ప్రపంచ వ్యాప్తంగాఉన్న సుమారు 160 కోట్ల మంది ముస్లింలు 'చాంద్రమాన
కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ
కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్',
రమదన్(అరబ్బీ) రమాదాన్(పర్షియన్) రంజాన్ (ఉర్దూ) రమజాన్(టర్కిష్).
రమదన్ అనే పదం అరబ్బీ పదము రమీద లేదా
ఆర్-రమద్ నుంచి ఆవిర్బవించినది. రమదన్ ఆనగా విపరీతమైన వేడి లేదా పొడితనం అని అర్ధం
రంజాన్ మాసమును ముస్లింలు అత్యంత
పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! ఇది ఎంతో శుభప్రదమైన నెల.
రంజాన్ మాసం సత్కార్యాల పుణ్యమాసము అనగా బరకత్
మాసము. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల
కలయికే ' రంజాన్ మాసం. రంజాన్ మాసంలో
పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి.
“రంజాన్ మాసం నరక జ్వాలల నుండి మానవునకు విముక్తి కలిగించే విశిష్టత కలిగిన మాసం!”- తిర్మిజి.
“రంజాన్ నెల అంతా స్వర్గ ద్వారాలు తెరవబడిఉంటాయని,నరక ద్వారాలు
ఈ నెల అంతా మూయబడిఉంటాయి మరియు దుష్ట శక్తులకు సంకెళ్ళు పడతాయని ప్రవక్త (స) పేర్కొన్నారు”.-సహీ బుఖారి.
అల్లాహ్ చేత అశ్విరదింపబడిన ఈ నెలలో, తన దాసుల
ఆరాధనలకు, సత్కర్యాలకు ఎన్నో రేట్ల ప్రతిఫలం అల్లాహ్ ఇస్తానంటున్నాడు. రంజాన్
నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో జరుగుతుంది.మానవులను ప్రలోభపరిచే దుష్ట శక్తులకు ఈ
నెలలో సంకేళ్లు పడును. పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి,
క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం
అవుతుంది . ఈ నెలలో ముస్లింలు దురలవాట్లకు, చెడుకు దూరంగా వుండడం,
ఆత్మసమ్మానం మరియు హుందాగా జీవించడం చేస్తారు. ప్రార్ధనలు, ఖురాన్ పారాయణం తో ఈ నెల అంతా
గడుపుదురు.
ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన
నియమం ' ఉపవాసవ్రతం'
. ఈ ఉపవాసంను పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని
పిలుస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసదీక్షలను పూర్తినెలరోజుల
పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. ఉపవాసదీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయటం గా భావించ వచ్చు. దీనిని ఖురాన్ ' తఖ్వా' అని అంటుంది. రోజా ను నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం గా వివరించవచ్చును.
సాధారణంగా ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు (తారావిహ) జరుపుతారు ఈ నెలలో తరవిహ్ నమాజ్ పాటించాలని ఆదేశించబడినది. ఈ నెలలో సాయం సంధ్యవేళలో (ఇషా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా ఇరవై రకాత్ ల ' తరావీహ్' నమాజ్ చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు.
రంజాన్ నెలలో పిత్రా దానాలు ఇవ్వాలని
ఆదేశించబడినది. ఫిత్రా అనే పదానికి అర్థం తనతోపాటు ఇతరులకు సంతోషాన్నివ్వడం. ఫిత్రా పేదలకు ధనరూపంలోగానీ వేరేదైనా రూపములో గాని
ఇవ్వాలి. ఉపవాసవ్రతాలు విజయవంతంగా
ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా
పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రా దానం వలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం
వుంది.
‘హృదయంలో కలిగే చెడు తలంపులు,
ఆలోచనలు,
నోటినుంచి
వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ
ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి’ అని మహమ్మద్ ప్రవక్త (స) అన్నారని అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపారు.
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్
నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి
నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు జకాత్ ను పేదల ఆర్థిక
హక్కుగా పేర్కొంటారు. 'జకాత్' కు రంజాన్
నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది.
వెయ్యి రాత్రులకన్నా
శ్రేష్టమైన ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ ఈ మాసంలోనే ఉంది.రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజునే అవతరించిందని భావించే
ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఈ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు
చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు
చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం
వుంది. ఈ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
‘ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా ఎంతో
శ్రేష్టమైనది” –దివ్య ఖురాన్ 97:3
సృష్టికర్త సాన్నిధ్యాన్ని పొందటానికి,ఆయన ప్రసన్నతను చూరగొనడానికి
ఉద్దేశించబడిన ఇతేకాఫ్(మౌన వ్రతం) కూడా రమజాన్ నెలలోనే ఉంది. రంజాన్ నెల 21వ రోజు నుంచి దీనిని పాటిస్తారు.'
. 'ఏతెకాఫ్ ' అంటే ఒకరకమైన తపోనిష్ట. దీనిని పాటించే వారు మసీదులోనే ఒక ప్రక్క డేరాలా ఒక తెరను
కట్టుకుని అక్కడ దైవధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయడంలో నిమగ్నమయివుంటారు.
మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది. కనుక ఇది నిస్సందేహంగా
అపారమైన వరాలను పొందే నెల అని చెప్పవచ్చును.
'రంజాన్'నెల లో జరిగిన ముఖ్య మైన సంఘటనలు:
'రంజాన్'నెల
2వ దినం :
తోరాహ్ గ్రంధము ప్రవక్త మూసా కు అందించబడిన రోజు
10వ దినం :
ప్రవక్త (స) సతీమణి,
మాతృశ్రీ ఖడిజా బీబీ మరణించినారు.
: “యామ్ కిప్పూర్ యుద్ధం”-
అరబ్-ఇజ్రాయిల్ దేశాల మద్య పోరాటం ప్రారంభమయిన దినం
12వ దినం :
ఇంజీల్ గ్రంధము ప్రవక్త ఈసాకు అందించబడినది.
15వ దినం :
ప్రవక్త (స) మనుమలు హాసన్ ఇబ్న్ అలీ పుట్టినరోజు.
:
“బక్లవ అలయి” ఉత్సవ దినము -ఒట్టోమన్ టర్కీ
సుల్తాన్ నిజ అంగరక్షకులైన ‘జనిస్సరీస్’ కు ఉత్సవ పూర్వకముగా “బక్లవా ట్రే” అందించబడిన దినము.
17వ దినం: :
ప్రవక్త (స) సతీమణి,విశ్వాసుల
మాత ఆయెషా బింతే అబు బకర్
పరమపదించిన రోజు.
:
బద్ర్ యుద్దంలో ముస్లింలు విజయం పొందిన దినము.
18వ దినం: : జబూర్ గ్రందము దావూద్ ప్రవక్తకు
అందచేయబడిన దినము.
19వ దినం: : అలీ బిన్ అబు తాలిబ్ తలపై కత్తి
దెబ్బ తగిలిన రోజు
20 వ దినం: :
మక్కా పై ముస్లింలు అంతిమ విజయము పొందిన దినం
21 వ దినం: :
తలపై కత్తి దెబ్బ తగిలిన పలితముగా అలీ
బిన్ అబు తాలిబ్ మరణించిన దినం.
27వ దినం : షబ్-ఎ-ఖద్ర్ రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే
అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి
జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఈ రాత్రి
చేసే ప్రార్థనల
వల్ల సర్వపాపాలు
తొలగిపోతాయని భావిస్తారు.
మొత్తం రంజాన్ మాసం : రంజాన్ మాసం మొత్తం పరమ పవిత్రమైందని, శుభప్రదమైనది అని ప్రవక్త (స) అన్నారు.