29 April 2023

భారత దేశం లో మే డేను ప్రారంభించిన మద్రాసు కార్మిక నాయకుడు మలయపురం సింగారవేలు చెట్టియార్ The man from madras Malayapuram Singaravelu Chettiar -ATrade Unionist who initiated May Day

 

M. Singaravelar. ఎం సింగారవేలార్

ఎం. సింగరవేలు లేదా సింగరవేలర్ అని పిలువబడే మలయపురం సింగారవేలు చెట్టియార్ (1860-1946)  భారతదేశంలో ప్రముఖ కార్మిక నాయకుడు మరియు  మార్గదర్శకుడు. ఉపఖండపు తొలితరం కమ్యూనిస్టు (భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు), న్యాయవాది, వ్యాపారవేత్త, కార్మిక నాయకుడు, సామాజిక న్యాయ ఉద్యమ సారథి, బౌద్ధునిగా దక్షిణ భారత ముఖ్యంగా తమిళ సామాజిక యవనికను స్ఫూర్తిదాయకంగా ప్రభావితం చేసిన చరిత్ర నిర్మాత సింగారవేలు.

భారత ఉపఖండంలో తొలిసారిగా 1923 మే నెల మొదటి రోజున మద్రాస్‌లో అరుణ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ కార్మిక లోకంతో పాటు భారత కార్మిక శక్తి పిడికిలి బిగించి నినదించిన ఆ రోజుకు ఈ మేడేతో నూరేళ్లు పూర్తవుతాయి. శతాబ్దం క్రితం జరిగిన ఆ చరిత్రాత్మక ఆరంభానికి కర్త, క్రియ మలయపురం సింగారవేలర్.

సింగారవేలు చెట్టియార్‌గా కూడా సుప్రసిద్ధుడైన మలయపురం సింగారవేలర్ ఆధునిక భారతదేశ తొలి దళిత సిద్ధాంతకర్త, భాషావేత్త, సిద్ధ వైద్య నిపుణుడు అయిన అయోతి దాస్, రష్యన్ విప్లవం, పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమంతో ఉత్తేజితుడైన సింగారవేలు స్వాతంత్ర్య, కార్మికోద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. ఒక పరిపూర్ణ ఉద్యమకారుడిగా, పలు రంగాల నిష్ణాతుడిగా ప్రజా జీవనంపై ఆయన తనదైన ముద్ర వేశారు.

అయోతి దాస్ కులపీడన సమస్యకు బౌద్ధ దమ్మ స్వీకారమే పరిష్కార మార్గమని భావించి సిలోన్ మహాబోధి సంఘం మాదిరిగా మద్రాస్‌లో శాక్య బౌద్ధ సంఘాన్ని సింగారవేలు స్థాపించారు. అంటరానితనం కు వ్యతిరేకంగా బౌద్ధమతాన్ని స్వీకరించిన సింగరవేలర్ ఒక సంఘ సంస్కర్త. 1902లో ఒక బౌద్ధ సదస్సులో పాల్గొనడానికి లండన్ వెళ్లి అక్కడ మార్క్స్ రచనలను చదివి సామ్యవాద సిద్ధాంతం పట్ల ఆకర్షితుడయ్యారు. 

భారతదేశంలోని మద్రాసులో అధికారికంగా స్థాపించబడిన మొట్టమొదటి ట్రేడ్ యూనియన్లతో సింగరవేలర్ సంబంధం కలిగి ఉన్నాడు. మే 1, 1923, సింగరవేలర్ భారత దేశంలో మొట్టమొదటిసారిగా “మేడే” వేడుకను నిర్వహించాడు. 

సింగరవేలర్ మొదట్లో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ నాయకత్వంలో పనిచేసాడు కానీ, తరువాత, కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. 1925లో, సింగరవేలర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహులలో ఒకడు అయ్యాడు మరియు కాన్పూర్‌లో దాని ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించాడు.

బ్రిటీష్ ప్రభుత్వం సింగరవేలర్ ను ఇతర నాయకులతో పాటు క్రౌన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అరెస్టు చేసినప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే విడుదల చేయబడినాడు. 

మద్రాసు ప్రెసిడెన్సీలో వెనుకబడిన కులాలకు సమాన హక్కుల కోసం పోరాడిన ఆత్మగౌరవ ఉద్యమంలో కూడా సింగరవేలర్ ముందున్నారు. సింగరవేలర్ తరువాతి సంవత్సరాలలో, క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగాడు, కానీ సింగరవేలర్ 85 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు తను నమ్మిన సిద్దాంతాల పట్ల నిభద్దత వాదిగా ఉన్నాడు.

సింగరవేలు చెట్టియార్ మద్రాసులో వెంకటాచలం చెట్టి మరియు వల్లియమ్మాళ్ దంపతుల మూడవ కుమారుడిగా సంపన్న కుటుంబంలో జన్మించారు. సింగరవేలు 1881లో మెట్రిక్యులేట్ చేసి మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఎఫ్.ఎ. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకున్నాడు. తర్వాత మద్రాసు లా కాలేజీలో చేరి బి.ఎల్. 1907లో డిగ్రీ. ఆ తర్వాత మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు.

1889లో సింగరవేలర్ తన కులానికి చెందని అంగమ్మాళ్‌ను వివాహం చేసుకున్నాడు. వారి ఏకైక కుమార్తె కమల. సింగరవేలర్ మేనకోడలు సీత, ఫిలిప్ స్ప్రాట్ అనే కమ్యూనిస్ట్ పాత్రికేయుడిని 1939లో వివాహం చేసుకున్నారు. సింగరవేలర్ న్యాయవాదిగా విజయం సాధించారు; తక్కువ వ్యవధిలో, అతను మద్రాసు మరియు దాని శివారు ప్రాంతాల్లో ఆస్తిపరుడు అయ్యాడు.

19వ శతాబ్దం చివరి అంకంలోనే మన దేశంలో కార్మికోద్యమాలకు బీజం పడింది. నిర్దిష్ట నిబంధనలతో, పటిష్ఠ ప్రణాళికతో తొలి కార్మిక సంఘాలను స్థాపించిన ఘనత సింగారవేలుదే. ఏప్రిల్ 27, 1918న మద్రాసులోని బకింగ్ హామ్ కర్నాటిక్ టెక్స్టైల్ మిల్లు (వస్త్ర పరిశ్రమ) కార్మికులను కూడగట్టి మద్రాస్ లేబర్ యూనియన్పేరుతో తొలి ట్రేడ్ యూనియన్‌ను సింగారవేలు స్థాపించారు.

భారతదేశంలోని శ్రామిక వర్గ ఉద్యమ చరిత్రలో మద్రాస్ ప్రముఖపాత్ర వహించినది. రష్యా విప్లవం జరిగిన ఆరు నెలల్లోనే భారతదేశంలో మొట్టమొదటి అధికారిక ట్రేడ్ యూనియన్, మద్రాస్ లేబర్ యూనియన్, జి. సెల్వ పతి చెట్టి మరియు తిరు వి కా (వి. కళ్యాణ¬సుందరం), సింగరవేలర్ మరియు ఇతర ఉద్యమకారులచే ఏర్పాటు చేయబడినది.

ఆతర్వాత M.S.M వర్కర్స్ యూనియన్, ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్, ట్రామ్‌వే వర్కర్స్ యూనియన్, పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్, ప్రింటింగ్ వర్కర్స్ యూనియన్, అల్యూమినియం వర్కర్స్ యూనియన్, రైల్వే ఎంప్లాయీస్ యూనియన్, కోయంబత్తూర్ వీవర్స్ యూనియన్ మరియు మధురై వీవర్స్ యూనియన్ వంటి సంఘాలు స్థాపించబడినవి,.

 ప్రారంభం నుండి, మద్రాస్‌లోని ట్రేడ్ యూనియన్స్ మేనేజ్‌మెంట్‌లతో ఘర్షణలకు దిగారు. బకింగ్‌హామ్ & కర్నాటిక్ మిల్స్ కార్మికుల సమ్మె ఒక దీనికి ఒక ఉదాహరణ. బకింగ్ హామ్ మిల్లు కార్మికులు తమ హక్కులకై సింగారవేలు నాయకత్వంలో ఉద్యమించారు.  మిల్లుల యాజమాన్యం కార్మికుల కలిపే హక్కును right to combine కూడా ఒప్పుకోలేదు. యూనియన్‌ను బ్రిటిష్ అధికారులు నిషేధించారు.

యూనియన్ నాయకులు జూన్ 21, 1921 న సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె చేసేవారి స్థానాలలో యాజమాన్యం 'నిమ్న' కులాల నుండి కార్మికులను నియమించడం ద్వారా కుల యుద్ధాన్ని ప్రేరేపింఛి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సమ్మె రెండు వర్గాల మధ్య కుల ఘర్షణగా మారింది. ఆగష్టు 29, 1921న పెరంబూర్‌లోని మిల్స్ ప్రాంగణంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. వారి అంత్యక్రియల ఊరేగింపు బయటకు వెళ్లినప్పుడు, కొందరు దుర్మార్గులు రాళ్లు రువ్వారు, ఇది మరో కుల హింసకు దారితీసింది. సెప్టెంబరు 19 మరియు అక్టోబరు 21న మరో రెండు కాల్పులు జరిగాయి. ఆరు నెలల తర్వాత, సమ్మె ముగిసింది, దాని లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు.

1920 సెప్టెంబరులో గాంధీ తన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, సింగరవేలర్, గాంధీ నాయకత్వాన్ని అంగీకరించి మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావవంతమైన నాయకులలో ఒకడు అయ్యాడు. బ్రిటీష్ కోర్టులను బహిష్కరించినందుకు చిహ్నంగా 1921 మేలో జరిగిన బహిరంగ సభలో సింగరవేలర్ తన లాయర్ గౌనుకు నిప్పంటించాడు. తన చర్యను వివరిస్తూ మహాత్మా గాంధీకి లేఖ రాశారు. నేను ఈ రోజు లాయర్ వృత్తిని వదులుకున్నాను. మీరు ఈ దేశ ప్రజల కోసం పాటుపడుతున్నప్పుడు నేను మిమ్మల్లి అనుసరిస్తాను.

వేల్స్ యువరాజు మరియు అతని భార్య భారతదేశాన్ని సందర్శించడం ఆ కాలంలోని ముఖ్యమైన సంఘటన. వారు మద్రాసుకు వచ్చినప్పుడు, సింగరవేలర్ హర్తాల్ ద్వారా పర్యటనను బహిష్కరించారు, మద్రాస్ పట్టణo  మూసివేయబడినది. గాంధీ ఫిబ్రవరి 9, 1922 నాటి యంగ్ ఇండియాలో ఒక వ్యాసంలో హర్తాళ్‌ను విమర్శించారు.

భారతదేశంలో ఏ శ్రామిక వర్గ ఉద్యమమైనా నిలదొక్కుకోవాలంటే రాజకీయ మద్దతు అవసరమని సింగరవేలర్‌కు నమ్మకం ఏర్పడింది. 1922 సెప్టెంబరులో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ కార్మిక పోరాటాన్ని చేపట్టాలని అన్నారు.

1922 సెప్టెంబర్‌లో మద్రాస్ కాంగ్రెస్ కమిటీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కార్మికులకు కాంగ్రెస్ అండగా నిలువవలసిన అవసరం గురించి సింగారవేలు విశదీకరించారు. గయలో కాంగ్రెస్ జాతీయ మహాసభలో కార్మికుల పోరాటం జాతీయ ఉద్యమంలో భాగం కావాలని సింగారవేలు ప్రతిపాదించారు. కార్మికులంతా సంఘటితమై దోపిడీకి వ్యతిరేకంగా, వనరుల సమాన పంపిణీకై పోరాడవలసిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్ వైఖరిలో నిబద్ధత కరువైనదని భావించిన సింగారవేలు 1923 మే ఒకటవ తేదీన స్వంతంగా లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్ను స్థాపించారు.

సిoగరవేలర్ మే డేను రెండు చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మద్రాసు హైకోర్టు ఎదురుగా ఉన్న బీచ్‌లో ఒక సమావేశం జరిగింది; మరొకటి ట్రిప్లికేన్ బీచ్‌లో జరిగింది.

భారత ఉపఖండం లోని భూభాగంపై ప్రప్రథమంగా ఎర్ర జెండాను ఎగురవేశారు. ఆ రోజున మద్రాస్ హైకోర్టు ఎదురుగా సముద్రతీరంలో, అలాగే ట్రిప్లికేన్ బీచ్‌లో అరుణ పతాకాన్ని వందలాది ప్రజల సమక్షంలో ఎగురవేసి సింగారవేలు చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం చింతాద్రిపేట్‌లోనున్న నేపియర్ పార్క్‌లో కూడా ఆ రోజున ఆయన ఎర్ర జెండాను ఆవిష్కరించినట్టు తెలుస్తోంది.

1925లో కాన్పూర్‌లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభకు సింగారవేలు అధ్యక్షత వహించారు. ఆ సభలోనే మేడేను సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డాంగే, ఘాటే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్తా మొదలైన నాయకులు ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకు అధ్యక్షత వహించమని సింగారవేలును వారే కోరడం కార్మిక వర్గ శ్రేయస్సు పట్ల ఆయనకు గల అంకితభావానికి నిదర్శనం.

కమ్యూనిస్టు పార్టీలో కొంత కాలం పనిచేసిన సింగారవేలు, పెరియార్‌కు సన్నిహితుడై ఆత్మ గౌరవ ఉద్యమంలో పాల్గొన్నాడు. లేబర్ అండ్ కిసాన్ గెజెట్, తొజిలాలమ్ (శ్రామికుడు) లాంటి పత్రికలను ఆయన నడిపారు. శాస్త్ర విజ్ఞాన విషయాలపై రచనలు చేస్తూ, కార్మిక పోరాటాలకు తన వంతు సహాయం చేస్తూ సింగారవేలు ఫిబ్రవరి 1946లో మరణించారు.

ది హిందూ పత్రిక నివేదించింది, “లేబర్ కిసాన్ పార్టీ మద్రాసులో మే డే వేడుకలను నిర్వహించినది.. సభకు కామ్రేడ్ సింగరవేలర్ అధ్యక్షత వహించారు. మేడేను ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని తీర్మానం చేశారు. పార్టీ అధ్యక్షుడు గా సింగరవేలర్ పార్టీ సూత్రాలను వివరించారు. స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రపంచ కార్మికులు ఏకం కావాలని ఉద్ఘాటించారు”.

 .


No comments:

Post a Comment