23 August 2013

తెలుగు లో ఇస్లామిక్ సాహిత్యం



భారతదేశం లోని 28 రాష్ట్రలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఇది అక్షర క్రమంలో ముందు ఉంది, భారతదేశం వివిద మతాలకు నిలయం. వాటిలో ఇస్లాం ఒకటి. దేశ జనాభాలో 13% ముస్లింలు కలరు. వారి ప్రధానమైన భాష ఉర్దూ.ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 10—12% వరకు ముస్లిం జనాభా కలదు. వీరి మాతృభాష ఉర్దూ. వీరు మాట్లాడే ఉర్దూ  ఒక ప్రత్యకమైన యాసను కలిగిఉండీ దక్కనీ  ఉర్దూ  గా పీలుబడుతుంది. ఉర్దూ  మాట్లాడేవారి సంఖ్య  రాష్ట్రంలో 18% వరకు ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లింలు ప్రధానంగా హైదరాబాద్, కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్, గుంటూర్, ప్రకాశం, కృష్ణ జిల్లాలలో అదికంగా కనిపిస్తారు. వీరిలో ఆదిక శాతం ప్రజలు ఉర్దూతో పాటు తెలుగు భాషను కూడా మాట్లాడుతారు. హైదరాబాద్, కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్, గుంటూర్ జిల్లాలలో ఉర్దూ 2వ ఆదికార భాషగా ఉంది. ఆదిక శాతం మంది  ముస్లిం విద్యార్దులు తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మీడియంలలో తమవిద్యాబ్యాసం కొనసాగిస్తున్నారు. కొంతమంది ధార్మిక విద్యను భోదించే మదరసాలలో విద్యాబ్యాసం  చేస్తున్నారు. ఆధునిక పరిస్తితులకు తగినట్లు మదరసాలలో కేవలం మత విద్యానేకాక, ఆంగ్లం, కంప్యూటర్ విద్యను కూడా భోదించుచున్నారు.

ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ . ఇది అరబ్బీ భాషలో అవతరించినది. ముస్లింలు ఖురాన్, హదీసులను ప్రామాణిక గ్రంధాలుగా పరిగణించేదరు. అరబ్బీ భాషలోని ఖురాన్ను తెలుగులో అనువదించడం ద్వారా దాన్ని సామాన్య ముస్లిం ప్రజల వద్దకు చేర్చటానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఖోరాన్ను తెలుగులో మొదటిసారిగా శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు 1925 లో అనువదించిరి.  ఆ తరువాత అనేకమంది రచయితలు, 1945 లో శ్రీ ఖాసిం ఖాన్ సాహెబ్ , 1947 లో మౌల్వీ అబ్దుల్ గఫూర్ సాహెబ్ గారు, ఆ పిదప జనాబ్ హమీదుల్లా షరీఫ్ గారు ఇంకా అనేకులు అనువదించి తెలుగు పాఠక  లోకానికి అందించినారు
.
ఖురాన్  అను పదానికి  అతను పాటించేను లేక అతను జోడించేను అని అర్థము. దీనికి ఇంకా   కొన్ని ఇతర పేరులు కలవు. అందు ముఖ్యమైనవి పుర్ఖాన్ (సత్యాసత్యములు విడమరిచి తెలుపునది) కలాముల్లాహ్(భగవంతుని వాక్కులు), అజ్జికర్ (జ్ఞప్తి చేయునది లేక మేల్కొపునది) అల్ముమైన్ (పూర్వ గ్రంధములలో తెలిపిన సత్యములను సంరక్షించునది ) మొదలగునవి.

ఖురాన్  గ్రంధములో మొత్తం 114 సూరాలు కలవు. ఒక్కొక్క సూరా లోని ఒక్కొక్క వాక్యమును ఆయత్ అని అందురు. ఖురాన్ లో మొత్తం 6616 ఆయత్లు, 77954 అక్షరములు కలవు. ఖురాన్ను చదవటాని వీలుగా 30 భాగాలుగా విభాగించడమైనది. ఒక్కొక్క భాగమును పారా అని అందురు. ఈ పారాలలోని చిన్న భాగములను రుకూ అని అందురు.

ఖురాన్ను కంఠస్తం చేసిన వారిని హాఫీజు అని అందురు, దీనిని స్వరబద్దముగా పలికే  విదానంను ఖిరాత్ అందురు. ఖిరాత్ తెలిసినవారు ఖారీలు అనబడేదరు. ఇస్లాం అను పదమునకు తెలుగు లో శాంతి అని అర్థము.
ఖురాన్ తరువాత ముస్లింలకు పరమ ప్రామాణికం అయినవి హాదీసులు. ఖురాన్  దైవ వాణి.  ఇది మహా ప్రవక్త నోటిద్వారా మానవాళికి అందచేయబడినది. హాదీసులు అనగా దైవ సందేశహరుల (స.ఆ.వ.స.)సూక్తి, ఆచరణ తక్రిర్ లను హాదీసులు అందురు. ఈ హాదీసులను సున్నత్ అని కూడా అందురు. ఆరబ్బీ భాషలోని ఖురాన్ , హాదీసులను సరళమైన తెలుగు లో అనువదించి సామాన్య పాఠకులకు అందించడం కోసం అనేక మంది  రచయితలు, సంఘాలు  పూనుకొన్నాయి
.
ఇస్లామిక్ సాహిత్యం అంతులేని ఆగాధం లాంటిది. ఇస్లామిక్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి సామాన్య పాఠస కులకు మత జ్ఞానాన్ని భోదించడానికి ఆధునిక కాలంలో ప్రయత్నాలు తీవ్రంగా సాగినాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, కర్నూల్, నగరాలలోని అనేక పుస్తక సంస్తలు ఖురాన్ ను తెలుగు లోకి ప్రముఖ  పండితులచే అనువదింప చేసి సామాన్యుల వద్దకు చేర్చుచున్నారు.అదేవిదంగా హాదీసుల సంకలనాలు, ప్రవక్త ప్రవచనాలు, హాదీసు మకరందం అనే పేర్లతో  అనేక మంది రచయితలు హాదీసులను పాఠకులకు పరిచయం చేయుచున్నారు.

ఖురాన్ , హాదీసుల తరువాత ముస్లిం ప్రజలకు ప్రధానమైనది సీరత్ అనగా మహా ప్రవక్త (స.ఆ.వ.స) జీవిత చరిత్ర. మహా ప్రవక్త, శాంతిదూత ఐన మహమ్మద్ ప్రవక్త పై అనేక గ్రంధాలు తెలుగు లో రచింపబడినవి. మహాప్రవక్త జీవిత గాధ, జీవిత విశేషాలు, వారి ప్రవర్తన-సూక్తులు సామాన్య జనాలకు అందుబాటులోనికి వచ్చినవి.

ఖురాన్ , హదీసులు,సీరత్ లతో పాటు ఫిఖా  అనగా ధర్మశాస్త్రం పై అనేక గ్రంధాలు వెలుబడినవి. ముస్లిం ధర్మశాస్త్రం- దాని వివరణ ఫిఖా  గ్రంధాలలో లబ్యమవుతుంది. ఇవియే కాక ముస్లింల  జీవనవిధానము, ముస్లింలు పాటించవలసిన నియమాలు, రోజా, జకాత్, నమాజ్, ధార్మిక అంశాలు,జమాత్, షరియత్, ప్రవక్తలు  మొదలగు విషయాలపై అనేక గ్రంధాలు వెలుబడి సామాన్య ముస్లింలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముస్లిం పర్సనల్  లా, షరియత్, పై తెలుగు లో గ్రంధాలు వెలుబడినాయి. తెలుగు ఇస్లామిక్ అనువాద సాహిత్యం శరవేగం తో ముందుకు నడుస్తున్నది. అరబ్బీ, ఉర్దూ, బాషల తో బాటు తెలుగు నేర్చిన అనేకులు అనువాదకులుగా వ్యవరించున్నారు. వీరందరూ అనువాద మత సాహిత్యాన్ని సామాన్యుల ముంగిట చేర్చుచున్నారు.

తెలుగులో ముస్లిం సాహిత్యాన్ని వెలువరిస్తున్న సంస్తలలో తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, అల్ హక్ పబ్లికేషన్స్, ట్రూత్ పబ్లికేషన్స్, రియజుద్దీన్ అలీ మెమోరియల్ పబ్లికేషన్స్, గఫూరియా పబ్లికేషన్స్ ఇంకా అనేక ఇతర పబ్లికేషన్స్ కలవు. ఇవన్నివిజయవాడ, కర్నూల్,హైదరాబాద్ మొదలగు ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. తెలుగు మాట్లాడే ముస్లింలలోని ఉపజాతి ఐన దూదేకుల వారి కోసం అనేక సంస్తలు తెలుగు లో పూర్తిగా ఇస్లామిక్ మత సాహిత్యాన్నిఅనువదించి  అందిస్తున్నాయి.

ఇస్లామిక్ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్న రచయితలలో ఎస్‌ఎం మాలిక్, హఫీజ్ ఎస్‌ఎం రసూల్ షర్ఫీ, ఇర్ఫాన్, మహమ్మద్ అజీజూర్ రహమాన్, మౌల్వీ అబ్దుల్ గఫూర్, వాహెద్, ఇక్బాల్ అహ్మద్,ఉస్మాన్ ఖాన్,  హమీదుల్లా షరీఫ్,  పోరుమామిళ్ల షేక్ అబ్దుల్ హకీం, హీదాయత్   మొదలగు అనేకులు  ముఖ్యులు.  అమూల్యమైన అరబిక్,ఉర్దూ,భాషలలోని  ఇస్లామిక్ సాహిత్యాన్ని, తెలుగులోకి అనువదించి దాన్ని సామాన్య పాఠకులకు అందించటంలో వీరు సఫలీకృతులుఐనారు. శరవేగంగా విస్తరిస్తున్న తెలుగు అనువాద  మత సాహిత్యంలో తెలుగు ఇస్లామిక్ సాహిత్యం ముఖ్యమైనదిగా చెప్పవచ్చును.

1-11-13 గీటురాయి లో ప్రచురితం 


No comments:

Post a Comment