22 September 2022

హెన్రీ వేలిముద్రల వర్గీకరణ వ్యవస్థ" అభివృద్ధి లో తోడ్పడిన భారతీయ పోలిస్ ఆఫీసర్ ఖాన్ బహదూర్ ఖాజీ అజీజుల్ హక్

 

ఆంగ్లేయ వలసవాదులు భారత దేశ భౌతిక సంపద మాత్రమే కాదు, భారతీయుల మేధో సంపత్తిని కూడా దోచుకున్నారు. సర్ J.C. బోస్, రాధానాథ్ సిక్దర్, కిషోరి మోహన్ బందోపాధ్యాయ, హేమంత బోస్ లాంటి అనేక మంది భారతీయులు చేసిన ఆవిష్కరణలను పాశ్చాతులు తమ స్వంతంగా పేర్కొన్నారు.

వేలిముద్రల  సాంకేతికతను కనుగొన్న వారిలో ఒకరైన ఖాన్ బహదూర్ ఖాజీ అజీజుల్ హక్ యొక్క శతాబ్ది వార్షికోత్సవం 2022, కానీ ఆ ఘనత ప్రధానంగా సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీకి చెందింది. సర్ హెన్రీ వేలిముద్రల యొక్క "హెన్రీ వర్గీకరణ వ్యవస్థ"ని అభివృద్ధి చేసాడు, అయితే ఈ సాంకేతికత వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఇద్దరు భారతీయులు - ఖాన్ బహదూర్ ఖాజీ అజీజుల్ హక్ మరియు హేమంత బోస్ అని కొంతమందికి మాత్రమె తెలుసు.

ఖాజీ అజీజుల్ హక్ 1872లో అప్పటి బెంగాల్‌లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న) ఖుల్నా జిల్లాలోని పైగ్రామ్ కస్బా గ్రామంలో జన్మించారు. హక్ చిన్నతనంలోనే  అతని తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మరణించారు. తల్లిదండ్రులను, కోల్పోవడంతో, కుటుంబానికి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి, కుటుంబనిర్వహణాభారం మొత్తం  హక్ యొక్క అన్నయ్య పై పడింది.

హక్ సంఖ్యాపరమైన గణిత  సమస్యలను పరిష్కరించడంలో అసాధారణమైన సామర్ధ్యం కలిగిన అల్లరి పిల్లవాడు. హక్ భోజన ప్రియుడు. ఆహారం పట్ల ఆసక్తి గలవాడు. హక్‌ అన్నయ్య,  హక్ ను తన ఆహారపు అలవాట్లను సరిదిద్దుకోమని తరచూ తిట్టేవాడు. ఒక రోజు అతని సోదరుడు పని నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి  హక్ తన భోజనంలో తన వాటాతో  పాటు, తన సోదరుడి ఆహారంలో గణనీయమైన భాగాన్ని కూడా తిన్నాడని తెలుసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన హక్ అన్నయ్య,  హక్‌ను కొట్టాడు. అవమానం తో హక్ ఇంటిని విడిచిపెట్టి, రైలు ఎక్కి 1884లో కలకత్తా చేరుకున్నాడు.

కలకత్తా లో ధనవంతుడు అయిన ఒక ప్రముఖ బెంగాలీ హిందూ,   హక్ పై జాలిపడి అతనిని తన ఇంట్లో పని అబ్బాయిగా నియమించుకున్నాడు. హక్ పనిచేసే ఇంట్లోని పిల్లలకు బోధించడానికి ఒక ట్యూటర్ వచ్చేవాడు. హక్ సమీపంలోని నేలపై కూర్చుని పాఠాలను  వినే వాడు. ఒక సారి హక్, యజమాని ఇంటి పిల్లలు చేయలేని గణిత సమస్యలను పరిష్కరించాడు. ట్యూటర్, హక్‌ గణిత నైపుణ్యతను చూసి ఆశ్చర్యపోయాడు మరియు వెంటనే ఇంటి యజమానికి విషయాన్ని నివేదించాడు.

యాజమాని హక్‌ను మరింత ప్రశ్నించాడు, హక్ అతనికి నిజం చెప్పాడు – హక్ తన గ్రామంలోని  స్కూల్ లో చదేవేవాడినని, అన్న మీద కోపంతో  ఇంటి నుండి పారిపోయి కలకత్తా వచ్చానని చెప్పాడు.  హక్ ప్రతిభావంతుడైన అబ్బాయి అని యజమానికి నమ్మకం కలిగింది. యజమాని,  హక్ ను చదువుకోవడానికి స్కూల్ లో చేర్చాడు.

స్కూల్ విద్య అనంతరం హక్,  కలకత్తాలోని ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు. అక్కడ హక్  గణితం మరియు సైన్స్‌ లో రాణించాడు. 1892లో, బెంగాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ (1850-1931), స్టాటిస్టిక్స్‌లో బలమైన నేపథ్యం ఉన్న తన విద్యార్ధులలో ఒకరిని పోలీసు శాఖ లో ఉద్యోగానికి సిఫార్సు చేయమని అభ్యర్థిస్తూ కళాశాల ప్రిన్సిపాల్‌కి లేఖ రాశారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంటనే హక్‌ను సిఫార్సు చేశాడు, తద్వారా హక్,  మరో యువకుడు హేమ్ చంద్రబోస్‌తో పాటు పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్స్ గా నియమించబడ్డారు.



సర్ హెన్రీ- బ్రిటిష్ ఇండియా- బెంగాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్

 

హక్ మరియు బోస్ ఇద్దరూ సర్ హెన్రీచే వేలిముద్రల యొక్క "హెన్రీ వర్గీకరణ వ్యవస్థ Henry Classification System "ని అభివృద్ధి చేయడానికి నియమించబడ్డారు. హక్, సిస్టమ్‌కు గణిత ఆధారాన్ని అందించాడు, అయితే బోస్ వేలిముద్రల కోసం టెలిగ్రాఫిక్ కోడ్ సిస్టమ్‌ను రూపొందించడం ద్వారా దానిని పూర్తి చేశాడు. సర్ హెన్రీ, హక్ మరియు బోస్ యొక్క పరిశోధన,  వేలిముద్రల  యొక్క "హెన్రీ వర్గీకరణ వ్యవస్థ"గా పిలువబడింది, ఇది దాదాపు ఒక శతాబ్దం (1899-1990s) పాటు విజయవంతంగా ఉపయోగించబడింది. వాస్తవానికి, "హెన్రీ వర్గీకరణ వ్యవస్థ" ప్రస్తుత బయోమెట్రిక్ వ్యవస్థల అభివృద్ధిలో, అంటే నేటి AFIS సాంకేతికత (ఇంటిగ్రేటెడ్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) ఏర్పాటులో కూడా అత్యంత ప్రభావవంతమైన పాత్రను పోషించింది.

చేతి ముద్రలు మరియు వేలిముద్ర లక్షణాలపై తీవ్రమైన అధ్యయనాలు 1600ల మధ్యకాలం నుండి ఐరోపాలో ప్రారంభమయ్యాయి. అయితే, వేలిముద్రలను గుర్తింపు సాధనంగా ఉపయోగించడం 19వ శతాబ్దం మధ్యకాలం వరకు జరగలేదు. సుమారు 1859లో, సర్ విలియం జేమ్స్ హెర్షెల్, ICS (1833-1917) వేలిముద్రలు కాలక్రమేణా స్థిరంగా ఉంటాయని మరియు వ్యక్తులలో ప్రత్యేకంగా ఉంటాయని కనుగొన్నారు. 1877లో భారతదేశంలోని జుంగిపూర్‌లోని హుగ్లీ జిల్లా ప్రధాన మేజిస్ట్రేట్‌గా, సర్ విలియం జేమ్స్ హెర్షెల్ గుర్తింపు, చట్టపరమైన పత్రాలపై సంతకం చేయడం మరియు లావాదేవీలను ప్రామాణీకరించేందుకు వేలిముద్రల ఉపయోగాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి.

 

1892లో, గణాంక నిపుణుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ “ఫింగర్ ప్రింట్స్‌” అనే ప్రసిద్ద పుస్తకమును  ప్రచురించాడు, దీనిలో గాల్టన్ తన వేలిముద్రల  వర్గీకరణ వ్యవస్థను వివరించాడు, ఇందులో మూడు ప్రధాన వేలిముద్ర నమూనాలు ఉన్నాయి - లూప్స్, వోర్ల్స్ మరియు ఆర్చ్‌లు.

1894లో, సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ, బెంగాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్  నేర పరిశోధన కోసం వేలిముద్రలపై ఆసక్తి కనబరిచాడు మరియు హెన్రీ వేలిముద్రల  గుర్తింపు వ్యవస్థ తిరిగి  ఉపయోగం లోకి తీసుకువచ్చారు.  ఖైదీల ఆంత్రోపోమెట్రిక్ Anthropometry, కొలతలతో పాటు వారి వేలిముద్రలను సేకరించాల్సిందిగా సర్ హెన్రీ బెంగాల్ పోలీసులను ఆదేశించారు.

గాల్టన్ యొక్క వర్గీకరణ వ్యవస్థను విస్తరిస్తూ, సర్ హెన్రీ 1896 మరియు 1925 సంవత్సరాల మధ్య హెన్రీ వర్గీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ప్రధానంగా 1024 పిజియన్ హోల్ ఆధారిత హెన్రీ ఆలోచనకు అనుబంధంగా గణిత సూత్రాన్ని అభివృద్ధి చేసిన అజీజుల్ హక్,  హెన్రీ ప్రయత్నానికి సహాయం చేశాడు. సర్ హెన్ యొక్క మరొక సహాయకుడు సబ్-ఇన్‌స్పెక్టర్ హేమ్ చంద్రబోస్, కూడా వేలిముద్ర వర్గీకరణ సిస్టమ్‌కు టెలిగ్రాఫిక్ పద్ధతిని రూపొందించడంలో సహాయం చేయడం ద్వారా సిస్టమ్‌ను మెరుగుపరచడంలో సహాయం చేశాడు.

 

సర్ హెన్రీ యొక్క సిఫార్సుపై అతని సహాయకులు ఇద్దరూ-అజీజుల్ హక్  మరియు  హేమ్ చంద్రబోస్ సంవత్సరాల తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నుండి వారి విలువైన సహకారానికి గుర్తింపు పొందారు.

 

హెన్రీ వర్గీకరణ వ్యవస్థ 1899లో ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. 1897లో ఆంత్రోపోమెట్రీని Anthropometry, హెన్రీ వర్గీకరణ వ్యవస్థతో పోల్చడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఫలితాలు ఎక్కువగా వేలిముద్రలకు అనుకూలంగా ఉండటంతో, బ్రిటిష్ ఇండియాలో వైస్రాయ్ ద్వారా 1900లో ఆంత్రోపోమెట్రీ స్థానం లో  వేలిముద్రలు ప్రవేశపెట్టబడ్డాయి

 

విశిష్ట పోలీసు అధికారిగా హక్, తదనంతరం, 1912లో బెంగాల్ ప్రెసిడెన్సీ నుండి బీహార్ విడిపోయినప్పుడు బీహార్ పోలీస్ సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, అతను బీహార్‌లోని మోతిహారిలో స్థిరపడ్డాడు, అక్కడ హక్ 1935లో మరణించాడు.

వేలిముద్రల అంశంలో భారతీయ మరియు పాశ్చాత్య చరిత్రకారులు, పరిశోధకులు మరియు నిపుణులు, వేలిముద్రల హెన్రీ వర్గీకరణ వ్యవస్థను రూపొందించడంలో మరియు దానిని పరిపూర్ణం చేయడంలో గరిష్టంగా సహకరించిన వ్యక్తిగా హక్ యొక్క పాత్రను ఏకగ్రీవంగా గుర్తించారు.

హెన్రీ వేలుముద్రాల వర్గీకరణ లో అసాధారణమైన సహకారం అందించిన హక్ 1913లో ఖాన్ సాహిబ్ మరియు 1924లో ఖాన్ బహదూర్ బిరుదును బ్రిటీష్ ప్రభుత్వం నుండి పొందాడు మరియు  బీహార్,మోతిహారిలో జాగీర్ (ఫ్యూడల్ ల్యాండ్ గ్రాంట్)కూడా  పొందాడు.

అదేవిధంగా, బోస్,  రాయ్ సాహిబ్ మరియు రాయ్ బహదూర్ బిరుదులను పొందారు. ఫింగర్‌ప్రింటింగ్ వర్గీకరణ స్థాపనలో చేసిన అత్యుత్తమ సహకారానికి గాను  ఇద్దరికీ,  ఒక్కొక్కరికి 5,000 రూపాయల గౌరవ వేతనం లభించింది.

హక్ యొక్క మేధాతనమునకు   అత్యంత సముచితమైన నివాళి,సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ నుండి వచ్చింది. "ఖాన్ బహదూర్ అజీజుల్ హక్ కొత్త ప్రపంచవ్యాప్త వేలిముద్రల గుర్తింపు వ్యవస్థకు ప్రధానంగా బాధ్యత వహించే వ్యక్తి."అని  సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ పేర్కొన్నాడు.

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment