15 September 2022

డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ - ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా మత్తు వైద్యురాలు

 

భారతదేశం ఎందరో సుప్రసిద్ధ వ్యక్తులను అందించింది. వారిలో ఒకరు డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ. హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ ఉస్మానియా మెడికల్ కాలేజీ (గతంలో హైదరాబాద్ మెడికల్ స్కూల్ అని పిలుస్తారు) నుండి రూపా బాయి ఫుర్దూంజీ 1885-1889 లో "హకీమ్" డిగ్రీని పొందారు.

క్లోరోఫామ్ అనస్థీషియా అంతకుముందు యునైటెడ్ స్టేట్స్‌లో అంతర్యుద్ధం సమయంలో ఉపయోగించబడింది.

డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ భారతదేశంలో క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించడాన్ని పరిచయం చేసింది తద్వారా డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అనస్థటిస్ట్‌ అయ్యారు..

పంతొమ్మిదవ శతాబ్దంలో అనస్థీషియా శాఖలో మెడికల్ స్పెషాలిటి లేదు. అనస్థీషియా విషయంపై పూర్తి అవగాహన పొందడానికి మరియు నిపుణుత సాధించడానికి డాక్టర్ రూపా 1909లో స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో డిప్లొమా పొందారు. భారతదేశంలో క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించడాన్ని ప్రారంభించడంలో డాక్టర్ రూపా ముఖ్యమైన పాత్ర పోషించింది.

డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ 1889-1917 సంవత్సరాలలో బ్రిటిష్ రెసిడెన్సీ హాస్పిటల్ (ప్రస్తుతం సుల్తాన్ బజార్ హాస్పిటల్), అఫ్జల్‌గంజ్ హాస్పిటల్ మరియు జెనానా హాస్పిటల్, హైదరాబాద్‌లో అనస్థీషియాను అందించింది

1888 మరియు 1891లో జరిగిన మొదటి మరియు రెండవ హైదరాబాద్ క్లోరోఫామ్ కమీషన్లలో డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ క్రియాశీల సభ్యురాలు.. రెండవ హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ సమయంలో, డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ, ఎడ్వర్డ్ లారీ మరియు థామస్ లాడర్ బ్రంటన్‌లతో కలిసి మానవులకు క్లోరోఫామ్ ఇవ్వడం పై ప్రదర్సన ఇచ్చారు.

 క్లోరోఫామ్ అనస్థీషియా ఇవ్వడం లో క్లోరోఫామ్ అనస్థీషియాను నిర్వహించడంలో డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ నైపుణ్యాన్ని,  ఎడ్వర్డ్ లారీ ప్రశంసించారు, దీనిని 1891లో ప్రచురించబడిన ఎ రిపోర్ట్ ఆన్ హైదరాబాద్ క్లోరోఫామ్ కమీషన్స్అనే పుస్తకంలో పేర్కొన్నారు.

 డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ హకీమ్‌గా  డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, బాల్టిమోర్‌లోని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం నుండి మెడికల్ డిగ్రీని పొందింది.

వైద్యరంగం పురుషాధిక్యతతో నిండి  మరియు సాంఘిక నిషేధాలు ప్రపంచమంతటా ప్రబలంగా ఉన్న కాలంలో డాక్టర్ రూపా అనస్థీషియాలజిస్ట్‌గా వైద్య ప్రపంచంలో చాలా మహోన్నత పేరు సాధించినది.

డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ పుట్టిన తేదీ మరియు మరణించిన తేదీకి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవు. మహిళా పార్సీ మత్తు వైద్యురాలు డాక్టర్ రూపా బాయి ఫుర్దూంజీ 1920లో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసింది.

No comments:

Post a Comment