20 April 2014

ఇస్లాం లో స్వప్నములు లేదా కలల వివరణ

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు (Dream) అంటారు. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలని కేవలం భౌతికంగా, జీవ శాస్త్ర దృక్పథంతో చూస్తే అవి నిద్రావస్థలో నాడీ సంకేతాల చలనాలకి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే అవి ఉపచేతనలో జరిగే చలనాలకి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. అధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలు గానో, భవిష్యత్తుని తెలిపే దూతలు గానో చెప్పుకోవచ్చు.

స్వప్నము లేదా కలలను వివరించడం ఇస్లామిక్ సాహిత్యం లో కనిపిస్తుంధి, ఈ రంగములోఇస్లామిక్  విద్వాంసులు తగినంత కృషి చేసి కలలకు వివరణలు లేదా భాష్యం ఇచ్చినారు. కలలను గురించి, కలల వివరణ పట్ల మొదట్నుంచి ముస్లింలకు ఆసక్తి ఉంది. ఇస్లాం లో కలలను గురించి ఇయాన్ ఆర్.ఎడ్గర్ విస్తృత పరిశోధనలు చేసెను. అతని ప్రకారం ఇస్లాం చరిత్ర మరియు ముస్లింల జీవితాలలో కలలు ప్రధాన పాత్ర వహించును. ప్రవక్త (స) మరణించినతరువాత కలల ద్వారానే ముస్లింలు అల్లాహ్ సందేశాలను పొందుచున్నారు.

ముస్లింల దృష్టి లో కల అనునది ఒకరమైన ప్రకృతి అతీత భావన. ప్రవక్త(స) ప్రకారం “విశ్వాసికి వచ్చే కల నబువ్వత్ కు చెందిన నలబై ఆరు భాగాలలో ఒక భాగం అవుతుంది-సహీ బుకారి 2263. దైవ ప్రవక్త (స)ఈ విధంగా ప్రవచించినారు “మంచి కలలు (రుయా)దేవుని తరపున వస్తాయి,చెడ్డ కలలు(హుల్మ్) షైతాన్ తరుపున వస్తాయి. కనుక ఎవరికైనా కలలో ఏదైనా చెడు విషయం కనిపిస్తే మేల్కొన్న వెంటనే అతను ధూ ధూ అనిమూడు సార్లు తన ఎడమవైపు ఉమ్మి  షైతాన్ బారి నుండి దేవుని శరణు వేడుకోవాలి, అలా చేస్తే ఆ కల వల్ల అతనికి ఎలాంటి నష్టం వాటిల్లదు.”-సహీ బుకారి 3118

ముస్లిం సమాజం కలలు,వాటి వివరణలో పశ్చిమ సమాజం కన్నా బిన్నమైన అబిప్రాయాలను కలిగిఉంది.ఇస్లాం లో “తాబిర్ లేదా తఫ్సీర్” అనే పేర్లతో కలలను వివరించడం జరిగింది  మరియు ఆధునిక ముస్లిం ల జీవితాలలో కలల వివరణ ముఖ్య స్థానాన్ని కలిగిఉంది. ఇస్లామిక్ సాహిత్యం లో మెండు గా ఉన్న కలల ప్రస్తావన పై ఆధునిక పశ్చిమ పరిశోధకులకు సరియైన అవగాహన లేదు. 1400 సంవత్సరాల ఇస్లామిక్ సాహిత్యం లో ప్రస్తావించిన కలల సిద్దాంతాలు, భావనలు, నిర్ధారిత ఫలితాలను, వాస్తవాలను ఆధునిక శాస్త్రవేత్తలు తమ గత 150 సంవత్సరాల పరిశోధనలలో నిరూపించినారు.  రాత్రి ఆఖరు భాగం లోని మూడోవ భాగం లో వచ్చే కలలు నిజమవుతాయని ముస్లింలు సాధారణంగా విశ్వసిస్తారు. ఇదే విషయాన్నిఅనగా  సాధారణ నిద్రలోని ఆఖరి భాగం లోని 3దశలో కలలు వస్తాయని ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది.

దివ్య ఖురాన్ లో కలలను వివిధ పదాల రూపం లో ప్రస్తావించడం జరిగింది. రుయా/vision (చాయా లేదా రూపు) గురించి 17:60, 37:105, 48:2 ఆయతులలో, హుల్మ్ (కల) గురించి 21:5,52:3 ఆయతులలో, మనం(నిద్ర)గురించి 37:10, బుష్రా(వార్తలు) గురించి 10:6,ఆయతులలో ప్రస్తావించడం జరిగింది.
దివ్య ఖురాన్ లోని క్రింది మూడు సురాలలో కలలను గురించిన వివరణాత్మక ప్రస్తావన కలదు:
1.    
12వ  సూరా యూసుఫ్ లో  యూసుఫ్ (Joseph) కధ మరియు కలల వివరణకు సంబంధించిన వివరణలు కలవు.
2.   37వ సూరా అస్-సాఫ్ఫాత్:  ఈ సురాలో ప్రవక్త ఇబ్రాహిం కు తన కుమారుని బలి ఇమ్మని దేవుడు (అల్లాహ్) ఇచ్చిన ఆజ్ఞ వివరాలు కలవు.

3.     8వ సూరా అల్ ఆనఫాల్ : ఈ సురాలో ప్రవక్త మహమ్మద్(స)  కు వచ్చిన ఒక కల గురించి వివరించడటమైంది.” ఆ సమయాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి, అపుడు ఓ ప్రవక్తా! అల్లాహ్ వారిని కలలో  కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే,మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు, యుద్దం విషయం లో వివాద పడి ఉండేవారు. కానీ అల్లాహ్ మిమ్మల్లి దీనినుండి రక్షించాడు”. దివ్య ఖురాన్ 8:43.  ఈ సురాలో ప్రవక్త (స) కు బద్ర్ యుద్దానికి ముందు రాత్రి వచ్చిన కల గురించి వివరించడమైనది.

లైలతుల్-మీరాజ్ (రాత్రి ప్రయాణం) కు సంబందించిన వివరాలు 17వ సూరా బనీ ఇస్రాయీల్ లో కనిపిస్తాయి.” కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి (ప్రవక్త) ఒక రాత్రి మస్జిదె హరామ్ నుండి, దూరంగా ఉన్న ఆమసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు (అల్లాహ్). ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం  చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును”–దివ్య ఖురాన్ 17:1

దివ్య ఖురాన్ లోని కలలను గురించి ప్రస్తావించిన పశ్చిమ దేశాల రచయితలు లైలతుల్-మీరాజ్ (రాత్రి ప్రయాణం) ను మహమ్మద్ ప్రవక్త (స) కు వచ్చిన కలగా వర్ణించేదరు. కానీ ముస్లింలు ఈ అద్బుద్ధతమైన రాత్రి  ప్రయాణమును (రాత్రి లోని కొంత సమయంలో జరిగినప్పటికి )కలగా గాక నిజముగా జరిగినట్లు భావించేదరు. వాస్తవానికి మహమ్మద్ ప్రవక్త (స) శరీరము మరియు ఆత్మ మక్కా నుంచి జెరూసెలెమ్ కు పయనించినట్లు ఆతర్వాత స్వర్గాన్ని దర్శించినట్లు భావిస్తారు. ప్రవక్త (స) తన ప్రయాణములో 7రకాల స్వర్గాలను దర్శించినట్లు, అక్కడ అనేక మంది ప్రవక్తలను కలసినట్లు వారితో కలసి జరిపిన ప్రార్ధనలలో నాయకత్వం  వహించినట్లు ముస్లిం లు భావిస్తారు. కాబట్టి దీనిని మనం కల అని భావించలేము!

కొంతమంది దివ్య ఖురాన్ లోని అజ్-జుమర్ సూరా లో అల్లాహ్ నిద్ర మరియు కలలో ఆత్మను దేవుడు వశం చేసుకొన్నట్లు భావిస్తారు. మరణ సమయంలో ఆత్మలను వశపరచుకొనే వాడు అల్లాహ్ యే; ఇంకా మరణించని వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడూ వశపరచుకొంటాడు.ఆయన ఎవడి విషయంలో, మరణ నిర్ణయం అమలు చేస్తాడో, దానిని (అతడి ఆత్మను) ఆపి ఉంచుతాడు; మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపివేస్తాడు, ఆలోచించే వారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి”. –దివ్య ఖురాన్ 39:42.

13వ శతాబ్ధాపు ముస్లిం విద్వాంసుడు అల్-కుర్థుబి (1214-1273) ప్రకారం నిద్రలో ఆత్మ శరీరంనుంచి వేరుపడి నపుడు  వచ్చే రూపుల(visions)వలన  మంచి  కలలు సంభవిస్తాయని, ఆత్మ శరీరంలోనికి తిరిగి రావటానికి ముందు అనగా స్థిర పడటానికి ముందు  పీడ కలలు సంభవించునని తెలిపినాడు. అనేక మంది ముస్లిం తత్వవేత్తలు కలలగురించి వివిధ సిద్దాంతాలను వివరించినారు. ఇబ్న్-అరబీ (1164-1240) గ్రీక్ తత్వశాస్త్రము, ముస్లిం మతశాస్త్రము  కలసిన మెటాఫిజికల్ పద్దతిని సూచించినాడు.

ఇస్లామిక్ చరిత్రలో గొప్ప కలల సిద్దాంతిగా ఇబ్న్-సిరిన్ (653-728) పేరుగాంచినాడు. ఇతని ప్రకారం కలలు దివ్య ఖురాన్ మరియు హదీసు గ్రంధాలలో ప్రముఖ స్థానములను ఆక్రమించినవి. ఇతడు రచించిన “తఫ్సీరుల్ అల్-కబీర్” (The Great Book of Interpretation of Dreams)  లో కలలపై 59 ఆద్యాయాలు కలవు. ఇతని ప్రకారం కల కు భాష్యం అనునది వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణాలు మరియు అతని జీవన పరిస్థితులపై ఆధార పడి  ఉండును. ఇస్లామిక్ పండితుడు,తత్వ వేత్త ఇబ్న్-ఖల్దున్ ప్రకారం కలలకు వివరణ ఇవ్వడం ఒక శాస్త్రము.  తన ప్రసిద్ధ గ్రంధం మూకద్దిమహ్ (An introduction to History)లో అతడు కలలను మూడు రకాలుగా వర్గీకరణ చేసినాడు. 1. అల్లాహ్ నుంచి వచ్చే కలలు-స్పష్టమైన,దోష రహితమైన అర్థమును,విషయమును కలిగి ఉండును. 2. దైవ దూతల నుంచి వచ్చేకలలు- దృష్టాంతముగా వచ్చునవి-వీటికి వివరణ ఇవ్వ వలసి  ఉంటుంది. 3. సైతాన్ నుంచి వచ్చే కలలు- ఇవి అస్పష్టంగా ,వ్యర్ధముగా ఉండును.
No comments:

Post a Comment