నిజాంల కింద పనిచేసి, హైదరాబాద్ వాసులలో అపారమైన ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ సైనిక అధికారి మైఖేల్
జోచిమ్ మేరీ రేమండ్ వారసత్వానికి రేమండ్ సమాధి ఒక స్మారకంగా నిలుస్తూ, ఫ్రాన్స్ మరియు హైదరాబాద్ మధ్య ఉన్న సుదీర్ఘ చారిత్రక మరియు సాంస్కృతిక
సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలోని
సికింద్రాబాద్‌లో ఉన్న రేమండ్ సమాధి, అపారమైన చారిత్రక మరియు
సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఒక స్మారక చిహ్నం.రేమండ్ సమాధి, హైదరాబాద్ రెండవ నిజాం అయిన నిజాం అలీ ఖాన్, ఆసఫ్ జా II కింద పనిచేసిన ఫ్రెంచ్ సైనికాధికారి మైఖేల్ జోచిమ్ మేరీ రేమండ్ జ్ఞాపకార్థం
నిర్మించబడింది.
18వ శతాబ్దం చివరలో హైదరాబాద్‌కు వచ్చిన ఫ్రెంచ్ సైనిక అధికారి మైఖేల్ జోచిమ్
మేరీ రేమండ్, తన సైనిక నైపుణ్యం, క్రమశిక్షణతో నిజాం అలీ ఖాన్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. సైనిక నైపుణ్యం
మరియు వ్యూహాత్మక తెలివితేటలకు పేరుగాంచిన రేమండ్, తక్కువ కాలంలోనే ఉన్నత
స్థాయికి ఎదిగి నిజాంకు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. 1768లో నిజాంతో చేతులు కలిపిన రేమండ్, నిజాం కు ఆధునిక సైన్యాన్ని తయారు చేసి శిక్షణ ఇవ్వడంలో సహాయపడ్డారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన ప్రభావాన్ని
విస్తరిస్తున్న సమయంలో దక్కన్‌లో ఈ సైన్యం ఒక శక్తివంతమైన దళంగా ఆవిర్భవించింది.
రేమండ్ 1798లో, 43 ఏళ్ల వయసులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ప్రస్తుతం మలక్‌పేట్‌గా
పిలవబడే ప్రాంతంలోని ఒక చిన్న కొండపై రేమండ్ ను ఖననం చేశారు. అక్కడే రేమండ్ తన
సైనికులకు, విలుకాళ్లకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత రేమండ్ సమాధిపై 23 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నిర్మించారు. దీనితోనే ప్రస్తుతం రేమండ్ సమాధిగా
పిలవబడే స్మారక చిహ్నం ఏర్పడింది.నిజాం సైన్యానికి రేమండ్ అందించిన సేవలు ఎంతగానో
ప్రశంసించబడ్డాయి; అందుకే వివిధ మతాలకు చెందిన స్థానిక ప్రజలు రేమండ్ ని ఎంతో గౌరవించేవారు.
కాలక్రమేణా శిదిలమై దెబ్బతిన్న చారిత్రాత్మక
రేమండ్ సమాధిని, పరిరక్షించడం మరియు భారత-ఫ్రెంచ్
దేశాల మద్య మధ్య సాంస్కృతిక సంబంధాలను
మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా, బ్యూరో డి ఫ్రాన్స్, హైదరాబాద్ నుండి రూ.14 లక్షల ఆర్థిక సహాయంతో రేమండ్ సమాధిని పునరుద్ధరించనున్నారు.
పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఫ్రెంచ్ ప్రతినిధి
బృందం, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహిస్తామని తెలంగాణ
వారసత్వ శాఖ డైరెక్టర్ తెలిపారు.
No comments:
Post a Comment