లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు. లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు అనగా ఏడు సంవత్సరముల పాటు (1990 నుండి 1995 వరకు మరియు 1995 నుండి 1997 వరకు) బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. లాలూ ప్రసాద్ యాదవ్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో రైల్వే మంత్రిగా పనిచేశాడు.
లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాష్ట్రములోని గోపాల్గన్ జిల్లా, పుల్వారియా గ్రామానికి చెందిన ఒక
యాదవ రైతు కుటుంబములో జన్మించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ తల్లి తండ్రులు కుందన్ రాయ్, మరచ్చియా దేవి. లాలూ పాట్నా విశ్వవిద్యాలయం నుండి
రాజనీతిశాస్త్రములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. లాలూకు 1973, జూన్ 1న రాబ్డీ దేవితో
వివాహమైంది. ఈయన భార్య రాబ్దీ దేవి కూడా కొన్నాళ్ళు బీహార్ ముఖ్యమంత్రిగా
పనిచేసింది. లాలూ, రాబ్దీ
దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు.
లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వము వహించారు. విద్యార్థి నాయకుడైన లాలూ భారతదేశ ఎమర్జెన్సీ కాలములో అప్పటి ప్రధాన మంత్రి, ఇందిరా గాంధీకి ఒక వినతి శాసనాన్ని (charter of demands) అందించిన ధీశాలి.
గడచిన
రెండు దశాబ్దాలలో బీహార్ రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రబలమైన వ్యక్తి. కేవలము
10 సంవత్సరముల వ్యవధిలోనే లాలూ, బీహార్లో ఒక ఉజ్జ్వల శక్తిగా ఎదిగాడు.
1977లో, లాలూ ప్రసాద్ యాదవ్ 29 సంవత్సరాల వయస్సులో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. బీహార్‌లోని ఛప్రా నియోజకవర్గం నుండి 6వ లోక్ సభ కు జనతాదళ్ టిక్కెట్‌పై గెలుపొందాడు. 1980 నుండి 1989 వరకు, అతను బీహార్ శాసనసభలో సభ్యునిగా వరుసగా రెండు పర్యాయాలు పనిచేశాడు.
యాదవులు
మరియు ముస్లింలలో తనకున్న ప్రజాదరణ తో 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో
బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. 1990లో బీహార్లో జరిగిన ఆర్థిక అభివృద్ధికిగాను
లాలూ నాయకత్వం లోని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రశంసలు అందుకొన్నది.
1995 ఎన్నికల తర్వాత లాలు మరో మారు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు, అయితే అపఖ్యాతి పాలైన దాణా కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లాలు పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పదవీవిరమణ చేయవలసి వచ్చింది.
1996లో
బీహార్‌లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూతో పాటు ఇతర ముఖ్య
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినవి (ఈ దర్యాప్తును
లాలూ ఆదేశించడము విశేషము). పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానములో సతీమణి రాబ్డీ
దేవిని ముఖ్యమంత్రిగా నియమించాడు.తదనంతరం, 1997లో
లాలూ, జనతా దళ్
నుండి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ అనే సొంత పార్టీని స్థాపించాడు.
1998 లోక్‌సభ ఎన్నికలలో, లాలూ మాధేపురా నుండి గెలిచాడు, అయితే 1999 ఎన్నికలలో శరద్ యాదవ్ చేతిలో ఓడిపోయాడు. 2000 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో,లాలు ఒక స్థానంలో గెలిచాడు, కానీ ప్రతిపక్షంలో ఉన్నాడు.
బీహార్‌లో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ
అధికారంలోకి రాలేకపోయింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకోవడం
ద్వారా నితీష్ కుమార్ రాష్ట్ర ఎన్నికలలో జనతాదళ్ (యునైటెడ్)ని విజయతీరాలకు
చేర్చారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తనను తాను జాతీయ నాయకుడిగా తీర్చిదిద్దుకున్నారు మరియు 2004, 2009 మరియు 2014లో లోక్‌సభ ఎన్నికల్లో విజయం
సాధించారు. 2013లో దాణా కుంభకోణం కేసులో దోషిగా
తేలిన తర్వాత, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ
చేయకుండా నిషేధం విధించారు. 2015 బీహార్
అసెంబ్లీ ఎన్నికలలో, 'మహాగత్బంధన్' యొక్క కూటమి భాగస్వాములలో అత్యధిక
స్థానాలను గెలుచుకోవడం ద్వారా RJD పెద్ద
పునరాగమనం చేసింది.
అంతర్జాతీయ ఖ్యాతి
హార్వర్డ్, హె.ఇ.సి మేనేజ్‌మెంట్ స్కూల్, ఫ్రాన్స్ వంటి వివిధ అంతర్జాతీయ
విశ్వవిద్యాలయాలు, దౌత్య
కార్యాలయములు లాలూ జీవిత చరిత్రపై అసక్తిని కనబరిచాయి కేంద్ర మంత్రైన తరువాత నష్టాలలో
నడుస్తున్న భారతీయ రైల్వేలను లాభాల దిశగా నడిపించిచటంలో ఉపయోగించిన విన్నూత
యాజమాన్య పద్ధతులకై లాలూ ఖ్యాతి గడించాడు.
ఆసియా
టైమ్స్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ లాలూ "ప్రపంచములోని వివిధ ప్రాంతాల్లోని
ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యమును, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ
ఉత్సుకత భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము" అని అన్నాడు.
No comments:
Post a Comment