29 May 2023

మోమిన్ కాన్ఫరెన్స్ నుండి పస్మాండ ఉద్యమం వరకు From Momin Conference to Pasmanda movement - ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ All India Momin Conference

 

1939లో గోరఖ్‌పూర్‌లో జరిగిన మోమిన్ కాన్ఫరెన్స్ సెషన్‌ ఛాయాచిత్రం


మోమిన్ కాన్ఫరెన్స్ ముస్లిం ప్రజలలో అణగారిన, దిగువ స్థాయి ప్రజల స్వరానికి ప్రాతినిధ్యం వహించింది. ఇది ముస్లిం సమాజం లోని హస్తకళాకారుల, చేతివృత్తుల వారి   రాజకీయ పార్టీ.

 

ముస్లిం ప్రజలలో అణగారిన, దిగువ స్థాయి హస్తకళాకారులు, చేతివృత్తుల వారు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి అలాగే తోటి ముస్లింల నుండి వివక్షతకు గురి అయ్యారు. మాంచెస్టర్ మరియు లివర్‌పూల్ నుండి తమ ఉత్పత్తులను విక్రయించాలనే తపనతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ వస్త్ర పరిశ్రమను నాశనం చేయాలని నిర్ణయించుకుంది; ఫలితంగా, ఈ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న ముస్లిం నేత పనివారు  ఆగ్రహంతో ఉన్నారు. ఆలాగే ఆసియా ఉపఖండంలోని ముస్లిం సమాజం అష్రఫ్-అర్జాల్ కులాల వారీగా విభజించబడింది కాబట్టి, అగ్రవర్ణ ముస్లింలు అయిన  అష్రఫ్ అని పిలవబడే వారిచే అణచివేతకు గురైన అర్జాల్(దిగువ స్థాయి ముస్లిములు ) వారు కూడా ఉన్నారు. ఈ అణచివేతకు గురైన మరియు అణగారిన ప్రజలు ఐక్యంగా ఉండి, వారి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.

 

మోమిన్ కాన్ఫరెన్స్ అని పిలువబడే “ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్” లేదా జమాత్-ఉల్-అన్సార్ 1911లో    భారతదేశంలో స్థాపించబడిన రాజకీయ పార్టీ. మోమిన్ అన్సార్ కమ్యూనిటీ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేకించి, "నేత కార్మికుల సాంప్రదాయ కళలను పునరుద్ధరించడం, నేత కార్మికులలో ఆత్మగౌరవం మరియు అంకితమైన మత ప్రవర్తనను ప్రోత్సహించడం మరియు వారి స్వతంత్ర స్థితిని పునరుద్ధరించడం” లక్ష్యంగా ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ ఏర్పడినది.

 

ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ సాధారణంగా ఆధునిక భారతదేశంలో ముస్లిం సమాజంలోని కుల-ఆధారిత అసమానతలను సవాలు చేయడానికి మొదటి పెద్ద-స్థాయి ప్రయత్నాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నేత కార్మికుల ఈ సంస్థ (జోలాహ) ముస్లింలలో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించింది, తరువాత ఇతర కులాలు కూడా చేరాయి.

 

మోమిన్ ఉద్యమం (ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్) సాధించిన గొప్ప విజయం ఏమిటంటే, అది  (నేత) కులం యొక్క మానసిక స్థితిని మార్చింది. ఇప్పుడు వారు తమ కుల “నేత/అన్సారీ/మోమిన్/జోలాహా” గుర్తింపు గురించి సిగ్గుపడకుండా గర్వంగా ప్రకటించారు. ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ (AIMC) వ్యవస్థాపకులలో ఒకఋ  మరియు దాని మొదటి సెషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హఫీజ్ షంసుద్దీన్ అహ్మద్ షామ్స్ పై మాటలు అన్నారు.

 

1925 మార్చి 22 మరియు 23 తేదీలలో కోల్‌కతాలోని టౌన్ హాల్‌లో ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ మొదటి సెషన్ జరిగింది. ఈ చారిత్రాత్మక సమావేశానికి మానేర్ (బీహార్)కి చెందిన ప్రొఫెసర్ హఫీజ్ షంషుద్దీన్ అహ్మద్ షమ్స్ అధ్యక్షత వహించారు.

 

షంసుద్దీన్ తన రచనలలో ఒకదానిలో మోమిన్ అనే పదానికి మూలాన్ని కూడా ఇచ్చాడు. 12వ శతాబ్దంలో ఒక సూఫీ, హజ్రత్ మోమిన్ ఆరిఫ్ (R.A) యెమెన్ నుండి వచ్చి బీహార్‌లోని మానేర్‌లో ఉన్నాడని వ్రాశాడు. హజ్రత్ మోమిన్ ఆరిఫ్ (R.A) బట్టలు నేయడంలో నిపుణుడు. హజ్రత్ మోమిన్ ఆరిఫ్ (R.A) ప్రభావంతో ఇస్లాం స్వీకరించిన ప్రజలు, అతనితో వచ్చిన వ్యక్తులు మరియు హజ్రత్ మోమిన్ ఆరిఫ్ (R.A) స్వంత సంతానం భారతదేశం అంతటా బట్టలు నేసే కళను సజీవంగా ఉంచారు మరియు వారిని మోమిన్ అని పిలుస్తారు.

 

మోమిన్ ఉద్యమం అన్ని పస్మాంద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఉన్నప్పటికీ, అది త్వరలోనే నేత కార్మికుల ఉద్యమంగా మారింది.1912 నుండి 1915 వరకు మోమిన్ ఉద్యమం కోల్‌కతా నుండి బీహార్, అవధ్, పంజాబ్, బొంబాయి మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.

 

 మోమిన్ కాన్ఫరెన్స్ ప్రయాణం కలకత్తా నుండి ప్రారంభమైంది మరియు ప్రధానంగా ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం చేయబడింది, అలహాబాద్, ఢిల్లీ, లాహోర్, గయా, కాన్పూర్, గోరఖ్‌పూర్ మరియు పాట్నా వంటి ప్రదేశాలలో మోమిన్ కాన్ఫరెన్స్ వార్షిక సమావేశాలు జరిగాయి. 1వ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత పస్మాంద సమస్యలకు అంకితమైన ఉర్దూ వార్తాపత్రిక “అల్ మోమిన్” ప్రారంభమైంది. కోల్‌కతా నుండి ముద్రించిన వార్తాపత్రిక అల్ మోమిన్ పస్మందా ముస్లిములకు తమ సమస్యలపై మరింత అవగాహన కల్పించడంలో సహాయపడింది.

 

" ఉన్నత వర్గానికి చెందిన ముస్లింల పార్టీగా ముస్లిం లీగ్”  భావించబడగా దానికి విరుద్ధంగా " మోమిన్ కాన్ఫరెన్స్"సామాన్య ముస్లింల ప్రయోజనాలను కాపాడటo” తన లక్ష్యం గా పేర్కొన్నది.

 

“ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్”, కాంగ్రెస్ పార్టీతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నది మరియు భారతదేశంలోని "అందరూ" ముస్లింలు టూ నేషన్ థియరీ”కి అనుకూలురు అనే ముస్లిం లీగ్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంలో కీలకపాత్ర పోషించినది.

 

1940లో పాట్నాలో జరిగిన ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ భారతదేశ విభజనను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జిన్నా విభజన ప్రచారానికి వ్యతిరేకంగా 1940లో ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసిన 19 ముస్లిం పార్టీలలో ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ ఒకటి. తరువాత ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్, ముస్లిం లీగ్‌తో పోరాడటానికి ఒక రాజకీయ సంస్థ అయిన “ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్‌”లో కూడా చేరింది.

 

1941లో, బీహార్ మరియు తూర్పు యుపి కి చెందిన వేలాది మంది ముస్లిం నేత కార్మికులు మంది మోమిన్ కాన్ఫరెన్స్ బ్యానర్‌తో  డిల్లి వస్తున్నారని బ్రిటిష్ సిఐడి నివేదిక పేర్కొంది. జిన్నా ప్రతిపాదిత రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా మోమిన్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. భారతీయ ముస్లింలలో మెజారిటీగా ఉన్న నాన్-అష్రాఫ్(పస్మందా) ముస్లింలు విభజనను వ్యతిరేకించారు మరియు పాకిస్తాన్‌ ఏర్పాటును వ్యతిరేకించారు.

 

మోమిన్ కాన్ఫరెన్స్‌కు నిర్ణయాత్మక క్షణం దాని తొమ్మిదవ సెషన్, ఇది 1948లో పాట్నాలో జనాబ్ అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ మార్గదర్శకత్వంలో జరిగింది. దీని తరువాత, 1976 మరియు 1985లో న్యూఢిల్లీలో జంట సెషన్లు జరిగాయి, దీనికి ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీ అధ్యక్షత వహించారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయింది  అనేకసార్లు మోమిన్ కాన్ఫరెన్స్‌ ను  పునరిద్దరించడానికి ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు.

 

 

 

 




 

No comments:

Post a Comment