15 October 2026

సానిటే బెలైర్, హైతీ విప్లవకారిణి 1781-1802 Sanité Bélair Haiti revolutionary1781-1802

 

వచనం చిత్రం కావచ్చు


సానిటే బెలైర్ (Sanité Bélair) హైతీ విప్లవంలో (Haitian Revolution) ఫ్రాన్స్ వలసపాలనకు మరియు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ధీరవనిత, సైనిక అధికారిణి మరియు హైతీ జాతీయ నాయకురాలు. విప్లవకారుడు జీన్-జాక్వెస్ డెస్సాలినెస్, సానిటే బెలైర్ ను  "ది టైగ్రెస్" (ఆడపులి) అని అభివర్ణించారు

సుజాన్ బెలైర్‌ పుట్టుకతోనే ఒక 'అఫ్రాంచి' (Affranchis - స్వేచ్ఛ పొందిన నల్లజాతీయురాలు) అయినప్పటికీ, తన తోటి ప్రజల విముక్తి కోసం పోరాడాలని నిర్ణయించుకుంది.

1781లో సెయింట్-డొమింగ్యూ (ప్రస్తుత హైతీ)లో జన్మించిన సుజాన్ బెలైర్‌ తన భర్త చార్లెస్ బెలైర్‌తో కలిసి హైతీ విప్లవ పోరాటంలో చేరారు, మరియు క్రమశిక్షణ, నాయకత్వం, మరియు ధైర్యం ద్వారా త్వరగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. టూసైంట్ లూవర్టూర్ సైన్యంలో సార్జెంట్ నుండి లెఫ్టినెంట్‌గా ఎదిగి, బానిసత్వాన్ని అంతం చేయడానికి మరియు కాలనీ ప్రజలకు స్వయంప్రతిపత్తిని సాధించడానికి జరిగిన వ్యవస్థీకృత పోరాటంలో సుజాన్ బెలైర్‌ భాగమయ్యారు. లార్టిబోనైట్ ప్రాంతంలోని బానిసలందరినీ ఏకం చేసి ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించడంలో సుజాన్ బెలైర్‌ కీలక పాత్ర పోషించింది

చారిత్రక కథనాల ప్రకారం సుజాన్ బెలైర్‌ దృఢ సంకల్పం మరియు సూత్రబద్ధత కలిగిన వ్యక్తి, తాను సేవ చేసిన ఆశయాన్ని గాఢంగా విశ్వసించిన వ్యక్తి. 1800ల ప్రారంభంలో ఫ్రెంచ్ దళాలు కాలనీపై తిరిగి నియంత్రణ సాధించడానికి ప్రయత్నించినప్పుడు, బెలైర్ విప్లవకారుల పక్షాన నిలబడింది.

1802లో, సుజాన్ బెలైర్‌ ఫ్రెంచ్ సైనికుల చేతికి చిక్కింది అక్టోబర్ 5, 1802 న ఫ్రెంచ్ సైనిక కోర్టు సుజాన్ బెలైర్‌ కు మరణశిక్ష విధించింది. స్త్రీ అనే కారణంతో సానిటే తల నరికి (Decapitation) చంపాలని చూశారు. కానీ, సుజాన్ బెలైర్‌ తాను ఒక సైనికురాలినని, తన భర్తలాగే తనను కూడా తుపాకీతో కాల్చి చంపాలని (Firing Squad) ధైర్యంగా డిమాండ్ చేసి సాధించుకుంది. శిక్ష అమలు చేసేటప్పుడు కళ్లకు గంతలు కట్టుకోవడానికి నిరాకరించి, నిటారుగా నిలబడి "Viv libète! A ba esclavaj!" (స్వేచ్ఛ వర్ధిల్లాలి! బానిసత్వం నశించాలి!) అని నినదిస్తూ కేవలం 21 ఏళ్ల వయసులోనే ప్రాణాలర్పించింది.

సుజాన్ బెలైర్‌ మరణించిన రెండు సంవత్సరాల తర్వాత (1804 లో) హైతీ ప్రపంచంలోనే మొట్టమొదటి స్వతంత్ర నల్లజాతి రిపబ్లిక్‌గా అవతరించింది. హైతీ ప్రభుత్వం సానిటే బెలైర్‌ను "నేషనల్ హీరోయిన్" (జాతీయ వీరవనిత) గా గుర్తించింది.

నేడు, సానిటే బెలైర్ హైతీ విప్లవ వీరవనితలలో ఒకరిగా గౌరవించబడుతోంది. 2004 లో సానిటే బెలైర్ చిత్రం హైతీ కరెన్సీ 10 గూర్డెస్ (10 Gourdes) పై ముద్రించి గౌరవించారు., హైతీ నోట్లపై ముద్రించబడిన రెండవ మహిళగా సానిటే బెలైర్ చరిత్రకెక్కారు

కళాకారులు, చరిత్రకారులు, విద్యావేత్తలు సానిటే బెలైర్ కథ గుర్తుండిపోయేలా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. విముక్తి పోరాటాలకు వాస్తవమైన, శక్తివంతమైన మరియు అత్యవసరమైన సహకారం అందించిన ఎందరో మహిళలకు సానిటే బెలైర్ ప్రతీక.

 

 

 

No comments:

Post a Comment