భారత రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కుకు హామీ ఇస్తుంది. సమాన అవకాశం, సమాన రక్షణ, మరియు సమాన న్యాయం కల్పిస్తుంది. మహారాష్ట్ర మహిళ డాక్టర్ బెనజీర్ తంబోలి, ముస్లిం మహిళలతో సహా భారతదేశంలోని అణగారిన వర్గాల కోసం ఈ ప్రాథమిక హక్కులను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే బాధ్యతను స్వీకరించారు.
బెనజీర్ ప్రగతిశీల భావాలున్న కుటుంబంలో పెరిగారు. బెనజీర్ కుటుంబం ముస్లిం సత్యశోధక్ మండల్ వ్యవస్థాపకుడైన హమీద్ దల్వాయి ఆలోచనలచే ప్రభావితమైంది. బెనజీర్ తండ్రి, ఇలాహీ మోమిన్, దల్వాయితో కలిసి పనిచేసేవారు. అటువంటి భావజాల వాతావరణంలో పెరగడం వల్ల, బెనజీర్ చిన్నతనం నుండే సమానత్వం మరియు స్వేచ్ఛ విలువలను తన మనస్సులో, ప్రవర్తనలో అలవర్చుకున్నారు.
బెనజీర్ కల్లోలభరితమైన వివాహ జీవితాన్ని ఎదుర్కొన్నారు. బెనజీర్ తన వైవాహిక జీవితం లో అనేక సమస్యలను ఎదుర్కొని, చివరికి విడాకులు తీసుకోవలసి వచ్చింది.విడాకుల తర్వాత, బెనజీర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి బట్టలు కుట్టడం ప్రారంభించింది. బెనజీర్ ఈ వృత్తిలో ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారింది.తరువాత బెనజీర్ లెక్చరర్ పదవికి ఇంటర్వ్యూలకు హాజరై, అక్కడ కూడా విజయం సాధించింది.
ముస్లిం బాలబాలికలు ఉర్దూ మాధ్యమంలో ఎక్కువగా చదువుకుంటారు. బెనజీర్ ఉర్దూ మీడియం విద్యార్థులలో భాషా నైపుణ్యాలను, ముఖ్యంగా ఆంగ్లాన్ని పెంపొందించడానికి, 'తన్జీమ్-ఎ-వాలెదైన్' అనే సంస్థ ద్వారా ఉర్దూ మాధ్యమ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు ఆంగ్లం బోధించేందుకు చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో అనేక విజయవంతమైన ప్రయోగాలను అమలు చేశారు. ఈ కార్యక్రమాల ఆధారంగా బెనజీర్ ఒక సిద్ధాంత వ్యాసాన్ని కూడా సమర్పించారు.
ఒక సామాజిక కార్యకర్తగా బెనజీర్ ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కర నిమిత్తం ముస్లిం సత్యశోధక్ మండలి కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు.ముస్లిం సత్యశోధక్ మండలి ద్వారా, బెనజీర్ అనేక కార్యక్రమాలను అమలు చేశారు మరియు మహిళల హక్కుల కోసం, ముఖ్యంగా ముస్లిం మహిళల సమాన హక్కుల కోసం నిరంతరం గళం విప్పారు. అలాగే, 'ముస్లిం మహిళా సహాయ కేంద్రం' ద్వారా, విడాకులు తీసుకున్న మరియు బాధితులైన అనేక మంది మహిళలకు విలువైన మద్దతును అందించారు.
బెనజీర్ విడాకులు లేదా కుటుంబ వివాదాలను పరిష్కరించడానికి రాజ్యాంగ మరియు న్యాయ ప్రక్రియలను తప్పనిసరిగా ఉపయోగించాలని ఎల్లప్పుడూ నొక్కి చెబుతారు.బెనజీర్ ప్రస్థానం కేవలం సామాజిక సేవకే పరిమితం కాలేదు; విద్యా మరియు సైద్ధాంతిక రంగాలలో కూడా తనదైన ముద్ర వేశారు. బెనజీర్ విద్యలో పిహెచ్.డి పూర్తి చేసి, వివిధ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో బోధించారు.
ఇది కాకుండా, ఆమె 'మహారాష్ట్ర నాలెడ్జ్ కార్పొరేషన్' (MKCL)లో చాలా కాలం పాటు సీనియర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు మరియు విద్య, విద్యా నిర్వహణ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు
తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠంలో పనిచేస్తున్నప్పుడు, బెనజీర్ మహిళలపై అఘాయిత్యాల నివారణ సెల్ నోడల్ అధికారిగా తన సామాజిక నిబద్ధతను కొనసాగించారు. బెనజీర్ ధైర్యసాహసాలు మరియు అంకితభావంతో చేసిన సేవకు గుర్తింపుగా, న్యూఢిల్లీలో 'సహాస్ సమ్మాన్' (2015) మరియు పూణేలో 'సేవావతి మహిళా పురస్కార్' (2017) వంటి అవార్డులతో బెనజీర్ ను సత్కరించారు.
బెనజీర్ విద్యా సంబంధిత కృషితో పాటు, మరాఠీ, హిందీ మరియు ఆంగ్ల భాషలలో, చాలా అనువాద మరియు ఎడిటింగ్ పనులు చేశారు. బెనజీర్ 'ముస్లిం సత్యశోధక్ పత్రిక' మరియు 'సమాజ్‌వాది అధ్యాపక్ పత్రిక'లకు సహ సంపాదకురాలిగా పనిచేశారు.
బెనజీర్ మండల్ పత్రికకు క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తూ, వివిధ ప్రదేశాలలో పాండిత్య ఉపన్యాసాలు ఇచ్చారు. బెనజీర్ రచించిన 'శిక్షణశాస్త్ర శబ్దకోష్' (విద్యా నిఘంటువు) ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్.
బెనజీర్ 'ప్రభావశాలి శిక్షణ తాజ్న' (ప్రభావవంతమైన విద్యావేత్తలు) అనే గ్రంథాన్ని కూడా రచించారు, మరియు (దక్షిణాన 'స్కై బాబా'గా ప్రసిద్ధి చెందిన) షేక్ యూసుఫ్ బాబా యొక్క తెలుగు కథా సంకలనాన్ని మరాఠీలోకి అనువదించారు,.
బెనజీర్ మరియు ఆమె భర్త, డాక్టర్ షమ్సుద్దీన్ తంబోలి, మరణానంతరం తమ శరీరాలను దానం చేయాలని నిర్ణయించుకుని, అందుకు సంబంధించిన అధికారిక పత్రాలను పూరించారు. ఈ నిర్ణయం వారి ప్రగతిశీల ఆలోచనలలోని పరిపక్వతను తెలియజేస్తుంది.
డాక్టర్ బెనజీర్ తంబోలి ఎంతో మంది ముస్లిం మహిళలు మత మరియు సామాజిక రంగాలకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ, వారు సైన్స్, వైద్యం, న్యాయవ్యవస్థ, పరిశ్రమ మరియు సాహిత్యంలో కూడా కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు.
డాక్టర్ బెనజీర్ తంబోలి అటువంటి మహిళల గురించి సమాచారాన్ని సేకరించి, ఆ సమాచారాన్ని ఒక పుస్తకంలో నమోదు చేయాలని యోచిస్తున్నారు. బెనజీర్ ముస్లిం సత్యశోధక్ మండలి మరియు హమీద్ దల్వాయిల ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలని విశ్వసిస్తున్నారు.
1954 'ప్రత్యేక వివాహ చట్టం' కింద జంటలు వివాహం చేసుకునేలా ప్రోత్సహించడానికి మరియు వారికి చట్టపరమైన, భావోద్వేగ మద్దతును అందించడానికి బెనజీర్ పనిచేయాలని సంకల్పించారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషాన్ని తగ్గించడం మరియు 'ఐక్యత, సమగ్రత'ను ప్రోత్సహించడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారు.ఈ కార్యక్రమాలలో తన భర్త డాక్టర్ షమ్సుద్దీన్ తంబోలి యొక్క అమూల్యమైన మద్దతు తనకు ఉందని బెనజీర్ పేర్కొన్నారు.
బెనజీర్ కృషి, ఆలోచనలు
మరియు సంకల్పం సమాజంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా
ముస్లిం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం.
No comments:
Post a Comment