28 March 2026

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు ఆయన హిందూ సహచరులు Hindu comrades of Sir Syed Ahmad Khan

 


 

సర్ సయ్యద్ అహ్మద్ యొక్క ముస్లిమేతర మిత్రులు: స్వామి దయానంద్ సరస్వతి, రాజా జై కిషన్ దాస్, మరియు లాలా లజపత్ రాయ్

 

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు అలీగఢ్ ఉద్యమం గురించి అనేక అపోహలు ఉన్నాయి. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపనకు మరియు అనేక సామాజిక సంస్కరణలకు దారితీసిన ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన ముస్లిమేతర మిత్రులు మరియు సహచరుల గురించి మనకు చాలా తక్కువగా తెలుసు.

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారత ఉపఖండ చరిత్రలో ఒక సంస్కర్తగా నిలుస్తారు. సర్ సయ్యద్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు, సామాజిక సామరస్యం మరియు ఉమ్మడి నాగరికత అనే భావనలను ప్రోత్సహించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు మద్దతు ఇచ్చినారు.  విద్య మరియు సామాజిక సంస్కరణల ఉమ్మడి ఆశయం కోసం సర్ సయ్యద్ చుట్టూ అన్ని మతాల సహచరులు ఉండేవారు. 

సర్ సయ్యద్ కు సన్నిహితంగా ఉన్న హిందూ సహచరులు అలీగఢ్ ఉద్యమానికి బలమైన పునాది వేయడంలో సహాయపడ్డారు. సర్ సయ్యద్ అహ్మద్ యొక్క ముస్లిమేతర, ముఖ్యంగా హిందూ మిత్రుల జాబితా చాలా పెద్దది.

సర్ సయ్యద్ సన్నిహిత  హిందూ మిత్రులలో ఒకరు రాజా జై కిషన్ దాస్. ఆయన సర్ సయ్యద్ యొక్క అత్యంత సన్నిహిత మరియు విశ్వసనీయ సహచరులలో ఒకరిగా పరిగణించబడ్డారు. రాజా జై కిషన్ దాస్ సైంటిఫిక్ సొసైటీ స్థాపనకు, అలీగఢ్ కళాశాల పునాదికి ఎంతగానో తోడ్పడ్డారు

బాబు శ్యామ్ ప్రసాద్,  సర్ సయ్యద్ ఆలోచనలకు మరో సన్నిహిత మద్దతుదారుడు. బాబు శ్యామ్ ప్రసాద్,  సర్ సయ్యద్ విద్యా ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొన్నారు.

అదేవిధంగా, పండిట్ బద్రీనాథ్,  సర్ సయ్యద్ కు మరో విశ్వసనీయ ముస్లిమేతర సహచరుడు. పండిట్ బద్రీనాథ్,  సైంటిఫిక్ సొసైటీలో సర్ సయ్యద్‌కు మద్దతు ఇచ్చారు. పండిట్ బద్రీనాథ్ శాస్త్రీయ కార్యకలాపాలలో పాలుపంచుకుని, సైంటిఫిక్ సొసైటీ సంస్థను బలోపేతం చేయడానికి తోడ్పడ్డారు.

ఘాజీపూర్‌లో సర్ సయ్యద్ గారి విద్యా మరియు సామాజిక సేవలో బాబు జ్యోతి ప్రసాద్ సహాయకుడిగా ఉన్నారు. స్థానిక స్థాయిలో సర్ సయ్యద్ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడ్డారు.

సర్ సయ్యద్ గారి దృష్టిలో భారతదేశం ఒక ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం. సర్ సయ్యద్ హిందూ మిత్రులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడమే కాకుండా, వారి పండుగలలో కూడా పాల్గొన్నారు.

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్,  రాజా జై కిషన్ దాస్‌ను తన సోదరుడిలా చూసుకునేవారని, తన మనవడికి ఆయన ఒడిలో విద్యను ప్రారంభించడం ద్వారా తన మనవడు లో రాజా జై కిషన్ దాస్‌  గుణాలను అలవర్చుకోవాలని కోరుకున్నారని ప్రముఖ చరిత్రకారుడు మరియు AMU రిటైర్డ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అయిన  రాహత్ అబ్రార్ అన్నారు.

రాజా జై కిషన్ దాస్‌తో ఆయన స్నేహం యూపీలోని మొరాదాబాద్‌లోని ఒక అనాథాశ్రమంలో ప్రారంభమైంది., సర్ సయ్యద్ అన్ని వర్గాల, మతాల అనాథలకు సేవ చేయడం రాజా జై కిషన్ దాస్‌ గమనించారు. ఆ తర్వాత, రాజా జై కిషన్ దాస్‌,  సర్ సయ్యద్ అహ్మద్ యొక్క అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చాడు.

ఆర్య సమాజ్ ఉద్యమ స్థాపకుడైన మహర్షి దయానంద్ సరస్వతి కూడా సర్ సయ్యద్‌కు సన్నిహితుడు.మహర్షి దయానంద్ సరస్వతి అనుచరులలో ఒకరైన లాలా లజపత్ రాయ్, ఆర్య సమాజ్ సంస్థ డీఏవీ కళాశాల మరియు దయానంద్ ఆంగ్లో-వేదిక్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించినప్పుడు, అది సర్ సయ్యద్ యొక్క అలీగఢ్ నమూనా నుండి స్ఫూర్తి పొందిందని చెప్పారు. అలీగఢ్ ఉద్యమం వలె, ఆర్య సమాజ్ సంస్థలు కూడా ఆధునిక విద్య మరియు సామాజిక సంస్కరణల కలయికపై ఆధారపడి ఉన్నాయి.

ఈ విషయంపై లజపత్ రాయ్ రాసిన ఒక లేఖ ను ఏఎంయూలోని సర్ సయ్యద్ హౌస్ మ్యూజియంలో ప్రదర్శించారు.

హిందూ సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా స్వామి దయానంద్ సరస్వతి గట్టిగా గళం విప్పడం జరిగింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్,  ఒక సారి స్వామి దయానంద్ సరస్వతిని  తన ఇంటికి ఆహ్వానించారు.సర్ సయ్యద్ ఇంట్లో స్వామి దయానంద్ సరస్వతి వేదాలను పఠించారు.

స్వామి దయానంద్,  రాజా జై కిషన్ దాస్‌కు సన్నిహితుడు, స్వామి దయానంద్ అలీగఢ్‌కు వచ్చినప్పుడల్లా రాజా జై కిషన్ దాస్‌ ఇంట్లోనే బస చేసేవారు. ఆ సమయంలో, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తప్పకుండా స్వామి దయానంద్ ను కలుసుకునేవారు.

సర్ సయ్యద్ తన కళాశాల హాస్టళ్లలో గోమాంసం వడ్డించడాన్ని నిషేధించారు.బక్రీద్ పండుగ సందర్భంగా, ఒకసారి ఒక విద్యార్థి బలి ఇవ్వడం కోసం ఒక ఆవును హాస్టల్‌కు తీసుకువచ్చాడని రాహత్ అబ్రార్ పేర్కొన్నారు. ఈ విషయం సర్ సయ్యద్‌కు తెలిసిన వెంటనే, సర్ సయ్యద్ హాస్టల్‌కు పరుగెత్తుకెళ్లి వారిని అడ్డుకున్నారు. అంతేకాకుండా, ఆ ఆవును హాస్టల్‌కు తీసుకురావడంలో ప్రమేయం ఉన్న విద్యార్థిని కళాశాల నుండి బహిష్కరించాలని సర్ సయ్యద్ ఆదేశించారు. ఇది స్పష్టంగా హిందువుల మనోభావాలకు మరియు మత విశ్వాసాలకు సర్ సయ్యద్ ఇచ్చిన గౌరవానికి నిదర్శనం.

 

No comments:

Post a Comment