24 September 2026

అబ్బాసిద్ ఖలీఫా రాజ్యంలో అత్యున్నత న్యాయ పదవిని అధిరోహించిన మహిళ: థుమల్ అల్-కహ్రామాన్ Dhumal Al-Qahraman, The Woman Who Rose to the Highest Judicial Position in the Abbasid Caliphate

 

థుమల్ అల్-కహ్రామాన్ ఒక సాధారణ రాజభవన ఉద్యోగి స్థాయి నుండి బాగ్దాద్‌లోని 'మజాలిమ్' న్యాయస్థానానికి (అన్యాయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులను స్వీకరించే ప్రత్యేక న్యాయస్థానం) ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. ఖలీఫా తల్లి రాజమాత షఘాబ్,  థుమల్ ను ఈ పదవిలో నియమించారు. థుమల్ తన అసాధారణ న్యాయ పరిజ్ఞానం, నిష్పాక్షికత మరియు పరిపాలనా సామర్థ్యాలను నిరూపించుకుని, మధ్యయుగ ఇస్లామిక్ చరిత్రలో మహిళల న్యాయాధికారానికి ప్రతీకగా నిలిచారు.

క్రీ.శ. 918లో, అబ్బాసిద్ ఖలీఫా తల్లి రాజమాత షఘాబ్, థుమల్ అల్- ఖహ్రామాన్‌ను,  మజాలిమ్ న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించినది.

థుమల్,  అబూ అల్-హసన్‌తో సహా బాగ్దాద్‌లోని అత్యంత ప్రసిద్ధ, గౌరవనీయ న్యాయ పండితులను తనతో పాటు కోర్టులో కూర్చోవడానికి ఆహ్వానించింది. థుమల్ తన వృత్తి జీవితాన్ని అబ్బాసిద్ ఖలీఫా రాజ్యంలోని అంతఃపురం అని పిలువబడే రాజభవనంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభించింది. ఆ కాలంలో, అంతఃపురం రాజకీయ, దౌత్య కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. థుమల్‌ సామర్థ్యాలను గుర్తించి, ఖహ్రామానా పదవికి పదోన్నతి లభించింది. అబ్బాసిద్ సామ్రాజ్యంలో, ఖహ్రామానా పదవి అత్యంత శక్తివంతమైనదిగా, ప్రభావవంతమైనదిగా పరిగణించబడింది.

ఖహ్రామానా పదవిలో ఉన్నప్పుడు, థుమాల్ సామ్రాజ్యం యొక్క ఆర్థిక వ్యవహారాలు, రహస్య సమాచారం మరియు రాజకీయ పొత్తుల గురించి లోతైన అవగాహనను సంపాదించింది.క్రమంగా, థుమాల్ ఖలీఫా తల్లి అయిన షఘాబ్‌కు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగత ప్రతినిధిగా మరియు సహాయకురాలిగా మారింది.రాజ్య పరిపాలనకు సంబంధించిన ప్రతి ప్రధాన నిర్ణయంపై రాజమాత షఘాబ్, థుమాల్‌ను సంప్రదించేది.

క్రీ.శ. 918 నాటికి, బాగ్దాద్ పరిపాలనా మరియు న్యాయ వ్యవస్థలలో విస్తృతమైన అవినీతి పాతుకుపోయింది. రాజ్యం లో క్షీణిస్తున్న న్యాయ వ్యవస్థను సంస్కరించడానికి, రాజమాత షఘాబ్ తన అత్యంత విశ్వసనీయ మరియు నమ్మకమైన సహచరురాలైన థుమల్‌ను మజాలిమ్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఈ పదవి, ఆధునిక కాలపు న్యాయశాఖ మంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తి పాత్రలతో పోల్చదగినది.

మజాలిమ్ న్యాయస్థానాలు ప్రధానంగా ఖలీఫా లేదా రాజ్యంచే నిర్వహించబడేవి. షరియా యొక్క సాధారణ సూత్రాలతో పాటు, ఈ న్యాయస్థానాలు రాజ్య పరిపాలనా చట్టాలు మరియు నిష్పక్షపాత, మానవతా న్యాయ సూత్రాల ఆధారంగా ప్రధానమైన మరియు సంక్లిష్టమైన కేసులను విచారించేవి.

ధుమల్ అల్-ఖహ్రామన్ ప్రధాన న్యాయమూర్తి అయిన వెంటనే, కోర్టు పిటిషన్ ఫీజులను దాదాపు పూర్తిగా రద్దు చేశారు లేదా వాటిని చాలా నామమాత్రపు మొత్తానికి తగ్గించారు.

ప్రఖ్యాత అరబ్ చరిత్రకారుడు అల్-తబరీ ఇలా వ్రాశారు:"ధుమల్ తన విధులను ఎంత అద్భుతంగా నిర్వర్తించారంటే, ఆమె బాగ్దాద్ ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొంది, న్యాయానికి రక్షకురాలిగా పరిగణించబడ్డారు."

అబ్బాసిద్ కాలంలో, పలువురు ప్రాంతీయ గవర్నర్లు మరియు ఇతర ఉన్నత అధికారులు అవినీతి కి పాల్పడేవారు మరియు  ఖలీఫా బంధువులు, శక్తివంతమైన సైనిక కమాండర్లు మరియు ధనవంతులైన ఆస్థానీయులు పేద మరియు బలహీన కుటుంబాలకు చెందిన భూములను, తోటలను అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగేది.  వారిపై ఫిర్యాదులు థుమల్ దర్బారుకు చేరినప్పుడు, ధుమాల్ అవినీతి అధికారులను వారి పదవుల నుండి తొలగించమని ఆదేశించడమే కాకుండా, వారు అక్రమంగా వసూలు చేసిన డబ్బును, ఆస్తిని  బాధితులకు తిరిగి అందేలా చూస్తూ, దానిని తిరిగి చెల్లించమని కూడా ఆదేశించేవారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు ఇబ్న్ అల్-జౌజీ ప్రకారం,“థుమల్ స్వయంగా వినతిపత్రాల చట్టపరమైన యోగ్యతలను పరిశీలించేవారు. రాజరికపు ఒత్తిడికి లొంగకుండా శాసనాన్ని జారీ చేసి,భూమి దాని నిజమైన యజమానులకు తిరిగి అందేలా చూసేవారు”.

రాజమాత షఘాబ్ స్వయంగా థుమాల్‌ను ప్రశంసిస్తూ ఇలా అన్నారు:"రాజ్య  పరిపాలనా, ప్రజా వ్యవహారాలను, న్యాయ వ్యవస్థను థుమాల్ ఉత్తమంగా నిర్వహించగలరు."

ప్రఖ్యాత చరిత్రకారుడు అల్-తబరీ ఇలా రాశారు:" ఇస్లామిక్ చరిత్రలో మజాలిమ్ న్యాయస్థానాల అత్యుత్తమ  అధిపతిగా ధుమాల్ కన్పిస్తారు, థుమాల్ తన సామర్థ్యంతో ప్రజల కేసులను నిష్పక్షపాతంగా, వివేకంతో పరిష్కరించేవారు."

ఆధునిక ఇస్లామిక్ పండితులు ఇలా నమ్ముతారు:" ఇస్లామిక్  స్వర్ణయుగంలో మహిళలు అత్యున్నత న్యాయాధికారాన్ని కలిగి ఉన్నారనడానికి థుమాల్ జీవితమే బలమైన సాక్ష్యం. "

థుమల్ క్రీ.శ. 918 నుండి 929 వరకు, సుమారు 11 సంవత్సరాల పాటు మజాలిమ్ దర్బారుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

క్రీ.శ. 929లో, థుమల్ సహజ కారణాలతో మరణించారు. థుమల్ మరణం రాజమాత షఘాబ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలిగించింది; షఘాబ్ వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా దెబ్బతిన్నారు.

ఒక సాధారణ నేపథ్యం నుండి సామ్రాజ్యంలో అత్యున్నత న్యాయ పదవికి థుమల్ అల్-ఖహ్రామన్ ఎదగడం మధ్యయుగ చరిత్రలో అత్యంత అసాధారణ సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది

No comments:

Post a Comment