ఆర్థిక సంక్షోభంలో పశ్చిమ దేశాలు కూరుకు పోయిన నేపథ్యంలో
ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ గురించిన చర్చ తెరమీదకు వచ్చింది. ఈ చర్చల్లో “ఇస్లామిక్ బ్యాంకింగ్” ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇస్లామిక్
బ్యాంకింగ్ అనే పదం ఈమద్య తరచుగా వార్తలలో వినిపిస్తున్నది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ
రహమాన్ ఖాన్, ఆర్.బి.ఐ., గవర్నర్ శ్రీ రఘు రామ్ రంగరాజన్
ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను మన దేశంలో ప్రవేశ పెట్టాలని ఆలోచించుచున్నారు.
భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ ఇటీవల తమ మలేసియా పర్యటనలో అక్కడి ఇస్లామిక్
బ్యాంక్ పనితీరుతెన్నులను పరిశీలించి, మన దేశం లో అలాంటి
బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టటానికి మార్గాలు ఆలోచించమని ఆర్.బి.ఐ.ను కోరినారు.
ఇంతకు ముందు 2011 లో కేరళ హైకోర్టు, తన
తీర్పులో రాష్ట్రం లో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటులో గల అడ్డంకులను
తొలగించినది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచినా
అభివృద్ధిలో అట్టగున ఉన్నముస్లింలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా వారి వెనుకబాటు తనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో యూపీఏ సర్కారు ఉంది. ఇందుకోసం
ప్రత్యేకంగా 75 దేశాల్లో సత్ఫలితాలిస్తున్న
ఇస్లామిక్ బ్యాంకులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా
ఇస్లామిక్ బ్యాంకులు తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇస్లామిక్ బ్యాంకింగ్- ప్రధాన సూత్రాలు:
ఇస్లాం మత సిద్ధాంతం ఆధారంగా సాగేదే ఇస్లామిక్
బ్యాంకింగ్. షరియత్ చట్టాలను గౌరవిస్తూ, ఆ సూత్రాలకు అనుగుణంగా నడుచుకునే బ్యాంకులను ఇస్లామిక్ బ్యాంకులు
అనవచ్చును.ఈ బ్యాంకులు ఇస్లామిక్ ‘షరియా’ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. షరియా సూత్రాలపై
ఆధారపడి లాభ,నష్టాలు పంచుకొనే విధానం(ప్రాఫిట్ అండ్ లాస్
షేరింగ్) పై ఆధారపడి పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థను ఇస్లామిక్ బ్యాంకింగ్ గా
పేర్కొనవచ్చును..
ఎలాంటి వడ్డీ
లేకుండా “షరియా” నిబంధనల ప్రకారమే రుణాలందజేస్తాయి. ఇస్లాం మత సూత్రాల ప్రకారం వడ్డీ (రిబా) విధించడం, చెల్లించడం నిషేధం. పెట్టుబడికి సమానమైన రొక్కాన్ని మాత్రమే రుణం
తీసుకున్న వారు తిరిగి చెల్లించాలి అంటే వెయ్యి దినార్ల బంగారం రుణంగా ఇస్తే అంతే
బరువైన బంగారు కాయిన్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. షరియత్ సూత్రాలననుసరించి
వడ్డీ(రిబా) నిషేధంతో అన్ని ఇస్లామిక్ బ్యాంకులు వడ్డీరహిత సూత్రాన్ని విధిగా
పాటిస్తున్నాయి. ఈ బ్యాంక్ లు వర్తక, వాణిజ్యం, సామాజిక అబివృద్ధి వంటి ఉత్పాదక
కార్యకలాపాలకు ఊతం ఇస్తాయి. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే ముస్లింలకు ఈ బ్యాంకులు ఎలాంటి
లాభాపేక్ష లేకుండా రుణాలు ఇస్తాయి. ఆర్థికంగా లాభం వచ్చే రంగాల్లో ఇవి పెట్టుబడులు
పెట్టిస్తాయి. షరియత్ లో నిషిద్దమైన
వ్యాపారాల్లో పెట్టుబడులను ఆ బ్యాంకులు పెట్టవు. డబ్బు ను విలువకట్టే సాధనంగానే తప్ప ఆస్తిగా
ఇస్లాం అంగీకరించదు.
ఇస్లామిక్
బ్యాంకుల లోని కరెంట్ ఎకౌంట్
ఖాతాలు సాంప్రదాయ బ్యాంకులలోలాగా ఉండి, డిపాజిట్‌దారుల అనుమతితో వారి సొమ్మును ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టి
లాభాలు వస్తే పంచుతున్నారు, నష్టాలు వస్తే భరించవలసి ఉంటుంది. లాభంశముతో పాటు నష్టభయాన్ని పంచుకోవడమే దీని మూల
సూత్రం. డబ్బు ద్వారా ఆదాయార్జన కాకుండా లాభనష్టాలను పంచుకోవాలన్నదే ఇందులో
ముక్యోద్దేశం. ఇలా రుణం ఇవ్వడాన్ని ఒక సామాజిక మదుపుగానే
పరిగణిస్తుంది. షరియత్
సూత్రాలననుసరించి జూద ప్రవృత్తి గల రంగాలలో పెట్టుబడులు నిషేధించిన కారణంగా
బ్యాంకింగ్ పెట్టుబడులు అత్యధిక రిస్కు
కలిగిన రంగాలకు విస్తరించకపోవటం ఇస్లామిక్ బ్యాంకింగ్‌కు రక్షణగా ఉంది.నైతిక మడుపు, విలవలకు కట్టుబడిన కొనుగోళ్ల వ్యవహారాలలో
ఇస్లామిక్ బ్యాంకులు నిమగ్నమై ఉంటాయి.
ఇస్లామిక్ బ్యాంకింగ్ ఆవిర్భావం:
ఇస్లాం మత సూత్రాల ప్రాతిపదికన నిర్వహించబడే ఇస్లామిక్
ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఇస్లామిక్ బ్యాంకింగ్ ఉనికి లోనికి వచ్చింది. 1200 సంవత్సరాల క్రితం బాగ్దాద్, డెమస్కస్, ఫెజ్ మరియు కోర్డోబాలలో ఇస్లామిక్
బ్యాంకింగ్ కార్యకలాపాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి
ఆధునిక ఇస్లామిక్
బ్యాంకింగ్ వ్యవస్థకు ఆద్యుడిగా మీర్జా బషీర్-ఉద్దీన్-మహమూద్ అహమ్మద్ ను
పేర్కొనవచ్చును. ఇతడు తాను వ్రాసిన “నిజామే నౌ”(NIZAME NAU 1942), “ఇస్లాంకా నిజామ్ఇక్తీసది” (ISLAM KA NIZAAM IQTISADI 1945) గ్రంధాలలో ఇస్లామిక్ ఆర్థిక వ్యవస్థ
మూలసూత్రాలు వివరించాడు. ఆ తరువాత నయీమ్ సిద్దికి(1961), మౌలానా మదూది, మహమ్మద్
హమీదుల్లా(1944), ముహమద్ ఉజైర్(1955),అబ్దుల్లా అల్-అరబీ(1967), అల్-నజ్జర్(1971), తమ రచనలలో “ముదరభా” అనగా
లాభ,నష్టాలు పంచుకొనే విధానం(ప్రాఫిట్ అండ్ లాస్
షేరింగ్) గురించి వివరించినారు. మహమ్మద్ బకీరుల్ సదర్ (1961) రచన
IQTISADUNA (మై ఏకనామిక్స్) ఆధునిక ఇస్లామిక్
బ్యాంకింగ్ విధానం పై వ్రాయబడిన ప్రముఖ
గ్రంధం గా పేర్కొనవచ్చును.
ఇస్లామిక్
బ్యాంకింగ్ సంస్థలు 1960లో పిలిగ్రిమ్స్
ఫండ్స్ రూపంలో మలేషియాలో ఆవిర్భవించినాయి. 1963 లో ఈజిప్ట్ లోని మిట్ఘమర్ (Mitghamr) అనే పట్టణంలో అహ్మద్ ఎలాంఘర్ లాభ-నష్టాల పంపిణిపై ఆధారపడి
పనిచేసే మిట్ఘమర్ (Mitghamr) సేవింగ్స్ బ్యాంక్ ను స్థాపించాడు. 1981 నాటికి
ఈజిప్ట్ లో ఇలాంటి బ్యాంక్ ల సంఖ్య 9కు చేరింది. ఇస్లామిక్ బ్యాంకింగ్
విధానంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొంది, “మొరాబాహ” పై విస్తృతంగా వ్రాసిన
సమీ హాసన్ హొమౌద్ అనే జోర్డాన్ దేశస్థుడు 1978 లో జోర్డాన్
ఇస్లామిక్ బ్యాంకు ను స్టాపించాడు. 1974లో దుబాయి ఇస్లామిక్ బ్యాంక్ ఆవిర్భవించింది. 1975లో జెడ్డా
ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ ఇస్లామిక్ డెవలప్‌మెంట్
బ్యాంక్ వివిధ దేశాలలోని ఇస్లామిక్ బ్యాంక్‌ల కార్యకలాపాలను అనుసంధానం చేస్తూ 1976 నుండి తన కార్యక్రమాలను విస్తృత పరచింది.చాంద్రమాన హిజ్రీ సంవత్సరాన్ని ఐడిబి ఆర్థిక
సంవత్సరంగా పరిగణిస్తారు. ఇస్లామిక్ సిద్దాంతలకు అనుగుణంగా సామాజికార్ధిక
అబివృద్ది సాధనే ఈ బ్యాంకు ప్రధాన లక్ష్యం.ప్రస్తుతం 56 ఇస్లామిక్ దేశాలకు
సబ్యత్వము ఉన్న ఐడిబి అధీకృత మూలధనం 1992 నాటికి 200 కోట్ల ఇస్లాం
దినారులు.ఇస్లామిక్ బ్యాంక్ ఆబివృద్ధిరేటు ఏటా 10-15 శాతంగా ఉంది.
ఇస్లామిక్ బ్యాంకుల ప్రస్తుత స్థితి:
13వ శతాబ్దంలో ప్రారంభమైన ఇస్లామిక్ బ్యాంకులు 1960 దశకంలో విస్తరణ బాట పట్టాయి. ప్రపంచవ్యాప్తం గా ఆర్థిక మాంద్యం ఏర్పడిన
పరిస్థితులలో కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా 75 దేశాల్లో వడ్డీలేని రుణాలు ఇస్తున్న ఇస్లామిక్ బ్యాంకులు
అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉన్నాయి. మానవ వనరులను సమృద్ధిగా వినియోగించుకుంటూ
ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్న ఇస్లామిక్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా
అన్ని దేశాలను కుదిపేసిన ఆర్థిక మాంద్యాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాయి. ప్రపంచ
పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు పెట్టింది పేరైన అమెరికా బ్యాంకు మాంద్యం దాటికి
విలవిల్లాడితే ఇస్లామిక్ బ్యాంకులు మాత్రం పురోభివృద్ధిలోనే సాగాయి.
ఇస్లామిక్
బ్యాంకులు సాలీన పది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా
తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అనేక
కొర్రీలు పెడుతూ వడ్డీలకు చక్రవడ్డీలు జోడించి రుణ గ్రహీతలను పీల్చిపిప్పి
చేస్తుంటే ఇస్లామిక్ బ్యాంకులు మాత్రం అడిగిన వారికల్లా రుణాలు ఇస్తూ
లాభాపేక్షలేని వ్యాపారంతోనే ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. ఈ కాలంలో ఇస్లామిక్
బ్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ప్రపంచ ప్రఖ్యాత
బ్యాంకులు సైతం ఇస్లామిక్ బ్యాంకింగ్ డివిజన్లను ఏర్పాటు చేశాయి. అమెరికా, బ్రిటన్, జర్మని, ఫ్రాన్స్, సింగపూర్ వంటి అనేక దేశాల్లో వాటి
సేవలు ప్రారంభమయ్యాయి.ఇటీవల ఆర్థిక మాంద్యంలోను ఇస్లామిక్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం మంచి పని తీరును కనబర్చడంతో మరికొన్ని దేశాలు
దీనిపై ఆసక్తి చూపుతూన్నాయి
ఈ వడ్డీ రహిత
ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400-500 ఇస్లామిక్ బ్యాంకులు,250 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రస్తుతం ఒక లక్ష కోట్ల డాలర్ల
వ్యాపారంను నిర్వహిస్తున్నాయి, సేవలందిస్తున్నాయి.. 2005 నాటికి ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా 822 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసినట్టు ద ఎకనామిస్ట్ పేర్కొంది. ఈ
మొత్తం వ్యాపారం షరియా నిబంధనలకు లోబడే సాగించినట్లు తేల్చింది. కొన్ని ఇస్లామిక్ బ్యాంక్లు వందశాతం నగదు
నిల్వల నిష్పత్తి కలిగి ఉన్నాయని సమాచారం. ఇస్లామిక్ బ్యాంకులు 2012 నాటికి 1.10 లక్షల కోట్ల
ఆదాయం ఆర్జించినట్లుగా అంతర్జాతీయ ఆర్థిక సర్వేలు వెల్లడించాయి.2013 లో ప్రపంచ వ్యాప్తంగా
ఇస్లామిక్ బ్యాంకింగ్ సంస్థల ఆస్తులు 1.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుకొన్నట్లు
అంచనా.2015 నాటికి గల్ఫ్ ప్రాంతంలోనే ఇస్లామిక్ బ్యాంకుల ఆస్తులు 990 బిలియన్
డాలర్లకు చేరవచ్చునని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఒక్క పశ్చిమ ఆసియా
ప్రాంతంలో 2020 నాటికి ఇది
తొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెంట్ మెకెంజీ అంచనా
వేసింది
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక తిరోగమన
పరిస్థితులన్నా ఇస్లామిక్ బ్యాంకులు 2014 నాటికి మరింత
పురోగమనంలోకి వెళ్తాయని ఆశిస్తున్నారు. ప్రపంచ
వ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి తట్టుకొని నిలబడిన ఇస్లామిక్ బ్యాంకులను మన
దేశంలోనూ ప్రవేశపెట్టి ముస్లింల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రం వ్యూహాలు
రచిస్తోంది.
ఆధారాలు:
· జనం సాక్షి
· ఇస్లామిక్ బ్యాంకింగ్- ఒక పరిశీలన – లక్ష్మి ప్రసాద్ కొండముది.
· వికీపీడియా
· గీటురాయి
· హిందూ, టైమ్స్ ఆఫ్ఇండియా, ఇండియన్ ఎక్సప్రెస్ మొదలగు పత్రికలు
· యోజన