25 February 2024

భుట్టో ప్రేమలేఖలు

 



పాకిస్థాన్‌ రాజకీయాలు ఇప్పటికీ నాకు ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి.. ఎందుకంటే- ఒకప్పటి నా జీవితం వాళ్లతోనే పెనవేసుకు ఉండేది. పాకిస్థాన్‌లో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే- జ్ఞాపకాల పొరల నుంచి అనేక సంఘటనలు గుర్తుకొచ్చాయి.

పాకిస్థాన్‌ రాజకీయాలు ఇప్పటికీ నాకు ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి.. ఎందుకంటే- ఒకప్పటి నా జీవితం వాళ్లతోనే పెనవేసుకు ఉండేది. పాకిస్థాన్‌లో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే- జ్ఞాపకాల పొరల నుంచి అనేక సంఘటనలు గుర్తుకొచ్చాయి. జుల్ఫికర్‌ ఆలీ భుట్టోతో కలిసి చదివిన రోజులు, తన ప్రేమకు నేను అందించిన సాయం... ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారి చుట్టుముట్టాయి.

సుమారు 75 ఏళ్ల క్రితం- నేను ముంబాయిలో సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్లో చదువుతూ ఉండేదాన్ని. ముంబాయిలోని సంపన్నుల పిల్లలందరూ ఆ స్కూల్లోనే చదివేవారు. సురయ్యా కరెంబోయ్‌, జుల్ఫికర్‌ ఆలీ భుట్టో, మనోహర్‌ శిరోద్కర్‌... వీళ్లందరూ నా స్నేహితులు. ఒక్కొక్కరికి ఒకో ముద్దు పేరు. భుట్టోను జుల్ఫిఅని పిలిచేవాళ్లం. జుల్ఫి నాన్న- షహనవాజ్‌ భుట్టో జూనాఘడ్‌ సంస్థానంలో దివాన్‌. అంతే కాకుండా వైస్రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో సభ్యుడు కూడా! మా నాన్న (రాజా ధన్‌రాజ్‌గిరి)కు మంచి స్నేహితుడు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా ఎదురుగా మా ప్యాలెస్‌ ఉండేది. మా ప్యాలెస్‌ పక్కనే జూల్ఫి నాన్నగారికి కూడా కొన్ని భవంతులుండేవి. ఆయన అప్పుడప్పుడు అక్కడకి వస్తూ ఉండేవారు.

నేను, మా తమ్ముళ్లిద్దరు, సురయా- అప్పుడప్పుడు గేట్‌వే ఆఫ్‌ ఇండియా దగ్గరకు వెళ్లేవాళ్లం. మా యూరోపియన్‌ గవర్నెస్‌ అక్కడ మాకు అక్కడ పిస్తా, బాదం పప్పు కొని పెట్టేది. గేట్‌ వే దగ్గర కూర్చుని వాటిని తినటం మాకొక సరదా! ఆ రోజుల్లో మా అందరికీ గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తి సాము- ఇలా ఏదో ఒకటి నేర్పించేవారు. నాకు గుర్రపు స్వారీ నేర్పించారు. ఇతర ఆటల్లో అంత ప్రావీణ్యం ఉండేది కాదు. సురయా మాత్రం అథ్లెటిక్స్‌లో ముందు ఉండేది. ప్రీ ఒలింపిక్స్‌ హైజంప్‌ కాంపిటేషన్‌లో గెలిచి... ఒలింపిక్స్‌కు కూడా ఎంపికయింది. కానీ వాళ్ల నాన్న( ఇస్మాయిల్‌ చుర్రంబోయ్‌) సురయాను ఒలింపిక్స్‌కు పంపటానికి ఒప్పుకోలేదు. సురాయా అడిగితే- ‘‘నువ్వు అమ్మాయివి. నీ భవిష్యత్‌ అది కాదు’’ అన్నారట. దాంతో తను ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే తను ఒలింపిక్స్‌కు వెళ్ళి మెడల్‌ తెచ్చేదేమో! ఆ విషయాన్ని పక్కన పెడితే- సురయా చూడటానికి ముట్టుకుంటే కమిలిపోతుందా? అన్నంత తెల్లగా, అందంగా ఉండేది. దీంతో ఆమెకు స్కూల్లో అబ్బాయిల ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండేది. అలా తన వెంటపడిన వారిలో జూల్ఫి కూడా ఒకడు. సురయాకు కూడా తనంటే ఇష్టమే ఉండేది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచేది. వారిద్దరూ ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. వాళ్లిద్దరూ నా స్నేహితులు కావటంతో - ఆ ఉత్తరాలను రహస్యంగా ఒకరికొకరికి అందించే బాధ్యత నాపై పడింది. ఇలా కొద్ది కాలం నడిచింది. ఎలా తెలిసిందో తెలియదు కానీ... వీరి ప్రేమ వ్యవహారం జుల్ఫి వాళ్ల నాన్న (సర్‌ షా నవాజ్‌)కు తెలిసిపోయింది. ఒక రోజు ఆ విషయం మాట్లాడటానికి మా నాన్న దగ్గరకు ఆయన వచ్చారు. తెలిసిన సంబంధం. పైగా సమాజంలో దాదాపు సరిసమానపు హోదా ఉన్నవారు. దాంతో షా నవాజ్‌కు ఈ సంబంధం కలుపుకోవటానికి అభ్యంతరమేమీ లేదు. సురయా తల్లితండ్రులతో మాట్లాడమని నాన్నతో చెప్పారు. సురాయా వాళ్ల అమ్మ మా ఇంటికి తరచూ వస్తూ ఉండేది. ఒక రోజు మా నాన్న- సురయా వాళ్ల అమ్మ దగ్గర ఈ విషయం లేవనెత్తారు. అప్పుడు- ఆమెకు ఈ ప్రేమ వ్యవహారం ఇష్టం లేదని తెలిసింది. మా నాన్న- ఆమెకు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు. ఆమె వినలేదు. అంతేకాదు. ఈ విషయం తన భర్తకు చెప్పవద్దని హెచ్చరించింది. దీనితో నాన్న- ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు.

ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. ఇలా గొడవలు జరుగుతున్న సమయంలోనే- జుల్ఫి ఉన్నత విద్య కోసం అమెరికాలోని బర్క్‌లీ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. అప్పటికే ఆ విశ్వవిద్యాలయంలో సురయా కజిన్‌ ఆసీఫ్‌ కూడా చదువుతున్నాడు. జూల్ఫీకి హాస్టల్‌లో రూమ్‌ కావాల్సి వచ్చింది. ఆసీఫ్‌, జుల్ఫి - ఇద్దరూ భారతీయులే కాబట్టి విశ్వవిద్యాలయం అధికారులు ఇద్దరికీ ఒక రూమ్‌ కేటాయించారు. రూమ్‌లో జూల్ఫీ చేరేనాటికి ఆసీ్‌ఫతో తనకు పెద్ద స్నేహం లేదు. జుల్ఫి రూమ్‌లో చేరిన వెంటనే తన దుస్తులన్నీ బయటకు తీసి హ్యాంగర్లకు తగిలించుకున్నాడు. తన సామాన్లన్నీ అరల్లో పెట్టుకున్నాడు. తనకు కేటాయించిన స్టడీ టేబుల్‌ మీద సురయా ఫొటో ఉన్న ఫ్రేమ్‌ పెట్టాడు. ఆ ఫొటోను చూసిన వెంటనే ఆసీఫ్‌ షాక్‌ తిన్నాడు. విషయం అర్థమయింది. కానీ నిర్ధారణకు రావాలి కదా! అందుకోసం జుల్ఫితో ఆసీఫ్‌ ఎక్కువ స్నేహం నటించటం మొదలుపెట్టాడు. వ్యక్తిగత విషయాలను అడగటం మొదలుపెట్టాడు. అసలు విషయం తెలియని జుల్ఫి అన్ని విషయాలు ఆసీ్‌ఫతో పంచుకోవటం మొదలుపెట్టాడు. చివరకు సురయా గురించి కూడా చెప్పేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే - ఆసీఫ్‌- ఇంట్లో వాళ్లను చూడాలనే మిషతో ముంబాయి వచ్చేశాడు. సురయా వాళ్లింటికి ప్రతి రోజు వెళ్లటం మొదలుపెట్టాడు. ఆసీఫ్‌ బంధువే కావటంతో సురాయా వాళ్లింట్లో పెద్ద అభ్యంతరాలు ఉండేవి కావు. నెమ్మదిగా సురాయా అమ్మ, నాన్న... ఆసీ్‌ఫను ఇష్టపడటం మొదలుపెట్టారు.

బొంబాయిలో జరుగుతున్న విషయాలేమి- జుల్పీకి తెలియవు. ఒక వైపు దూరాభారం. మరో వైపు పరీక్షల హడావిడి. ఈలోపు సురయా నుంచి ఉత్తరాలు రావటం మానేసాయి. ఎందుకో తెలుసుకొనే లోపులోనే సురయా- ఆసీ్‌ఫల వివాహం నిశ్చమయిపోయింది. నిఖా వైభవంగా జరిగింది. నిఖా చేయటానికి ఆ సమయంలో ముస్లింలందరికీ పెద్ద అయిన ఆగాఖాన్‌ వచ్చారు. ఈ సంఘటనల నేపథ్యంలోనే- దేశ విభజన జరిగింది. జుల్ఫీ కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. మేమందరం బొంబాయిలో ఉండిపోయాం. 1951లో నుసరత్‌ను జుల్ఫీ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి నేను వెళ్లలేదు. ఆ తర్వాత మా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. అయితే ఎప్పుడైనా తను బొంబాయి వస్తే తప్పనిసరిగా నన్ను కలిసేవాడు. మేము పాత జ్ఞాపకాలు నెమరువేసుకొనేవాళ్లం. సరదగా నవ్వుకొనేవాళ్లం. మనకు పాకిస్థాన్‌కు మధ్య వైరం బాగా పెరిగిన రోజుల్లో ఒక సారి జుల్ఫీ- ఇందిరా గాంధీని కలవటానికి ఢిల్లీ వచ్చాడు. అశోక హొటల్‌లో దిగాడు. అక్కడి నుంచి నాకు ఫోన్‌ చేశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక- ‘‘మీ భారత్‌కు ఏం కావాలి?’’ అని అడిగాడు. ఒక్క క్షణం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ‘‘స్నేహం’’ అని సమాధానమిచ్చా. అవే నేను తనతో మాట్లాడిన చివరి మాటలు.

1979, ఏప్రిల్‌ నాలుగో తేదీన నేను, శేషేంద్ర బొంబాయి వెళ్లాం. అక్కడ ఒబరాయ్‌ హోటల్‌లో దిగాం. ఆ మర్నాడు ఉదయం లేచి చూస్తే- పత్రికల్లో జుల్ఫీని ఉరితీశారనే వార్త కనిపించింది. నాకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. ఎందుకో తెలియదు.. స్నేహితుడు, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత సర్ధార్‌ జాఫ్రీ- సరిహద్దు అనే కవితలోని తుం భీ గులాం థే.. హం భీ గులాం థేఅనే పంక్తులు గుర్తుకొచ్చాయి. ఆ రోజంతా భారంగానే గడిచింది. ఆ సాయంత్రం మమల్ని సురాయా విల్లింగ్టన్‌ క్లబ్‌లో డిన్నర్‌కు పిలిచింది. మేమిద్దరం వెళ్లాం. పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. ఎవ్వరూ జుల్ఫీ గురించి మాట్లాడలేదు. కానీ అందరి హృదయాల్లోను ఉన్న ఆవేదన తెలుస్తూనే ఉంది. డిన్నర్‌ పూర్తయిన తర్వాత సురయా మమల్ని సాగనంపటానికి కారు దాకా వచ్చింది. నా చేతులు పట్టుకుంది. తన చేతులు వణుకుతున్నాయి. తన కళ్లల్లో నీటి పొర..

ఆ తర్వాత కూడా నేను ఎప్పుడూ జుల్ఫీ భార్య నుసరత్‌తో కానీ, కూతురు బెనజీర్‌తో కానీ మాట్లాడలేదు. బహుశా మా స్నేహం గురించి వాళ్లకు తెలిసిఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని చిన్ననాటి స్నేహాలు మనస్సులోనే గుర్తులుగా పదిలంగా ఉండిపోతాయి. జుల్ఫీ కూడా అలాంటి ఒక గుర్తే!

 

 

-ప్రిన్సెస్‌ ఇందిరాదేవి ధనరాజ్‌గిర్‌

ABN ఛానల్ ఫాలో అవ్వండి

 

No comments:

Post a Comment