ఆడబిడ్డ పుట్టడమే
భారంగా భావించే కాలంలో 1914 డిసెంబరు 26న భారత దేశం లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో సుశీల అనే అమ్మాయి పుట్టింది. సుశీల
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరచడం మరియు సమాజంలోని అణగారిన
వర్గానికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం ద్వారా మార్పును సృష్టించాలని
నిశ్చయించుకున్న ఒక యువతిగా ఎదిగింది. సుశీల జీవితం త్యాగాలు మరియు సాఫల్యాల యొక్క
అద్భుతమైన గాథ.
డాక్టర్ సుశీల నయ్యర్
పంజాబ్‌లోని (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కుంజా అనే చిన్న పట్టణానికి
చెందినవారు. సుశీల నయ్యర్ బాల్యం నుండి మహాత్మా గాంధీ యొక్క సామాజిక మరియు రాజకీయ భావాల
నుండి ప్రేరణ పొందింది. సుశీలా నయ్యర్ సోదరుడు ప్యారేలాల్ నయ్యర్, గాంధీజీ కి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నందున ఆమెకు
మొదటి నుండి గాంధీజీతో సన్నిహిత పరిచయం ఉంది.
సుశీల ఢిల్లీ లోని లేడీ
హార్డింజ్ మెడికల్ కాలేజీ నుండి MBBS మరియు MD డిగ్రీలు పొందారు మరియు 1950లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మెడికల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో భాగమయ్యారు,
డాక్టర్ సుశీల నయ్యర్, 1939లో మెడిసిన్ లో గ్రాడ్యుయేషన్
పూర్తి చేసిన తర్వాత, సోదరుడు ప్యారేలాల్ నయ్యర్ ఆమెను సేవాగ్రామ్‌కు తీసుకువచ్చారు, అక్కడ డాక్టర్
బి.సి. రాయ్ గాంధీజీకి అధిక రక్తపోటు ఉన్నందున గాంధిజీని చూసుకోమని డాక్టర్ సుశీలా నయ్యర్ కు
చెప్పారు, ఆసమయం లో సేవాగ్రామ్‌లో కలరా
వ్యాప్తిచెందినది. డాక్టర్
సుశీల నయ్యర్ ఎవరి సహాయం లేకుండా స్వయం గా కలరా కేసులను నిర్వహించింది
మరియు వార్ధా నగరంలో కలరా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడింది. ఇది డాక్టర్ సుశీల నయ్యర్ కెరీర్ ను మార్చినది.
డాక్టర్ సుశీల నయ్యర్ సేవాగ్రామ్‌లో ఉండటం వలన ఆమెకు ఆధ్యాత్మిక మరియు జాతీయ భావనలు అలవాటుబడటమే
కాకుండా, ఆమె సేవాగ్రామ్ లో
కమ్యూనిటీ మెడిసిన్‌ను నిర్వహించినది. డాక్టర్ సుశీల నయ్యర్ నాయకత్వలక్షణాలు గాంధీజీ దృష్టిని ఆకర్షించినవి. గాంధీజీ సుశీల
నయ్యర్ ధైర్యం, సామర్థ్యం మరియు
ప్రజా సేవ పట్ల ఆమె నిబద్ధతను కొనియాడారు. గాంధీజీ, సుశీల నయ్యర్ ను తన వ్యక్తిగత వైద్యురాలుగా నియమించినారు.
భారతదేశ
స్వాతంత్ర్యం కోసం గాంధీ చేస్తున్న పోరాటంలో డాక్టర్ సుశీల నయ్యర్ గాంధీజీతో పాటు ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో డాక్టర్ సుశీల
నయ్యర్ ప్రముఖ పాత్ర పోషించారు. బ్రిటీష్ పాలనను నిర్భయంగా ఎదుర్కొని తిరుగుబాటు
చేసిన డాక్టర్ సుశీల నయ్యర్, అరెస్టు చేయబడి కస్తూర్బా గాంధీతో పాటు ఆగాఖాన్
ప్యాలెస్ జైలులో బంధించబడింది.
భారత జాతీయ ఉద్యమం
లో భారతీయులు మందులతో సహా అన్ని బ్రిటీష్ వస్తువులను బహిష్కరిస్తున్నందున భారతీయులకు
అవసరమైన మందులను స్వదేశం లో ఉత్పత్తి చేసే సిప్లా ఫార్మాస్యూటికల్స్ కు మద్దతు ఇవ్వడానికి డాక్టర్ సుశీల, మహాత్మా గాంధీతో
పాటు సిప్లా ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు ఖ్వాజా అబ్దుల్ హమీద్‌ను
సందర్శించారు.
ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు సరైన ఆరోగ్య సంరక్షణ అందించడమే డాక్టర్ సుశీల నయ్యర్ లక్ష్యం. సేవాగ్రామ్ మరియు చుట్టుపక్కల వైద్య సదుపాయాలు లేనందున, 1944 లో, డాక్టర్ సుశీల నయ్యర్ ఆశ్రమంలో ఒక చిన్న డిస్పెన్సరీని ప్రారంభించింది. అక్కడ డాక్టర్ సుశీల నయ్యర్ నోఖాలీ, పంజాబ్ మరియు కాశ్మీర్‌లో విభజనకు ముందు జరిగిన అల్లర్ల బాధితులకు చికిత్స చేయడం ప్రారంభించింది.
ఆతరువాత డాక్టర్ సుశీల నయ్యర్
, పారిశ్రామికవేత్త G D బిర్లా విరాళంగా
ఇచ్చిన చిన్న క్లినిక్‌లోకి మారినది. ఈ క్లినిక్ ఆసుపత్రికి విత్తనంగా మారింది
మరియు 1945లో కస్తూర్బా హాస్పిటల్ (ప్రస్తుతం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సైన్సెస్) స్థాపనతో డాక్టర్ సుశీల నయ్యర్
కల నెరవేరింది. డాక్టర్ సుశీల నయ్యర్
మరణించే వరకు దాని వ్యవస్థాపక- డైరెక్టర్‌గా కొనసాగింది.
కస్తూర్బా హాస్పిటల్
కేవలం 15 పడకలతో, పిల్లల మరియు ప్రసూతి ఆసుపత్రిగా ప్రారంభమైంది మరియు ఇది 1948 నుండి 1954 వరకు ఆశ్రమ సంరక్షణలో
పనిచేసింది. తరువాత కొలది సంవత్సరాలలోనే కస్తూర్బా హాస్పిటల్, కస్తూర్బా హెల్త్
సొసైటీగా అభివృద్ధి చెందింది, అందరికీ వైద్యం అందించడానికి డాక్టర్ సుశీల
నయ్యర్ నిరంతర కృషి చేయసాగింది.
డాక్టర్ సుశీల నయ్యర్, కస్తూర్బా హెల్త్ సొసైటీని ప్రారంభించారు. నయర్ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మరియు గాంధీ ప్రారంభించిన గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా పని చేసారు.
గాంధీజీ హత్య తరువాత, డాక్టర్ సుశీల నయ్యర్ యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లారు మరియు జాన్
హాప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుండి పబ్లిక్ హెల్త్
లో మాస్టర్స్ ఆఫ్
పబ్లిక్ హెల్త్ (MPH) మరియు డాక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (DrPH) అనే రెండు డిగ్రీలు
పొందారు. డాక్టర్ సుశీల నయ్యర్ 1950లో భారతదేశానికి
తిరిగి వచ్చి అనేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను అభివృద్ధి చేసింది.
1952లో, భారతదేశంలో మొదటిసారి
ఎన్నికలు జరిగినప్పుడు, డాక్టర్ సుశీల నయ్యర్
రాజకీయాలలోకి ప్రవేశించారు మరియు ఢిల్లీ
శాసనసభకు ఎన్నికయ్యారు (1952 - 1956). తర్వాత డాక్టర్ సుశీల నయ్యర్ నెహ్రూ క్యాబినెట్‌లో
ఢిల్లీకి మొదటి ఆరోగ్య మంత్రిగా 1955 వరకు పనిచేశారు. డాక్టర్ సుశీల నయ్యర్
ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సమయంలో, మలేరియా, వెనిరియల్ వ్యాధి, క్షయ మరియు కుష్టు
వ్యాధికి చికిత్స మరియు నియంత్రణతో సహా
అనేక ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. 1962-1967 వరకు డాక్టర్ సుశీల
నయ్యర్ కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
డాక్టర్ సుశీల నయ్యర్
ఒక సంఘ సంస్కర్త, మద్యపానాన్ని చెడుగా భావించారు మరియు మద్యపాన నిషేధ కమిటీ అధ్యక్షురాలిగా మూడు దశాబ్దాలకు
పైగా కొనసాగారు.
1977నుంచి డాక్టర్ సుశీల నయ్యర్ రాజకీయ రంగానికి దూరంగా ఉండి సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారు. డాక్టర్ సుశీల నయ్యర్ "బాపు కి కరావాస్ కహానీ" అనే అవార్డు గెలుచుకున్న పుస్తకాన్ని రాసింది, అది 1952లో రాష్ట్రపతి అవార్డును అందుకుంది. డాక్టర్ సుశీల నయ్యర్ సోదరుడు ప్యారేలాల్ నయ్యర్ కూడా గాంధీపై మూడు సంపుటాలుగా పుస్తకాలు రాశారు కానీ ప్యారేలాల్ నయ్యర్ మరణం కారణంగా మిగతా సంపుటాలను కొనసాగించలేకపోయారు. ఈ సిరీస్‌లోని మిగిలిన ఐదు సంపుటాలను డాక్టర్ సుశీల నయ్యర్ పూర్తి చేసింది.
డాక్టర్ సుశీల నయ్యర్ 1995లో విశ్వ భారతి విశ్వవిద్యాలయం,
శాంతినికేతన్ ద్వారా "దేశికొత్తమ" అవార్డును అందుకున్నారు. 1996లో అస్సాం ప్రభుత్వంచే "అమోల్ ప్రభా దాస్ అవార్డు"; 1997లో పూణేలోని బా-బాపు సమితిచే "బా
మరియు బాపు" అవార్డు. ఆ తర్వాత 2000లో "పబ్లిక్ హెల్త్ పర్సన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు"చే సత్కరించబడింది.
డాక్టర్ సుశీల నయ్యర్ జీవితాంతం అవివాహితగానే ఉండిపోయింది మరియు 3 జనవరి 2001న, డాక్టర్ సుశీల నయ్యర్ 86 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా మరణించారు. నయ్యర్ తన జీవితమంతా గాంధీ సిద్ధాంతాలను అమలు చేయడం, నిరంతరం శాంతిని నెలకొల్పడం మరియు విభజన సమయంలో మత సామరస్యాన్ని కొనసాగించడం చేసారు.
డాక్టర్ సుశీల నయ్యర్ తన స్ఫూర్తిదాయకమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, సమాజంలో స్త్రీలను భారంగా భావించే
సమయంలో స్త్రీవాదానికి ఒక వెలుగుగా వెలిగింది!
No comments:
Post a Comment