27 ఏళ్ళ వయసులో అమరుడైన అష్ఫకుల్లా ఖాన్ ఒక విప్లవకారుడు. ఒక
అమరవీరుడు, ఒక డకోయిట్, - మీరు అతన్ని ఏ పేరుతో పిలిచినా, భారతదేశ స్వేచ్ఛా స్వాతంత్రాలకోసం తన ప్రాణాలను త్యాగం చేసిన
స్వాతంత్ర సమర యోదుడు భారతమాత ముద్దు బిడ్డ అష్ఫకుల్లా ఖాన్.
గొప్ప అమరవీరుడు, అష్ఫకుల్లా ఖాన్ 1900 అక్టోబర్ 22 న
ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని
తండ్రి షఫీకుర్ రెహ్మాన్ పోలీసు శాఖలో పనిచేసేవాడు. వారిది పఠాన్ కుటుంబం. అతని తల్లి మజరునిస్సా గొప్ప
ఆదర్శ మహిళ. అతని తల్లి వలస భారతదేశంలో పరిపాలనా సేవల్లో పాల్గొంది.
తన ఆరుగురు తోబుట్టువులలో అష్ఫకుల్లా చిన్నవాడు. భారత స్వాతంత్య్ర
సంగ్రామంతో ప్రభావితమై చాలా చిన్న వయస్సులోనే అస్ఫకుల్లా హృదయం దేశభక్తి భావాలతో
నిండిపోయింది. మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమము ప్రారంభించినప్పుడు అష్ఫాక్ పాఠాశాలలో చదువుతున్నాడు.
సహకార ఉద్యమంలో చేరిన చాలా మంది యువకులలో ఖాన్ ఒకరు, కాని 1922 లో
గాంధీ దీనిని విరమించుకున్న తరువాత అనేక మంది భారతీయ యువకులు తీవ్రమైన పద్ధతుల
వైపు మొగ్గు చూపారు. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత
త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌పూర్
కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్తో పరిచయమేర్పడింది.
ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో అష్ఫాకుల్లా
ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు.
ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో
భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు
కాకోరీ రైలు దోపిడి
తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి
కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను
నిర్వహించారు. చాలా తర్జనబర్జనల తర్వాత రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని
దోచుకోవాలని నిర్ణయించారు. కకోరి నుండి లక్నోకు బ్రిటిష్ రాష్ట్ర ఖజానాను
తీసుకెళ్తున్న రైలును దోచుకోవడం మరియు స్వాతంత్ర్య పోరాటం కోసం ఆయుధాలను కొనుగోలు
చేయడానికి దోపిడీని ఉపయోగించడం ఈ ప్రణాళిక. విప్లవాత్మక సమూహం హిందుస్తాన్
రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) నాయకుడు రామ్ ప్రసాద్
బిస్మిల్‌తో కలిసి 1925 కకోరి రైలు దోపిడీకి
నాయకత్వం వహించినందుకు అష్ఫాకుల్లా ఖాన్ చరిత్రలో ప్రసిది పొందాడు.
ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్ మరియు మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామము
వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.అష్ఫకుల్లా ఖాన్ దోపిడీలో
ప్రముఖ పాత్ర పోషించాడు
1925 సెప్టెంబరు 26 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను
పట్టుకున్నారు. అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతములో బీహార్ నుండి
బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో
మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరింగు చదవాలని
నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి
మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్
స్నేహితున్ని ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి
పోలీసులకు ఆయన జాడ తెలియజేసాడు. తత్ఫలితంగా అరెస్టు చేయబడి ఫైజాబాద్ జైలులో
నిర్బంధించబడ్డాడు.
అష్ఫాకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు
చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా
వాదించాడు. జైలులో ఉండగా ఈయన దివ్య
ఖురాన్ పఠనము చేసేవాడు. కాకోరీ
దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా
ఖాన్, రాజేంద్ర లాహిరి మరియు రోషన్
లకు మరణ శిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు
విధించడముతో ముగిసినది.
మరణము
అమరవీరుడు అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి
ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. స్మారక చిహ్నంగా మారిన షాజహన్‌పూర్‌లోని అష్ఫకుల్లా
ఖాన్ సమాధి నేటికి మనకు దేశం కోసం అతడు చేసిన నిస్వార్థ త్యాగం గుర్తుచేస్తుంది.
కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై
ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు.
నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం
చేయాలనుకున్నా ను. నా త్యాగం వృథా కాదు. మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది.
నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి
పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని
ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను' అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే
వేసుకున్నాడు.
ఈయన దేశానికి తన చివరి సందేశములో "నా దేశ స్వాతంత్రం
కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడుతున్నాను" అని
రాశాడు.
"ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే వుంటాను
ఉరిశిక్ష పడినా,జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో నీనామ స్మరణ చేస్తూనే వుంటాను" [హే
మాతృభూమీ తేరి సేవా కియా కరూంగా, ఫాంసీ
మిలే ముజే, యా హో జన్మఖైద్ మెరీ, బేడీ బజా బజా కర్ తేరా భజన్ కరూంగా"]--అష్ఫాకుల్లా ఖాన్
(ఉరి వేదిక మీద నుండి)
నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతా
లవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను
ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావా లి--అష్ఫాఖుల్లా ఖాన్.
భరతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల
కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్.
అష్ఫాకుల్లా ఖాన్ కవిత్వం మరియు దేశభక్తి
అష్ఫాఖుల్లా ఖాన్ ఉర్దూ కవిత్వo లో నైపుణ్యం కలిగి ఉన్నాడు మరియు వరాసి (లేదా
వార్సి) మరియు హజారత్ (Varasi (or
Warsi) and Hazarat) అనే మారుపేర్లతో రాశాడు.
భారతదేశంలో బ్రిటీష్ 'కుట్ర' గురించి ఆయన సుదీర్ఘంగా ఇలా వ్రాశారు:
“ఫూట్ దల్కర్ సంషాన్ కర్నే కి చాల్ కా హామ్ పర్ కోయి అసార్
నహి హొగా ఔర్ హిందూస్తాన్ ఆజాద్ హోకర్ రహేగా” (భారతదేశాన్ని విభజించి పాలించటానికి మీ కుట్ర పనిచేయదు; మేము హిందుస్థాన్‌ను మాది చేస్తాము. .)
రచయిత రాజా అన్వర్ వివరించినట్లుగా, ఖాన్ "అతని కాలంలోని అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక ఫైర్‌బ్రాండ్లలో"
ఒకరు.
అష్ఫాకుల్లా ఖాన్ మరియు ఈయన సహచరులు చేసిన పనులను 2006లో
విడుదలైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రంగ్‌దే బసంతీ అను హిందీ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రములో అష్ఫాకుల్లా
ఖాన్ పాత్రను కునాల్ కపూర్ పోషించాడు.
ఖాన్-బిస్మిల్ మద్య స్నేహం :
చిన్నప్పుడు అష్ఫాకుల్లా ఖాన్ తన పెద్ద సోదరుడి నుండి “[రామ్ ప్రసాద్] బిస్మిల్ యొక్క ధైర్యం మరియు షాయారీ ఉర్దూ
కవిత్వం” గురించి కథలు విన్నాడు.
అష్ఫాకుల్లా ఖాన్ మనవడు ప్రకారం, బిస్మిల్ అతనిని సంస్థలో(HRA) అంగీకరించడానికి మొదట
సంశయించాడు. "షాజహాన్పూర్ యొక్క ఇతర పఠాన్ల మాదిరిగా, ఖాన్ కుటుంబం ధనిక మరియు
మంచి స్థితిలో ఉoది. అతని తండ్రి కొత్వాల్, అందువల్ల బిస్మిల్ అతన్ని పార్టీలోకి తీసుకుకోవడానికి సమయం
తీసుకున్నాడు. ఉమ్మడి భావజాలం, ఆదర్శాలు
మరియు దేశభక్తిపై ఆధారపడినందున వారి స్నేహం సాధారణం కంటే ఎక్కువగా ఉంది. బిస్మిల్ యొక్క
మేనల్లుడు రాజ్ బహదూర్ తోమర్ కూడా ఇద్దరి మధ్య“ జీవితకాల బంధం ”గురించి వ్యాఖ్యానించారు.
ఉరి తీయడానికి మూడు రోజుల ముందు, అతను "రాజకీయ పరిణామాలపై తన వేదన" గురించి ప్రజలకు
బహిరంగ లేఖలో రాశాడు అని ప్రసిద్ద చరిత్రకారుడు
ఎస్. ఇర్ఫాన్ హబీబ్ రాశారు.
నిరాశపరిచిన జ్ఞాపకం
అష్ఫాకుల్లా ఖాన్ మనవడు షాహదుల్లా ఒకప్పుడు దేశం కోసం త్యాగం
చేసిన అష్ఫాకుల్లా ఖాన్ ను నేడు గుర్తుకు తెచ్చుకున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం
చేశాడు "మా అమ్మమ్మ మంచి నేపథ్యం
నుండి వచ్చినందున, మేము జీవించగలిగాము," అని ఆయన చెప్పారు. కానీ "ఆగస్టు 15 మరియు అతని మరణ వార్షికోత్సవాన్ని మినహాయించి, అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరికీ సమయం లేదు ...
అష్ఫకుల్లా ఖాన్ ఉరితీయబడిన తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం అన్ని ఆస్తులను జప్తు చేసి, మా కుటుంబాన్ని చనిపోయేలా చేసింది."
నివాళి -ట్విట్టర్ లో @INCIndia
కకోరి రైలు దోపిడీకి ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక
స్వాతంత్ర్య సమరయోధుడు అష్ఫకుల్లా ఖాన్‌ను ఈ రోజు మనం గౌరవిస్తాము. అతను తన
ప్రియమైన స్నేహితుడు మరియు స్వాతంత్ర్య సహచరుడు రామ్ ప్రసాద్ బిస్మిల్‌తో కలిసి తన
జీవితాన్ని త్యాగం చేశాడు.
No comments:
Post a Comment