19 April 2022

కలోనియల్ ఇండియాలో పాశ్చాత్య వైద్య చరిత్ర మరియు దాని పురోగమనం The history of Western Medicine and its rise in Colonial India

  

భారత ఉపఖండం బ్రిటీష్ వలస దేశాలలో  అతిపెద్ద మరియు అత్యధిక జనాభా కలిగిన భూభాగం మరియు బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన  మొదటి కొన్ని దేశాలలో ఒకటి. బ్రిటిష్ పాలన సుసంపన్నమైన భారతీయ సంస్కృతిపై ప్రభావం చూపడమే కాకుండా సాంప్రదాయ భారతీయ వైద్య విధానంపై కూడా గాఢమైన ప్రభావం చూపినది..

18వ శతాబ్దం మొదటివరకు  పాశ్చాత్య మరియు స్వదేశీ వైద్య వ్యవస్థల మధ్య సామాజిక అవగాహన ఉన్నప్పటికీ ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే మొదటిసారిగా మానవ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నందున, బ్రిటిష్ వారు సాంప్రదాయ భారతీయ వైద్యాన్ని చిన్నచూపు చూడటం ప్రారంభించినారు.

 వైద్య రంగం లో పాశ్చాతులు సాధించిన   శాస్త్రీయ పురోగతి భారతదేశంలోని వైద్య వ్యవస్థ, సంస్థలు మరియు ప్రాక్టిషనర్స్ ను ప్రభావితం చేసింది. వాస్తవానికి అనేకమంది చరిత్రకారులు వలసరాజ్య పాలకులు  భారతదేశంలో తమ పాలనాదికారాన్ని విస్తరించడానికి పాశ్చాత్య వైద్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించారని అంటారు. భారతదేశంలోని రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన యునాని మరియు ఆయుర్వేదాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో  మనం లోతుగా మరియు నిశితంగా పరిశీలిద్దాం.

భారతదేశంలో విభిన్న నేపథ్యాల వైద్యులు ఉన్నారు. వారు ఆయుర్వేదం మరియు యునాని వైద్యం చేసే “వైద్యా మరియు హకీమ్‌”లు. భారతదేశంలో ఆయుర్వేద వ్యవస్థ 600BC కాలంలో ఉద్భవించింది. యునాని టిబ్ భారతదేశంలో 12వ శతాబ్దంలో భారతదేశంలో ముస్లిం పాలకులచే పరిచయం చేయబడింది.

18వ శతాబ్దం మధ్యలో, భారతదేశంలో 'డాక్టరీ' అని పిలువబడే పాశ్చాత్య వైద్యం వలస భారతదేశంలో ఊపందుకుంది. పాశ్చాత్య/యురోపియన్  వైద్యుని వేషధారణ, స్వరూపం మరియు వారు సంభాషించే విధానం సాంప్రదాయ వైద్యులకు  చాలా భిన్నంగా ఉoది. వీరికి బ్రిటిష్ వారు మరియు పాశ్చాత్య దేశాలలో చదువుకున్న కొందరు భారతీయులు మద్దతు ఇచ్చారు. మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, పాథాలజీలో కొనసాగుతున్న ఆవిష్కరణలు మరియు పరిశోధనల పలితంగా పాశ్చాత్య వైద్యం  పట్ల ప్రజలలో ఆసక్తి పెరిగింది.

ప్రారంభంలో యూరోపియన్ వైద్యులు భారతీయ వైద్య విధానాన్ని గౌరవించారు మరియు ట్రాపికల్/ఉష్ణమండల వ్యాధుల చికిత్సలో వారి పద్ధతులను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మైక్రోస్కోప్‌ ఆవిష్కరణ పాశ్చాత్య శాస్త్రవేత్తలకు వ్యాధికి కారణమయ్యే వ్యాధికారకాలను pathogens అధ్యయనం చేయడానికి సహాయపడినది.

బాక్టీరియా మరియు ప్రోటోజోవా ను పరిశీలన చేయడానికి ఆంటోనీ వాన్ లీవెన్‌హోక్ సింగిల్-లెన్స్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించారు. 1851లో ఐరిష్ వైద్యుడు, ఆర్థర్ లీర్డ్  మరియు 1852లో జార్జ్ ఫిలిప్ కమ్మన్ చేత స్టెతస్కోప్‌ కనిపెట్టబడటం వైద్యరంగంలో ఒక భారీ పురోగతి. జ్ఞానం కంటే శాస్త్రీయ ఆధారాలు ఉన్నందున తాము మరింత 'ఉన్నతమైన' వైద్య విధానాన్ని కలిగి ఉన్నామని  యూరోపియన్/పాశ్చాత్య వైద్యులు భావించారు.

కొంతమంది స్వదేశీ వైద్యులు కూడా పాశ్చాత్య వైద్యం యొక్క ఆలోచనలను స్వీకరించారు. భారతదేశంలో ఈ కాలంలో అనేక విభిన్న వైద్య విద్య, సేవలు మరియు సంస్థలు అభివృద్ధి చెందాయి. 18వ శతాబ్దంలో బెంగాల్‌లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా మంది బ్రిటీష్ సర్జన్లను నియమించినది.  ఈ సర్జన్లు బ్రిటన్ మరియు భారతదేశంలో పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. బెంగాల్‌లో బ్రిటీష్ సర్జన్ల ఉద్యోగాల కోసం “బెంగాల్ మెడికల్ సర్వీసెస్” స్థాపించబడింది.

18వ శతాబ్దంలో జరిగిన యుద్దాల  కారణంగా చాలా మంది సర్జన్లు మిలిటరీ సర్వీసెస్ కోసం పనిచేశారు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే నియమించబడిన భారతీయ సైనికులు బ్రిటిష్ వైద్యులచే వైద్య చికిత్స పొందిన మొదటి భారతీయులు. అయితే  కొంతమంది ఉన్నత స్థాయి కుల/అప్పర్ క్యాస్ట్   సైనికులు పాశ్చాత్య మందులను తిరస్కరించారు. వారికోసం కంపెనీ ఔషధాలను పంపిణీ చేయడానికి భారతీయ వైద్యులను నియమించింది. త్వరలోనే కంపెనీ భారతీయు మెడికల్ అసిస్టెంటులను నియమించుకోవడం ప్రారంభించింది. 1760 తర్వాత ప్రతి ప్రెసిడెన్సీలో "సబార్డినేట్ మెడికల్ సర్వీసెస్" (SMS) రూపొందించబడింది.

అనతికాలం లోనే  భారతీయ విద్యావేత్తలు  సాంప్రదాయ ఆయుర్వేద మరియు యునాని గ్రంథాలను అనువదించడం ప్రారంభించాడు, సర్ విలియం జోన్స్ 1789లో జర్నల్ ఆఫ్ ఏషియాటిక్ రీసెర్చ్అనే పత్రికను స్థాపించారు. అతను భారతీయ ఔషధం మరియు ఔషధ మొక్కల పరిశోధనలకు మద్దతు ఇచ్చాడు.

1792లో కలకత్తాలో మొట్టమొదటి జనరల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు, అది సాధారణ భారతీయ ప్రజల కోసం తెరవబడింది. ప్రజలు క్లిష్టమైన వ్యాధుల చికిత్స కోసం అక్కడకు రాసాగారు. క్రమంగా సంపన్నులు మరియు ఉన్నత వర్గ  భారతీయ పురుషులు సాంప్రదాయ మెడికల్ ప్రాక్టిషనర్స్ కన్నా  యురోపియన్/ బ్రిటిష్ వైద్యుల వద్ద చికిత్స పొందటం ప్రారంభించారు.

1822 మరియు 1824 సంవత్సరాలలో, కలకత్తాలో నేటివ్ మెడికల్ ఇనిస్టిత్యుట్ (NMI) మరియు సంస్కృత కళాశాలలు ఉర్దూ మరియు సంస్కృతం మీడియంలో పాశ్చాత్య మరియు భారతీయ వైద్య విధానాలను బోధించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. 1849లో భారతదేశంలో వైద్య రంగంలో క్లోరోఫామ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యంగా ప్రసూతి శాస్త్రం, విచ్ఛేదనం శస్త్రచికిత్స మరియు ఫ్రాక్చర్ నిర్వహణలో వేగవంతమైన పురోగతి కనిపించింది. పాశ్చాత్య మరియు సాంప్రదాయ భారతీయ  వైద్య పద్దతుల మద్య దూరం పెరిగింది.

థర్మామీటర్లు, స్టెతస్కోప్, మైక్రోస్కోప్ మరియు వ్యాక్సిన్ వంటి ఆధునిక సాధనాలు వ్యాధి నిర్ధారణ మరియు నివారణలో పురోగతికి దారితీశాయి. ఈ పురోగతులు సాంప్రదాయ ఔషధాన్ని బాగా దెబ్బ తీసాయి. ఆసుపత్రులు మరియు క్లినిక్‌లలో ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రాముఖ్యతను ఇచ్చే పాశ్చాత్య వైద్యానికి విరుద్ధంగా భారతీయ వైద్య వ్యవస్థకు ప్రయోగాత్మకంగా క్లినికల్ శిక్షణ లేకపోవడం మరో లోటు.

క్రమంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన సిబ్బందికి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది మరియు భారతీయ వైద్య విధానం పట్ల తన మద్దతును పూర్తిగా నిలిపివేసింది. 1822 మరియు 1824లో స్థాపించబడిన కళాశాలలు రద్దు చేయబడ్డాయి మరియు 1835లో కలకత్తా వైద్య కళాశాల స్థాపించబడింది, ఇది పాశ్చాత్య వైద్య విధానాన్ని ఆంగ్లంలో మాత్రమే భోదిస్తుంది.  మద్రాసు, బొంబాయి మరియు లాహోర్‌లలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభించబడ్డాయి. ఈ కళాశాలలు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీచే గుర్తించబడ్డాయి మరియు మానవ శరీర నిర్మాణ శాస్త్రం, మానవ విచ్ఛేదం వంటి అనేక ఇతర సబ్జెక్ట్స్ కలిగి ఉన్నాయి. కోర్సు వ్యవధిని ఐదేళ్లకు పెంచారు. ఇండియన్ మెడికల్ సర్వీసెస్ (IMS) 1897లో ఏర్పడింది.

 


1860 నుండి 1880 మధ్య కాలంలో పారా-మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి వైద్య పాఠశాలలు స్థాపించబడ్డాయి, వారిని 'లైసెన్షియేట్స్' అని పిలుస్తారు. అనేక ప్రాంతీయ సంస్థలలో పాశ్చాత్య వైద్యం స్థానిక భాషలలో పంపిణీ చేయబడింది. పాశ్చాత్య వైద్య విద్య భారతీయులకు అందుబాటులో ఉంది. ఇది వారికి డాక్టర్‌గా గుర్తింపు మరియు కంపెనీ వైద్య సేవలో ఉండే అవకాశాన్ని కల్పించింది. పాశ్చాత్య-విద్యావంతులైన భారతీయులు పాశ్చాత్య వైద్యానికి మద్దతు ఇచ్చారు మరియు దానిని విజ్ఞానం యొక్క అత్యుత్తమ రూపంగా పరిగణించారు.

పాశ్చాత్య వైద్యం భారతీయ స్త్రీలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. మార్చి 1886లో భారతదేశంలోని బాంబే ప్రెసిడెన్సీ కు చెందిన ఆనందీబాయి గోపాల్ జోషి యునైటెడ్ స్టేట్స్‌లో వెస్ట్రన్ మెడిసిన్‌లో పట్టా పొందిన మొదటి మహిళ. రూపాబాయి ఫుర్దూంజీ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మత్తు వైద్యురాలుగా పేరుగాంచింది.

 


బ్రిటీష్ వారు భారత ఉపఖండంలో తమ పాలనను సమర్థించుకోవడానికి వైద్యంతో సహా ప్రతి రంగంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించారు మరియు భారతదేశంలో వలసరాజ్య అధికారాన్ని మరియు ఆధిపత్యాన్ని స్థాపించడంలో పాశ్చాత్య వైద్యం సహాయపడింది.

 

 

No comments:

Post a Comment