28 September 2013

సీమాంద్ర లో సమైక్య ఉద్యమం – ముస్లింల పాత్ర – ఒక పరిశీలన. .

అదునిక ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యం గా 1950 తరువాతి రాజకీయ పరిణామాలను పరిశీలించిన కొన్ని విచిత్ర అంశాలు కన్పిస్తాయి. 1953, 1969,1972 లలో విభజనను పూర్తిగా సమర్ధించిన వారు , 2013 లో విభజన ప్రకటన వచ్చిన తరువాత ముఖ్యంగా సీమాంద్ర ప్రాంత వాసులు పక్కా సమైక్యతా వాదులుగా మారారు.సమైక్యతా వాదం హృదయాలలోంచి వచ్చినట్లు కన్పిస్తుంది.సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలు సమైక్య వాదాన్ని సమర్దిస్తూనే ఉన్నారు.
ఉభయ ప్రాంతాలలోని  ముస్లిం మైనారిటీ ప్రజల భావాలను పరిశీలిద్ధాము.
 రాష్ట్రం లో ముస్లింల జనాభా దాదాపు 13% వరకు ఉంది. తెలంగాణ ప్రాంతం లో ముస్లింలు, కోస్తా ప్రాంతం  కన్నా అధికంగానే ఉన్నారు. హైదరాబాద్ లో 40% పైగా ముస్లిం జనసంఖ్య ఉంది. పాతబస్తీ లో 90% వరకు ముస్లిం లు ఉన్నారు. అన్నీ తెలంగాణ జిల్లాలలో కూడా ముస్లింలు తగినంతగా ఉన్నారు.  కానీ తెలంగాణ ఉద్యమం లో వీరి పాత్ర స్వల్పం గానే ఉంది. ముఖ్యం గా ఎం‌ఐ‌ఎం తెలంగాణ ఏర్పాటును వ్యతేరేకించింది. రాష్ట్రం విడిపోరాదని, విడిపోతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయమని కోరింది.  ఎటువంటి పరిస్థితులలోనూ హైదరాబాద్ ను యూనియన్ టెరిటరి గా ఒప్పుకోము అన్నారు. ఉద్యమానికి మూలస్తంభం గా పరిగణింఫ బడే  టి‌ఆర్‌ఎస్ లో కూడా ముస్లిం నాయకులు వెళ్లమీదనే ఉన్నారు. వారు మహబూబ్ నగర్ జిల్లా లో జరిగిన  ఉప ఎన్నికలలో నిలబెట్టిన  ముస్లిం అభ్యర్ఢి పరాజయం పొందినాడు. తెలంగాణ ఏర్పడుతే బి.జే.పి. ప్రాబల్యం పెరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. బి.జే.పి. అగ్ర నాయకులు ఐనా సుష్మా స్వరాజ్, రాజ్ నాధ్ సింగ్, నరేంద్ర మోడి మొదలగు వారు తెలంగాణ లో పర్యటించారు. తెలంగాణ కు మద్దతు ప్రకటించారు.
మొత్తం మీద పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమం లో ముస్లిం ల పాత్ర స్వల్పంగానే ఉన్నదని చెప్పవచ్చును.ముస్లిం విద్యాధికులు తెలంగాణా ఏర్పాటును ఆమోదించిన, ముస్లిం సామాన్య ప్రజలలో తెలంగాణ ఏర్పాటువాదం మీగతా వర్గాల  ప్రజలతో పోలిస్తే అంతగా లేదు. ముస్లింలు నిరాసక్తతను ప్రదర్శిస్తూ ఉన్నారు.తెలంగాణ ఏర్పాటును ఆహ్వానించ లేదు, అట్లని వ్యతిరేకించలేదు. యూ.పి.ఏ.-2. సి.డబల్యూ.సి. నిర్ణయాల తరువాత మాత్రం షబ్బీర్ అలీ లాంటి నాయకులు తెలంగాణ రాజకీయాలలో చురుకైన పాత్ర వహిస్తున్నారు. ఎం.ఐ.ఎం. మాత్రం వుహాత్మకంగా అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తూ  వేచిచూసే ధోరణిలో ఉంది. 
ఇక సీమాంద్ర ప్రాంతానికి వస్తే ముస్లింల జనాభా 5-6% కన్నా ఎకువ లేదు. రాయలసీమ ప్రాతంలోనూ, దక్షిణ కోస్తాలో ముస్లింలు కన్పిస్తారు. గోదావరి జిల్లాలలోనూ, ఉత్తర ఆంధ్రా లో వీరి సంఖ్య అతి స్వల్పము. కానీ సంయుక్త ఆంధ్ర ఉద్యమం లో వీరి పాత్ర అదికంగా ఉంది. ముఖ్యం గా రాయలసీమ లోని అన్నీ జిల్లాలలోనూ, గుంటూర్,కృష్ణ జిల్లా, విశాఖపట్నం  లో జరిగే ఉద్యమాలలో వీరు చురుకుగా పాల్గొంటున్నారు. మసీదులలో, ముస్లిం జమాత్ లలో, రోడ్ల మీద నమాజులు చదువుతున్నారు. దువా  చేస్తున్నారు. ముస్లిం మత  పెద్దలు, శాసన సభ్యులు నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సంయుక్తంగా ఉంచమని కోరుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కి వోట్ బ్యాంక్ గా పరిగణించబడే వీరు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకి స్తున్నారు. తెలుగు దేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు నిర్వహించే  నిరసన ప్రదర్శనలలో కూడా అదికంగా కన్పిస్తున్నారు. ఎ సభలు, ఏ  నిరసన ప్రదర్శనలు చూసిన వీరి భాగస్వామ్యం ఎక్కువ సంఖ్యలో కన్పిస్తుంది. ముస్లిం స్త్రీలు, పురుషులు,విద్యార్దులు, విద్యార్ధినులు, యువకులు,యువతులు,  తమ సంప్రధాయ వస్త్ర ధారణతో చూడగానే కనిపించేటట్లు నిరసన ప్రదర్శనలలో పాల్గొంటూన్నారు. ఈ ఆందోళనలో అర్బన్, గ్రామీణ ప్రాంతాల తేడా లేకుండా  ముస్లింలు ఆదిక సంఖ్యలో పాల్గొంటున్నారు. క్రింది తరగతి,ఉన్నత తరగతి అనే తేడా లేకుండా, అన్నీ వర్గాలవారు, అన్నీ వృత్తులకు చెందిన ముస్లింలు పాల్గొంటున్నారు.
ముస్లింల స్థితిగతులను పరిశీలించుటకు , ప్రభుత్వం చే నియమించబడిన  వివిద సంఘాల నివేదికల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లింల సామాజిక,ఆర్ధిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులు, ఎస్‌సి,ఎస్‌టి,బి‌సి ల కన్నా అంత్యంత దారుణంగా ఉన్నాయి. ముస్లింలలో ఉన్నత విద్యావంతులు, వృతి నిపుణుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది, రాష్ట్ర సర్వీసులలోని ముస్లిం ఉద్యోగస్తుల సంఖ్య 1%-3% కన్నా తక్కువుగా ఉంది. ముస్లింలకు  ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించబడటానికి అనేక అడ్డంకులను ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రస్తుతం  రాష్ట్రం లో కోర్ట్ స్టే పైనే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ముస్లిం ల లో కూడా అందరికీ రిజర్వేషన్లు లేవు. కొంతమందికి మాత్రమే కలవు. పఠాన్, సయ్యద్ లకు రిజర్వేషన్లు లేవు. షేక్ లకు కలవు. భారత దేశం లోని కొన్ని రాష్ట్రాలలో ముస్లింలకు  రిజర్వేషన్లు ఉన్న, సచార్ కమిటీ, రంగనాధ మిశ్రా కమిటీ సూచనల మేరకు  కేంద్ర సర్వీసులలో ఇంకా రేజర్వేషన్లు  కల్పించబడలేదు.పోలీసు,పారామిలిటరీ,ఆర్‌ఏ‌ఎఫ్, దళాలలో వీరి సంఖ్య పెంచబడలేదు. పైగా ఇటీవల జరిపిన సర్వే లో పై దళాలలో వీరి సంఖ్య గత 10 సం. లలో తగ్గినది.
 ఆంధ్ర ప్రదేశ్ లో  ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటానికి జరిగిన ఉద్యమాలను, ఆందోళనలను పరిశీలించిన, ఆ అంధోళనలలో సీమాంద్రలోని ముస్లిం జనసమూహం నిర్వహించిన పాత్ర , ప్రస్తుత సమైక్యతా  ఉద్యమం తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పవచ్చు.  హైదరాబాద్, ఇతర నగరాలలోని ముస్లింలు రిజర్వేషన్ల కోసం ముఖ్యం గా అర్బన్ ప్రాంతాలలోని ముస్లిం విద్యాధికులు ముస్లిం రిజర్వేషన్ల కోసం పోరాడారు. తమ జీవనం, అభివృద్ధి, తమ పిల్లల చదువు, ఉద్యోగాలు, తమ భవిష్యత్తో ముడిపడిన రిజర్వేషన్ల కన్నా, సీమాంద్ర ముస్లింలకు సంయుక్త ఉద్యమం అత్యంత ప్రధానంగా కనిపిస్తుంది అని కొందరు అబిప్రాయ పడుతున్నారు. పై వాఖ్యలలోని నిజాలను పరిశీలించవలసి ఉంది. .
విభజన జరిగిన రాయలసీమ ఎక్కువుగా నష్ట పడుతుంది అని, రాయలసీమ వాసులకు నీటి కొరత ఏర్పడుతుంది అని,ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి అని , ప్రగతి ఆగిపోతుంది అనే కారణాలపై రాయలసీమ ముస్లింలు, వారి శాసన సభ్యులు,  భయపడి ఆందోళన చేయడం సమంజసం గానే ఉంది, కానీ కోస్తా ముస్లింలు ఏకారణాల వలన ఉద్యమించారో అర్ధం కావటం లేదు. రాష్ట్రం విడిపోతే వీరికి వచ్చే నష్టాలు ఏంటి అనేది ఒక ప్రశ్న? అది చర్చించవలసిన అంశము?
రాష్ట్ర విభజన జరిగిన కోస్తా ముస్లింలకు వచ్చే నష్టం లేదు అని, నీటి కొరత ఏర్పడదని, ఉన్న ప్రాజెక్టులకు నిఖర జలాలలో విషయం లో ఎటువంటి ఢోఖా ఉండదని నీతిపారుదల నిపుణులు చెప్పుతున్నారు. సమస్యలు వస్తే తీర్చటానికి నిపుణుల కమిటీలు ఉన్నాయి కదా అంటున్నారు.
ఇకపోతే ఉద్యోగాల విషయంలో హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగాలు చేయటానికి జోనల్ పధకం అడ్డు వస్తుంది. 610 జె.వో. క్రింద ఉన్నవారే వెనుకకు వస్తున్నారు. కేంద్ర ఉద్యోగాలలో,విద్యాలయాలలో  అందరికీ సమాన అవకాశాలు కలవు. ఇక ప్రైవేట్ ఉద్యోగాల విషయానికి వస్తే  ఆర్హతలు ఉంటే హైదరాబాద్ లో మిగతవారికన్నా ముస్లింలకే ఆదిక అవకాశాలు ఉన్నాయి.బాష, సంస్కృతి, ప్రయోజనాన్ని అధికంగా పొందవచ్చు. వారికి హైదరాబాద్ ఇల్లు తరువాత ఇల్లు గా ఉంటుంది. . ఇతరులకన్నా మిన్నగా  వీరు ఏటువంటి ఆదుర్దా పడవలసిన అవసరం లేదు. హైదరాబాద్ లో  ముస్లింలకు ప్రయోజనలు లేకున్నా నష్టాలు మాత్రం లేవు.అది మాత్రం నిజం.
రాష్ట్ర విభజన జరిగి, రాజధాని కర్నూల్లో వచ్చిన, విజయవాడ-గుంటూర్ మద్య వచ్చిన, ఒంగోల్లో వచ్చిన ముస్లింలకే ఆదిక ప్రయోజనం. ఆ ప్రాంతాలలో మరియు వాటి చుట్టుపక్కల ప్రాంతాలలో  ముస్లింల జనసంఖ్య, ఆ ప్రాంత జనసంఖ్యలో దాదాపు 20-25% ఉంది, వారి భూముల, ఆస్తుల  విలువలు  పెరుగుతాయి, వ్యాపారాలు, చిన్న,చేతి  పరిశ్రమలు  అబివృద్ధి చెందుతాయి, పిల్లలకు ఉద్యోగావకాశాలు అబివృద్ధి చెందుతాయి. సర్వోతోముఖాభివృద్ధి చెందుతారు. శాసనసభలో కూడా వీరీ ప్రాతినిద్యం పెరుగుతుంది. వీరి ప్రాంతాలలో కొత్తగా  పరిశ్రమలు స్థాపించబడతాయి. ముస్లింలచే స్టాపించబడిన, విద్యాలయాలు, వృత్తివిద్య కళాశాలలు, మదరసాలు అన్నీ ఈ ప్రాంతంలోనే అదికంగా ఉన్నాయి. రిజర్వేషన్ల ద్వారా ఇప్పుయిప్పుడే ముస్లింలలో పెరుగుతున్న విద్యాశక్తి ఇంకా పెరిగి,  ఆదిక సంఖ్యాకులు విద్యావంతులు, ఉద్యోగస్తులు, వృతి నిపుణులు గా  పెరుగుతారు.
ఐనా ఈ ప్రాంతాలలో సమైఖ్య  ఉద్యమం శరవేగంతో విస్తరిస్తున్నది. ముస్లిం లు ఆదిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇది చర్చించ దగిన,ఆలోచించవలసిన  అంశము. ప్రస్తుతం ఉన్న సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ కన్నా రేపు బహుశా విడిగా  ఏర్పడే సీమాంద్ర, తెలంగానాల లో వీరి అబివృద్ధి నిజంగా తగ్గుతుందా , లేదా విభజన ద్వారా ఆదిక ప్రయోజనం కలుగుతుందా అనేది కాలమే నిర్ణయించవలసిన అంశము, వేచి చూద్దాము. ఇది తప్పని సరిగా ముస్లిం మేధావులు  చర్చించవలసిన, పరిశోదించవలసిన అంశము.
ఒక వక్త చెప్పినట్లు, మతం ఒకటిఐన ఉర్దూ,తెలుగు-ఉర్దూ మాట్లాడే తెలంగాణ ముస్లింలకు, ఉర్దూ, తెలుగు-ఇంగ్లిష్ మాట్లాడే ఆంధ్ర ముస్లింలకు విభజన, సమైఖ్యతల  మద్య సరియైన విధానమ, అవగాహన, కుదరలేదా ? వారి వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయా?  ఇది ఆలోచించాలసిన విషయం.
(ఈ వ్యాసం వ్రాయడం లో ముఖ్య ఉద్దేశం పైన వివరించిన  అంశాల  పై  చర్చ జరగాలని, ముఖ్యం గా ముస్లిం మేధావులు, ముస్లిం విద్యావంతులు, ముస్లిం ప్రజానీకం పై అంశాల  పై  తమ భావాలను ప్రకటించగలరని ఆశించటమైనది. సహృదయంతో అభిప్రాయాలకు,చర్చలకు  ఆహ్వానం పలుకుతున్నాను.)

31-10-13 నమస్తే తెలంగాణ దినపత్రిక లో ప్రచురితం.


No comments:

Post a Comment