ఆధునిక భారతదేశ నిర్మాణంలో భారతదేశంలోని సోషలిస్ట్ సంప్రదాయం సరి అయిన ఉత్తమ స్థానం పొందవలసి ఉంది. స్వాతంత్ర్య పోరాట లక్ష్యాల సాదనలో సోషలిస్ట్ నాయకులు అందించిన సహకారం మరువలేనిది.
భారతదేశ ప్రజలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి
వ్యతిరేకంగా రాజకీయ స్వేచ్ఛ కోసమే కాకుండా, మరింత
ముఖ్యంగా సమానమైన సామాజిక,
ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి కూడా
పోరాడారు.
ఆచార్య నరేంద్ర దేవ్, రామ్ మనోహర్ లోహియా, జయ ప్రకాష్ నారాయణ్, మినూ మసాని, అశోక్ మెహతా, అచ్యుత్ పట్వర్ధన్ వంటి సోషలిస్ట్ నాయకులు స్వాతంత్ర్య పోరాట కార్యక్రమాలలో సమానత్వం మరియు సామాజిక న్యాయం యొక్క సూత్రాలను చేర్చడానికి దృఢంగా పోరాడారు మరియు స్వాతంత్ర్యానంతర కాలంలో మధు లిమాయే, కర్పూరి ఠాకూర్, చంద్ర శేఖర్, కిషన్ పట్నాయక్, జార్జ్ ఫెర్నాండెజ్, మృణాల్ గోర్ మరియు జస్టిస్ సచార్ వంటి నాయకులు ఆ లక్ష్యాలను సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు.
భారతీయ విలువలు మరియు నైతికతలను రాజీ పడకుండా ఆధునిక పోటీ ప్రపంచం యొక్క అవసరాలను తీర్చడానికి భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చనే దాని గురించి పైన పేర్కొనబడిన సోషలిస్ట్ నాయకులు తమ అభిప్రాయాలు వివరించారు.. విభజన శక్తుల వలన ఎదురయ్యే ముప్పు గురించి వారు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు మరియు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రధాన అడ్డంకిగా భావించే మతతత్వం మరియు కులతత్వం యొక్క ఉపద్రవాన్ని నిర్మూలించడానికి వివిధ మార్గాలను సూచించారు.
ప్రముఖ సోషలిస్ట్ మధు లిమాయే సరళమైన జీవితాన్ని గడిపారు మరియు రాజకీయ జీవితంలో సమానత్వం అనే ఆలోచనకు ప్రతిపాదకుడు. మతతత్వ మరియు వేర్పాటువాద శక్తులు ఎదుర్కొంటున్న సవాలు పట్ల మధు లిమాయే తీవ్ర ఆందోళన చెందారు. భారత రాజ్యాన్ని బలోపేతం చేయడానికి కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయాలని ప్రతిపాదించారు. మధు లిమాయే మతతత్వ శక్తులను అద్భుతంగా విమర్శించినప్పటికీ, కాంగ్రెస్ వినియోగదారుల పెట్టుబడిదారీ విధానాన్ని ఆమోదించడం జరిగింది. కాని సమానత్వ సమాజాన్ని స్థాపించడంలో వినియోగదారులవాదం ప్రధాన అవరోధం.
చంద్ర శేఖర్ ఆచరణాత్మక రాజకీయ నాయకుడుగా ఉన్నారు. చంద్ర శేఖర్ ఉదారవాద వ్యతిరేకి. చంద్ర శేఖర్ తన సైద్ధాంతిక విశ్వాసాలలో స్పష్టత కలిగి ఉండి అంతర్జాతీయ విధానాలలో తన అభిప్రాయాలను ఎవరి ప్రభావానికి లొంగకుండా వెల్లడించే రాజకీయ ధైర్యం కలిగి ఉన్నారు. చంద్ర శేఖర్ నూతన ఆర్థిక విధానాలను వ్యతిరేకించి గాంధేయ ఆర్ధిక విధానాల పట్ల నమ్మకం ఉంచినాడు. చంద్ర శేఖర్ ప్రపంచ బ్యాంకు మరియు IMF వంటి సంస్థలకు స్పష్టత మరియు నమ్మకంతో "మీరు నడిపే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువ ప్రజాదరణకు మాత్రమే పరిమితం చేయబడింది..... అవి ఎక్కువమంది ఆమోదం కలిగి ఉండవు" అని చెప్పి వారి సూచనలను వ్యతిరేకించారు. ప్రపంచీకరణ దేశంలోని అతి పెద్ద పేద జనాభాకు ప్రయోజనం చేకూర్చదని చంద్ర శేఖర్ దృఢంగా విశ్వసించారు.
మరొక సోషలిస్ట్ సురేంద్ర మోహన్ ఒక గొప్ప రచయిత మరియు హిందీ మరియు ఆంగ్ల వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా రచనలు చేశారు. సురేంద్ర మోహన్ నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. సురేంద్ర మోహన్ నయా ఉదారవాద వ్యతిరేక ఉద్యమానికి పర్యాయపదంగా మారినాడు. నయా ఉదారవాదాన్ని వ్యతిరేకించే సంస్థలు మరియు సమూహాలు తమ ఉమ్మడి లక్ష్యాల సాధనలో సహచరులుగా పనిచేయాలని సురేంద్ర మోహన్ దృఢంగా విశ్వసించారు. దళితులు మరియు సమాజంలోని అణగారిన వర్గాల ప్రయోజనాలను సమర్థించడంలో సురేంద్ర మోహన్ ఎల్లప్పుడూ ముందంజలో ఉండేవారు తద్వారా సోషలిస్ట్ ఆలోచన పరిధిని విస్తరించారు మరియు తీవ్రతరం చేశారు.
మహిళా సోషలిస్ట్ మృణాల్ గోర్ సమాజంలోని అన్ని వర్గాలకు తాగునీటి లభ్యతను నిర్ధారించడానికి గోరేగావ్‌లో విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించి 'పానీ వాలి బాయి' అనే బిరుదును పొందారు. 1990లలో, నూతన ఆర్థిక విధానాల ప్రతికూల ప్రభావాలను నొక్కి చెప్పడానికి మృణాల్ గోర్ దృఢమైన వైఖరిని కొనసాగించారు. మృణాల్ గోర్ తన రాజకీయ కృషిలో ప్రజాస్వామ్య విలువలకు ఉన్నత స్థానం ఇచ్చారు. లింగ సమస్యలు మరియు కులాంతర వివాహం గురించి కృషి చేసారు.
1928లో జన్మించిన భాయ్ వైద్య పద్నాలుగేళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు మరియు 1946లో CSP సభ్యుడిగా ఎన్నికైనారు. 1970లలో గోవా విముక్తి ఉద్యమంలో మరియు JP ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి (1975-77) సమయంలో భాయ్ వైద్య MISA కింద జైలు పాలయ్యారు. భాయ్ వైద్య జ్యోతిబా ఫూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచనలు మరియు ఆలోచనల ద్వారా బాగా ప్రభావితమయ్యారు. భాయ్ వైద్య నూతన ఆర్థిక విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది సమాజానికి మరియు దేశ నిర్మాణానికి వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని నమ్మారు. నవ సామ్రాజ్యవాదం మరియు విద్య ప్రైవేటీకరణను భాయ్ నిరంతరం వ్యతిరేకించారు.
జస్టిస్ సచార్ లేదా సచార్ సాహెబ్‌కు సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు అన్యాయానికి వ్యతిరేకంగా అహింసాయుత నిరసన విధానంపై అపారమైన విశ్వాసం ఉంది. ప్రభుత్వాల నవ ఉదారవాద విధానాల గురించి సచార్ తన అభిప్రాయాలలో స్పష్టంగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సచార్ వ్యతిరేకించారు. నవ ఉదారవాద విధానాలు మతతత్వాన్ని, అంధ జాతీయవాదాన్ని మూర్ఖత్వాన్ని, ప్రోత్సహిస్తాయని సచార్ అభిప్రాయపడ్డారు.
సోషలిస్టులు వినియోగదారుల పెట్టుబడిదారీ సూత్రాలను, ముఖ్యంగా 1991 తర్వాత ప్రభుత్వాల నయా ఉదారవాద విధానాలను సమానత్వ సమాజం మరియు సంస్కృతి స్థాపనకు వ్యతిరేకమని భావిస్తారు. నయా ఉదారవాదంపై అత్యంత చురుకైన విమర్శను కిషన్ పట్నాయక్ చేశారు.
"భారతదేశంలో 20వ శతాబ్దం రెండవ భాగంలో ఆరు దశాబ్దాల తర్వాత మేధావులు పౌర సమాజం ఎదుర్కొంటున్న ఏ సమస్యను వివరించడానికి ఏమీ చేయలేదు. పేదరికం, వ్యాధి, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి, బానిసత్వం, యుద్ధం, అవమానాలు మరియు ఆత్మహత్యలు యుగంపై తమ ముద్రను వేశాయి, కానీ భారతదేశంలోని మేధావి వర్గం ఒక్క సమస్యకు కూడా పరిష్కారాన్ని అందించలేదని లేదా సూచించలేదని చెప్పుకోలేరు"అని కిషన్ పట్నాయక్ అంటాడు.
పట్నాయక్ అభిప్రాయం లో సాధారణ పౌరుల చైతన్యం మేధావులు నిర్మించిన భావనల ద్వారా ప్రభావితమవుతుంది. దృశ్య కళలు, థియేటర్ మరియు సినిమా వంటి ప్రదర్శన కళలు, సామాజిక ప్రభావకారులు, సాహిత్యం: కవిత్వం మరియు గద్యం వంటి వివిధ మార్గాల ద్వారా సామాన్యుల వద్దకు వరకు చేరుతాయి మరియు సాధారణ పౌరులు సమకాలీన పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి సహాయపడతాయి.
ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కాలంలో కూడా సాధారణ పౌరులు మరియు మేధావుల మధ్య పూర్తి అంతరం ఉండటం దురదృష్టకరం. ఇది ఎక్కువగా ఆర్థిక అసమానత, అధిక నిరక్షరాస్యత మరియు స్థానికేతర భాషల ఆధిపత్యం కారణంగా ఉంది, పట్నాయక్ ఆలోచన లో భారతదేశ మేధావులు పాశ్చాత్య ఆలోచనల ప్రతినిధులుగా మారారు. వారు భారతీయ ఆలోచనను తిరోగమనం, మూఢనమ్మకం మరియు పునాదులు లేనిదిగా కూడా ఎగతాళి చేశారు.
కిషన్ పట్నాయక్ ఆధునిక వర్తమాన కాలాన్ని 'శాస్త్ర విహీన్' మరియు విచార్ విహీన్ వంటి లేఖన విలువలు మరియు ఆలోచనలు లేని కాలంగా వర్ణించారు. 'ప్రపంచీకరణ మరియు సరళీకరణ యుగంలో, మేధావులు తమ మేధస్సును అధిక ధరలకు వర్తకం చేస్తున్నారు' అది మరింత ప్రమాదకరమైనది అంటాడు.
ఆధునిక కాలం లో మేధావి వర్గం కొనుగోలు చేయబడిన బానిసగా మారిందని అంటాడు. ఇందుకు ఉదాహరణగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ తన ఉద్యోగాన్ని వదిలి టీవీ ఛానల్‌ను ప్రారంభించడానికి మరియు నవ-ఉదారవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఒక సాధనంగా ఎలా మారాడనే దాని గురించి కిషన్ పట్నాయక్ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఈ పరిస్థితిని మేధా వర్గ బానిసత్వం/బౌద్ధిక్ వర్గ అధీనం subordination తో పోల్చారు. వారికి నవ వలసవాదం మరియు ప్రపంచీకరణ యొక్క ఉచ్చులలోకి ప్రవేశించడంలో ఎటువంటి అపరాధ భావన లేదు.
అదేసమయం లో ప్రపంచీకరణ యొక్క ఉపద్రవానికి వ్యతిరేకంగా పోరాడటానికి దళిత, గిరిజన మరియు వెనుకబడిన వర్గాలలో మరియు వారికి ప్రజాస్వామ్య ఉద్యమాలలో పెరుగుతున్న అవగాహనలో కిషన్ పట్నాయక్ ఆశ యొక్క మెరుపును చూశాడు.ఈ ఉద్యమాలు, చిన్న స్థాయిలలో ఉన్నప్పటికీ, అణచివేతకు వ్యతిరేకంగా పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి.
కిషన్ పట్నాయక్ ప్రకారం, 'మేధో వర్గం సమాజాన్ని నియంత్రించే పాత్రను తిరిగి పొందుతుందని’ ఆశావాదంతో ఉన్నాడు. అయితే, AI లేదా పెట్టుబడిదారీ శక్తి యొక్క పునరుద్ఘాటన మేల్కొలుపు జరగడానికి అనుమతిస్తుందా అనే ప్రశ్న మిగిలి ఉంది.
దేశంలోని సమాజం మరియు రాజకీయాలలో అసభ్యకరమైన పెట్టుబడిదారీ విధానం మరియు నేరపూరిత మతతత్వం లోతుగా పాతుకుపోయిoది. ప్రతిఘటన ప్రభావం చూపడానికి చాలా బలహీనంగా ఉంది. ఇది ఒక "దౌర్భాగ్య విషాదం". సోషలిస్ట్ నాయకులు వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా మతతత్వం మరియు కులతత్వం అనే క్యాన్సర్‌ను తమదైన రీతిలో ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేశారు.
సోషలిస్ట్ నాయకులకు నివాళి నయా ఉదారవాదానికి ప్రత్యామ్నాయాలు
ఉన్నాయని గుర్తుచేస్తుంది,
కానీ ప్రత్యామ్నాయాలకు అర్థం మరియు
ఉచ్చారణ ఎలా ఇవ్వాలి అనేది ఒక చర్చనీయాంశమైన ప్రశ్న.
(రచయిత:
ప్రొఫెసర్ హరీష్ సి. శర్మ,
మాజీ హెడ్ హిస్టరీ, గురు నానక్ దేవ్ యూనివర్సిటి)
సంక్షిప్త తెలుగు స్వేచ్చా అనువాదం : ముహమ్మద్
అజ్గర్ అలీ, తెనాలి.
No comments:
Post a Comment