11 November 2013

మహారాష్ట్ర లోని ముస్లింల స్థితిగతులపై మహమ్మద్-ఉర్- రహమాన్ కమిటీ నివేదిక 2013-ముఖ్యాంశాలు


2008 మే 6వ తేదీన   ఆప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విలాస రావు దేశముఖ్ నాయకత్వంలోని కాంగ్రెస్-ఎన్‌సి‌పి సంకీర్ణ మంత్రివర్గం మహారాష్ట్ర లోని ముస్లింల స్థితిగతులు,సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వారి వెనుకబాటుతనం, ప్రభుత్వౌద్యోగాలలో వారికి గల  తక్కువ ప్రాతినిద్యం, దళిత ముస్లిములు,వక్ఫ్ ఆస్తుల స్థితి గతులు తదితర ఆంశాలను  పరిశీలించి  ముస్లింల స్థితిగతులు మెరుగు పరుచుటకు సూచనలు  ఇవ్వటానికి గాను మాజీ IAS అధికారి , అలీఘర్ ముస్లిం యునివర్సిటి మాజీ వైస్-ఛాన్సలర్ ఐనా  శ్రీ మెహమూద్ –ఉర్- రహమాన్ నాయకత్వం లో 6గురు IPS మరియు  ప్రముఖ సామాజిక వేత్తలతో కూడిన ఒక కమిటీని (ఆద్యయన బృందం Study group) నియమించేను. ఈ కమిటీ తన ప్రాధమిక నివేదికను 2008లో, మరియు 400 పేజీలతో, 300 సూచనలతో  కూడిన  పూర్తి స్థాయి  తుది నివేదికను 2013 అక్టోబర్ 25వ తేదీన నేటి మహారాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ పృద్విరాజ్ చౌహాన్ కు  సమర్పించేను. ఐతే ఇంకా దీనిని అధికారయుతంగా ప్రకటించలేదు.
          రహమాన్ కమిటీ ముస్లింలు ఎదుర్కొంటున్నవివిధ  సమస్యలను కూలంకుషంగా పరిశీలించి ప్రతి సమస్యకు పరిష్కారాలను సూచించేను. కమిటీ వివిధరంగాలలో ముస్లింల అల్ప  ఉనికిని తెలిపే ఒక భిన్నత్వ సూచికను (diversity index) తయారు చేయమని సూచించింది.సమాజంలోని  వివిధ రంగాలలో ముస్లింల అల్ప  ఉనికి సామాజిక అసమానతలకు దారితీసి వారిలో ఒకరకమైన తక్కువ బావానికి దారితీస్తుందని రహమాన్ అబిప్రాయపడ్డారు. 
మెహమూద్-ఉర్- రహమాన్ కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలు మరియు సూచించిన పరిష్కారాలను   పరిశీలించుదాము.
          మహారాష్ట్ర మొత్తం జనాభా (2001 ప్రకారం) 9.69కోట్లు కాగా ఇందులో ముస్లిం జనాభా 1.03కోట్లు అనగా జనాభా లో ముస్లింల శాతం 10.6%. మహారాష్ట్ర లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివసించే మొత్తం ముస్లిం జనాభా లో దాదాపు 60% ముస్లింకుటుంబాలు బి‌పి‌ఎల్ (BPL) కుటుంబాలు. 25% కుటుంబాలు బి‌పి‌ఎల్ (BPL)స్థాయి  కన్నా కొంచం పై స్థాయి ఉన్న కుటుంబాలు.  బి‌పి‌ఎల్ (BPL)స్కీములు, రేషన్ కార్డులతో ముడిపడి ఉన్న పధకాలు ముస్లింలు  సులభంగా పొందటానికి గాను వారికి సులభంగా రేషన్ కార్డులు లభించాలి . గ్రామీణ ముస్లింలకు పేదరిక నిర్మూలన పధకాలను గురించిన  అవగాహన కల్పించాలి అని కమిటీ పేర్కొంది.
          పట్టణాలలో నివసించే 70% ముస్లిం కుటుంబాలు గృహవసతి లేమి ని ఎదుర్కొంటున్నాయి. ముస్లిం ప్రాంతాలలో తప్పితే మిగతా చోట్ల వారికి గృహాలు లబించుట లేదు. కాబట్టి  వారికి  గృహాల కేటాయింపులో 8% నుంచి  10% రిజర్వేషన్లను సూచించింది. ఇందుకు గాను అవసరమైతే ప్రైవేట్ బిల్డర్లకు ఎక్కువ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) లేదా ట్రాన్సఫర్ ఆఫ్ దేవలప్మెంట్ రైట్స్ ఇవ్వమని సూచించినది. గ్రామీణ ముస్లింలకు ప్రభుత్వం ఇతరులకు లాగానే ఉచిత భూ కేటాయింపులు జరపాలి..
          ఏకపక్షంగా తలాక్  (Talaak) ఇవ్వడాన్ని నిషేదించాలని కమిటీ సూచించింది. తలాక్ పొందిన ముస్లిం స్త్రీలకు తప్పనిసరిగా భరణం ఇవ్వాలని చెప్పింది.స్థానిక సంస్థల ఎన్నికలలో 33% ముస్లిం స్త్రీలకు, స్త్రీల రిజర్వేషన్ కోటా లో స్థానం కల్పించాలి. గృహ హింసను ఎదుర్కొనటానికి ముస్లిం స్త్రీలకు ఉచిత న్యాయ సధుపాయం కల్పించాలి. ముస్లిం బాలికలకు ప్రత్యేకంగా  రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలి.  లింగ భేధాన్ని రూపుమాపటానికి ముస్లిం సమాజంలో సంస్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరింది.
          మహారాష్ట్ర లోని ముస్లింలలో ముఖ్యం గా పురుషుల కన్నా స్త్రీ  లలో నిరుద్యోగిత అదికంగా ఉంది. ఇందుకు గాను ముస్లింల ఆర్థికాబివృద్ధి పై దృష్టి పేట్టాలని, వారి ఆర్ధికాబివృద్ది మెరుగు పరచాలని సూచించింది. ముస్లిం స్త్రీలు ఇంటివద్ద తయారు చేసె వస్తువుల అమ్మకానికి NGO సంస్థలు తోడ్పాటు అంధించాలి. వాటి ఎగుమతి నిబంధనలను సరళతరం చేయాలి. మౌలానా ఆజాద్ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ను పునర్వ్యవస్థీకరించి సమర్ధులైన ఉద్యోగులను నియమించి దాని మొత్తం రికార్డులను కంప్యూటరించాలి.         మహారాష్ట్ర లోని ముస్లింలలో కేవలం  2% పురుషులు, మరియు స్త్రీలలో 1.4%  పట్టభద్రులుగా (Degree Holders)ఉన్నారు. ప్రభుత్వౌద్యోగాలలో 4% మంది, మహారాష్ట్ర  పరిపాలనా విభాగం (State IAS Cadre)లో1%, IPSలో వెళ్లమీద లెక్క పెట్టవలసినంతమంది, రాష్ట్ర పోలీస్ దళంలో4% ముస్లింల సంఖ్య కలదు.  ముస్లింలలో శ్రామిక శక్తి (Work participation)32.4%గా ,స్త్రీలలో అది 12.7% గా ఉంది.అది వారి జనాభా విష్పత్తికి తగినట్లు లేదు. కాబట్టి ఉద్యోగాల కల్పనలో  ముస్లింలకు ప్రాధాన్యత అనగా పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాలలో విద్యా మరియు  ఉద్యోగాలలో 8% నుంచి  10% రిజర్వేషన్లను కమిటీ  సూచించింది.
          ముస్లింలలో ఆదిక శాతం విద్యార్దులు సెకండరీ, హైయర్ సెకండరీ తోనే విద్యను ఆపుతున్నారు. మహారాష్ట్ర లోని ముస్లింలు అదికంగా ఉన్న ప్రాంతాలలో మెరుగైన విద్యను ప్రసాదించే స్కూళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను,కాలేజీలను   స్థాపించాలి. ముస్లిం విద్యార్ధులను అదికంగా చేర్చుకొనే పాఠశాలలకు ఎక్కువ FSI,రేజిస్ట్రేషన్ , భూమి అదికంగా కల్పించాలి.  విద్యా మరియు అవస్థాపన రంగంలో పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వాయం ఉండాలి.ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో, గ్రంధాలయలు,రీడింగ్ రూములు ఏర్పాటుచేయాలి తద్వారా వాటిలో  వృతి విద్యా కౌన్సిలింగ్ అందించాలి. కంప్యూటర్ కోర్సులను నెలకొల్పాలి. పాట్యపుస్తకాలలోముస్లింల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి. సెక్యులర్ ఆంశాలను పుస్తకాలలో చేర్చాలి.మదరసా బోర్డు ను ఏర్పాటు చేసి,మదరసా విద్యార్ధులకు ఉన్నత విద్యా ప్రసాదించాలి. ఇందుకు గాను మదర్సాల ఆధునీకరణ జరపాలి. ఐ‌టి‌ఐ లాంటి వృతి విద్యా కోర్సులను మదరసాలలో నెలకొల్పలి.
          ముస్లింలు అధికంగా స్వయం ఉపాధి పై ఆధార పడి ఉన్నందున ,ముస్లిం ప్రాంతాలలో ముస్లింలు స్వయం ఉపాధి పొందటానికి గాను  ఉపయోగపడే వృత్తివిద్య శిక్షణా సంస్థలు అనగా పాలిటెక్నికులు,ఐ‌టి‌ఐ లు స్థాపించాలి. ముస్లిం వృతి పనివారు తయారు చేసి వస్తువుల మార్కెట్ కు తగిన సదుపాయాలు కల్పించాలి.మహారాష్ట్ర లో ముస్లింలకు బ్యాంకుల ద్వారా లబించే రుణాలు ఇతర వర్గాల వారికన్నా అతి తక్కువుగా ఉన్నాయి,  ఇందుకు కారణం ముస్లింలు నివసించే ప్రదేశాలను అనధికారికం గా బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే. RBI ఈ విషయం లో తగు జోక్యం  చేసుకొని, రుణాల పంపిణిని పర్యవేక్షించి, ముస్లింల పట్ల  వివక్షత చూపే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలలో సులభ ఋణ సదుపాయం కల్పించే మైక్రో ఫైనాన్స్ సంస్థలను నెలకొల్పలి. బ్యాంకు రుణాల విషయంలో హామీలు,సబ్సిడీలు,వడ్డీరేట్లను పరిగణలోనికి తిసుకోవాలి. 
          నిరుపేద  ముస్లింలను ఓ‌బి‌సి (OBC) వర్గంలో చేర్చమని, దళిత ముస్లింలను ఎస్‌సి లుగా (SC)గుర్తించమని, ఎస్‌సి/ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం లాగానే, ప్రత్యేకంగా ముస్లింల పట్ల వివక్షతను నిరోదించే చట్టాన్ని రూపొందించమని ప్రభుత్వాని కోరింది.సామాజిక అబివృద్ధిలో తగిన బాగస్వామ్యం పొందటం కోసం ముస్లింలకు  ప్రత్యేకంగా  సమాన అవకాశాల కమిషన్(Equal Opportunities Commission) ను ఏర్పాటు చేయమని మరియు దాని కార్యకలాపాలను సోషల్ ఆడిట్ చేయించమని నివేదించినది.
          ఉగ్రవాద నిరోదక కేసులలో ముస్లింల నిర్భందాలను పరిశీలించటానికి ఒక ప్రత్యేక సెల్,మరియు మహారాష్ట్ర లో జైళ్ళలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముస్లింల స్థితిగతులను పరిశీలించటానికి ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయమని  కొరింది. రాష్ట్రం లోని ఖైదీలలో 32%  మందిముస్లిం ఖైదిలే.
          వక్ఫ్ ఆస్తుల అనధికార ఆక్రమణలను వెంటనే తొలగించాలి. వక్ఫ్ భూములలోని ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే తమ అద్దె బకాయిలను చెల్లించాలి.  మహారాష్ట్ర వక్ఫ్ సర్విస్ ను ఏర్పాటు చేయాలి. బాంబె లో వక్ఫ్ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరింది. మహారాష్ట్ర మరియు దేశంలోని అన్నీ ప్రాంతాల ముస్లింలు కోరినట్లు  బొంబాయి  లోని ఇస్మాయిల్ యూసుఫ్ కళాశాల మరియు దాని పక్క స్థలాన్ని, అతి ప్రాచీన మరియు సమర్ధవంతంగా నిర్వహింపబడుతున్న అంజుమన్-ఏ-ఇస్లాం సంస్థ కు అప్పచెప్పాలని ప్రబుత్వాన్ని కోరింది. ముస్లింల న్యాయభద్దమైన డిమాండైన  పల్టన్ రోడ్ లోని హజ్ హౌస్ ను  సామాజిక,సాంస్కృతిక,మత కార్యక్రమాల నిర్వహణ కోసం ముస్లింలకు అప్పచెప్పాలని డిమాండ్ చేసింది. హజ్ హౌస్ అన్నీ వర్గాల ముస్లింల ,చిన్న,పెద్ద  విరాళాలచే  నిర్మించబడినది.ఇందుకు గాను అవసరమైతే కేంద్ర హజ్ కమిటీ సి‌ఈ‌ఓ(CEO) ఆఫీసు ను వేరే చోటకు అనగా  అద్దె లేదా ఆదికార భవనానికి మార్చమని కోరింది.   
          పోలీసు,మునిసిపాలిటీ అధికారులుంచి మసీదుల నిర్మాణంలో ముస్లిం శ్మశానాల ఏర్పాటులో  అనుమతులు పొందటంలో ఎదురైతున్న ఇబ్బందులను(ముఖ్యంగా కొల్లాపూర్,సాంపాడ(నవీముంబై) కమిటీ పేర్కొంది. ఇది పౌరుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా,మరియు వివక్షణతో కుదుకొన్నదని కమిటీ పేర్కొంది.
ఎస్‌సి/ఎస్‌టి (SC/ST) విద్యార్ధులులాగానే ముస్లింవిద్యార్ధులకు కూడా అన్నీ ప్రభుత్వ సదుపాయాలు (స్కాలర్ షిప్పులు,ఫీజులు)కల్పించాలి.స్కాలరు షిప్ లను అధికం చేయాలి. ముస్లింలు అదికంగా ఉన్న ప్రాంతాలలో (MCD) ఉర్దూ,మరాఠీ,ఇంగ్లీష్, మీడియం స్కూళ్లను, ఉన్నత విద్యా సంస్థలను  స్థాపించాలి. ఉద్యోగాల ఎంపిక కమిటీలలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఉర్దూ అకాడమీ భవనాన్ని నిర్మించాలి,ఉర్దూను ఆదికార బాష చట్ట ప్రతిపత్తి కల్పించాలి. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలోని ఉర్దూ మీడియం కానీ స్కూళ్ళలో ఉర్దూను 3వ బాష గా నేర్పాలి.  జస్టిస్ మార్కండేయ కట్జూ చెప్పినట్లు ఉర్దూ,సంసృతంలను ప్రోత్సహించాలి. కర్జాత్  లేదా మత్తెరాన్ రైల్వే స్టేషన్ పేరు ఆడంజీ పీర్ భాయి రైల్వే స్టేషన్ గా మార్చాలి.   
          కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ నివేదికలోని ఆంశాల ఆధారం గా మహారాష్ట్ర లో ముస్లింల స్థితిగతులను పరిశీలించడానికి 2007 లో ఏర్పాటుచేసిన రహమాన్ కమిటీ తన నివేదికను 2013 అక్టోబర్ లో అనగా 2014 పార్లమెంట్ సాధారణ ఎన్నికలు దగ్గిరవుతున్న వేళ సమర్పించినది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గిరౌతున్న వేళ  మహమ్మద్ –ఉర్-రహమాన్ కమిటీ సమర్పించిన  నివేదిక మహారాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించ సాగినది. బి‌జే‌పి,శివసేనలు  మత ప్రతిపాదికన రిజర్వేషన్లను వ్యతిరేకించి, రాబోయే 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఎన్నికల కుట్రగా దీనిని  బి‌జే‌పి అధికార ప్రతినిధి  అబివర్ణించగా, కాంగ్రెస్స్, ఎన్‌సి‌పి నివేదికలోని ఆంశాలపట్ల అనుకూలతను వ్యక్తం చేసినాయి.
          కమిటీ నివేదికను పరిశీలించి కాబినెట్ ఆమోధానికి పంపుతామని, ముస్లింల అభివృద్ధికి, వారిని జాతీయ జీవన స్రవంతి లో భాగస్వాయులు చెయడానికి అవసరమైన అన్నీ సిఫారసులను అమలు చేస్తామని మహారాష్ట్ర మైనారిటీ అబివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఆరిఫ్ (నసిమ్) ఖాన్ అన్నారు.
          గత 66 సం: ల నుంచి ప్రతి  రాజకీయ పక్షము ముస్లింలను వోటు బ్యాంకు గానే పరిగణించున్నది గాని ముస్లింల అబివృద్ధికి, వారిని జాతీయ జీవన స్రవంతి లోనికి చేర్చటానికి  ఏ మాత్రం సహాయ పడలేదు. ఉద్యోగ, విద్యా రంగాలలో ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించటానికి ఎన్నో న్యాయ పోరాటాలు చేయ వలసి వచ్చినది. 2010 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను హై కోర్ట్ కొట్టివేయగా, ప్రస్తుతం ఆ విషయం సుప్రీం కోర్ట్ పరిశీలనలో ఉంది.మనదేశం లో ముస్లింలు 3 వర్గాలుగా ఉన్నారు.ఆషరాఫ్స్,అజలఫ్స్,అరజల్స్. మహారాష్ట్ర మరియు భారత దేశంలోని అనేక రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా  ఉంది. ఇందుకు గాను కొంతమంధి  ముస్లింలను ఎస్‌సి(SC) లలోనూ(దళిత ముస్లింలు),ఇతర వెనుకబడిన కులాలకు చెందిన నిరుపేద ముస్లింలను(అజలఫ్స్) OBCలలోనూ చేర్చవచ్చు. దీనివలన ఎవరికి ఇబ్బంధి లేకుండా ముస్లింల అబ్యున్నతి సాదించ వచ్చు.

29-11-13 గీటురాయి లో ప్రచురితం 




No comments:

Post a Comment