2 November 2015

హలాల్ మ్యూజిక్ (ఇస్లామిక్ మ్యూజిక్)






నేడు ప్రపంచవ్యాప్తంగా తరచూ వినిపిస్తున్న పదం హలాల్. హలాల్ అను పదం అరబిక్ మూలాలను కలిగి ఉంది. హలాల్ అనగా ధర్మ బద్ధం లేదా చట్ట బద్ధం అని అర్ధం. హలాల్ పదమునకు వ్యతిరేక పదం హరాం అనగా నిషేదించబడినది అని అర్ధం. ఇస్లామిక్ షరియా ప్రకారం హారం వస్తువులను లేదా హారం చేయబడినదానిని ముస్లిం లు స్వికరించరాదు.
ఒకప్పుడు  హలాల్ అను పదం కేవలం ఆహరం, మాంస పదార్ధలకే పరిమితమైనది.కాని నేడు హలాల్ అనే పదానికి విస్తృత అర్ధం ఉంది. జీవితం లోని అన్ని రంగాలలో దీనిని ఉపయోగిస్తున్నారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ముస్లింలు వ్యాపార, ఉద్యోగ, ఇమ్మిగ్రషన్ ద్వారా పాశ్చ్యాత్య దేశాలలో స్థిరపడినారు. స్వతహాగా ముస్లింలు సాంప్రదాయక వాదులు. వీరి పిల్లలు వారు స్థిరపడిన అమెరికా యూరప్ లాంటి పాశ్చాత్య  దేశాలలోనే పెరిగి పెద్దవుతున్నారు. ఇలా పెరిగిన ముస్లిం యువత పాశ్చ్యాత సంస్కృతి పట్ల సహజం గానే ఆకర్షిక్తులవుతున్నారు.అయితే వారిలో మత,సాంస్కృతిక మూలాలు పూర్తిగా పోలేదు దీనితో   ప్రాచ్య దేశాల మూలాలను కలిగి పశ్చిమ దేశాలలో పుట్టి పెరుగుతున్న ఆధునిక పాశ్చాత్య ముస్లిం యువకులు ఆధునికతో పాటు ఇస్లామిక్ సంప్రదాయాలను, మూలాలను కూడా కోరుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వారికి  హలాల్ అనగా ధర్మబద్దమైన వాటిని  అందించవలసిన ఆవశ్యకత ఉంది.ఈ సందర్భంగా ఇస్లామిక్ యువతను ప్రధానం గా ఆకర్షించే ఇస్లామిక్ లేదా హలాల్ మ్యూజిక్ గురించి తెలుసుకొందాము.
హలాల్ మ్యూజిక్ (ఇస్లామిక్ మ్యూజిక్)

ప్రాచ్య దేశాల మూలాలను కలిగి పశ్చిమ దేశాలలో పుట్టి పెరుగుతున్న ఆధునిక పాశ్చాత్య ముస్లిం యువకులు ఒక వైపు పాశ్చాత్య సంగీతాన్ని ఆస్వాదిస్తూనే దానితో తో పాటు  అసబ్యత,శృంగారం, హింస కు,పెద్ద పెద్ద ధ్వనులకు  తావు  లేని, ఇస్లామిక్ విశ్వాసాలను పెంచే  హలాల్ (దర్మబద్దమైన)మ్యూజిక్ (సంగీతాన్ని) కూడాఇష్ట పడుతున్నారు. ఈ ప్రయత్నం లో భాగం గానే 10 సంవత్సరాల క్రిందట పాశ్చ్యాత్య ప్రపంచం లో ఇస్లామిక్ మ్యూజిక్ ఇండస్ట్రి ఆవిర్భవించినది. 2000 సం. లో ఏర్పాటు చేయబడిన బ్రిటన్ కు చెందిన అవేకనింగ్ రికార్డ్స్ సంస్థ ఈ దిశ లో ప్రయత్నిస్తుంది.

2003 లో అజర్ బైజాన్ మూలాలు కలిగి ఇరాన్ లో జన్మించి బ్రిటిష్ పౌరసత్వం కలిగి,బ్రిటిష్ రాయల్ అకాడమి అఫ్ మ్యూజిక్ లో విద్య నబ్యసించిన  సామీ యూసుఫ్(గేయ రచయిత, సంగిత కారుడు, నిర్మాత, అనేక వాయిద్యాల నిపుణుడు  )  తన ఆల్బం “అల్-ముఅల్లిం” (2003)తో ఒక వెలుగులోనికి వచ్చాడు.ఇతని ఇస్లామిక్ సంగీతం పాశ్చ్యాత్య ప్రపంచం లో బాగా ప్రజాదరణ పొందినది.ఇతడు 2006 లో టైం మ్యాగజైన్  చే ఇస్లాం రాక్ స్టార్ గా పిలవ బడ్డాడు. 2005 లో మై ఉమ్మా,2009 లో వితౌట్ యు,2010 వేర్ ఎవర్ యు ఆర్,2012లో సలాం ఆల్బమ్స్ తో ప్రఖ్యాతి గాంచినాడు. యూసఫ్ సామీ ముస్లిం మ్యూజిక్ అందించేవారిలో లోక ప్రియుడు.

యూసుఫ్ సామి తో పాటు ఇంకొక ముస్లింసంగీత కారుడు మహేర్ జైన్ కూడా పూర్తిగా విశ్వాసిగా మారి తన జీవితాన్ని ఇస్లామిక్ సంగీతాన్ని వ్యాప్తి చేయటానికి అంకితం చేసాడు. లెబనాన్ లో జన్మించి స్వీడన్ పౌరసత్వం కలిగిన మహేర్ ముస్తఫా మహేర్ జైన్ (గీత రచయిత,గాయకుడు, సంగీతకారుడు, సంగీత నిర్మాత) ఇతను గిటార్,పియానో,కీ బోర్డు మొదలగునవి వాయిoచును. థాంక్యు అల్లాహ్ (2009) ఫర్గివ్ మి(2012) అను రెండు ప్లాటినం ఆల్బమ్స్ తో  ఇస్లామిక్ మ్యూజిక్ ను కోట్లాది పాశ్చ్యాత్య ముస్లిం కుటుంబాలకు చేర్చాడు. ఇతను లేడీ గాగా తో కలసి పని చేసాడు. ఇస్లామిక్ సంగీతం జాతి,మతాలను దాటి ముస్లిమేతరులను కుడా ఆకర్షిస్తూ  క్రమంగా అద్యాత్మికత వైపునకు పయనిస్తున్నది.

సైఫ్ ఆడమ్ అనే బ్రిటిష్ ఇస్లామిక్ సంగీతకారుడు పాశ్చాత్య ముస్లిం/ముస్లిమేతరులను ఆకర్షిస్తూ ఇస్లామిక్ సంగీతాన్ని వారి వద్దకు చేరుస్తున్నాడు.





వీరితో పాటు లెబనాన్, మొరాకో, కెనడా, వంటి దేశాలకు చెందిన ఇస్లామిక్ మూలాలు కలిగిన ముస్లిం సంగీతకారులు  విలువలతో కూడిన ఇస్లామిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. “అరబ్స్ గాట్ టాలెంట్” అనే అరబ్ రియాల్టి షో లో ద్వితీయ స్థానం పొందిన అమెరికా కు చెందిన జెన్నిఫర్ గ్రౌట్ తనకు  ఏమాత్రం అరబ్బీ రాకపోయిన తన సుమధుర, శ్రావ్యమైన కంఠం తో అరబ్ క్లాసికల్ మ్యూజిక్ ను, అరబిక్ పాటలను పాడుతూ లోక ప్రియమైనది.
యూసఫ్ ఇస్లాం (క్యాట్ స్టివెంస్) నేటివ్ దీన్, నర్సిసైస్ట్,షాదియా మన్సూర్, ఖాలిద్, కరీం సల్మాస్, దావూద్ వారంస్బె మొదలగు వారు ఇస్లామిక్ సంగీతాన్ని పాశ్చ్యాత్య ప్రపంచం లో జనరంజకం చేసినారు.
ఈ మద్య ఇస్లామిక్ మ్యూజిక్ లో కొత్త వొరవడి ప్రారంభం అయినది. సమకాలిన రాజకీయాలు ,అణిచివేత,సామాజిక న్యాయం మొదలగు అంశాల నేపద్యం లో పాలస్తీనా,సిరియా వంటి ముస్లిం సమస్యలను ప్రపంచదృష్టి కి తెస్తూ సంప్రదాయక సంగీతానికి బిన్నం గా కాన్షియస్ హిప్-హాప్ పేర సరికొత్త చైతన్య,ఆలోచనాత్మక సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ విధంగా హలాల్ భావన జీవితం లోని అన్ని రంగాలలో విస్తరించబోతున్నది. ఆధునిక సమాజాలు క్రమంగా నైతిక,ధార్మిక విశ్వాసాలనుండి వైదొలుగుతున్న ప్రస్తుత కాలంలో ముస్లింలు శాంతంగా, ఆధునికంగా,ఇస్లామిక్ విశ్వాసాలకు అనుగుణ్యమైన తమదైన ముద్రను సమాజం పై  వేస్తూ కాలం తో పాటు నడుస్తూ,ఆధునికతను సంతరించుకొంటు, ప్రజలలో  హలాల్ భావనను పెంచుతూ  (ధర్మబద్దమైనది)  అన్ని రంగాలలోను ఇతరులతో పోటి పడటానికి,ముందుండటానికి ప్రయత్నిస్తున్నారు.



No comments:

Post a Comment