29 July 2022

ధరమ్ స్వరూప్ నకారా (డి.యస్. నకారా) గారి వర్ధంతి -జూలై 29

 నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరు సకాలంలో పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపడం వెనుక ధరమ్ స్వరూప్ నకారా(డి.యస్. నకారా)చేసిన కృషి, సాగించిన పోరాటం చిరస్మరణీయం.మన దేశంలో పెన్షన్ పొందుతున్న పెన్షనర్స్ కు ఆయన చిరస్మరణీయుడు.                

డి.యస్.నకారా 1914 ఏప్రిల్ 8 న ముంబైలో జన్మించి ,అలహాబాద్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్ లో బంగారు పతకము అందుకున్నారు.ఆయన బాల్యం నుండి ఉర్థూ సాహిత్యం పట్ల అభిలాష పెంచుకున్నారు.ఉర్థూ సాహిత్యం లో ఆయన చేసిన సేవలకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ లాంటి ఉద్దండుల ప్రశంసలు పొందారు.1937 లో  సివిల్ సర్వీసు పోటీ పరీక్షల్లో విజయుడై డిఫెన్స్ అకౌంట్స్ శాఖలో ప్రవేశించటంతో ఆయన ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ,గార్డెన్ రీసెర్చ్ ఇంజనీర్స్ లో డైరెక్టర్ గా పని చేసారు.

సంగీత ,సాహిత్య, చిత్రకళా సంస్థలలో  కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు. ప్రాగాటూల్స్ సంస్థలకు చైర్మైన్ గా ఆయన విశిష్ట సేవలందించారు. ఎన్నో సంస్థలకు ఆర్థిక సలహాదారుగా , కేంద్ర ప్రభుత్వం లో  ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ పదవులు  సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహించారు. 1972 లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా , రక్షణ శాఖ కు ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తూ పదవీవిరమణ చేసారు.               

డి.యస్.నకారా పెన్షన్ దారుల కోసం చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపు లభించుటకు కారణమైంది. పదవీవిరమణ తరువాత భారత్ సేవా సమాజం న్యూఢిల్లీ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ చెల్లింపు లలో ప్రభుత్వాల వివక్షతను గమనించారు.1977 సంవత్సరానికి ముందు పదవీవిరమణ చేసినవారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో  కోతలు విధించేవారు.ఆనాడు అత్యధికంగా రూ 675/లు మాత్రమే పెన్షన్ వుండేది. ఆ కొద్ది పాటి పెన్షన్ తో కుటుంబ జీవనం గడపడం కష్టతరంగా వుండేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించు ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో వున్న వారికే వర్తించునని ,అంతకు పూర్వం పదవీవిరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25 నాడు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా , ఈ ఉత్తర్వులు పెన్షన్ దారులను కుంగదీసాయి.అరకొర పెన్షన్లతో జీవించడం కన్నా మరణమే మేలని మానసిక భావనకు పెన్షన్ దారులు గురయ్యారు.

స్వయంగా పెన్షన్ బాధితుడైన డి.యస్.నకారా  మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలసి దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లో రాజ్యాంగం లోని ఆర్టికల్ 32 క్రింద కేసు నెం. 5939-41/1980 రిట్ పిటిషన్ దాఖలు చేసారు.

ఆనాడు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ వై.వి.చంద్రచూఢ్ మరియు ఓ.చిన్నపురెడ్డి , హరూల్ ఇస్లాం ,వి.డి. తుల్జాపూర్కర్ , డిఏ దేశాయి ఈ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సంక్షేమ రాజ్యం యొక్క బాధ్యత లు 

గతంలో యిచ్చిన తీర్పులు , భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ,వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిశంబర్ 17 న చారిత్రాత్మక మైన తీర్పును వెలువరించినది. తీర్పు యొక్క సారాంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టీస్ దేశాయి ప్రకటించారు.         

 

గౌ!! సుప్రీం కోర్టు తీర్పు లోని ముఖ్యాంశాలు : 

(1)పింఛన్ అనేది యజమాని ఇష్టాయిష్టములతో ,దయతో యిచ్చు దానము కాదు.అది పింఛనుదారుని యొక్క స్థిరమైన హక్కు.

(2) గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్.

(3)ఉద్యోగి పదవీవిరమణ అనంతరం వృద్దాప్య జీవితం సుఖ సంతోషాలతో ,గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్ ను పరిగణించాలి.

(4) పింఛన్ దారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించుటకు కల్పించబడిన ఆర్థిక, న్యాయ పరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్యగా పింఛన్ ను పేర్కొనటం జరిగింది.

(5)కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కు ఒక తేదీని ఎంచుకొని  దానికి ముందు గాను ,తరువాత రిటైరైన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14 కి విరుద్ధం. నిర్ణీత తేదీకి ముందు రిటైరైన వారికి కూడా ,ఆ తేదీ తర్వాత రిటైరైన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలని ఆదేశించింది.

(6)పెన్షనర్స్ అందరిని ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు.                   


పైన పేర్కొన్న తీర్పును దృష్టిలో పెట్టుకొని 2014 సం.లో ఏప్రిల్ 30 న సుప్రీం కోర్టు మన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో జిఓ నెం.87 తేది 25-5-1998  ప్రకారం  ఈ తేదీకిముందు పదవీ విరమణ చేసిన వారికి ఒక రకంగా తరువాత రిటైరైన వారికి ఒక రకంగా పెన్షన్ వుండరాదని పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

డి.యస్.నకారా చేసిన కృషి ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  లక్షలాది పెన్షనర్ల జీవితాలకు ముసురుకున్న చీకట్లు తొలగి పోయాయి.కొత్త ఆశలు చిగురించాయి.భవిష్యత్ పై విశ్వాసం ఏర్పడి ,నకారా ఆశాజ్యోతి గా నిలచిపోయారు.

డి.యస్.నకారా 94 సం.ల పరిపూర్ణ జీవితం గడిపారు. ఉద్యోగ విరమణ తరువాత తన శేష జీవితాన్ని పెన్షనర్స్ సేవలో గడిపారు.

2009 జూలై 29 న ఆయన పెన్షనర్స్ పోరాట యోధునిగానే తుది శ్వాస విడిచారు.

నకారా గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు పెన్షనర్లకు సాధించి పెట్టిన రాజ్యాంగబద్దమైన పెన్షన్ హక్కును కాపాడుకోవడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి....

 

No comments:

Post a Comment