24 December 2018

అరబ్బు ప్రజలకు భారతదేశంతో సంబంధాలు


అరబ్బు ప్రజలకు భారతదేశంతో సంబంధాలు ఏర్పడడానికి అనేక చారిత్రక కారణాలున్నాయి. ఆ కాలంలో ఈరాన్ సామ్రాజ్యం అంటే పర్షియన్ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. చాలా బలమైన సామ్రాజ్యం.కొన్ని అరబ్బు భూభాగాలు కూడా అందులో ఉండేవి. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న సింథ్, బలూచిస్తాన్లు కూడా ఈ సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండేవి. దానివల్ల చాలా మంది భారతదేశానికి చెందిన వారు కూడా పర్షియన్ సైన్యాల్లో పనిచేసేవారు. అలా పర్షియన్ సైన్యంలో పనిచేసిన కొందరు తర్వాత పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న అరబ్బు ప్రాంతాల్లో స్థిరపడడం కూడా జరిగింది. ఇలా అక్కడ స్థిరపడిన వారు భారతదేశం నుంచి చేతివృత్తుల ఉత్పత్తులను అరబ్బు భూభాగాలకు తీసుకెళ్లి అక్కడ వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపార కార్యకలాపాలు తర్వాత అరబ్బు, భారత భూభాగాల మధ్య మరింత విస్తరించాయి. ప్రాచీన కాలంలో అరబ్బులు నౌకామార్గంతో కేరళ తీరానికి ఈ వ్యాపారం నిమిత్తం వచ్చేవారు. ఈ రకంగా భారత్-అరబ్ సంబం ధాలు చాలా ప్రాచీనమైనవి.

అరబీలో జుత్ గాను, ఫార్శీలో, టర్కీలో జాట్ గాను వ్యవహరించబడే అజుత్ తెగ అరబ్బు భూభాగాల్లో ప్రాచీన కాలం నుంచి నివసిస్తోంది. ఈ ప్రజలు పంజాబ్, సింథ్, బలూచిస్తాన్ మూల వాసులని కొందరి చరిత్రకారుల అభిప్రాయం. లిసాను అనే అరబ్ గ్రంథంలో ఈ ప్రజల గురించి జుత్ ప్రజలు సింధ్ ప్రాంతానికి చెందిన నల్లని వారు అని ఉన్నది. “జుత్” అనే పదం కూడా భారత దేశంలోని జాట్ పదం నుంచే వచ్చిందని చెబుతారు.జాట్ ప్రజలు భారత దేశ మూలవాసులు. తక్వీముల్ బల్హాన్ పుస్తక రచయిత అబుల్ ఫిదా ఈ ప్రజల గురించి రాస్తూ మా వద్ద బెలూచిస్తాన్ ప్రజలను కూడా జాట్ అనే అంటారు. ఎందుకంటే వారి భాష భారత ప్రజల భాష మాదిరిగా ఉంటుంది”.

 ప్రాచీన కాలంలో అరబ్బు భూభాగాల్లో స్థిరపడిన జాట్ ప్రజలు నిజానికి ముల్తాన్, బెలూచిస్తాన్, దీబల్, మక్రాన్, సింథ్ ప్రాంతాల ప్రజలని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రజలు అరబ్బు భూభాగాలకు ఎలా వెళ్ళారన్నది కూడా ఆసక్తికరమైన కథ. ఇందులో కొందరు పర్షియా సామ్రాజ్యంలోని బస్రా నుంచి అరబ్బు భూభాగాలకు వెళ్ళారు. బస్రా నుంచి అమ్మాన్, బహ్రెయిన్ వరకు తీర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసు కున్నారు. ముఖ్యంగా వీరు పశుపాలకులు.మేకలు, గొర్రెలు, ఒంటెలు పెంచేవారు. సంచార జీవితం గడిపేవారు. కొందరు స్థిరపడి పోయారు. ఇందులో చాలా మంది పర్షియా ప్రభువుల సైన్యంలో పనిచేసేవారు. కాబూల్ ప్రాంతంలోను జాట్ ప్రజలు నివాసాలు ఏర్పరచు కున్నారు. ఇస్లామ్ వచ్చిన తర్వాత ఈ ప్రజల్లో కొందరు ఇస్లామ్ స్వీకరించారు. హజ్రత్ అబూ మూసా అష్కరీ వారిని బస్రా సమీప ప్రాంతాల్లోనే నివసించే వసతి కల్పించారు. బహ్రయిన్ ప్రాంతంలోను జాట్ తెగ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసించేవారు.

ప్రవక్త ముహమ్మద్ (స) కు ముందు నుంచి వారి నివాసాలు ఇక్కడ ఉండేవి. ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లామ్ సందేశ ప్రచారం తర్వాత, హజ్రత్ అబూ బక్ర్ సిద్దీక్ (ర)జి అమ్స్ ఖలీఫాగా ఉన్న ప్రారంభకాలంలో బహ్రెయిన్ పరిసర ప్రాంతాల్లో కల్లోలం తలె త్తింది. అప్పుడు హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (ర) ఈ కల్లోలాన్ని పరిష్క రించడానికి సైన్యంతో అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో అరబ్బులలోని అనేక తెగలతో పాటు జాట్ తెగ ప్రజలు కూడా హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్(ర) సైన్యంతో యుద్ధం చేశారు. జాట్ తెగ 'మాత్రమే కాదు, అప్పట్లో ఇక్కడ సియా బాజా అనే తెగ కూడా ఉండేది. ఈ తెగ కూడా మూలతః భారతదేశానికి చెందినది. సింధ్ ప్రాంతానికి చెందిన తెగగా చరిత్ర కారులు పేర్కొంటారు. జాట్, సియా బాజా తెగల ప్రజలు కూడా బహ్రెయిన్ ప్రాంతంలోని ఇతర అరబ్బు తెగలతో కలిసి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్(ర) సేనల పై యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ఓడి పోయిన చాలా మంది బస్రా వెళ్ళిపో యారు. అక్కడ హజ్రత్ మూసా అష్కరీ (ర) సమక్షంలో ఇస్లామ్ స్వీకరించి ముస్లిములుగా మారారు.

ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో కూడా మక్కా ప్రాంతం లోనూ జుత్ లేదా జాట్ ప్రజలు ఉండే వారని తెలుస్తోంది. ఈ ప్రజల దుస్తులు, శరీరాకృతి స్థానిక అరబ్బు ప్రజలకు విభిన్నంగా ఉండేది. తిర్మిజిలో హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రజి) చెప్పిన మాటల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (స) ఒకరోజు ఇషా నమాజు తర్వాత హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రజి)ను తీసుకుని మక్కా శివార్లకు వెళ్ళారు. అక్కడ కొందరు జాట్ తెగ ప్రజలు వచ్చి వారిని  కలిశారు. అలాగే మదీనా నగరంలో కూడా జాట్ ప్రజలు ఉండేవారు. అందులో ఒక వ్యక్తి ఇస్లాం ప్రారంభకాలంలోనే స్వీకరించాడు. అతను వైద్యుడు. మహాప్రవక్త ముహమ్మద్ (స) సతీమణి హజ్రత్ ఆయేషా (రజి) జబ్బు చేసినప్పుడు ఆయన వైద్యం చేసినట్లు కూడా తెలుస్తోంది.

హిజ్ర శకం 10లో నజ్రాన్ నుంచి బనూ హారిస్ బిన్ కాబ్ తరఫున వచ్చిన ముస్లిం బృందం ప్రవక్త ముహమ్మద్ (స) ను కలుసుకున్నప్పుడు ఆయన వారిని చూసి, వీళ్ళెవరు, భారతీయుల్లా ఉన్నారు అని చెప్పినట్లు హదీసుల్లో తెలుస్తోంది. ఇదంతా ఎందుకంటే,అరబ్బు భూభాగంతో భారతదేశానికి చాలా ప్రాచీన సంబంధాలున్నాయి. జాట్, సియాభాజా తెగల ప్రజలే కాదు ఇంకా భారత మూలాలున్న తెగలు వేరేవి  కూడా ఉండేవి అలాంటి తెగల్లో మైద్ తెగ ఒకటి. ఈ తెగ ప్రజలు కూడా పర్షియన్ సైన్యాల ద్వారా అరబ్బు భూభాగాలకు వచ్చారు. అరబ్బులు వీరిని మొద్ అని పిలవడానికి కారణం ఉంది.

ఈ తెగ సముద్రదొంగల తెగగా అప్పట్లో పేరుపొందింది. అరబ్బుల నౌకలు ముంచి దోచుకునేది. అరబ్బుల వ్యాపారం నౌకామార్గాన జరగడం వీరివల్ల కష్టమయ్యేది. ఈ తెగ ప్రజలు సింధ్ ప్రాంతానికి చెందిన వారిగా భావించబడు తున్నారు. గుజరాత్ లోని కథియావాడ్ ప్రాంతంలో వీరి ప్రాబల్యం ఎక్కువ. ధార్మికంగా వీరు బౌద్దులని కూడా తెలుస్తోంది. సింధ్ నుంచి ముల్తాన్ వరకు వీరు విస్తరించి ఉండేవారు. సింథ్, గుజరాత్లోని కథియావాడ్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ ప్రజలు ఎక్కువగా ఉండేవారని తెలుస్తోంది. హిజ్ర శకం మొదటి శతాబ్దంలో శ్రీలంక నుంచి వస్తున్న ముస్లిముల నౌకను వీరు అడ్డుకుని దోచుకున్నారు.

దబీల్ ప్రాంతంలో  ఈ దోపిడి జరిగింది. ఈనౌకలో ముస్లిం మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. శ్రీలంక రాజు వారిని చాలా గౌరవ మర్యాదలతో అరబ్బు ప్రాంతాలకు పంపాలని అనుకున్నాడు. కాని మార్గమధ్యంలో ఈ దోపిడి జరిగింది. సుదీర్ఘకాలం వరకు మైద్ తెగ ప్రజలు తీరప్రాంతాల సమీపంలో నివసించేవారు. హిజ్ర శకం మూడవ శతాబ్దంలో సంజాన పాలకులు ఈ సముద్ర దొంగలను ఈప్రాంతాల నుంచి పారద్రోలారు. ఈ తెగ గురించి అరబ్బులకు బాగా తెలుసు

అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నసయాబాజా తెగ ప్రజలు నౌకలకు రక్షణ కల్పించే యోధులుగా పని చేసే వారు.ముఖ్యంగా సముద్ర దొంగల నుంచి రక్షణ కల్పించే దళాల్లో ఉండేవారు. సింధ్,హింద్ ప్రాంతాలకు చెందిన బలిషులైన,ధైర్యసాహసాలు కలిగిన తెగగా ఈ ప్రజలను లిసానుల్ అరబ్ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. లిసాను గ్రంథం లో వీరు నౌక యజమానితో పాటు ఉండి, రక్షణ కల్పించే విధులు నిర్వర్తించే వారని రాశారు. లిసాను అరబ్ గ్రంథం ప్రకారం అక్కడ ఖజానా రక్షణకు, జైళ్ళలో భద్రతా సిబ్బందిగాను సియాబాజ తెగనే నియమించారు. ఈ ప్రజలు కూడా ప్రవక్త ముహమ్మద్ (స) కన్నా చాలా కాలం ముందు నుంచే అరబ్బు భూభాగాల్లో స్థిరపడిన ప్రజలు.

ఇలాంటి మరి కొన్ని తెగలున్నాయి. అహామిరా తెగ కూడా సింధ్ ప్రాంతంనుంచి వచ్చిందిగానే భావిస్తారు. ఈ తెగ ప్రజలు ఎర్రగా ఉండడం వల్ల వారికి ఆ పేరు వచ్చింది. అలాగే అసావిరా తెగ ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉండే వారు. ఈ తెగ ప్రజలు చాలా ప్రాబల్యం కలిగిన వారు. పర్షియన్ సామ్రాజ్య చక్రవర్తి పేరుతో ఈ తెగ పెద్దలే రాజ్యం చేసేవారు. ఈ ప్రజలు పర్షియన్లకు సన్నిహితంగా ఉండడం వల్ల ఇతర అరబ్బులతో కలిసేవారు కాదు. అసావిరా అనే పదం అశ్వికుడు అన్న అర్దం నుంచి వచ్చింది. ప్రాచీన కాలంలో భారత మూల వాసులు అనేకమంది అరబ్బు భూభా గాల్లో స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారని చరిత్ర వల్ల తెలుస్తోంది.

No comments:

Post a Comment