1 April 2014

ప్రపంచాన్ని అబ్బురపరచిన 20 ముస్లిం ఆవిష్కరణలు


       ఆధునిక ప్రపంచ చరిత్రల్లో ముస్లిం యుగoను  ఒక ముఖ్యమైన ఘట్టం గా పేర్కొన వచ్చును.అరబ్బులు మొదటి నుంచి వ్యాపార వేత్తలు. మక్కా ప్రపంచ వాణిజ్య పటం లో కీలకమైన స్థానం లో ఉంది,  క్రీ.స.570 లో మక్కా లో  జరిగిన మహమ్మద్ ప్రవక్త (స) జననం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుత సంఘటన.అది ప్రపంచ గతినే మార్చివేసింధి.  క్రీ.స. 630 నాటికి మక్కా ముస్లింల వశం అయినది. 631 నాటికి సంపూర్ణ అరేబియా ముస్లింల పాదాక్రాంతం అయినది.

8నుంచి 13 శతాబ్ధాల మద్య కాలం లో  ముస్లిం సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా, మద్య ప్రాచ్యం, మద్య ఆసియా,స్పెయిన్ నుంచి చైనా సరిహద్దులవరకు విస్తరించి. ఒక నూతన  ముస్లిం ప్రపంచాన్ని ఏర్పడినది.. అరబ్బీ ముస్లిం సామ్రాజ్య అధికార భాష అయినది. వర్తకము,వాణిజ్యము,దౌత్య సంబంధాలు, విజ్ఞాన శాస్త్రాలు అన్నీ అరబ్బీబాష  లోనే నిర్వహించబడేవి. బైత్-అల్-హిక్మ్ (జ్ఞాన కేంద్రం )  గా బాగ్దాద్ విరాజిల్లినది., డెమాస్కుస్,అలెక్సాండ్రీయ,ఫేజ్,కార్దోభా,పాలేర్మో,బస్రా  ముస్లిం విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లినవి.

           పాశ్చాత్య  పండితుడు విల్ డూరంట్  అబిప్రాయం లో 700-1200 వరకు  ఐదు శతాబ్దాల పాటు శాస్త్ర విజ్ఞానము,టెక్నాలజీ, తత్వశాస్త్రం, సాహిత్యము,సుపరిపాలన,వంటి విషయాలలో ఇస్లాం ప్రపంచాన్నిఎలింది.

సుమారు 500 సంవత్సరాల పాటు ప్రపంచ చరిత్ర లో ముస్లిం యుగం సువర్ణాక్షరాలతో లిఖించబడినది . ఈ కాలంలోనే శాస్త్ర విజ్ఞాన రంగములో అనేక నూతన ఆవిష్కరణలు సాధించబడి శాస్త్ర విజ్ఞానము సామాన్యులకు అందుబాటులోనికి వచ్చినది. నిజ జీవితం లో మనము ఉపయోగించే అనేక వస్తువులను ఉదా: కాఫీ నుంచి చెక్కుల వరకు, మూడు రకాలతో కూడిన భోజనం(సూప్+మాంసం+ఫలం)(Three Course Meal) మొదలగు వాటినన్నింటిని కనుగొన్నఘనత ముస్లింలకు లబించును ఈ కాలంలో ముస్లింలచే ఆవిష్కరించబడి ప్రపంచాన్ని అబ్బురపరచిన కొన్ని ఆవిష్కరణలను పరిశీలిద్దాము.

1.కాఫీ ని కనుగొనుట :
ఖాలిద్ అనే అరబ్ దక్షిణ యుధోపియా లోని  కుఫా ప్రాంతం లో  తన గొర్రెలను మేపుతున్నప్పుడు అవి కొన్ని రకాల బెర్రిలు లాంటి పళ్ళ ను తిన్నతరువాత ఉత్సాహం గా ఉండటం గమనించినాడు. ఆ బెర్రి పళ్లను వేడి నీటి లో బాగా మరిగించినప్పుడు తయారైన ద్రవమే కాఫీ. మెల్లగా కాఫీ గింజలు యుధోపియా నుంచి యెమన్ చేరినవి. అక్కడ వాటిని సూఫీ సన్యాసులు ఎక్కువుగా వాడే వారు..15వ శతాబ్ధ అంతానికి కాఫీ మక్కా,,టర్కీ లగుండా ప్రయాణించి1645 నాటికి  వెనిస్  చేరింది. 1650 లో ఇంగ్లాండ్ రాజధాని లండన్  లోని లొంబర్డ్ వీధిలో మొదటి “కాఫీ హౌస్” ను “పస్కుయ రోసీ” అనే టర్కీ వ్యక్తి ప్రారంబించినాడు. కాఫీ అనే ఇంగ్లిష్ పదం, అరబిక్ లోని కహ్వ,టర్కిష్ లోని  కఃవే,ఇటాలియన్ లోని కఫ్ఫే పదాలనుంచి పుట్టింది.
2. కెమెరాను  కనుగొనుట :
కనుల నుంచి బయటకు ప్రసరించే కిరణాల వలన మనము చూడగలుగు తున్నామని ప్రాచీన గ్రీకులు నమ్మారు. కానీ వెలుతురు కంటి నుండి బయటకు ప్రసరించడం కాదు  కంటిలోనికి ప్రవేశించుట వలన మనము చూడగలుగుతున్నామని శాస్త్రియము గా నిరూపించిన ఘనత 10వ శతాబ్ధాపు గణిత వేత్త,ఖగోళ పరిశోధకుడు, బౌతీక శాస్త్ర వేత్త ఇబ్న్-అల్-హైతమ్ కు దక్కుతుంది. మూసిన కిటికీ రెక్కలలోని చిన్న రంద్రము గుండా కాంతి లోనికి ప్రవేశించుట చూసిన  ఇబ్న్-అల్-హైతమ్ దాని ప్రేరణతో  మొదటి పిన్-హోల్ కెమెరాను తయారు చేసినాడు.  డార్క్ రూమ్ ను (అరబ్బీ పదం కమరా అనగా చీకటి గది అని అర్థం)  తయారు చేసినది కూడా ఇతనే, ఇతని కాలం లోనే బౌతిక శాస్త్రం తాత్విక దృక్పదంనుంచి పరిశోదనా  దృక్పధం వైపునకు మరలింది,
3.చదరంగం:
చదరంగం ను కనుగొనినది మొదట భారతీయులే కానీ దానిని ప్రస్తుత రూపం లో అబివృద్ధి చేసినది పర్షియా లో. ఆతరువాత మూర్ల(moors) ద్వారా స్పెయిన్ కు అక్కడనుండి జపాన్ వరకు వ్యాపించినది. రూక్ అనే పదం ఫార్శి పదం రూఖ్ నుంచి అనగా రధం నుంచి ఆవిర్భవించినది.
4. ఎగిరే యంత్రం-విమాన ఆవిష్కారం
రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయటానికి వేయి సంవత్సరాల పూర్వం, ముస్లిం కవి, ఖగోళ వేత్త,సంగీతకారుడు మరియు ఇంజనీర్ ఐనా అబ్బాస్-ఇబ్న్-ఫిర్నాస్ ఎగిరే యంత్రాన్ని కనుగొనటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. 852 అతను వదులైన గుడ్డ తో చేయబడిన చెక్కను కట్టుకొని కర్దోబా పెద్దమసీదు మినారు నుండి క్రిందకు దూకినాడు. పక్షి వలే ప్రయాణించాలనుకొన్నాడు. కానీ ప్రయత్నం సఫలం కాలేదు. క్రిందకు దూకినప్పుడు వదులైన గుడ్డ పారాచూట్ లాగా పనిచేసినది స్వల్ప దెబ్బలతో బయటపడినాడు.875 లో 70 ఏళ్ల వయస్సులో సిల్క్ వస్త్రాలలతో కూడిన మెషీన్ ,పక్షి ఈకలు కట్టుకొని కొండ నుంచి క్రిందకు దూకినాడు. 10 నిమిషాల పాటు కొంతదూరం గాలిలో ప్రయాణించి  క్రింద పడినాడు. తను వాడిన మెషీన్ కు తోక లేనందువలన పడటం జరిగిందని నిర్ధారించాడు.  ప్రస్తుత బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నకు  చంద్రునిలోని ఒక బిలం (crater) నకు అతని గౌరవార్ధం అతని పేరు పెట్టడం జరిగింది.    

5.సోప్ (సబ్బు)/షాంపూ లను  తయారుచేయుట :

వజూ చేయుట, స్నానము చేయుట ముస్లిం లకు తప్పనిసరి.అరబ్బులు విజిటబుల్ అయిల్.సోడియం హైడ్రాక్సైడ్ మరియు సుగంధభరిత నూనెలను కలిపి సబ్బు/షాంపూ తయారు చేసేవారు. యూరప్ వాసులకు స్నానం చేయుట తెలియదు. క్రూసేడ్లు జరిగిన కాలంలో క్రైస్తవులు,  ముస్లింలనుండి సబ్బు/షాంపూ చేయటం నేర్చుకొన్నారు. ఇంగ్లాండ్ కు షాంపూను పరిచయం చేసింది ఒక ముస్లిం. అతను “మహమూద్ ఇండియన్ వాపర్ బాత్స్” అనే పేరుతో 1759 లో బ్రైటన్ సముద్రతీరంలో షాప్ ప్రారంభం చేసినాడు . అతను king జార్జ్ IV,మరియు కింగ్ విలియం IV  కు షాంపూ సర్జన్ గా నియమింప బడినాడు.  

6.ఆధునిక రసాయనిక శాస్త్రం
ఆధునిక రసాయన శాస్త్ర పితామహునిగా పిలవబడే జాబిర్-ఇబ్న్ –హయ్యన్ క్రీస్తు శకం 800 లో ద్రవాలను వేరుచేయు డిస్టిలేషన్ ప్రక్రియను కనుగొన్నాడు. ఆధునిక రసాయనిక ప్రయోగ శాలలలో వాడే అనేక పరికరాలను,సల్ఫురిక్,నైట్రిక్ ఆసిడ్ లను కనుగొన్నాడు. రోజ్ వాటర్, ఇతర సుగంధ ద్రవాలను కనుగొన్నాడు. 
 7.మెకానికల్ యంత్రాల ఆవిష్కరణ.
అల్-జజరి అనే పేరుగల ముస్లిం ఇంజనీర్ ఇరిగేషన్ కు అవసరమైన నీటిని తోడి పోసే యంత్రాన్ని కనుగొన్నాడు. 1206 అతను మెకానికల్ యంత్రాలపైనా రాసిన పుస్తకం లో  అనేక మెకానికల్ యంత్రాల  గురించిన వివరాలు కలవు. వాల్వులు,పిస్టన్స్,మెకానికల్ క్లాక్స్, కాంబినేషన్ లాక్ ను కనుగొన్నాడు. రోబోటిక్స్ పితామహునిగా పేరుగాంచినాడు.
 8.క్విల్ట్ ల (బొంతల ) తయారీ.
క్విల్ట్ లను తెలుగులో బొంతలు అని పిలిచేదరు. రెండు దుప్పట్ల మద్య దూది లేదా పాత గుడ్డలను (insulating material) ఉంచి కుడతారు, క్రూసేడ్ యుద్ధాలలో ముస్లిం సైనికులు వీటిని శరీరానికి కవచా లుగా వాడేవారు. క్రైస్తవులు బరువుతో కూడిన ఇనప కవచాలు వాడేవారు. క్రైస్తవులు తక్కువ బరువు తో ఎక్కువ రక్షణ ఇచ్చే క్విల్ట్ ల తయారిని ముస్లింల వద్ద నెర్చుకొని బ్రిటన్,హాలెండ్ లోని చలి వాతావరణాన్ని ఎదుర్కోవటానికి వాడేవారు.

9. ఆర్చిటెక్చర్
యూరోపియన్ లు తమ గోతిక్ చర్చల నిర్మాణం లో ఉపయోగించిన పాయింటెడ్ ఆర్చ్ ముస్లింఆర్కిటెక్చర్ నుండి గ్రహించినారు. అదేవిధంగా రిబ్బెడ్ వాల్టింగ్,రోజ్ విండోస్, డోమ్ బిల్డింగ్ నిర్మాణాలను ముస్లింలనుండి గ్రహించారు. యూరోపియన్ కాజీల్ లు ముస్లిం నిర్మాణాలను అనుకరించినవి, 5వ హెన్రి కాజీల్ ను ఆర్కిటెక్ట్ చేసినది ఒక ముస్లిం.

10.సర్జికల్ పనిముట్ల తయారీ.
ఆధునిక కాలంలో సర్జరీ లో ఉపయోగించే అనేక పరికరాలను అనగా స్కాల్పెల్,బోన్ సాస్,ఫోర్సెప్స్,ఫైన్ సీజర్స్, కంటి సర్జరీ లో ఉపయోగించే పరికరాలను మొదలగు దాదాపు 200 పరికరాలను  కనుగొన్నది 10వ శతాబ్ధాపు ముస్లిం సర్జన్ అల్-జఃరవి.  గాయాలకు కుట్లు వేయడానికి,కాప్సూల్ తయారుచేయటానికి  ఉపయోగ పడే నరము తో చేసిన తీగ (catgut) ను కనుగొన్నాడు.బ్లడ్ సర్క్యులేషన్ ను విలియం హార్వే కనుగొనటానికి 300 సంవత్సరాల పూర్వమే  ఇబ్న్ నఫీస్ అనే ముస్లిం వైద్యుడు బ్లడ్ సర్క్యులేషన్ ను కనుగొన్నాడు. అనస్తీషియా, కంటిలోని శుక్లాలను బయటకు తీసే హలో నీడీల్స్ ను కనుగొన్నది ముస్లిం వైద్యులే.

11.గాలిమరలు
యూరప్ లో గాలి మరను ఉపయోగించడానికి 500 సవంత్సరాల పూర్వమే క్రీ.శ. 634 సంవత్సరములో  పర్షియా ఖలీఫా జొన్నలను దంచటానికి, ఇరిగేషన్ కు కావలసిన నీటిని తొడటానికి గాలిమరను కనుగొన్నాడు. పురాతన కాలంలో అరేబియా వాసులు  ఏడారులలో నీటిని తొడటానికి గాలి మరలను వాడేవారు

12.టీకాకరణ(INOCULATION)
జెన్నర్,పాశ్చర్ టీకాలను కనుగొనటానికి 50 సంవత్సరాలకు  పూర్వమే ముస్లింలు టీకాలను వాడేవారు. 1724 లో టర్కీ లోని ఇంగ్లీష్ రాయభారి భార్య టీకా ప్రక్రియను యూరప్ కు పరిచయం చేసింది. టర్కీ లోని పిల్లలను స్మాల్ ఫాక్స్(మశూచికం) వంటి అంటురోగాలనుండి కాపాడటానికి టీకాలు వేసేవారు.
13. ఫౌంటెన్ పెన్
చేతులు,బట్టలకు సిరామరకలు అంటని పెన్ తయారు చేయమన్న  ఈజిప్ట్ సుల్తాన్ కోరిక మేరకు 953 లో ముస్లింలచే పౌంటెన్ పెన్ తయారు చేయబడినది.
14. అంకెలు 
అంకెలను,దశాంస పద్దతిని  మొదట కనుగొన్నది భారతీయులైన వాటిని ప్రపంచానికి పరిచయం చేసింది అరబ్బులే.825 లో  ప్రముఖ ముస్లిం గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మీ మరియు అల్-కిండి తమ రచనలలో అరబిక్ అంకెలను ఉపయోగించినారు. అల్-ఖ్వారిజ్మీ పేర ఆల్జీబ్రా రూపొందినది.అరబ్బు గణిత శాస్త్రవేత్తల రచనలను 300 సంవత్సరాల తరువాత యూరప్ కు ఇటాలియన్ గణిత శాస్త్ర వేత్త ఫిబోనసి పరిచయము  చేసినాడు. ట్రిగొనమెట్రీ,అల్గొరిథ్మ్స్ ముస్లిం లనుండి నేర్చుకొన్నవే. ఆధునిక క్రిప్టో లోజీ ని(cryptology).
కనుగొన్నది అల్-కిండి.
15. త్రీ కోర్స్ మిల్  
9వశతాబ్దం లో ఇరాక్ నుంచి స్పెయిన్ కార్దోబా  కు వచ్చిన అలీ-ఇబ్న్-నఫీ (మారు పేరు బ్లాక్ బర్డ్) మూడు రకాలతో కూడిన భోజనం(సూప్+మాంసం+ఫలం)(Three Course Meal)యూరప్ వాసులకు పరిచయం చేసినాడు. క్రిస్టల్ గ్లాసెస్ ను  కూడా కనుగొన్నాడు.
16. తివాచీలు   
మద్య యుగపు ముస్లింలు తివాచిలను స్వర్గం లోని ఒక భాగం గా పరిగణించేవారు. తివాచిల నేతల లో వారు సాధించిన నైపుణ్యత యూరప్ వాసులను అబ్బుర పరచినది. ఇంగ్లాండ్ మరియు యూరప్ లో అరేబియన్ మరియు పర్షియన్ తివాచిలను ప్రవేశపెట్టినప్పుడు వాటికి విపరీతమైన ఆధరణ లబించినది.
 17. చెక్కులు
ఆధునిక చెక్కులకు మూలం అరబిక్ సాక్ అనగా తీసుకొన్న వస్తువులను   అందచేసినప్పుడు డబ్బు  చెల్లిస్తాను అన్న వ్రాతపూర్వక వాగ్ధానం. ఆ రోజులలో డబ్బుతో ప్రయాణం చేయటం  ప్రమాదం కాబట్టి ఇలా చెక్కు ఇచ్చేవారు. 9 శతాబ్ధం లో ముస్లిం వ్యాపారస్తులు  బాగ్దాద్ లోని తన బ్యాంక్ పేర తీసుకొన్న చెక్కును చైనా లో మార్చుకొనే వారు.
18. భూమి గుండ్రంగా ఉంది అన్నది మొదట ముస్లింలే  
9వ శతాబ్ధం లోనే ముస్లిం పండితులు భూమి గుండ్రం గా ఉన్నది అని గెలీలియో కన్నా 500 సంవత్సరాలకు పూర్వమే అన్నారు.  భూమి చుట్టుకొలతను ఖచ్చితంగా లెక్క వేసి చెప్పినది ముస్లింలే. 1139 లో అల్-ఇద్రీసి అనే ముస్లిం శాస్త్రవేత్త సిసిలి రాజు ఆస్థానం లో ప్రపంచాన్ని చూపే గ్లోబ్ ను ప్రదర్శించాడు.
19. గన్ పౌడర్
గన్ పౌడర్ ను మొదట కనుగొన్నది చైనీయులే దానిని వారు భాణాసంచా తయారీలో వాడేవారు. కానీ గన్ పౌడర్ ను సైనిక అవసరాలకు కనుగొన్నది ముస్లింలే. దీనిని వారు క్రూసేడ్ లలో వాడినారు. 15వ శతాబ్ధం నాటికి ముస్లిం లు రాకెట్,టోర్పెడోలను కూడా  కనుగొన్నారు.
20. విహార స్థలం గా తోట(గార్డెన్)
మద్య యుగం లో యూరప్ లోని ప్రతి ఇంటికి పెరట్లో కూరగాయల మరియు వనమూలికలతో కూడిన  తోట(GARDEN) ఉండేదిది.  కానీ  గార్డెన్ ను అందమైన, ప్రశాంతంగా ధ్యానం చేసుకొనే స్థలంగా మార్చినది ముస్లింలే. 11వ శతాబ్ధంపు ముస్లిం స్పెయిన్ లో అందమైన విహార స్థలం గా రాజు గారి తోట ( రాయల్ గార్డెన్) తయారు అయినది. కార్నషేన్,తూలిప్ మొదలగు పూలను కనుగొని పెంచినది ముస్లిం తోటలలోనే.




No comments:

Post a Comment