5 May 2023

Earth Day: 22 ఏప్రిల్ భూమి గుండ్రంగా లేదా? మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు

 

ఇంటర్నేషనల్ ఎర్త్ డేను ఏటా ఏప్రిల్ 22 నిర్వహిస్తారు. 1970‌లో ఇదే తేదీన అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఘటనలను గుర్తుచేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చేందుకు తేదీని ఎర్త్ డేగా ఐక్యరాస్యసమితి ప్రకటించింది.

సందర్భంగా భూమి గురించి కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం:

1. భూమి సంపూర్ణ గోళం కాదు:

భూమిని మ్యాప్లలో సంపూర్ణ గోళాకారంలో చూపిస్తారు. కానీ, అది నిజంకాదు. ధ్రువాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ధ్రువాల దగ్గర కాస్త సమతలంగా కనిపించే గోళంగా చెప్పుకోవచ్చు.

ఇతర గ్రహాల తరహాలోనే సూర్యుడి చుట్టూ కక్ష్యలో తిరగడం వల్ల భూమిపై కూడా గురుత్వాకర్షణ శక్తి, అపకేంద్ర బలం (సెంట్రీఫ్యూగల్ ఫోర్స్) గట్టిగా పనిచేస్తాయి. దీని వల్ల ధ్రువాలు కాస్త సమతలంగా ఉండటంతోపాటు భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ధ్రువాల దగ్గర కంటే భూమధ్య రేఖ వద్ద వ్యాసం 43 కి.మీ. ఎక్కువగా ఉంటుంది.

2. భూమిపై 70 శాతం ఉండేది నీరే:

భూమిపై నీరు ఘన , ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది.భూమిపై దాదాపు నాలుగింట మూడొంతులు ఉండేది నీరే. హిమానీనదాలు (గ్లేసియర్లు), చిత్తడినేలలు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహా సముద్రాల రూపంలో నీరు ఉంటుంది. మొత్తం నీటిలో 97 శాతం సముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంటుంది.

3. భూమి నుంచి 100 కి.మీ. ఎత్తులో అంతరిక్షం మొదలవుతుంది:

భూమి వాతావరణం, అంతరిక్షంల మధ్య రేఖను కార్మన్ రేఖగా పిలుస్తారు. సముద్ర తలం నుంచి వంద కి.మీ. ఎత్తులో ఇది మొదలవుతుంది.సముద్ర తలం నుంచి 11 కి.మీ. ఎత్తులోనే భూమి వాతావరణంలో 75 శాతం ద్రవ్యరాశి (మాస్) ఉంటుంది.

4. భూమిలోపల ఇనుప గోళం:

సౌర కుటుంబంలో ఐదో అతిపెద్ద గ్రహం భూమి. అత్యధిక సాంద్రత గల గ్రహం కూడా ఇదే.భూమి మధ్యలో ఒక ఇనుప గోళం ఉన్నట్లుగా భావిస్తున్నారు. దీని వ్యాసార్థ్యం దాదాపు 1,200 కి.మీ..దీనిలో ఎక్కువ శాతం ఉక్కు ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇనుము 85 శాతం, నికెల్ 10 శాతం వరకూ ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

5. జీవం ఉన్నది ఇక్కడేనా?

మన విశ్వంలో జీవం ఉన్నట్లు నిర్ధారించగలిగిన ఏకైక గ్రహం భూమి. ప్రస్తుతం దాదాపు 12 లక్షల జంతువులను పరిశోధకులు గుర్తించారు. అయితే, మొత్తం జంతు జాలంలో ఇవి చాలా తక్కువ శాతమని భావిస్తున్నారు.అయితే, 2011లో మొత్తంగా మన జీవావరణంలో 87 లక్షల జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం భూమి ఏర్పడింది. భూమి భౌగోళిక స్వరూపం, కక్ష్య వల్ల ఇక్కడ కొన్ని లక్షల ఏళ్ల నుంచి జీవుల మనుగడకు వీలైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

6. గురుత్వాకర్షణ శక్తి అన్నిచోట్లా ఒకేలా లేదు:

భూమి సంపూర్ణ గోళాకారంలో లేకపోవడంతోపాటు ద్రవ్యరాశి కూడా అన్నిచోట్లా ఒకేలా లేదు. దీంతో గురుత్వాకర్షణ క్షేత్రంలోనూ మనకు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.ఉదాహరణకు మనం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుగా వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. అయితే, హెచ్చుతగ్గులను మనుషులు నేరుగా గుర్తించడం కొంచెం కష్టం.

7. భిన్నత్వానికి భూమి కేంద్రం:

భూమిపై చాలా బిన్నమైన వాతావరణాలు మనకు కనిపిస్తాయి. ఒక్కో ప్రాంతం భౌగోళిక స్వరూపం ఒక్కోలా ఉండటం, వాతావరణం కూడా భిన్నంగా ఉండటంతో ప్రాంతానికి ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది.భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రాంతం ఏదని అడిగితే, చాలా సమాధానాలు వస్తాయి. అయితే, అమెరికాలోని డెత్ వేలీలో 1913 జులై 10 గరిష్ఠంగా 56.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను పరిశోధకులు గుర్తించారు.మైనస్ ఉష్ణోగ్రతల విషయంలో కనిష్ఠం అంటార్కిటికాలో నమోదైంది. 1983 జులై 13 వోస్టోక్లో -89.2 డిగ్రీల సెంటీగ్రేడ్ను పరిశోధకులు గుర్తించారు.

8. భూమిపై జీవమున్న అతిపెద్ద నిర్మాణం:

ఆస్ట్రేలియా తీరంలోని ‘‘ గ్రేట్ బారియర్ రీఫ్’’ను జీవులతో ఏర్పడిన అతిపెద్ద నిర్మాణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని మనం అంతరిక్షం లోనుంచి కూడా చూడొచ్చు.2000 కి.మీ. విస్తీర్ణంలో కనిపించే పగడపు దిబ్బల్లో వేలకొద్దీ సముద్ర జీవుల జాతులు కనిపిస్తాయి.1981లో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.

9. ఉపరితలం కింద ఫలకాలు కదులుతున్న ఏకైక గ్రహం భూమి:

భూఫలకాల కదలికల వల్ల భూమి నైసర్గిక స్వరూపం నిత్యం మారుతూ ఉంటోంది.భూమిపై పర్వతాలు ఏర్పడటం, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటానికి ఫలకాల కదలికలే కారణం.భూమి ఉష్ణోగ్రతల నియంత్రణలోనూ ఫలకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్రీన్హౌస్ వాయువులను రీసైకిల్ చేయడం, సముద్ర గర్భంలో కొత్తగా పైపొరలు ఏర్పడటంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయి.

10. భూమికి రక్షణ కవచముంది:

సూర్యుడి నుంచి వచ్చే ఆవేశపూరిత రేణువుల నుంచి భూమి అయస్కాంత క్షేత్రం రక్షణ కవచంలా పనిచేస్తుంది.భూమి కేంద్రం నుంచి మొదలయ్యే క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్స్ (సౌర పవనాల) నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

 

 

.

No comments:

Post a Comment