24 January 2014

2014-మైనారిటీల అభివృద్ధి - పాత పధకాలకు పదను-కొత్త పధకాలకు ఆరంభం -ఒక పరిశీలన



         
సచార్ కమిటీ నివేదిక ప్రకారం దేశాజనాభాలో 23%ప్రజలు పేదరికం తో బాదపడుతున్నారు వీరిలో ముస్లింలు అధికశాతం లో  ఉన్నారు .పట్టణ ప్రాంతాలలోని 38.4% మంది  మైనారిటీ ప్రజలు  పేదరికం లో ఉన్నారు, వీరిలో ముస్లింలు అధికం. ముస్లింల పరిస్థితి ఎస్‌సి,ఎస్‌టి ల కన్నకడు దమనీయము గా ఉంది. 
 
          వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశం లో అన్నీ రాజకీయపక్షాలు, యూ‌పి‌ఏ-2 ప్రభుత్వం మైనారిటీ లను ముఖ్యంగా ముస్లిం మైనారిటీలను ఆకర్షించటానికి అనేక నవీన పధకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఉన్న పధకాలను మెరుగు పెడుతూ, ఉచిత వైద్యసధుపాయం, అందుబాటులో ఋణ సధుపాయం, విద్యార్ధులకు స్కాలర్ షిప్ వంటి పధకాలకు అధిక ప్రాదాన్యత ఇస్తున్నాయి.

          గతం లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో ముస్లింల అండదండలతో అధికారం లోనికి వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాది ప్రభుత్వం ,ముజఫర్ నగర్ అల్లర్లతో పోయిన తన ప్రతిష్టను సంపాదించి ముస్లింల ఆదరాభిమానాలను, విశ్వాసాన్ని వచ్చే లోక్ సభ ఎన్నికలలో సాధించాలనే ఉద్దేశం తో అనేక నూతన పదకాలను ప్రారంభించినది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. గా ఒక ముస్లిం ను నియమించినది, అదేవిధం గా రాష్ట్ర ముఖ్య పాలనా కార్యదర్శి గా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పని చేస్తున్నారు.ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజవాది ప్రభుత్వం 30 ప్రభుత్వ శాఖలచే తను అమలు పరుస్తున్న 85 అబివృద్ధి పధకాలలో 20 పధకాలను ప్రత్యేకం గా ముస్లింలకు కేటాయించినదని  ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ అఖిలేశ్ సింగ్ యాదవ్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ జనాభాలో ముస్లిం లు 20% వరకు ఉన్నారు. వెనుక బడిన ముస్లింల సామాజిక,ఆర్ధిక,విద్యా బివృద్ధికి గాను సమగ్ర మైనారిటీ అభివృద్ధి పధకాలను ప్రభుత్వం రూపొందించుచున్నదని అన్నారు..ఇందుకోసం ప్రత్యేకం గా 2 కమిటీలను ఏర్పర్చడం జరుగుతుంది అని అన్నారు.

          ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 5 రాష్ట్రాల ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తరువాత, దిద్దుబాటు చర్యలను ప్రారంబించినది. ఈ రాష్ట్రాల ఎన్నికలలో సంప్రదాయకంగా కాంగ్రెస్ కు ఓటు చేసే ముస్లింలు, అల్పసంఖ్యాక వర్గాల వారి ఓట్లను పొందడంలో బి.జే.పి. ఆం ఆద్మీ పార్టీ కొంతవరకు సఫలీకృతం అయినాయి అని చెప్పవచ్చును. ముఖ్యం గా మద్య ప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో ముస్లింలు అధికం గా ఉన్న నియోజక వర్గాలలో కూడా కాంగ్రెస్స్ తన సీట్లను కోల్పోవవలసి వచ్చినది. ఇది ఆ పార్టీ  శ్రేణులను, అధినాయకత్వాన్ని కొంత వరకు ఆలోచనలో పడ  వేసినది. కోల్పోయిన ప్రతిష్టను, ఓట్లను తిరిగి సంపాదించడాని కాంగ్రెస్ నాయకత్వం మైనారిటీ ముఖ్యంగా ముస్లిం అబివృద్ధి పధకాల వైపు తన దృష్టిని మరల్చినది. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మైనారిటీలకు ప్రత్యేక పధకాలను అనగా ఉచిత వైద్య సదుపాయం,వృత్తి పనుల  అభివృద్ధి, స్త్రీలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ముస్లిం ఆకర్షణ పధకాలను ప్రవేశ పెట్టుటకకు కాంగ్రెస్ యోచించుచున్నది. జియో పార్సి”,”సిఖో ఔర్ కమాఓ”,”నయీ రోషని వంటి మైనారిటీ అభివృద్ధి ప్రభుత్వ పధకాలను శ్రేణులలో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ యోచించుచున్నది. అందుబాటులో రుణసౌకర్యం, వక్ఫ్ సంస్కరణలు ,మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ క్రింద ముస్లింలకు  ఉచిత వైద్య సధుపాయం కల్పించటానికి ప్రయత్నించుచున్నది. ఇందుకోసం 2013-14 ఆర్ధిక సం.లో 100 కోట్లను కేటాయించడం జరిగినది.

          రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలోని ముస్లింల అభిప్రాయాలు, డిమాండ్ల ను తెలుసుకొనుటకు గాను కాంగ్రెస్ నాయకత్వం దేశంలోని దాదాపు 200 మండి మైనారిటీ వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ముస్లిం ప్రతినిధులు తక్షణం దిద్దుబాటు చర్యలను ప్రారంబించక పోయిన కొంగ్రెస్ ముస్లిం ఓట్లను కోల్పోతుందని ప్రతినిధులు ఆవేదనతో,భాధతో ఆదినాయకత్వాన్ని హెచ్చరించినారు. ముస్లింలు కాంగ్రెస్ కు దూరమైన విషయాన్ని 5 రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు నిరూపించాయని ఒక ప్రతినిధి అబిప్రాయపడినారు. కాంగ్రెస్ ఉపాద్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ సమాజం లోని అన్నీ వర్గాలకు రక్షణ కల్పించాలి అని అన్నారు . మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి రెహమాన్ ఖాన్ అబిప్రాయంలో ఋణ సధుపాయం,వృతి విద్యా అబివృద్ధి,ముస్లిం విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు ముస్లింలకు ప్రయోజనం కల్గించును. అయితే కొంత మంది ప్రతినిధులు మైనారిటీ లు రుణసధుపాయం పొందడం చాలా కష్టము గా ఉన్నదని అన్నారు.

          ఇక యూ‌పి‌ఏ ప్రభుత్వ విషయానికి వస్తే, క్రిందటి సారి ఎన్నికలలో మైనారిటీ ల సంపూర్ణ సహకారాలతో,మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి పధకం వంటి జనాకర్షణ పధకాలతో ,మన్మోహన్ సింగ్ వంటి మైనారిటీ నాయకుడిని తిరిగి 2వ సారి ప్రధానిగా ప్రకటించి, కొన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం లో  అధికారం లోనికి వచ్చిన యూ‌పి‌ఏ సంకీర్ణ ప్రభుత్వం తన విధానాల ఫలితం గా మైనారిటీ లు ముఖ్యం గా ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయినది. ఫలితమే 2013 చివర్లో జరిగిన 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు. ఈ ఎన్నికలలో యూ‌పి‌ఏ భాగస్వామ్య కొంగ్రెస్ తన అధికారాన్ని కోల్పోటమే కాక సంప్రదాయ ముస్లిం బ్యాంకు ఓట్లను కూడా ఇతరులకు పోగొట్టుకొన్నది. 2014 లో జరిగే 16 వ లోక్ సభ ఎన్నికలలో యూ‌పి‌ఏ ప్రభుత్వం తిరిగి అధికారం లోనికి రావటానికి అనేక నూతన పధకాలను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంధి. ఈ పధకాలు సఫలం చెంది వచ్చే  పార్లమెంట్ ఎన్నికలలో మైనార్టీలు తిరిగి తనకు అధికారం ఇస్తారని ఆశించుచున్నది. ఇందుకుగాను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ అనేక అమలులో ఉన్న  పాత పధకాలకు పదను పెట్టి, నూతన పధకాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నది
.
          కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి అబిప్రాయం ప్రకారం అమాయక ముస్లింలను టెర్రరిస్టులు పేరుతో అరెస్టులు చేయడం, ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం వంటివి ముస్లింలలో తిరిగి యూ‌పి‌ఏ పట్ల విశ్వాసాన్ని కలుగ చేయును. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ షిండే టెర్రరిస్టుల పేర అమాయక ముస్లింల అరెస్టులలో జాగ్రత వహించమని, అరెస్టు ఐనా నిరపరాధ ముస్లింలకు తగిన నష్ట పరిహారం చెల్లించ మని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కోరినారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ఖాన్ టెర్రర్ కేసులలో ఇరుకొన్న అమాయక ముస్లిం యువకుల కేసులను పున:పరిశీలించుటకు గాను టాస్క్-ఫోర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.  అయితే దీనిపై ఎటువంటి నిర్ధిష్ట సమాధానము లబించలేదు.

          కొన్ని నెలలలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టికొని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముల్టీ-సెక్టొరల్ అబివృద్ధి పధకం, విద్యార్ధులకు స్కాలర్ షిప్ పధకం వంటి వాటిని వేగవంతం చేస్తుంది, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ,మైనారిటీ ల అబివృద్ధికి ముఖ్యంగా స్త్రీల/బాలికల   విద్యాభివృద్ధికి,ప్రీ-మెట్రిక్,పోస్ట్-మెట్రిక్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్పులు ప్రధానం చేస్తుంధి. ఈ స్కీములు అన్నింటిలోనూ 30% యువతులకు కేటాయించడం జరిగింది.

          మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ క్రింద 11,12 తరగతులు (+2) చదివే మైనారిటీ బాలికలకు ప్రత్యేకంగా స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి 15 సూత్రాల మైనారిటీ పధకం,ముల్టీ-సెక్తోరల్ డవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద స్కూళ్ళు, బాలికల హాస్టల్,ఐ‌టి‌ఐ,పాలిటెక్నిక్ మొదలగునవి నిర్మించుకోవటానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది.దేశవ్యాప్తంగా మైనారిటీలు  అధికంగా ఉన్న 710 బ్లాకులలో, 66 పట్టణాలలో 1250 కోట్లు, మరియు 1170 కోట్లను స్కాలర్ షిప్ ప్రోగ్రాం క్రింద ఈ ఆర్ధిక సం.లో  ఖర్చు పెట్టుటకు నిర్ణయించినది
                    2012-13 నుంచి “నై రోషని” (Nai Roshni) పధకం క్రింద మైనారిటీ స్త్రీలకు నాయకత్వ శిక్షణ కల్పించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని పెంచి, తద్వారా ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థలతో వారు వ్యవరించుటకు తగిన జ్ఞానము,పనిముట్లు, విధానాలను నేర్పడం జరుగు తుంది.సూక్ష్మ ఋణ సదుపాయాలను మెరుగు పరుచుటకు గాను నేషనల్ మైనారిటీ డవలప్మెంట్ అండ్ ఫీనాన్స్ కార్పొరేషన్ “మహిళా సమృద్ది యోజన”పధకమును ప్రారంబించడం జరిగింది.

          కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ చే “సీఖో ఔర్ కమాఓ” అనే నూతన పధకాన్ని ప్రవేశ పెట్టినది. సంప్రదాయక,నవీనతమ వృత్తులను చెప్పట్టే మైనారిటీ యువకులు తమ విద్యార్హతలు,ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు, మార్కెట్ స్థితులను దృష్టి లో పెట్టుకొని తమ వృతి నైపుణ్యాలను మెరుగు పరుచుకొనుటకు కావలసిన  సహాయం పొందగలరు.  ఈ పధకం ద్వారా నైపుణ్యం, తగిన అర్హతలు కలిగిన మైనారిటీ  యువకులు కనీసం 75% మంది  ఉపాధి పొందగలరు తిరిగి వారిలో 50% మంది  వ్యవస్థీకృత రంగం లో ఉపాధి పొందగలరు. ఇందుకు గాను ఈ పధకం లోని  30% సీట్లను మైనారిటీ యువతులకు, స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించడమైనది.

          ఖిద్మత్ అనే పేరుతో  మైనారిటీ సంక్షేమ శాఖ నిర్వహించే వివిధ పధకాల పై అవగాహనకల్పించుటకు ,ఆ పధకాలను  ఉపయోగించుకొనుటకు గాను ఆ రంగాలలోని  నిపుణుల సేవలను అందించే ఒక హెల్ప్ లైన్ ప్రారంబించబడినది. ప్రాంత అబివృద్ధి పధకం లో భాగం గా ఆమోదం పొందిన ప్రాజెక్ట్ ల క్రింద వరుసగా 1151 కోట్లు, 731 కోట్లు ఖర్చు పెట్టుటకు ఆమోదం తెల్పింది.

          వక్ఫ్ చట్టం సవరణ బిల్లు 2013 ద్వారా  దేశవ్యాప్తం గా ఉన్న వక్ఫ్ ఆస్తులను సరిగా నిర్వహించుటకు, ముస్లిం సమాజ సాంఘిక ,ఆర్ధిక అబివృద్ధికి గాను నిదులను పొందుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది.వక్ఫ్ సంస్థలకు రక్షణ కల్పించి వాటి నిర్వహణను సరియైన మార్గంలో పెట్టుటకు వీలు కల్పించడం జరిగింది.
          
 ఆర్ధిక, వైద్య, సేవల రంగాలలో పార్సి మైనార్టీ ల స్థితి గతులను,వారి జన సంఖ్యను పెంచుటకు “జియో పార్సి” పధకం ప్రవేశపెట్టినది
.
          పైన వివరించిన వివరాలను పరిశీలించిన అనేక రాజకీయ పక్షాలు మరియు కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాలు ,  మైనారిటీలను మచ్చికచేసుకొని, వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. దురదుష్టవశాత్తు పశ్చిమ బెంగాల్,బిహార్, ఈశాన్య భారతం లోని కొన్ని  రాష్ట్రాలు ఉన్న నిధులను సక్రమంగా వినియోగించూకోలేక  పోతున్నాయి. ఆయా రాష్ట్రాల ముస్లిం ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ముస్లిం సంక్షేమ ఫలాలు  అందడం లేదు. కనీసం 2014 లో ఐనా భారత దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటి లు చైతన్యం తో తమకు కేటాయించిన పధకాలను సక్రమంగా వినియోగించుకొని లబ్ధి పొందుతారని ఆశించుదాము. యూ‌పి‌ఏ-2, వివిధ రాష్ట్రా ప్రభుత్వాలు చిత్తశుద్దితో పని చేస్తాయని నమ్ముదాము.  





No comments:

Post a Comment