27 September 2022

భోపాల్ రాజ్యం ను 107 సంవత్సరాలు(1819-1926) పాలించిన నలుగురు భోపాల్ బేగంలు

 

భారత దేశం లోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన మధ్యప్రదేశ్  రాజధానిగా, భోపాల్ చారిత్రాత్మకతను కలిగి ఉంది.  ఇంపీరియల్ మరియు ఆధునిక భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు మరియు పట్టణాలకన్నా  భోపాల్ మహిళా సాధికారత విషయం లో ముందు ఉన్నది.

భోపాల్ గురించిన తొలి ప్రస్తావన 640 AD నాటిది. భోపాల్   పర్మార్ రాజవంశంచే పాలించబడింది. పురాణాల ప్రకారం, రాజా భోజ్‌కి కుష్టు వ్యాధి సోకింది మరియు 365 నదుల నీటితో ఒక సరస్సును నిర్మించి అందులో స్నానం చేయమని సలహా ఇవ్వబడినది,   రాజా భోజ్ సలహా ఆచరించాడు. సరస్సును భోజ్ తాల్ (లేదా భోజ్ సరస్సు) అని పిలిచేవారు. కాలక్రమేణా, అది భోజ్‌పాల్‌గా, తర్వాత భోపాల్‌గా మారింది.

భోపాల్ రాజ్య   మరియు భోపాల్ రాజవంశ స్థాపకుడు సర్దార్ దోస్త్ మొహమ్మద్ ఖాన్‌. 1672లో జన్మించిన దోస్త్ మొహమ్మద్ ఖాన్‌ అందమైన, ధైర్యసాహసాలు కల కూలిన వంశస్థుడు.  దోస్త్ మొహమ్మద్ ఖాన్‌ యొక్క ఏకైక ఆశయం ఔరంగజేబు సైన్యంలో చేరి తన భవిష్యత్తును మొఘల్ సామ్రాజ్య సేవలో మలచుకోవడం. 1697లో, దోస్త్ మొహమ్మద్ ఖాన్‌ ఖైబర్ కనుమను దాటి భారతదేశంలోకి వచ్చాడు. దోస్త్ మహమ్మద్ ఖాన్ జలాలాబాద్, కర్నాల్ మరియు ఢిల్లీ గుండా భోపాల్‌ చేరుకొన్నాడు.

దోస్త్ మహమ్మద్ ఖాన్ భోపాల్‌కు వచ్చిన తరువాత అనేక స్థానిక రాజ్యాలతో కలిసి పనిచేశాడు - రాణి కమలపాటి తన భర్త నిజాం షా మరణానంతరం దోస్త్ మహమ్మద్ ఖాన్ రక్షణ కోరినట్లు చెబుతారు మరియు దోస్త్ మహమ్మద్ ఖాన్ చేతికి రాఖీ కూడా కట్టారు

1707లో, దోస్త్ మహమ్మద్ ఖాన్ మధ్య భారతదేశంలోని మాల్వాకు రాకముందు, భోపాల్ బంగంగా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. భోపాల్ రాజ్యం ఈ 1715లో ఏర్పడింది. దోస్త్ మహమ్మద్ ఖాన్ 1716లో ప్రసిద్ధ ధై సీదీ కి మసీదుతో సహా ప్రసిద్ధ ఫతేఘర్ కోటను నిర్మించాడు. దోస్త్ మహమ్మద్ ఖాన్ వివాహం చేసుకున్న రాజ్‌పుత్ యువరాణి అయిన ఫతేహ్ బీబీ పేరు మీద ఫతేఘర్ పేరు పెట్టబడింది.

దోస్త్ మహమ్మద్ ఖాన్ మరణానంతరం, భోపాల్‌పై అనేక మంది కిరాయి సైనికులు దాడి చేశారు. చరిత్రకారుల ప్రకారం మొదటి బేగం అయిన మమోలా బాయి, అలాంటి శక్తులను తిప్పికొట్టడానికి బ్రిటిష్ జనరల్ గొడ్దార్డ్ సహాయం తీసుకున్నారు.

భోపాల్ పాలన  ఖాన్‌ల నుండి బేగంలుగా ఎలా మారింది?

భోపాల్ ఇది స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో రెండవ అతిపెద్ద ముస్లిం రాచరిక రాజ్యం. ఇందులో 90% జనాభా హిందువులు.

భోపాల్ నగర చరిత్ర వంద సంవత్సరాలకు పైగా మహిళల ఆధిపత్య పరంపరను వెల్లడిస్తుంది.

భోపాల్‌ను 107 ఏళ్లు(1819-1926) నలుగురు ముస్లిం మహిళలు (కుద్సియా బేగం, సికందర్ బేగం,షాజహాన్ బేగం, సుల్తాన్ జహాన్)పాలించారు. భోపాల్‌లోని బేగంలు తమను తాము భోపాల్ నవాబులుగా చెప్పుకోవడానికి వెనుకాడలేదు.

ఖుద్సియా బేగం(1819-1837)  దక్షిణాసియాలో ముస్లిం మహిళలకు చట్టబద్ధంగా ఒక రాజ్యాన్ని  పాలించే హక్కు ఉందని నొక్కిచెప్పిన మొదటి మహిళ. ఇస్లాం స్త్రీలను రాజకీయ అధికారాన్ని పొందకుండా మినహాయించలేదని కుద్సియా చూపించింది. ఖుద్సియా బేగం సైన్యానికి నాయకత్వం వహించింది మరియు యుద్ధాలలో ముందంజలో ఉంటుంది.భోపాల్ పాలకురాలు అయిన ఖుద్సియా బేగం భోపాల్ ను"సింధియాలు మరియు భోంస్లేల” పరం కాకుండా కాపాడినది.

భోపాల్ బేగం నవాబ్ సికందర్ బేగం(1844-1868), 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు.1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అణచివేయబడిన తరువాత, భోపాల్ రాజ్య పాలుకులు చూపిన విధేయతకు 1858 విక్టోరియా మహారాణి  ప్రకటనలో బహుమతి లభించింది.

భోపాల్ బేగం  సికందర్ తన స్వంత హక్కుతో భోపాల్‌ను పరిపాలించడానికి నవాబ్ బిరుదును పొందాడు అలాగే 19-తుపాకీల వందనం ఇవ్వబడింది, పొరుగురాజు కు కోల్పోయిన భూభాగం మరల భోపాల్ రాజ్య పరం అయినది  మరియు “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా” బిరుదు ఇవ్వబడినది.   ఆ సమయంలో ఈ గౌరవం బ్రిటీష్ సామ్రాజ్యంలో క్వీన్ విక్టోరియాతో పాటు పొందిన ఏకైక మహిళా నైట్‌గా భోపాల్ బేగం సికందర్ నిలిచింది, “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా” బిరుదు భోపాల్ బేగం సికందర్ ప్రత్యేక హోదాను, అలాగే బ్రిటీష్ వారితో భోపాల్ బేగం కున్న సన్నిహిత సంబంధాన్ని నొక్కి చెబుతుంది.

నవాబ్ సికందర్ బేగం రాజ్య పాలన  ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. సికందర్ బేగం “ఎ పిల్‌గ్రిమేజ్ టు మక్కాలో మక్కా మరియు మదీనాకు హజ్ యొక్క తన స్వంత అనుభవాన్ని రాసింది. సికందర్ బేగం యెమెన్, టర్కీ మరియు అరేబియా నుండి పండితులను ఆహ్వానించి బాలికల కోసం విక్టోరియా స్కూల్‌ను స్థాపించారు, తద్వారా భోపాల్‌లోని బాలికలు హస్తకళలలో  సాంకేతిక శిక్షణ పొందుతారు మరియు ప్రాథమిక విద్యా విషయాలపై జ్ఞానాన్ని పొందుతారు.

నవాబ్ సికందర్ బేగం   కుమార్తె, షాజహాన్ బేగం(1868-1901)  భోపాల్‌ను కవిత్వం, సంగీతం కళల కేంద్రంగా మార్చారు. సుల్తాన్ షాజహాన్ బేగం ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా వైద్యులు, నర్సులు మరియు ఇతర సిబ్బందితో “సుల్తానియా జెనానా హాస్పిటల్ భవనాన్ని” ప్రారంభించారు.

నవాబ్  షాజహాన్ బేగం మహిళల కోసం “తహ్జిబ్ అన్-నిస్వాన్ వా తర్బియాత్ ఉల్-ఇన్సాన్” పేరుతో సంస్కరణవాద మాన్యువల్‌ను కూడా రాశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఎన్సైక్లోపీడియాగా పరిగణించబడుతుంది మరియు ఇస్లాంలో మహిళల పని మరియు వారి స్థితి వంటి అంశాలను కలిగి ఉంది.షాజహాన్ బేగం ప్రసిద్ద సైఫియా కళాశాల మరియు తాజ్-ఉల్-మసీదును నిర్మించారు

నాల్గవ నవాబ్ సుల్తాన్ జహాన్(1901-1926), ప్రజల సంక్షేమం కోసం తీసుకొన్న అనేక చర్యలతో సహా పరిపాలనా సంస్కరణలకు ప్రసిద్ధి చెందింది. సుల్తాన్ జహాన్ విద్యా సంస్కర్త మరియు అనేక విద్యా సంస్థలను స్థాపించారు ముఖ్యంగా  ప్రజా బోధన మరియు స్త్రీ విద్యపై దృష్టి సారించారు.. "స్త్రీ విద్యకు సుల్తాన్ జహాన్ అందించిన సహకారం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కంటే ఏ విధంగానూ తక్కువ కాదు." అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అవతరించిన మహమ్మదీయ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీకి సుల్తాన్ జహాన్ మాత్రమే మహిళా ఛాన్సలర్. విద్యతో పాటు, సుల్తాన్ జహాన్ పన్నులు, పోలీసు, సైన్యం, న్యాయవ్యవస్థ, వ్యవసాయం, ఆరోగ్యం మరియు పారిశుధ్యాన్ని వ్యవస్థను కూడా సంస్కరించింది. 1914లో, సుల్తాన్ జహాన్ “ఆల్-ఇండియా ముస్లిం లేడీస్ అసోసియేషన్” కు అధ్యక్షురాలైంది.అందరు సుల్తాన్ జహాన్ ను “సర్కార్ అమ్మ” అని సంబోధించేవారు.

కుద్సియా బేగం, సికందర్ బేగం,షాజహాన్ బేగం, సుల్తాన్ జహాన్ ల పరిపాలనా  కాలం భోపాల్‌కు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. బేగంలందరూ బాగా పనిచేసి ఎక్కువ కాలం జీవించారు. ఒకప్పుడు, భోపాల్‌లోని నలుగురు రాణులు ఒకే సమయంలో సజీవంగా ఉన్నారు.

 

 

 

 


No comments:

Post a Comment