4 May 2023

విద్య ద్వారా ముస్లిం మహిళా సాధికారత చరిత్ర History of Muslim women's empowerment through education

 

ముస్లిం మహిళల విద్యా సాధికారత వెనుక గొప్ప వారసత్వం ఉంది. ముహమ్మద్ ప్రవక్త(స) భార్య హజ్రత్ ఆయిషా బింట్ అబూ బకర్ ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో జ్ఞానం మరియు నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. హజ్రత్ ఆయిషా హదీథ్‌ రంగంలో  ప్రముఖ పాత్ర పోషించింది మరియు నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందింది. ముహమ్మద్ ప్రవక్త మరియు హజ్రత్ ఖదీజా కుమార్తె అయిన హజ్రత్ ఫాతిమా అల్-జహ్రాను దైవభక్తి మరియు స్వచ్ఛతకు చిహ్నంగా ముస్లింలు గౌరవిస్తారు.

ఫాతిమా అల్-ఫిహ్రీ 859 CEలో మొరాకోలో ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాలలో ఒకటైన అల్ క్వారౌయిన్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. భారతీయ దేశంలో  బేగం రోకేయా సఖావత్ హుస్సేన్ కోల్‌కతాలో మొట్టమొదటి ముస్లిం బాలికల పాఠశాలను స్థాపించారు మరియు మహిళల హక్కులపై విస్తృతంగా రాశారు. బేగం రోకేయా సఖావత్ 20వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణాసియాలో మహిళా విముక్తికి మార్గదర్శకురాలిగా పరిగణించబడుతుంది. రబియా అల్-అదావియా, నానా అస్మావు, షహ్రజాద్ అల్-ఖలీజ్, జైనాబ్ అల్-గజలీ, ఫాతిమా షేక్, ఫాతిమా మెర్నిస్సీ, మలాలా యూసఫ్‌జాయ్ మొదలగు ముస్లిం మహిళలు విద్యా రంగం లో విశేషమైన కృషి చేశారు

రాజకీయ సాధికారత Political Empowerment:

బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, జోర్డాన్ రాణి రానియా మొదలగు ప్రముఖ ముస్లిం మహిళలు ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముస్లిం మెజారిటీ దేశాల్లో రాజకీయాలలో మహిళల అధిక భాగస్వామ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు, ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో, మహిళలు పార్లమెంటులో 25% స్థానాలను కలిగి ఉన్నారు. ట్యునీషియాలో, స్థానిక ప్రభుత్వంలో మహిళలు 47% స్థానాలను కలిగి ఉన్నారు.

ముస్లిం మహిళలు రాజకీయ క్రియాశీలత కలిగి అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఇరాన్‌లో, మహిళలపై వివక్షాపూరిత చట్టాలను నిలిపివేయాలని వన్ మిలియన్ సంతకాల ప్రచారాన్ని ఇరాన్ మహిళలు ప్రారంభించారు. మిలియన్ సంతకాలను సేకరించడంలో మరియు మహిళల హక్కుల సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రచారం విజయవంతమైంది. మలేషియాలో, మాజీ ఉప ప్రధానమంత్రి కుమార్తె అయిన నూరుల్ ఇజ్జా అన్వర్ ప్రముఖ రాజకీయ మహిళగా,  మహిళల హక్కుల కోసం పోరాడింది. సమకాలీన భారతదేశంలో, ఫాతిమా బేగం, బేగం ఐజాజ్ రసూల్, సయ్యదా అన్వారా తైమూర్, డాక్టర్ జకియా సిద్ధిఖీ, డాక్టర్ నజ్మా హెప్తుల్లా, మొహసినా కిద్వాయ్ మరియు మెహబూబా ముఫ్తీ జాతీయ స్థాయిలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

ఆర్థిక సాధికారత Economic Empowerment: 

ప్రవక్త(స) మొదటి భార్య హజ్రత్ ఖదీజా బిన్త్ ఖువైలిద్‌ మక్కా లోని ప్రముఖ మహిళ మరియు విజయవంతమైన వ్యాపారవేత్త, సమాజంలోని ఇతర మహిళలకు మార్గదర్శకరాలుగా మహిళల హక్కుల రక్షకురాలు. వ్యాపార ప్రపంచంలో హజ్రత్ ఖదీజా సాధించిన విజయాలు ఇతర ముస్లిం మహిళలను వారి వ్యవస్థాపక కలలను అనుసరించడానికి మరియు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి ప్రేరేపించాయి.

హీనా జోహరి, నుజాత్ హషీర్, ఫరా ఆరిఫ్ ఖాన్, అలీమ్ షేక్, అయేషా మీనన్ మరియు హుదా పటేల్ భారతదేశంలోని ప్రముఖ ముస్లిం మహిళా వ్యాపార వ్యవస్థాపకులు.

అయితే నేటి  భారతీయ ముస్లిం మహిళల దుస్థితికి ఎవరు బాధ్యులు అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది:?

భారత దేశాని  స్వాతంత్ర్యo వచ్చి  75 ఏళ్లు గడిచినా ముస్లిం సమాజం మహిళలను ప్రోత్సహించడం లేదు. భారతదేశంలో ముస్లిం మహిళలు నాణ్యమైన విద్య పొంది  రాజకీయాలు, సాహిత్యం, కళలు, క్రీడలు, సైన్యం, నావికాదళం, పోలీసు బలగాలు మొదలైనవాటిలో పాల్గొనాలనే వారి కల, కలగానే మిగిలిపోయింది.  భారతదేశంలోని ముస్లిం మహిళలు అత్యున్నత  స్థానానికి చేరుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు, కానీ ముస్లిం సమాజo వారికి సహాయం చేయడానికి సిద్ధంగా లేదు.

ఇస్లాం, పురుషులు మరియు స్త్రీల మధ్య ఎటువంటి తేడా చూపలేదు మరియు లింగ సమానత్వం, శాంతి, వినయం, సాధికారత మరియు మానవులందరికీ న్యాయం కోసం నిలుస్తుంది. ఇస్లాం స్త్రీలకు ఉన్నతమైన హక్కులను కల్పించింది. కానీ సమకాలీన కాలంలో, మహిళలు వరకట్నం, లింగ ఆధారిత వివక్ష, నిర్ణయాధికారం లేకపోవడం, విద్యలేమి వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నేటికీ మహిళలు గృహకార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ముస్లిం మహిళల కొరకు సురక్షితం అని భావిస్తున్న ఏకైక వృత్తి బోధన మాత్రమె.

ముస్లిం మహిళల స్థానం క్షీణించడానికి ప్రధాన కారణం ముస్లిం సంస్థల అజ్ఞానం, తప్పుడు కథనాలు, కఠినమైన ఆచారాలు మరియు పితృస్వామ్య ఆధిపత్యాన్ని పాటించడం. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, హమ్దార్ద్ యూనివర్శిటీ వంటి విద్యాసంస్థలు మరియు అనేక ఇతర విద్యాసంస్థలు కూడా ఏ మహిళా ను వైస్-ఛాన్సలర్‌గా  ఎన్నుకోలేదు. జామియా మిలియా ఇస్లామియాకు 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజ్మా అక్తర్ లభించింది. 

మనం చరిత్రను పరిశీలిస్తే దాదాపు అన్ని  రంగాలలో ముస్లిం మహిళల సహకారం ఉన్నత స్థానం లో ఉంది. విద్య, న్యాయవాదం, ఆరోగ్యం మరియు రాజకీయాలు వంటి దాదాపు అన్ని రంగాలలో ముస్లిం మహిళలు  ప్రతిభ కనబరిచారు. కానీ నేడు ముస్లిం మహిళల ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ముస్లిం మహిళలు ప్రతి రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నారు, కాని ముస్లిం సమాజ నాయకులు వారి నాయకత్వాన్ని పరిమితం చేస్తూ ప్రోత్సహించడం లేదు. జమియత్ ఉలేమా ఇ హింద్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, దేవబంద్, బరేలీ, నద్వా మొదలైన ముస్లిం సంస్థలు మరియు ఇతర సంస్థలు ముస్లిం మహిళల సాధికారత కోసం ఎలాంటి రోడ్ మ్యాప్‌ను ఎందుకు రూపొందించడం లేదు?

ఈ సంస్థలు ముస్లిం మహిళల కోసం విద్యా సంస్థలు, లైబ్రరీలు, ఆర్ట్ సెంటర్లు మొదలైనవాటిని ఎందుకు తెరవడం లేదు? ఈ సంస్థలను పురుషులు మాత్రమే ఎందుకు నాయకత్వం వహిస్తున్నారు? వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోతారని భయపడుతున్నారా లేదా దేని కోసం ఆధిపత్యం చెలాయిస్తున్నారు?

ఇస్లాం స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు కల్పించింది. ముస్లిం కమ్యూనిటీ సంస్థల్లో సేవ చేయడానికి భారతీయ ముస్లిం మహిళలకు తగినంత స్థలం మరియు సమాన అవకాశాలు ఎందుకు లేవు?

దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే ముస్లిం మహిళల సాధికారత కోసం సమస్యలు, సవాళ్లు మరియు మార్గాలను పునరాలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే వేలాది మంది ముస్లిం మహిళలు మద్దతు, అవకాశం, స్థలం మరియు స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారు. వరకట్నాన్ని డిమాండ్ చేసి, దానిని పెంచే బదులు, ముస్లిం మహిళలకు  వారసత్వంలో వారి వాటాను నిర్ధారించాలి. ఇది భారతదేశ సుప్రీంకోర్టుతో పాటు ఇస్లామిక్ న్యాయశాస్త్రం ద్వారా కూడా నిర్ధారించబడింది, కానీ సమాజంలో ఆచరణలో లేదు.

 

No comments:

Post a Comment