపొందించినప్పుడే ఇవి సత్ఫలితాలను ఇస్తాయి.
సబ్సిడీ కార్యక్రమాలకు నగదు బదిలీ వర్తింపచేయడం మంచిదే కాని ప్రజాపంపిణీ వ్యవస్థ విషయంలో మాత్రం మరింత శాస్త్రీయంగా అధ్యయనం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరుపై నిఘా పెట్టడం, అర్హులైన లబ్దిదారులను గుర్తించడం రేషన్ డీలర్ల అక్రమాలను నిరోధించే పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించగలిగితే ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ అవసరం ఉండక పోవచ్చని సామాజికవేత్తల అభిప్రాయం. మన దేశంలో కొత్తగా అమలు చేయనున్న నగదు బదిలీ పథకంలో కూడా మార్గదర్శకాలు లేకపోతే పథకం గతి మారుతుందని చెబుతున్నారు. మరి జనవరి నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఈ పథకంతీరుతెన్నులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.: 


.
.

No comments:

Post a Comment