10 June 2023

అబార్షన్ గురించి ఇస్లాం ఏం చెబుతోంది?

 

ఇస్లాం, మానవ జీవితంకు ప్రాధాన్యతనిస్తుంది. ఇస్లాం సరళమైన ధర్మం. ఇస్లాం  జీవితాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు కొన్ని షరతులకు లోబడి అబార్షన్‌ను అనుమతిస్తుంది.

ఇస్లాం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి జీవితాన్ని కాపాడటం. ఇస్లాం దృష్టిలో ఆత్మ హత్య లేదా ఒకరిని చంపడం పెద్ద పాపం. "ధర్మబద్దంగా తప్ప దేవుడు పవిత్రమైనదిగా (నిషిద్దమైనదిగా) చేసిన ఏ ప్రాణినీ హతమార్చకండి.” (6:151).

పిల్లలను కలిగి ఉండటం భగవంతుడి నుండి వచ్చిన ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. దివ్య ఖురాన్‌లోని చాలా మంది ప్రవక్తలు, జకారియా మరియు అబ్రహం వంటివారు తమకు సత్ప్రవర్తన గల పిల్లలను ఇవ్వమని దేవుడిని ప్రార్థించారు.

ఇస్లాం కు ముందు అరేబియాలో, అరబ్బులు మగ సంతానం పట్ల బలమైన ఆపేక్షను కలిగి తమ ఆడపిల్లలను సిగ్గుతో పాతిపెట్టేవారు. దివ్య ఖురాన్ ఈ క్రూరమైన చర్యను ఖండించింది వారిలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే, అతని ముఖం నల్లగా మారిపోతుంది, దానిని జీర్ణించుకోలేక లోలోపలే కుమిలిపోతుంటాడు. తనకు ఇవ్వబడిన శుభవార్తను నామోషీగా భావించి జనులనుండి తప్పించుకు తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని భరిస్తూ  ఆమెను ఉండనివ్వాలా లేక మట్టిలో పూడ్చిపెట్టాలా? అని సతమతమవుతుంటాడు. వారు గైకొంటున్న ఈ నిర్ణయం ఎంత నీచమైనది!?” (16:58-59). దివ్య ఖురాన్ మరియు హదీసులు ఆడపిల్లలను చంపడాన్ని నిషేధించాయి.

గర్భస్రావం విషయానికి వస్తే గర్భం దాల్చిన మొదటి 40 రోజులు లోపల అనుమతించబడుతుంది.. గర్భం దాల్చిన మొదటి 40 రోజులు లోపల తల్లిదండ్రులు ఇద్దరూ అనుమతితో మరియు తగిన కారణం ఉంటే  గర్భస్రావం ను చాలా మంది ఇస్లామిక్ పండితులు అనుమతిస్తారు. అత్యాచారం వంటి సందర్భాలలో మరియు శారీరక లేదా మానసిక బలహీనత కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పెంచలేనప్పుడు గర్భస్రావం అనుమతించబడుతుంది. అయితే, పేదరికం పిల్లల అబార్షన్ కోసం ఒక సమర్థనీయమైన సాకు కాదు. ఇస్లాం లో పేదరిక భయంతో బిడ్డను గర్భస్రావం చేయడం చట్టవిరుద్ధం

40రోజుల తర్వాత ముస్లిం పండితులు అబార్షన్ అనుమతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తల్లి ఆరోగ్యానికి ముప్పు ఉంటే, గర్భస్రావం అనుమతించబడుతుంది. అదేవిధంగా వైద్యులు పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన వైకల్యాన్ని కనుగొంటే, గర్భస్రావం చేయడానికి అనుమతించబడుతుంది. చాలా మంది ఆధునిక ముస్లిం పండితులు మొదటి 40 రోజులలో కొంత సౌలభ్యంతో అబార్షన్‌ను అనుమతిస్తారు, కానీ ఆ తర్వాత, అబార్షన్‌కు  తప్పనిసరిగా అవసరమైన బలమైన కారణం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ తప్పనిసరిగా అవసరమైన బలమైన కారణం కూడా ఏకపక్షం కాదు, దానికి ముస్లిం పండితులతో పాటు వైద్య నిపుణులను కూడా  సంప్రదించాలి

ఇస్లాంలో గర్భం వచ్చిన మొదటి 120 రోజుల తర్వాత, బిడ్డకు ఆత్మ ఇవ్వబడుతుందని నమ్ముతారు. అందువల్ల తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే తప్ప బిడ్డకు గర్భస్రావం చేయడం నిషిద్ధం. తల్లి కడుపులో పిండం చనిపోతే అబార్షన్ అనుమతించబడుతుంది.

ఇస్లాం జీవితాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది మరియు పిల్లలను కనే జంటలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, జీవితం కొన్ని సమయాల్లో సంక్లిష్టంగా ఉంటుందని ఇస్లాం అర్థం చేసుకుంటుంది మరియు అబార్షన్లు అవసరమయ్యే కొన్ని సందర్భాలు ఉన్నాయి (తల్లి ప్రాణాలను కాపాడటం, అత్యాచారం ఫలితంగా గర్భం మొదలైనవి).

No comments:

Post a Comment