10 October 2015

సర్ అల్లామా ముహమ్మద్ ఇక్బాల్




Nations are born in the hearts of poets, they prosper and die in the hands of politicians.
“కవుల హృదయలోంచి రాజ్యాలు పుడతాయి అవి వృద్ది చెంది రాజకియవేత్తల చేతులలో నశించుతాయి”.-ఇక్బాల్

ఇక్బాల్ బాల్యం-తల్లితండ్రులు:
పంజాబ్ లోని సియాల్ కోటలో సుమారు 300 సంవత్సరాల క్రితం ఇస్లాం మతం స్వీకరించిన  కాశ్మీరీ సప్రూ బ్రాహ్మణ కుటుంబంలో నవంబర్9,1877 లో అప్పటి బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు పాకిస్తాన్ లో)  జన్మించిన సర్ ముహమ్మద్ ఇక్బాల్, అల్లామా ఇక్బాల్ (علامہ اقبال) గా సుపరిచితుడు. అల్లామా అనగా మహా పండితుడు అని అర్థం. ఇక్బాల్ తన రచనలలో అనేక సార్లు తన కాశ్మీరీ బ్రాహ్మణ వంశ వృక్షాన్నిపేర్కొన్నాడు.
ఇక్బాల్ యొక్కతండ్రి  షేక్ నూర్ మహమ్మద్ సాధారణ విద్యనభ్యసించిన మతపరమైన వ్యక్తి. అతను వృతి రీత్యా   ఒక దర్జీ. ఇక్బాల్ యొక్క తల్లి పేరు ఇమాం బీ. ఈమె ఇరుగు పొరుగు వారి పట్ల దయ కలిగి వారి  సమస్యలు పరిష్కరించడం లో సహాయ పడేది. ఇక్బాల్ ఆమె   మరణాతరం ఆమె స్మృతి పట్ల తన  విచారం ను ఒక విషాద కవిత రూపం లో(ఎలిజీ)  వ్యక్తం చేశారు.
ఇక్బాల్ విద్యాబ్యాసం:
అల్లామా ఇక్బాల్ సంప్రదాయ మదర్సాలో లో తన ప్రాధమిక విద్యను అబ్యసించిన పిదప సియాల్కోట్ మిషన్ పాఠశాలలో  మెట్రిక్యులేట్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఆతరువాత 1897 లో, లాహోర్ ప్రభుత్వ కళాశాల నుండి ఆర్ట్స్ లో  బ్యాచిలర్ డిగ్రీ పొందినాడు. ఆ తరువాత రెండు సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ పొంది చరిత్ర, తత్వశాస్త్రం మరియు ఇంగ్లీష్ అధ్యాపకుడిగా, ఓరియంటల్ కాలేజీ, లాహోర్ లో నియమింప బడినాడు. ఆ తర్వాత అతను ఉన్నత చదువులకు యూరప్ వెళ్లి  కేంబ్రిడ్జ్ నుండి డిగ్రీ పొందిన తరువాత, మ్యూనిచ్లో డాక్టరేట్ సంపాదించాడు మరియు   న్యాయవాది గా అర్హత సాదించాడు.
ఇక్బాల్  బోధన మరియు లా ప్రాక్టిస్ లో నిమగ్నం  కాకుండా 1908 లో భారతదేశం తిరిగి వచ్చి  కవిత్వం రాయడం కొనసాగించారు. 1911 లో ఆయన ప్రభుత్వ పదవి కి రాజీనామా చేసి తన కవిత్వం ద్వారా ముస్లింలలో వ్యక్తిగత ఆలోచన ప్రచారం ను ప్రారంభించినాడు. 
ఇక్బాల్ రచనలు:
సర్ ముహమ్మద్ ఇక్బాల్ ప్రముఖ విద్యావేత్త, కవి, పండితుడు, ఇస్లాం మత తత్వవేత్త, ఉపన్యాసకుడు  మరియు ఆనాటి క్రియాశీల రాజకీయ నాయకులలో గొప్పవాడు. పాకిస్తాన్ ఏర్పాటు ఉద్యమ ప్రముఖ  ప్రేరణ కర్త గా గుర్తిoపు పొందాడు. ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి. “సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా”  గేయ రచయితగా సుప్రసిద్ధుడు.
ఇక్బాల్ పాకిస్తానీ, ఇండియన్, బంగ్లాదేశీ, శ్రీలంక మరియు ఇతర అంతర్జాతీయ పండితులచే   ప్రముఖ కవిగా గుర్తింపు పొందాడు. ఇక్బాల్ ఉత్తమ ప్రముఖ కవియే గాక  ఆధునిక కాలంలో ఒక "గొప్ప ముస్లిం తాత్విక ఆలోచనాపరుడు” గా పేరుగాంచినాడు.
ఇక్బాల్ యొక్క కవితా రచనలు ఉర్దూలో  కంటే పెర్షియన్ లో ప్రధానంగా ఉన్నాయి. అతని కవిత్వం లో 12,000 పంక్తులు  ఉంటె వాటిలో  7000 పంక్తులు పెర్షియన్ లో ఉన్నాయి. అతని మొట్టమొదటి కవిత్వం పుస్తకం, “అసర్-ఇ-ఖుది” 1915 లో పెర్షియన్ భాషలో వెలుబడింది మరియు అతని కవిత్వం యొక్క ఇతర పుస్తకాలు “రుముజ్ -ఇ-బేఖుది, పాయం -ఇ-మశ్రిక్మరియు” “జబుర్ ఇ-ఆజం” గా ఉన్నాయి ఉర్దూ లో అతని ప్రముఖ రచనలు 'బాంగ్ ఎ దరా' (శంఖారావం)'బాల్ ఎ జిబ్రఈల్' (జిబ్రఈల్ కేశాలు) 'జర్బె కలీమ్' 'అరమ్ గానె హిజాజ్'. అతని కవిత్వం ఎక్కువ భాగం ఫారసీ లో ఉంది. అతని ఉర్దూ మరియు పెర్షియన్ కవిత్వం, తో పాటు అతని  వివిధ ఉర్దూ మరియు ఆంగ్ల ఉపన్యాసాలు మరియు లేఖలు సంవత్సరాలుగా సాంస్కృతిక, సాంఘిక, మతపరమైన మరియు రాజకీయ పరమైన ప్రభావాన్ని చూపాయి.
ఇక్బాల్ ఆంగ్ల భాషలో రెండు పుస్తకాలు “పెర్షియా లో మెటాఫిజిక్స్ అభివృద్ధి” మరియు “ఇస్లాం మతం మత తత్వ విచారం  పునర్నిర్మాణo”, (  The Development of Metaphysics in Persia and The Reconstruction of Religious Thought in Islam) రాసాడు మరియు అనేక ఉర్దూ మరియు పెర్షియన్ సాహిత్య రచనలతో  పాటు అనేక ఉత్తరాలను వివిధ  అంశాలపై  రాశారు. దీనిలో అతని  పెర్షియన్ భావజాలం మరియు ఇస్లామిక్ సూఫీ తత్వము గురించి అతని   ఆలోచనలు వెల్లడిఅవుతున్నాయి. ముఖ్యంగా, ఇస్లామిక్ సూఫీ జీవితం ఒక మెరుగైన  అవగాహన కొరకు  ఆత్మను  ప్రేరేపిస్తుంది. అతను తత్వశాస్త్రం, దేవుని మరియు ప్రార్థన యొక్క అర్థం, మానవ ఆత్మ మరియు ముస్లిం మతం సంస్కృతి, అలాగే ఇతర రాజకీయ, సాంఘిక మరియు మతపరమైన సమస్యలు కుడా చర్చిoచినాడు.
ఇక్బాల్ గొప్ప సాహిత్యవేత్త, కవి, రచయిత మరియు తాత్వికుడు. అయన  రచనలలోను కవిత్వం లోను జాతియతా భావాలను, అచంచల దేశ భక్తి ని గమనించవచ్చు. ఇక్బాల్ తన కవితలో భారత దేశాన్ని కీర్తించాడు. ఇక్బాల్ భారత దేశమంటే అమితమైన ప్రేమను ప్రదర్శించినాడు. దేశ  సంస్కృతిని  వైభవాన్ని తన కవితలలో ఇక్బాల్ గానం  చేసాడు. “ఆరానా-ఇ-హిందూస్తాన్” అన్న పెద్ద  కవితలో ఇక్బాల్ భారత దేశపు సంస్కృతిని, వైభవాన్ని కీర్తించాడు.
ఇక్బాల్ పై ప్రభావం:
ఇక్బాల్ అరిస్టాటిల్,మౌలానా రూమీ గోదే, ఫెడ్రిక్ నీజ్జీ, హెన్రీ బెర్గ్సన్ వంటివారి  చే ప్రభావితుడు అయినాడు. అయన పై 13 వ శతాబ్దం నాటి ముస్లిం తత్వవేత్త జలాలుద్దిన్ రూమి ప్రభావం ఎoతోగానో ఉంది. మౌలానా  రూమి యొక్క కవిత్వం మరియు తత్వశాస్త్రం ఇక్బాల్ యొక్క మనస్సు మీద ఎంతో లోతైన ప్రభావం కల్పించినవి. బాల్యం నుండి మతం పట్ల అబిమానం గల ఇక్బాల్, ఇస్లాం మతం, సంస్కృతి, ఇస్లామిక్ నాగరికత, దాని రాజకీయ భవిష్యత్, చరిత్ర అధ్యయనం పై దృష్టి కేంద్రీకరించినాడు. ఇక్బాల్ తన కవితల లో మార్గదర్శక పాత్ర ను  (guide)రూమి కి కల్పించినాడు. ఇక్బాల్ యొక్క రచనలు ఇస్లామిక్ నాగరికత గత కాలపు గొప్పదనాన్ని, మరియు సాంఘిక రాజకీయ విమోచనం కోసం ఇస్లాం యొక్క  ఒక స్వచ్ఛమైన, ఆధ్యాత్మిక సందేశాన్ని అందించి నాడు. ఇక్బాల్ ముస్లిం దేశాల మధ్య రాజకీయ విభాగాలను  వ్యతిరేకించి నాడు. మరియు ప్రపంచ ముస్లిం  కమ్యూనిటీ లేదా ఉమ్మ(ummah) యొక్క పరంగా మాట్లాడాడు.
ఇక్బాల్ రాజకీయ జీవితం:
1922 లో, అతను ఇంగ్లాండ్ లో లా మరియు తత్వశాస్త్రం చదువుతున్నప్పుడే కింగ్ జార్జ్ V ద్వారా నైట్ హుడ్ "సర్" బిరుదు పొందినాడు మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క లండన్ బ్రాంచ్ సభ్యుడు అయ్యారు. 1925 లో పంజాబ్ శాననసభ కు ఎన్నికైనాడు.1928 నాటికి అతను ఒక గొప్ప ముస్లిం తత్వవేత్త గా కీర్తి ప్రతిష్టలు సాదిoచినాడు మరియు అతను హైదరాబాద్, అలిగర్, మద్రాసు వద్ద ఉపన్యాసాలు ఇవ్వటానికి ఆహ్వానింప బడినాడు. ఈ ఉపన్యాసాల సిరీస్ తర్వాత ఒక పుస్తకం గా (Six Lectures on the construction of Religious Thought in Islam)  "ఇస్లాం తత్వ విచార  పునర్నిర్మాణం" గా ప్రచురించబడ్డాయి. వివిధ అంశాలపై ఇక్బాల్ భావాలను ఈ గ్రంధం నుండి గ్రహించవచ్చు. ఇక్బాల్ ఇస్లాం తత్వ విచారాన్ని పున:నిర్మించడానికి ప్రయత్నిoచాడు. అతనిని కొందరు ఇస్లామిక్ పునరుద్దరణ వాది అని అందురు. ఈయన భావాలను అర్ధం చేసుకోవడం లో BL దార్ వ్రాసిన “ఎ స్టడీ అఫ్ ఇక్బాల్స్  ఫిలాసఫీ” అనే పుస్తకం తోడ్పడుతుంది.
1930 లో ఇక్బాల్ అలహాబాద్ వద్ద జరిగిన ముస్లిం లీగ్ బహిరంగ సమావేశంకు అధ్యక్షత వహించినాడు మరియు ముస్లిం లీగ్ యొక్క డిసెంబర్ 1930 సెషన్ లో ఇక్బాల్ తన అధ్యక్ష ప్రసంగంలోవాయువ్య భారతం లో ఒక ప్రత్యెక ముస్లిం రాజ్యం ఏర్పాటును కోరినాడు. చారిత్రాత్మక అలహాబాద్ ప్రసంగం  లో ఇక్బాల్  భారతదేశం యొక్క నార్త్-వెస్ట్రన్ ప్రాంతంలో (పంజాబ్, ఉత్తర-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్ మరియు బలూచిస్థాన్) ముస్లింలకు ఒక స్వతంత్ర మరియు సార్వభౌమ రాజ్యం కోరినాడు. వాయవ్య భారతదేశం లో ముస్లిం మతం రాష్ట్ర ఏర్పాటు, ముస్లింల ఆఖరి గమ్యం అని నాకు కనిపిస్తుంది అని ఇక్బాల్ అన్నాడు. రెండు దేశాల వాదము (ద్వి జాతి సిద్ధాంతం) అనగా ముస్లిములకు  ఒక ప్రత్యేకమైన దేశం కావాలని సూచించిన మొదటి రాజకీయ తత్వవేత్త సర్ ఇక్బాల్. ఈవిధంగా పాకిస్తాన్ అనే భావనను ప్రతిపాదించిన ప్రముఖులలో ఇక్బాల్ ప్రముఖుడు.
1931 లో జరిగిన 2 వ రౌండ్ టేబుల్ సమావేశంనకు మరియు 1932 లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశంనకు ఇక్బాల్  ముస్లిo లీగ్ ప్రతినిధి గా  ఇంగ్లాండ్ వచ్చినాడు.  తరువాత సంవత్సరాలలో జిన్నా(క్వాయిడ్-ఇ-ఆజం quaid-e-azam) భారతదేశం విడిచి ఇంగ్లాండ్లో నివసిస్తున్నప్పుడు , అల్లామా ఇక్బాల్ అతనిని భారత దేశం తిరిగి రమ్మని ఇక్కడి రాజకీయ సమస్యలు మరియు భారతీయ ముస్లింల వ్యవహారాల పై అతనికి  తన వ్యక్తిగత అభిప్రాయాలు తెలుపుతూ లేఖలు రాసాడు. ఆ లేఖల సంకలనం  (1936జూన్ -1937 నవంబెర్) పాకిస్తాన్ ఏర్పాటులో చరిత్రాత్మిక పాత్ర వహించినవి.

ఇక్బాల్ పాన్-ఇస్లామిజం/ఇస్లాం అంతర్జాతీయత వాదం:
కాలం గడుస్తున్న కొలది ఇక్బాల్ జాతియతాభావం స్థానం లో అఖండ ఇస్లాం భావన పెరిగింది. ముస్లింలు వివిధ దేశాల భూభాగాల్లో జివిస్తున్నంత మాత్రాన వీరందరూ ఒకే జాతిగా ఏర్పడేందుకు ఆటంకాలు ఏమి లేవని అయన పేర్కొన్నాడు. ఇక్బాల్ మొత్తం ప్రపంచాన్ని భగవంతుని కుటుంభం గా భావించే ఇస్లామిక్ భావనకు స్పందించినాడు. ఇక్బాల్ ప్రకారం ఇస్లాం జాతీయవాదం జాతి బిన్నత్వలను ఆమోదిస్తూ అంతిమంగా కలయిక లో విశ్వాసం కల్గిఉన్న నానాజాతి సమితి కనుకనే ఇక్బాల్ తోలి ఇస్లామిక్  దశ  లోనికి వెనుకకు వెళ్ళడం (Back to Early Islam) అనే నినాదాన్ని ప్రకటించాడు.
అఖండ  ఇస్లాం  అంతర్జాతీయ దృక్పదం కలిగినట్టిది. దీనినే పాన్ -ఇస్లామిజం అంటారు. ఇస్లాం ఒక అంతర్జాతీయ వ్యవస్థ అని  అది  ప్రపంచం లోని ముస్లింలందరినీ ఏకం చేయాలనీ ఇక్బాల్ అంటాడు. మతం ఐక్యతను సాధించే గొప్ప శక్తీ అని, శక్తివంతం గా పనిచేయగల అంతర్జాతీయ వ్యవస్థ ఏదైనా ఉంటె దానికి పునాది మతం కాగలదని ఇక్బాల్ విశ్వాసం.
అఖండ ఇస్లాం అనే ఇక్బాల్ భావన లో సమాజం లోని సమస్యలు అన్నింటిని పరిష్కారం చూపెట్ట గలిగేది మతం అని ఇక్బాల్ భావించాడు. ఇక్బాల్ తన చివరి దశలో మతపరమైన రాజ్యాన్ని సమర్దించినట్లు కనిపిస్తుంది. బౌతిక  సుఖాలకు ఆలవాలమైన మానవ జీవితానికి పరమార్ధక జీవనాన్ని ఇవ్వగలిగేది  మతమేనని ఇక్బాల్ విశ్వసించాడు. వ్యక్తికి నైతిక, నైతిక పరమార్ధక జీవనాన్ని కల్పించవలసిన బాద్యత  రాజ్యనిది, ప్రభుత్వానిది అని ఇక్బాల్ భావించాడు.
అతని ఉద్దేశం లో జాతీయవాదం కానీ, సోషలిజం గాని సామాజిక రుగ్మతలను రూపుమాప లేవు, ఈ ఆధునిక ప్రపంచ పున:జీవనాన్ని పొందటానికి మతమే మార్గమని ఇక్బాల్  పేర్కొన్నాడు. మతమే నైతికం గా మానవుని గొప్పగొప్ప బాద్యతలను స్వికరించగల శక్తీ సమకూరుస్తుంది.
ఇక్బాల్ ఉద్దేశం లో దివ్య ఖురాన్ దైవ సార్వబౌమాదికారానికి ప్రతిక అది మానవుని అన్ని జీవిత దశలను నిర్దేశిస్తుంది. దివ్య ఖురాన్ రాజకీయాలను, నైతిక విలువలను, మతాన్ని రాజ్యాన్ని కలగలిపిన దైవహక్కు గా విరాజిల్లు తుంది.
ఇక్బాల్ ఖ్యాతి:  

ఇరాన్ లో, అతను  ఇక్బాల్-ఇ లాహోరి (اقبال لاهوری). (లాహోర్ ఇక్బాల్) గా ప్రసిద్ది చెందినాడు. ఇక్బాల్ యొక్క "అస్రారే-ఇ-ఖుది" మరియు ప్రసిద్ధ "బాల్-i-జిబ్రీల్" ఇరాన్ లో బహుళ  ప్రజాదరణ పొందినవి మరియు ఇరాన్ వారు వాటిని  జీవితం యొక్క ఒక మార్గం వలె తీసుకుంటారు. 1979 నాటి ఇరానియన్ విప్లవంకు  స్పూర్తినిస్తూ మరియు దానిని అందుకోవడంలో ఇక్బాల్ కవిత్వంలోని లోని   భావజాల పాత్రను ఇరాన్ లో అనేకమంది పండితులు గుర్తించారు
హైడెల్బర్గ్, జర్మనీ లో ఒక వీధి కి ఇక్బాల్ యొక్క పేరు పెట్టి(ఇక్బాల్-ఉఫెర్)  జర్మనీ అతనిని  సత్కరించింది. యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ అసోసియేట్ జస్టిస్ విల్లియం O. డగ్లస్ అబిప్రాయం లో   ఇక్బాల్ యొక్క నమ్మకాలలో"సార్వత్రిక అప్పీల్ ఉందని” అన్నారు.  అతని జీవిత చరిత్ర రాసిన రష్యా కవి  NP అనికోవ్  “ఇక్బాల్ గొప్పదనం అతను ప్రవచించిన ఉత్తమ  ఆదర్శాలు మరియు ప్రజల మధ్య మానవతావాదం, ప్రజాస్వామ్యం, శాంతి మరియు స్నేహం యొక్క కొరకు అతను వెలుబుచ్చిన సూత్రాలు చాల బాగా ఉన్నాయి” అని  అన్నాడు. ప్రొఫెస్సర్ విల్ఫ్రెడ్ కాంట్వెల్ స్మిత్ , ప్రొఫెసర్ ఫ్రీలాండ్  అబోట్ అతనిని గొప్ప తత్వవేత్త గా కీర్తించారు.
దక్షిణ ఆసియా మరియు ఉర్దూ మాట్లాడే ప్రపంచం యొక్క చాలా భాగంలో ఇక్బాల్ షాయిర్-ఇ-మశ్రిక్  (شاعر مشرق, "తూర్పు కవి") గా భావించబడుతున్నారు. అతనిని ముఫ్ఫకిర్ –ఇ- పాకిస్తాన్ (مفکر پاکستان, "పాకిస్తాన్ యొక్క వేదాంతి ") అని కూడా అంటారు మరియు హకీం-ఉల్-ఉమ్మత్ (حکیم الامت, "ఉమ్మా ఋషి ") అని కుడా అందురు. పాకిస్తాన్ "జాతీయ కవి" గా పేరు గాంచినాడు.
భారతదేశం లో అతను ప్రముఖ పాట ” సారే జహాన్ సే అచ్చా” రచయిత గా వాసి కెక్కినాడు. జాతియోద్యం కాలం లో భారత దేశపు అతి కొద్ది మoది గొప్ప కవులలో ఇక్బాల్ ఒకడు. కొందరు ఇతనిని రవీంద్రనాథ్ టాగోర్ తో పోలుస్తారు.ఇతని ద్వార ప్రభావితం అయిన వారిలో అలీ షరయతి, ఖలిల్లుల్లా ఖలీలి ప్రముఖులు.
ఏప్రిల్ 21, 1938, గొప్ప ముస్లిం  కవి-తత్వవేత్త మరియు ముస్లిం సమస్యలకు ప్రతినిది అయిన ఇక్బాల్ పరమపదించినారు. కానీ ఎప్పుడూ తన అందమైన కవిత్వం ద్వారా ఉర్దూ,ఫారసీ పాఠకుల గుండెల  లో స్థిర నివాసం ఉంటారు. లాహోరులో ఆయన పార్థివ దేహము ను  బాద్షాహి మసీదు పక్కన ఖననం చేయడం జరిగింది
ఆధారాలు:
1.    వికీపీడియా.
2.    తెలుగు అకాడమి-రాజనీతి తత్వ శాస్త్రము.
3.    allamaiqbalforus.blogspot.com
4.    ajmalforum.blogspot.com


No comments:

Post a Comment