22 September 2014

రజియా సుల్తానా(1236-1240)




రజియా సుల్తానా(1236-1240)
 
బానిస వంశానికి చెందిన సుల్తానులలో ప్రముఖురాలు, డిల్లీ సింహాసనాన్ని అధిష్టించి భారతదేశాన్ని పరిపాలించిన మొట్ట మొదటి ముస్లిం స్త్రీ రజియా సుల్తాన్. ఈమె తన తండ్రి ఇల్టుష్మిష్  మరణాంతరం 1236 లో డిల్లీ సింహాసనాన్ని అధిష్టించినంది. ఈమె అసలు పేరు రజియా అల్-డిస్. పట్టాభిషక్త పేరు జలాలత్ ఉద్-దీన్ రజియా. ఈమె  చరిత్రలో రజియా సుల్తాన్ లేదా రజియా సుల్తానా గా ప్రసిద్ధి. ఈమె ఢిల్లీ సింహాసనంపై క్రీ.శ. 1236 నుండి 1240 వరకు ఆశీనురాలైంది. ఈమె సెల్జుక్ వంశ టర్కిష్ మహిళ, టర్కిష్ చరిత్రలోనూ మరియు ముస్లింల చరిత్రలోనూ ప్రధమ మహిళా చక్రవర్తి. రజియాను ఎవరైనా "సుల్తానా" అని సంబోధిస్తే, నిరాకరించేది తననెప్పుడూ "సుల్తాన్" అని పిలువాలని కోరేది.

ఇల్టుట్మిష్(1210-1236) కు అనేక కుమారుల తరువాత కుమార్తె రజియా 1205 లో   జన్మించినది. సుల్తాన్ తన కుమార్తె పట్ల గొప్ప అనురాగాన్ని కలిగి ఆమె విద్యాబుద్దులను స్వయంగా తానే పర్యవేక్షించేవాడు. రజియా సైనిక విద్య, కవాతు, ధనుర్ధారణ, గుర్రపుస్వారీ మొదలగు  యుద్ధ విద్యలలో  గొప్ప నిపుణురాలుగా పేరుగాంచినది,తరచూ తన తండ్రితో పాటు యుద్దలలో పాల్గొనేది. రజియా అంతఃపుర స్త్రీలలా వుండేది కాదు సమకాలీన ముస్లిం యువరాణులలాగా పురుషునివలె దుస్తులు ధరించేది. సైనికుని వలె తిరిగేది. యుద్ధాలలో తానే నాయకత్వం వహిస్తూ వచ్చేది. తండ్రితోనే వుంటూ రాజవ్యవహారాలను చక్కగా వంటబట్టించుకున్నది.

 “నా కుమార్తె, అందరూ కుమారులకన్న ఉత్తమురాలు” అని సుల్తాన్ ఇల్టుష్మిష్ అబిప్రాయపడేవాడు. సుల్తాన్ ఇల్టుష్మిష్ డిల్లీని వదిలి ఇతరప్రాంతాలకు సైనిక విజయాల కోసం వెళ్ళేటప్పుడు  రజియా ను డిల్లీ పాలకునిగా నియమించే వాడు. రజియా సమర్ధత,తెలివితేటలు,వివేకం,శౌర్యం,పరిపాలనా పద్దతులు మరియు యుద్ద నిపుణతపట్ల సంతృప్తి చెందన సుల్తాన్ ఇల్టుష్మిష్ తన కుమార్తె రజియా ను తన తరువాత తన  వారసురాలుగా ప్రకటించినాడు. సుల్తాన్ ఇల్టుష్మిష్ మరణాంతరం రజియా  సోదరుడు రుక్న్-ఉద్దీన్  కొంతకాలము అనగా 7నెలలు పరిపాలణించినాడు ఆతరువాత రజియా సోదరుని ఓడించి డిల్లీ ప్రజల మద్దత్తు,సహకారంతో సింహాసనాన్ని అధిష్టించినది.

ఈమె ఢిల్లీ సింహాసనంపై క్రీ.శ. 1236 నుండి 1240 వరకు ఆశీనురాలైంది. రజియా తన రాజ్యంపట్ల తన ప్రజలపట్ల అమిత శ్రద్ధాశక్తులు చూపేది. ప్రజాక్షేమం మొదటి విషయంగా చూసేది. రజియా సుల్తాన్ తన సామ్రాజ్యం లో పూర్తి శాంతి బద్రతలను కాపాడినది. వ్యాపారం,రహదారులు,బావులను ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసినది.

పరమత సహనం ఈమె ఆభరణముగా మారింది. రజియా, సుల్తానుగా ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది, ఈవిషయం ఇతర ముస్లిం ప్రతినిధులను కోపాన్ని తెప్పించింది. ఇందుకు సమాధానంగా, రజియా, ముస్లింల భావాలకన్నా ఇస్లాం సూత్రాలు ముఖ్యమనీ “ముస్లిమేతరులపై భారాలను మోపకండి” అన్న  ముహమ్మద్ ప్రవక్త  ప్రవచనాలను ఉటంకించింది, సమర్ధత ఆధారంగా ఇస్లాంను స్వీకరించిన ఒకరిని ఉన్నత స్థానంగల హోదానిచ్చింది.

రజియా, పాఠశాలను, విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను, ప్రజా-గ్రంధాలయాను స్థాపించింది. ఈ సంస్థలలో, ప్రాచీన తత్వవేత్తల పై, ఖురాన్ పై, హదీసులపై పరిశోధనలు సాగేవి. హిందు ధర్మశాస్త్రాలు, తత్వము, ఖగోళశాస్త్రము మరియు సాహిత్యమునూ ఈ పాఠశాలలు, కళాశాలలో అధ్యయనా విషయాలుగా వుండేవి. కళలను,సాహిత్యాన్ని ఆదరించినది, ఈమె ఆస్థానం లో అనేకమంది చిత్రకారులు,సంగీతకారులు ఉండే వారు.

రజియా పరిపాలన స్వల్పకాలమే(1236-40) సాగింధి. అధికార కాంక్షతో సోదరుడు జరిపిన పోరాటాలు, స్త్రీ సుల్తాన్ కావటం సహించడం లేని ఆస్థానం లోని టర్కిష్ ప్రతినిదులు, సామంతుల  కుతంత్రాలు, జమాలుద్దీన్ యాకూత్ అనే అబిసీనియన్ దాసుడు/బానిస పట్ల రజియా కు గల  పరస్పర ఆకర్షణ మరియు చిన్ననాటి స్నేహితుడు మరియు భటిండా గవర్నరు అయిన మాలిక్ ఇక్తియారుద్దీన్ అల్తూనియా తో జరిగిన యుద్దం ఇవన్ని ఆమె పతనానికి దారితీసాయి. రజియా మరియు అల్తూనియాల మధ్య జరిగిన యుద్ధంలో యాకూత్ చంపబడ్డాడు, రజియా చెరసాల పరమయింది. ఆఖరుకు రజియా అల్తూనియాను వివాహమాడింది. ఈ మధ్య రజియా అన్నయైన ముయిజుద్దీన్ బహ్రామ్ షాహ్, అల్తూనియాపై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో అల్తూనియా మరియు రజియా అక్టోబరు 14, 1240 న, ప్రాణాలు కోల్పోయారు. బహ్రామ్ షా ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. బానిస వంశ చరిత్ర లో రజియా యుగం పరిసమాప్తం అయినది. ఆమె పరిపాలనా కాలము స్వల్పమైన తన పోరాటపటిమ,తన శౌర్యం, యుద్ధనీతి, పరిపాలన చాతుర్యం తో ఆమె బానిసవంశ ప్రభువులలో ప్రముఖురాలుగా విరాజిల్లినది.



























.


























No comments:

Post a Comment