26 April 2026

ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ముస్లిం వకీల్ ఖాజీ హైదర్ Chhatrapati Shivaji Maharaj's Muslim Vakil Qazi Haider

 

 


 

పూణే

మరాఠా యోధరాజు ఛత్రపతి శివాజీ మహారాజ్, అన్ని కులాలు మరియు మతాలకు చెందిన ప్రజలను ఏకం చేసి స్వరాజ్యాన్ని ఆవిష్కరించారు. శివాజీ 'అష్ట ప్రధాన్' (ఎనిమిది మంది మంత్రుల మండలి) మరియు పరిపాలనా వ్యవస్థలో ఖాజీ హైదర్ వంటి అనేక మంది విశ్వాసపాత్రులైన ముస్లింలు భాగస్వాములయ్యారు.

ఖాజీ హైదర్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు 'పారస్నిస్' (పర్షియన్ కార్యదర్శి)గా మరియు అత్యంత విశ్వసనీయమైన 'వకీల్' (దూత/న్యాయవాది/ మున్షీ)గా వ్యవహరించారు. ఖాజీ హైదర్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పరిపాలనలో న్యాయవాదిగా, రాయబారిగా సేవలందించారు.

స్వరాజ్యపు రహస్య వ్యవహారాలు మరియు దౌత్యపరమైన సంప్రదింపులలో ఖాజీ హైదర్ కీలక పాత్ర పోషించారు.ఔరంగజేబు ఆస్థానానికి సంబంధించిన పర్షియన్ పత్రాలలో కూడా ఖాజీ హైదర్ ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఖాజీ హైదర్ మొఘల్ సేవలో కూడా పనిచేశారు. శివాజీ మహారాజ్ మరణం (1680) తరువాత, ఖాజీ హైదర్ 1683లో మొఘల్ సేవలో చేరారు మరియు ఔరంగజేబు ఆస్థానంలో ప్రధాన న్యాయమూర్తి కూడా అయ్యారు.

శివాజీ మహారాజ్ సైన్యంలోని 10 మంది ముస్లిం నాయకుల జాబితాలో ఖాజీ హైదర్‌ ఒకరు. ఖాజీ హైదర్ మరియు మదారీ మెహతర్ (ఆగ్రా నుండి తప్పించుకోవడానికి శివాజీకి సహాయం చేసినవారు) శివాజీ మహారాజ్ బృందంలోని ప్రముఖ ముస్లింలలో ఉన్నారు.

శివాజీ మహారాజ్ స్వయంగా తన 'మహజర్' (చట్టపరమైన పత్రం)లో ఖాజీ హైదర్‌ను 'ఇజ్జత్ మహబ్ ఖాజీ హైదర్ పారస్నిస్' అని సంబోధించారు. పురందర్ ఒప్పందం విషయంలోనైనా లేదా సల్హేర్ సమస్య విషయంలోనైనా, మహారాజ్ తన వకీల్‌గా ఖాజీ హైదర్‌కు బాధ్యతలను అప్పగించారు. ఖాజీ హైదర్‌, సూఫీ ఖాద్రీ సంప్రదాయానికి చెందినవారు కావడంతో, కొన్ని చోట్ల ఆయనను 'ఖాజీ హైదర్ అలీ ఖాద్రీ' అని కూడా ప్రస్తావిస్తారు.

శివాజీ మహారాజ్ మరణించిన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాతే, పూణేలోని 'పార్వతి' ప్రాంతంలో ఖాజీ హైదర్ కన్నుమూశారు.

ఖాజీ హైదర్ మరణానంతరం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ 1682 ఫిబ్రవరి 12న ఖాజీ హైదర్ కుటుంబానికి ఒక లేఖను పంపారు.  ఆ లేఖలో ఇలా ఉంది: "ఖాజీ హైదర్ మా తండ్రిగారికి (ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు) అత్యంత విశ్వాసపాత్రుడైన, నమ్మకమైన సేవకుడు. ఆయనే నాకు పర్షియన్ భాషను నేర్పించారు; ఆ జ్ఞాపకాలను నేను నేటికీ ఎంతో ఆదరిస్తాను."

శంభాజీ మహారాజ్‌కు 16 భాషలు వచ్చేవని, శంభాజీ మహారాజ్‌ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పర్షియన్ భాషలో ఖాజీ హైదర్ వద్దే పొందారని ఆ లేఖలో ప్రస్తావించబడింది.

ఖాజీ హైదర్ కు ఇబ్రహీం, ఇస్మాయిల్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్లా మరియు మహమూద్ అనే ఐదుగురు సోదరులు ఉండేవారు. వారందరూ న్యాయ సంబంధిత విధుల్లో నిమగ్నమై ఉండేవారు. పూణేలోని దేశపాండే మరియు కులకర్ణి రికార్డులలో ఖాజీ ఇస్మాయిల్ మరియు ఖాజీ ఇబ్రహీం పేర్లు నేటికీ కనిపిస్తాయి.

పేష్వా రికార్డుల ప్రకారం, ఖాజీ హైదర్ కుమారుడైన ఖాజీ ముజీబ్ సాహెబ్ మరియు మనవడైన ఖాజీ హబీబుల్లా కూడా ప్రభుత్వ సేవలో ఉండేవారు. 1707వ సంవత్సరం వరకు ఖాజీ హైదర్ కుటుంబానికి సంబంధించిన రికార్డులు రాయగడ్ కోటలో లభిస్తాయి; ఇది మరాఠా సామ్రాజ్యం పట్ల ఖాజీ హైదర్ కుటుంబానికి ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్థాయి.

కాలక్రమేణా, ఖాజీ హైదర్ కుటుంబం న్యాయ సంబంధిత విధులను విడిచిపెట్టి, పోలీసు శాఖలో ప్రవేశించింది. ఈ కుటుంబం నుండి పోలీసు శాఖలో సుబేదార్‌గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఖాజీ షేక్ నిజాం. ఆయన బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులతో కూడిన మొదటి దళానికి నాయకత్వం వహించారు. అప్పటి నుండి నేటి వరకు, ఈ కుటుంబం వరుసగా 5 తరాలుగా పోలీసు దళంలో సేవలందిస్తోంది.

ఖాజీ హైదర్ వంశస్తుల  విజయాలు 'మహజర్ - మహారాష్ట్ర చరిత్ర పత్రాలు' వంటి పుస్తకాలలో కీర్తించబడ్డాయి.

 

 

No comments:

Post a Comment