మహ్మద్ ఇర్తజా హుస్సేన్ 1905 నవంబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్‌షహర్ జిల్లా, దిబాయిలో ఒక సంపన్న, ఉన్నత శ్రేణి కుటుంబంలో జన్మించారు. మౌల్వీ అలీ హుస్సేన్ కుమారుడైన మహ్మద్
ఇర్తజా హుస్సేన్ కు రెండేళ్ల వయసున్నప్పుడు తల్లి, తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు
తండ్రి మరణించారు.
బ్రిటిష్ ప్రభుత్వంలో కీలకమైన పరిపాలనా పదవులు మరియు హోదాలు కలిగిన తన
పెద్ద సోదరుడి పర్యవేక్షణ మరియు ఆప్యాయతల మధ్య పెరిగిన ఇర్తజా హుస్సేన్
సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం కలిగి ఉన్నారు.
అయితే, దిబాయిలోని కుబైర్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే మహ్మద్ ఇర్తజా హుస్సేన్ లో
జాతీయవాద భావాలు మొలకెత్తాయి. ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమాలో పాల్గొన్నారు
1922లో మహ్మద్ ఇర్తజా హుస్సేన్ దిబాయి
(బులాంద్‌షహర్)లో హైస్కూల్ విద్యను పూర్తి చేసి, అలీగఢ్‌లోని ముస్లిం
యూనివర్సిటీ ఇంటర్మీడియట్ కళాశాలలో చేరారు. మహ్మద్ ఇర్తజా హుస్సేన్ 1924లో ఇంటర్మీడియట్, 1926లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.) మరియు 1929లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి. (LL.B.) పట్టాలను పొందారు.
మహ్మద్ ఇర్తజా హుస్సేన్ న్యాయవిద్య పూర్తి చేసిన తర్వాత, మొదట దిబాయిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం
గ్వాలియర్‌కు వెళ్లారు, అక్కడ జ్యుడీషియల్ ఆఫీసర్ (న్యాయాధికారి) పదవికి ఎంపికయ్యారు. కాని జాతీయవాద
భావాల కారణంగా, మహ్మద్ ఇర్తజా హుస్సేన్ గ్వాలియర్‌లోని ప్రభుత్వ పదవిని తిరస్కరించి, బులాంద్‌షహర్‌లో తిరిగి న్యాయవాద వృత్తిని చేపట్టారు.
1937 నాటికి, ఇర్తజా హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యునిగా అధికారికంగా
చేరారు. 1940లో మహాత్మా గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించినప్పుడు, బులంద్‌షహర్ జిల్లా నుండి ఇర్తజా హసన్ మొదటి సత్యాగ్రహిగా ఎంపికయ్యారు. సత్యాగ్రహం
పాల్గొని 1941లో బులంద్‌షహర్ జైలులో ఖైదుశిక్ష అనుభవించారు.
1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఇర్తజా హుస్సేన్ అరెస్ట్ చేసి మొదట బులంద్‌షహర్ జిల్లా జైలులో ఉంచి, ఆ తర్వాత బరేలీ సెంట్రల్ జైలుకు తరలించారు. పిదప ఇర్తజా హుస్సేన్ ను తరువాత అలహాబాద్‌లోని నైని జైలుకు తరలించారు, అక్కడ రఫీ అహ్మద్ కిద్వాయ్ (1894-1954), లాల్ బహదూర్ శాస్త్రి (1904-1966), మరియు గోవింద్ సహాయ్ (190-1967) వంటి ప్రముఖులతో పాటు ఇర్తజా హుస్సేన్ ను ఖైదు చేశారు.
రెండు సంవత్సరాల తరువాత, 1944 ఆగస్టులో విడుదలైన ఇర్తజా
హుస్సేన్ ను దిబాయికి తిరిగి రాగానే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా
నిషేధిస్తూ బహిష్కరణ ఉత్తర్వు జారీ చేయబడింది తిరిగి వచ్చిన తర్వాత కూడా, ఇర్తజా హుస్సేన్ కొనసాగించిన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా బులంద్‌షహర్‌లో
మరిన్ని అరెస్టులు మరియు జైలు శిక్షలు అనుభవించారు.
1947లో భారత స్వాతంత్ర్యం తరువాత, ఇర్తజా హసన్ అప్పటి ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి నిసార్ అహ్మద్ ఖాన్
షేర్వానీ (1887-1956)కి ప్రధాన ప్రైవేట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. దేశ విభజన సమయం లో ఇర్తజా
హుస్సేన్ లక్నోలోని తన ఇంటిని నిరుపేద
కుటుంబాల కోసం ఒక సహాయ కేంద్రంగా మార్చి, నిరాశ్రయులైన అనేక మందికి
సహాయం చేశారు.
కాంగ్రెస్ పతాకం కింద ఎన్నికలలో పోటీ చేసి, మీరట్ నగరంలో సీట్లు గెలుచుకొని, తదనంతరం ఇర్తజా హుస్సేన్ బులంద్‌షహర్ వాయువ్య నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇర్తజా హుస్సేన్ 1950 నుండి 1966 వరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభలో నిరంతరాయంగా పనిచేశారు.
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ అంతటా
హింసాత్మక మత అల్లర్లు చెలరేగినప్పుడు, ఇర్తజా హుస్సేన్ తన ప్రాణాలకు
తెగించి, అణగారిన వారిని రక్షించడానికి, దుండగులను ఎదుర్కోవడానికి
నిర్భయంగా ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.
తమ ప్రజా జీవితంలో ఇర్తజా హసన్ రెండుసార్లు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యునిగా
పనిచేశారు, సుదీర్ఘకాలం పాటు ప్రావిన్షియల్
కాంగ్రెస్ కమిటీ (PCC) సభ్యునిగా ఉన్నారు మరియు బులాంద్‌షహర్‌లో
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు.
దిబాయిలోని కుబైర్ ఇంటర్ కాలేజీలో నిర్వహణ
బాధ్యతలు నిర్వహించారు. ఇంకా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కోర్టుకు
ఎన్నికైన సభ్యత్వం మరియు అలీఘర్‌లోని అఖిల భారత ముస్లిం విద్యా సదస్సు (All India Muslim Educational
Conference) నిర్వహణ
కమిటీలో ఇర్తజా హుస్సేన్ చేసిన కృషి మరువలేనిది..
1966
జూన్ 13న బులాంద్‌షహర్‌లో గుండెపోటుతో ఇర్తజా హుస్సేన్ కన్నుమూశారు. భారతదేశ
స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చేసిన ప్రశంసనీయమైన త్యాగాలను, అప్పటి ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్
(తరువాత ముఖ్యమంత్రి) బాబూ బనారసీ దాస్ (1912-1985) వంటి సమకాలీకులు ఎంతో గౌరవించేవారు.
రెఫెరెన్స్/ఆధారాలు
• అలుమ్నీ డైరెక్టరీ (1974). అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్. కరాచీ: సర్ సయ్యద్ యూనివర్సిటీ
ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
• యూపీ శాసనసభ స్పీకర్ బాబూ బనారసీ దాస్
జారీ చేసిన స్వాతంత్ర్య పోరాట సహకార ధృవీకరణ పత్రం (రిఫరెన్స్ నం. 7601/Adv/77). లక్నో: శాసనసభ సచివాలయం, ఉత్తరప్రదేశ్.
• శ్రీ ఇర్తజా హుస్సేన్ B.A. LL.B., M.L.A. సంక్షిప్త జీవిత చరిత్ర.
• తన తండ్రి జీవితానికి సంబంధించిన
ముఖ్యమైన పత్రాలను రచయితతో పంచుకున్న దివంగత ఇర్తజా హసన్ కుమారుడు శ్రీ రిజ్వానుల్
హసన్ ఫజ్లీకి కృతజ్ఞతలు.
• గమనిక: ప్రముఖ కవి దివంగత నిదా ఫజ్లీ (1938-2016) దివంగత ఇర్తజా హసన్‌కు బంధువు.
No comments:
Post a Comment