5 May 2014

ఎడారి సింహం ఒమర్ ముఖ్తార్(1858-1931)

ఒమర్ ముఖ్తార్  లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. నీఫా తెగకు చెందిన సున్నీముస్లిం ఐనా ఒమర్ ముఖ్తార్ 1858 సంవత్సరంలో పాత ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ట్రిపోలియన్ రాజ్యభాగంలో సైరెనైకా నగరం దగ్గర జాన్ జౌర్ గ్రామంలో జన్మించాడు.ఇతని తొలిచదువు స్థానిక మసీదులోమరియు  జఘ్ బుబ్ లోని సెనుస్సీ విశ్వవిద్యాలయంలో సాగింది. ఆ తరువాత ఒమర్ ముఖ్తార్ ఖురాన్ బొదించే అధ్యాపకునిగా పనిచేశాడు.
తొలుత లిబియా భూభాగం టర్కీ ఒట్టోమాన్ సామ్రజ్యంలో అంతర్భాగంగా ఉండేది. 1911 లో ఇటలీ-టర్కీ మద్య  యుద్దకాలంలో ఇటలి నావికా దళం  లిబియా పై దురాక్రమణ జరిపింది.  ఇటలి కి చెందిన అడ్మిరల్ లూగీ ఫారవెల్లీ నాయకత్వంలోని ఇటలీ నౌకాదళ విభాగం లిబియా పై మూడు రోజులపాటు దాడిజరిగిన తర్వాత, ట్రిపోలిను ఆక్రమించారు. క్రమంగా మొత్తం లిబియా ను ఇటలి కాలనీ గా మార్చారు. ఆక్రమిత ఇటలి సైన్యానికి వ్యతిరేకంగా ఒమర్ ముక్తార్ లిబియా వాసులు జరిపిన సాయుధ తిరుగుబాటుకు ఇతర తిరుగుబాటు నాయకులతో కలసి  నాయకత్వం వహించినాడు. 1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు తూర్పు లిబియా లో ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు జరిపాడు.
వృత్తిరీత్యా ఖురాన్ బోధకుడైనా ఒమర్ ముఖ్తార్, పరిస్థితులదృష్ట్యా విప్లకారునిగా మారాడు. ఒమర్ ముఖ్తార్  ఎడారి యుద్ధరీతుల్లోనూ,గెరిల్లా యుద్ద తంత్రం లోనూ  ప్రావీణ్యం ఉన్నవాడు. స్థానిక భౌగోళిక జ్ఞానం ఉన్నకారణంగా, దాన్ని అసరాగా ఇటలీ బలగాలమీద తిరగబడ్డాడు. గెరిల్లా యుద్ధరీతులు అనుసరించి చిన్న చిన్న తిరుగుబాటు దళాలతో ఇటలి దళాలపై దాడి చేసి అంతలోనే ఎడారి లో మాయమయ్యేవాడు. ఇటలీ సైనిక  స్థావరాలకు,సైనిక దళాలకు, సైన్యము యొక్క  సప్లయి,రవాణా-వార్తా ప్రసారాలకు  తీవ్ర నష్టం కలుగ చేసేవాడు.
లిబియా లో 20సంవత్సరాలుగా ఇటలి సైన్యానికి వ్యతిరేకంగా ఒమర్ ముఖ్తార్ నాయకత్వం లోని లిబియా తిరుగుబాటుదారులు(ముజాహిద్) జరుపుతున్న పోరాటాన్ని అణిచివేయటానికి ఇటలీ నియంత ముస్సోలినీ 1929 లో  జనరల్ గ్రజియానిని లిబియా 6వ గవర్నర్ గా నియమించుతాడు. జనరల్ గ్రజియాని మొత్తం లిబియా ను తన అధీనం లోనికి తీసుకొంటాడు. తిరుగుబాటుదారులను అణిచివేయటానికి మొదటి సారిగా ఏడారులలో టాంక్ లు,విమానాలు వాడబడతాయి.తిరుగు బాటుదారులను క్రూరంగా అణిచివేయాడానికి జనరల్ గ్రజియాని పంటలను విద్వాంసము చేయుట,యుద్దఖైదీలను సంహరించడం, అమాయక ప్రజలను చుట్టూ ముళ్ళ తీగలు వేసిన  క్యాంపులలో(శిబిరాలలో) నిర్బంధించి వారిపై ఆకృత్యాలు చేయడం జరుగుతుంది. ఉత్తర లిబియా నుంచి ఆగ్నేయ లిబియా తీరప్రాంతం చుట్టూ ముళ్ళ కంచేను వేసి విప్లవ కారులకు బయటి సహాయం ముఖ్యం గా ఈజిప్ట్ నుంచి  అందకుండా చేసినాడు విప్లవకారుల సహాయకులు అని అనుమానం ఉన్న వారిపై  అనేకరకాల అకృత్యాలు చేయడం జరుగుతుంది. విప్లవాన్ని క్రూరంగా అణిచివేయాటానికి అన్నిరకాల పద్దతులను జనరల్ గ్రజియాని ఉపయోగించును. సామాన్య ప్రజల,విప్లకారుల మనోధైర్యాలను తీవ్రంగా దెబ్బతీసినాడు. 
ఆహార పదార్ధాల కొరత,తగ్గిపోతున్న విప్లవకారుల సంఖ్య, తగ్గుతున్న ఆయుధాల సరఫరా, ఆంతరంగిక రహస్యాలు బయటకు చేరడం మొదలగు కారణాలతో చివరకు 11 సెప్టెంబరు 1931 స్లోంటా యుద్ధంలో గాయపడినపుడు, ఒమర్ ఇటలీ సైన్యానికి పట్టుబడ్డాడు. మూడు రోజుల పిదప, విచారణ అనంతరం "బహిరంగం ఉరి" శిక్ష విధింపబడి అమలుపరచబడినది. ఆఖరి కోరిక అడినపుడు, ఖురాన్ లోని "ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్" (అందరం దేవునికి చెందినవారమే, అందరం అక్కడికే పోతాం) అని బదులిచ్చాడు.
ఇటలి కాలనీ గా మగ్గబడిన లిబియా రెండోవ ప్రపంచయుద్దం లో ఇటలి పరాజయం అనంతరం 1943 లో మిత్రపక్షాల ఆధీనం లోనికి వచ్చింది. చివరకు 1951,డిసెంబర్ 21వ తేదీన స్వాతంత్రాన్ని పొందినది.  
ఒమర్ ముఖ్తర్ పేరు అరబ్ లోని అన్నీ దేశాలలో విప్లవ శక్తులకు ప్రతీకగా గుర్తించబడినాడు. లిబియా దేశపు పది దినార్ల కరెన్సీ పై ఒమర్ ముఖ్తార్ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఉన్నాడు1961 లో అతని పేర ఒమర్-అల్-ముఖ్తార్ విశ్వవిద్యాలయము స్థాపించ బడినది.  అంథోని క్వీన్ ఒమర్ ముఖ్తార్ గా  నటించిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన “ఒమర్ ముఖ్తార్ ది లయన్ ఆఫ్ డిసర్ట్" (ఎడారి సింహం) సినిమాలో ఒమర్ ముఖ్తార్ జీవితం లోని చివరి సంవత్సరాలు చూపబడినది. అనేక అరబ్ దేశాలలోని ఉదా; గాజా,కైరో,దోహా  నగరాలలోని  వీధులు అతని పేర నామకరణం చేయబడినవి. 2009 సంవత్సరంలో లిబియా అధ్యక్షుడు ముయమూర్ గద్దాఫీ రోమ్ నగర పర్యటనలో ఒమర్ ముఖ్తార్ పట్టుబడిన నాటి ఫోటోని తన ఛాతీపైన ధరించాడు. ఆనాటి పర్యటనలో ఒమర్ పెద్దకుమారుడు కూడా గద్దాఫీ తోడుగా ఉన్నాడు.  దాదాపు ప్రపంచంలోని అనేక దేశాలలో ఆక్రమిత శక్తులకు వ్యతిరేకంగా స్వదేశీయులు జరిపే  తిరుగుబాటులకు అతను ప్రేరణ అయినాడు. 

No comments:

Post a Comment