19 September 2026

హజ్రత్ ఆయిషా (రజి) గారి మేధో వారసురాలు: అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ Amrah bint Abd al-Rahman The Intellectual Heir of Hazrat Aisha (R.A.)

 

అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ ప్రారంభ ఇస్లామిక్ చరిత్రలో అత్యంత ప్రముఖ మహిళా పండితులలో, న్యాయ నిపుణులలో మరియు బోధకులలో ఒకరు. ఇస్లామిక్ న్యాయ విజ్ఞానాన్ని, హదీసు సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు భద్రపరచడంలో మరియు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ హజ్రత్ ఆయిషా (రజి) గారి ప్రత్యక్ష శిష్యురాలు  మరియు ఇస్లామిక్ చట్టంపై అత్యంత ప్రామాణికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న గొప్ప పండితురాలు.

తొలి ఇస్లాం కాలంలో స్త్రీలు కేవలం మతపరమైన విషయాలకే పరిమితం కాలేదు. అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్‌కు గల న్యాయపరమైన అధికారం, సామాజిక గౌరవం పట్ల మదీనా ప్రధాన న్యాయాధిపతి కూడా  గౌరవించేవారు.

 ప్రఖ్యాత పండితులు ఇమామ్ మాలిక్ మరియు ఇమామ్ ఇబ్న్ కతీర్ ఇలా వ్రాశారు:"అమ్రా తన కాలంలోని న్యాయాధిపతులు చేసిన ఇటువంటి న్యాయపరమైన తప్పులను తరచుగా సరిదిద్దేవారు."

అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ క్రీ.శ. 650 ప్రాంతంలో మదీనాలో, అన్సార్‌ల యొక్క ప్రసిద్ధ బనూ నజ్జర్ వంశంలో జన్మించారు. అమ్రా తండ్రి అబ్ద్ అల్-రహ్మాన్ ఇబ్న్ సాద్ ఇబ్న్ జురారా, మరియు తల్లి సలీమా బింత్ హకీమ్.

అమ్రా తాత, సాద్ ఇబ్న్ జురారా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క తొలి సహాబాలలో ఒకరు. అమ్రా చాలా చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి అనాథగా మారింది.

అమ్రా తండ్రి మరణం తర్వాత, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణి అయిన హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అమ్రా ను తన సంరక్షణలోకి తీసుకుని, అమ్రా పెంపకం మరియు విద్యను స్వయంగా పర్యవేక్షించారు. అమ్రా, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) యొక్క అత్యంత సన్నిహిత శిష్యులలో ఒకరిగా మారింది.

అమ్రా అసాధారణమైన తెలివితేటలను గుర్తించి, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అమ్రాను తన కార్యదర్శిగా నియమించారు. ఇస్లాం ప్రపంచం నలుమూలల నుండి మహిళలు పంపిన లేఖలకు సమాధానాలు రాసే బాధ్యత అమ్రాపై ఉండేది. ఆ మహిళలు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నుండి క్లిష్టమైన మతపరమైన మరియు చట్టపరమైన ప్రశ్నలకు సమాధానాలు కోరేవారు. ఈ అనుభవం అమ్రా చట్టపరమైన పరిజ్ఞానాన్ని మరియు పరిపాలనా సామర్థ్యాలను ఎంతగానో పెంపొందించింది.

హజ్రత్ ఆయిషా (ర.అ.) ఉల్లేఖించిన హదీసుల విషయంలో అమ్రా కంటే ఎక్కువ కచ్చితమైన మరియు విశ్వసనీయమైన వారు ఎవరూ లేరని ఆ కాలంలోని పండితులు మరియు విమర్శకులు కూడా అంగీకరించారు.

హజ్రత్ ఆయిషా (ర.అ.) మరణానంతరం, మదీనాలో హజ్రత్ ఆయిషా (ర.అ.) జ్ఞానానికి అమ్రా గొప్ప వారసురాలు అయ్యారు. అమ్రా, ఆయిషా(ర.అ) బోధనలను పదానికి పదం కంఠస్థం చేశారని సమకాలీన పండితులు గమనించారు.

అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ తన అపారమైన జ్ఞానాన్ని తనకే పరిమితం చేసుకోలేదు. ఒక శ్రేష్ఠమైన ఉపాధ్యాయురాలిగా, ఆ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను అమ్రా స్వయంగా తీసుకున్నారు. అమ్రా తన ఇంటిని ఒక అధికారిక విద్యా సంస్థగా మార్చారు. సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు అమ్రా ఉపన్యాసాలకు హాజరు కావడానికి మదీనాకు వచ్చేవారు.

అమ్రా స్వయంగా చాలా మంది అనాథ బాలురను, బాలికలను పెంచి, వారు సమాజానికి భవిష్యత్ నాయకులుగా ఎదగాలనే ఉద్దేశ్యంతో వారికి ఉన్నతమైన మత మరియు న్యాయ విద్యను అందించారు.

ఒక ఉపాధ్యాయురాలిగా, అమ్రా కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే బోధించలేదు. అమ్రా బోధన ఎంత ప్రభావవంతంగా ఉందంటే, ఖలీఫా ఉమర్ ఇబ్న్ అబ్ద్ అల్-అజీజ్ అమ్రా జ్ఞానాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరచాలని ఆకాంక్షించారు.

ఒక సందర్భంలో, ఒక తండ్రి తన కుమార్తె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెకు వివాహం కుదిర్చాడు. స్త్రీల హక్కులను పరిరక్షిస్తూ, అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ ఒక బలమైన న్యాయపరమైన అభిప్రాయాన్ని వెలువరించారు:

"కన్య అయినా, వితంతువు అయినా, ఏ స్త్రీకి అయినా ఆమె స్పష్టమైన సమ్మతి మరియు ఆమోదం లేకుండా వివాహం జరిపించరాదు. ఒక తండ్రి తన కుమార్తె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై వివాహాన్ని బలవంతంగా రుద్దితే, ఇస్లాం ఆ వివాహాన్ని చెల్లనిదిగా పరిగణిస్తుంది."

అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్ అనేక ముఖ్యమైన న్యాయ సూత్రాలను కూడా స్థాపించారు. అమ్రా ఖురాన్ మరియు హదీసుల వెలుగులో అనేక క్లిష్టమైన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించారు.

చట్టం మూఢనమ్మకాలు లేదా పుకార్లపై కాకుండా, పక్కా ఆధారాలు మరియు ప్రామాణికమైన హదీసులపై ఆధారపడి ఉండాలని అమ్రా దృఢంగా విశ్వసించారు. అమ్రా న్యాయపరమైన వ్యాఖ్యానం (ఇజ్తిహాద్) నేరుగా ఖురాన్ మరియు ప్రవక్త ఆచరణ(హదీస్)పైనే ఆధారపడ్డారు.

అమ్రా బింత్ అబ్ద్ అల్-రహ్మాన్, ఇబ్న్ షిహాబ్ అల్-జుహ్రీ, అబూ బక్ర్ ఇబ్న్ హజ్మ్, యహ్యా ఇబ్న్ సయీద్ అల్-అన్సారీ, అబూ అల్-రిజాల్ ముహమ్మద్, మరియు అబ్దుల్లా ఇబ్న్ అబీ బక్ర్ వంటి ఇస్లామిక్ చరిత్రలోని గొప్ప పండితులు, న్యాయవేత్తలు మరియు న్యాయమూర్తులలో కొందరికి శిక్షణ ఇచ్చారు.

ఇస్లామిక్ చరిత్ర ఎల్లప్పుడూ అద్భుతమైన మహిళా పండితులచే సుసంపన్నమైంది.

No comments:

Post a Comment