28 August 2026

కేరళ సూఫీ సన్యాసులు Sufi Saints of Kerala

 

 

కేరళలో సూఫీ సన్యాసులు ప్రజల మధ్య నివసిస్తూ, ప్రజల  కష్టాలకు స్పందిస్తూ, ఐక్యత మరియు ప్రేమ యొక్క సందేశాన్ని అందించారు. సహాయం కోరి వచ్చిన వారందరికీ మార్గదర్శకత్వo అందించారు.  స్వస్థతను మరియు సలహాలను అందించారు, మరియు ప్రాంత ప్రజల సామాజిక జీవితంపై చెరగని ముద్ర వేసారు.

కేరళం లోని అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరువనంతపురం సమీపంలోని భీమాపల్లి దర్గా షరీఫ్. ఇక్కడ ఆధ్యాత్మిక శక్తులకు ప్రసిద్ధి చెందిన సయ్యదున్నీసా భీమా బీవి సమాధితో పాటు, ఆమె కుమారుడి సమాధి కూడా ఉంది. ఇక్కడ జరిగే చందనకుడం మహోత్సవం అని పిలువబడే వార్షిక ఉర్స్, అన్ని వర్గాల నుండి వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ జనసమూహంలో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. వారు ఆరోగ్యం, కుటుంబ విషయాలు లేదా దీర్ఘకాలిక కష్టాల నుండి ఉపశమనం కోసం మొక్కులతో వస్తారు, మరియు చాలా మంది ఇక్కడ ఓదార్పు పొంది ప్రతి సంవత్సరం తిరిగి వస్తుంటారు.

కేరళ సూఫీ సాహిత్య సంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన రచన 'ముహిద్దీన్ మాల'. ఇది ఖాదిరియా పరంపర స్థాపకుడైన, పదకొండవ శతాబ్దానికి చెందిన బాగ్దాద్ సూఫీ సన్యాసి షేక్ హజ్రత్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ జీవితాన్ని, అద్భుతాలను కీర్తించే ఒక భక్తి కావ్యం. 'బహ్జా', 'తహ్మిలా' వంటి అరబిక్ రచనల నుండి, అలాగే పదిహేనవ శతాబ్దానికి చెందిన 'ముహిద్దీన్ అందవర్ మాల' వంటి తమిళ రచనల నుండి ప్రేరణ పొంది, 'ముహిద్దీన్ మాల' కావ్యాన్ని 1604లో కోజికోడ్‌కు చెందిన ఖాదీ ముహమ్మద్ రచించారు. దీని అపారమైన ప్రజాదరణ, మలబార్ ప్రాంతమంతటా ఖాదిరియా తరికా వ్యాప్తి చెందడంలో కీలక పాత్ర పోషించింది.

'ముహిద్దీన్ మాల'ను ఇళ్లలో, కుటుంబ సమావేశాలలో విస్తృతంగా పఠించేవారు. దీనిని చదవగలగడం అక్షరాస్యతకు చిహ్నంగా పరిగణించబడగా, సాంప్రదాయకంగా వివాహానికి ముందు యువతులు దీనిని కంఠస్థం చేయడం జరుగుతుంది.  ప్రత్యేక సందర్భాలలో దీనిని పఠించడం వల్ల దైవిక ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్ముతారు..

అలాగే మరొక సూఫీ సన్యాసి సయ్యద్ ఇస్మాయిల్ బుఖారీ మరియు అతని కుమారుడు సయ్యద్ ఫక్రుద్దీన్ బుఖారీ, తమ మత బోధనలు మరియు ఆదర్శప్రాయమైన జీవితాల ద్వారా కొచ్చిలోని ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషించారు. మసీదు సమీపంలో ఉన్న వారి మందిరం, స్థానికంగా ఆరాధన ప్రదేశంగా మిగిలిపోయింది మరియు భక్తులు తరచుగా సందర్శిస్తారు.

ఉత్తరాన మలప్పురం జిల్లాలో, మాంబూరం తంగళ్‌గా సుప్రసిద్ధుడైన సయ్యద్ అలవీ తంగళ్ గారి సమాధి ఉంది. సయ్యద్ అలవీ తంగళ్ ఒక ఆధ్యాత్మిక గురువు మరియు పండితుడు. సయ్యద్ అలవీ తంగళ్ జీవితం బోధన, స్వస్థత చేకూర్చడం మరియు కష్టకాలంలో సామాన్యులకు అండగా నిలవడంపై కేంద్రీకృతమై ఉంది. మలబార్ ప్రాంతంలోని ఎందరికో సయ్యద్ అలవీ తంగళ్ ఒక మార్గదర్సకుడు.

కేరళలోని అనేక మసీదులకు ముహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ, షేక్ రిఫాయీ, మరియు షేక్ అబుల్ హసన్ షాదిలీ వంటి ప్రఖ్యాత సూఫీ గురువుల పేర్లు పెట్టారు. వీటిని సాధారణంగా వరుసగా ముహియుద్దీన్ మసీదు, రిఫాయీ మసీదు, మరియు షాదిలీ మసీదు అని పిలుస్తారు. నవజాత మగపిల్లలకు ముహియుద్దీన్ అని, ఆడపిల్లలకు రబియా అని పెట్టే అలవాటు కలదు.

కేరళలోని సూఫీ సాధువులు తమ సందేశాన్ని నిరంతర కార్యాచరణ ద్వారా ఎక్కువగా వ్యాప్తి చేశారు. భీమాపల్లిలోని భీమా బీవి ఖ్యాతి, తమ ఇళ్లలో ఏ మతాన్ని ఆచరించినా సరే, ఉపశమనం అవసరమైన వారిని ఆకర్షించింది. మాంబూరంలో, మాంబూరం తంగళ్‌ గారి సలహా మరియు స్వస్థపరిచే సాన్నిధ్యం కూడా అదే విధమైన ఆకర్షణను సృష్టించాయి.

మలబార్ అంతటా, వివిధ తంగళ్ వంశాలు మరియు స్థానిక పీర్లు కేంద్రాలను నిర్వహించేవారు, అక్కడ ఆధ్యాత్మిక మార్గదర్శనంతో పాటు ఆచరణాత్మక మద్దతు కూడా లభించేది. కేరళ లోని సూఫీ సన్యాసులు కఠినమైన విభజనల కంటే ఉమ్మడి మానవ విలువలకు ప్రాధాన్యతనిస్తూ, అందరినీ కలుపుకొనిపోయే భావనను పెంపొందించడానికి సహాయపడ్డారని తెలుస్తుంది.

భీమాపల్లిలో పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు ఉర్స్ లో పెద్ద సంఖ్య లో పాల్గొంటారు.  మలబార్‌లోని మాంబూరం మరియు ఇతర చిన్న మఖమ్‌లలో, హిందూ ప్రజలు ఇప్పటికీ ఆశీర్వాదం కోసం, నిశ్శబ్ద ప్రార్థన కోసం, లేదా మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు.

సూఫీ సన్యాసుల ఉర్స్ ఉత్సవాలు  ఇటీవలి దశాబ్దాలలో మత సామరస్యానికి చిహ్నంగా నిలిచినాయి. సూఫీ సన్యాసుల  'బీమా బీవీ దర్గా' మరియు 'మాంబురం తంగల్ మఖాం' నేటికీ అన్ని వర్గాల ప్రజల పొందుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా తంగల్ కుటుంబాలు మరియు స్థానిక 'పీర్ల' (మత పెద్దల) ఆధ్వర్యంలో నడిచే ఇతర కేంద్రాలకు కూడా ప్రజల ఆదరణ లబిస్తుంది

 

 

No comments:

Post a Comment