ఏదైనా అంటే 'మీ తెనాలి
వాళ్లకు ప్రాంతీయాభిమానం ఎక్కువ' ని ఆడిపోసుకుంటారు అందరూ. తెనాలివాళ్ళంతా ' మీది తెనాలి.. మాది తెనాలి' అంటూ అర్థం పర్థం
లేని ప్రాంతీయాభిమానం చూపిస్తారని గేలిచేస్తారు. మితిమీరిన ప్రాంతీయాభిమానంతో
తెనాలివాళ్ళు తెలివితక్కువగా మోసపోతారని సినిమాలలో హాస్య సన్నివేశాలలో చిత్రించి, ఎద్దేవా
చేసి మరీ తెనాలి పట్ల తమ అక్కసు
వెళ్లగక్కారు కొందరు. కానీ అసలు ఇంతటి ప్రాంతీయాభిమానం తెనాలి వాళ్లకు ఎందుకుందో
ఎవరైనా ఆలోచిస్తున్నారా ? ఒకటా, రెండా తెనాలికి ఎన్ని ప్రత్యేకతలు ? కనీసం నాకు
తెలిసినవన్నీ చెప్పుకోవాలంటేనే అచ్ఛంగా
తెనాలి గురించి ముఖపుస్తకంలో ఒక యాభై భాగాల ధారావాహికే రాయొచ్చు. అయినా క్లుప్తంగా
కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడిక్కడ ముచ్చటిస్తాను.
నాకూ తెనాలికి అక్షరాలా అరవై
ఆరేళ్ళ అనుబంధం. నేను పుట్టిందీ, పెరిగిందీ, ఆడుకున్నదీ, చదువుకున్నదీ - అంతా ఇక్కడే మరి ! ఇదేదో
తెనాలిలో పుట్టి పెరిగిన నాలాంటి వాళ్లకి మాత్రమే ఉండే అభిమానమైతే దానిని ప్రాంతీయ
దురభిమానమని మీరంతా ఎప్పుడో కొట్టిపారేసేవారు కదూ ! కానీ తెనాలికి కోడళ్ళుగా, అల్లుళ్లుగా
వచ్చినవారికీ, ఉద్యోగరీత్యా ఏ
కొద్ది కాలమో తెనాలిలో పనిచేసినవారికీ కూడా తెనాలి పట్ల అభిమానం అంతే
తీవ్రస్థాయిలో ఉండడం ఆలోచనీయం కాదా ? ఎక్కడో పుట్టి, పెరిగి
ఇక్కడికొచ్చి స్థిరపడ్డవారు సరే, ఎక్కడెక్కడో
ఉద్యోగాలు చేసినవారు కూడా,
తెనాలిలో తాము పనిచేసిన
ఏ కొద్ది కాలాన్నో గుర్తుచేసుకుంటూ, తెనాలితో తమకున్న
ఆ కొద్దిపాటి అనుబంధాన్ని ఎంతో గర్వంగా
చెప్పుకుంటూ, ' మాదీ తెనాలే' అంటూ ఉండడం గమనార్హం కాదా ? తెనాలి పట్ల
వీళ్ళ వీరాభిమానాన్ని చూస్తుంటే ఈ గడ్డ మీద పుట్టిపెరిగిన మా బోంట్లకు కూడా
మతిపోతుంది.
మా తెనాలి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల
పరిధిలోని వారంతా దేశంలో,
ప్రపంచంలో
ఎక్కడికెళ్లినా కూడా తెనాలి బ్రాండ్ తో చెలామణీ అయిపోతుండడం చూస్తే మాకు గర్వంగా
ఉండదూ మరి ? నిజానికి ఇటీవలి
కాలం వరకూ రైల్వే మెయిన్ లైన్ లో అటు కలకత్తా, ఢిల్లీ వైపుకు వెళ్లాలన్నా, ఇటు మదరాసు, కేరళ, కన్యాకుమారికి
వెళ్లాలన్నా జిల్లా కేంద్రం గుంటూరు వాళ్ళు కూడా తెనాలి వచ్చే ట్రెయిన్స్
ఎక్కాల్సి ఉండేది. తెనాలి రైల్వే జంక్షన్ మొదటినుంచీ అంత కీలకమైనది మరి. గుంటూరుకు
జిల్లా కేంద్రం పేరుకే. గుంటూరు. జిల్లా
కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం 1920 దశకం నుంచీ ఇటీవలి వరకూ
తెనాలిలోనే ఉండేది. జిల్లా, రాష్ట్ర, కేంద్ర రాజకీయాలలో ఎప్పుడూ తెనాలికి చెందిన
రాజకీయ నేతలే చక్రం తిప్పేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా చక్రం తిప్పిన
కొత్త రఘురామయ్య, కల్లూరి
చంద్రమౌళి, ఆలపాటి
వెంకట్రామయ్య, నన్నపనేని
వెంకట్రావు, దొడ్డపనేని ఇందిర, కొణిజేటి రోశయ్య, యడ్లపాటి
వెంకటరావు, వెనిగళ్ల
సత్యనారాయణ రావు, నాదెండ్ల
భాస్కరరావు, ఆలపాటి ధర్మారావు, అన్నాబత్తుని
సత్యనారాయణ, ఆలపాటి
రాజేంద్రప్రసాద్, నన్నపనేని
రాజకుమారి, గొల్లపూడి వేదాంత రావు, నక్కా ఆనంద్
బాబు వంటి ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతపు
నేతలే.
సుప్రసిద్ధ రైతునేత
యన్.జి. రంగా, కమ్యూనిస్టు నేత
కొల్లా వెంకయ్య, ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు,శారద వంటి వారు ఇక్కడివారు
కాకున్నా తెనాలి పార్లమెంటు నుంచి గెలిచి ఇక్కడి రాజకీయాలలో ప్రముఖపాత్ర
పోషించారు. జాతీయోద్యమ కాలం నుంచీ తెనాలి
రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేది. సహాయ నిరాకరణోద్యమం, కల్లు వ్యతిరేక పోరాటం, విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణ, ఖాదీ ఉద్యమం, హిందీ ప్రచారోద్యమం వంటి వాటిలో తెనాలి స్థానం
అద్వితీయం. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రణరంగ చౌక్ లో జరిగిన కాల్పుల్లో
ఏడుగురు స్వాతంత్య్ర యోధులు అశువులు బాశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా
ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది.
తెనాలి నేతల మాటే మొదట్నుంచీ
జిల్లాలో శాసనంగా ఉండేది. జిల్లాకు ఒకటి
మాత్రమే ఉండే పారిశ్రామిక శిక్షణా కేంద్రం
( ఐ టి ఐITI ) మొత్తం గుంటూరు
జిల్లాకంతటికీ తెనాలిలో 1962 లోనే స్థాపించారు. దానిపక్కనే ఇప్పుడు కేంద్రీయ
విద్యాలయం కూడా నడుస్తున్నది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం
మొదట్నుంచీ తెనాలిలోనే ఉండేది. ఇటీవలనే
దానిని గుంటూరుకు తరలించారు. ఇక జిల్లాకి
ఒకటిగా ఉండే గ్రామీణ బ్యాంకు ( చైతన్య గ్రామీణ బ్యాంకు) కేంద్ర కార్యాలయం కూడా తెనాలిలోనే
స్థాపించారు. జిల్లా కేంద్రం కాకున్నా తెనాలే జిల్లా, రాష్ట్ర
రాజకీయాలకు, ఆర్ధిక రంగానికి
ఆయువుపట్టని చెప్పేందుకు ఈ వివరాలు
సరిపోతాయని భావిస్తాను.
తెనాలి పట్టణం, తెనాలి తాలూకాలోని పలు ప్రాంతాలు మొదటినుంచి
గొప్ప విద్యాకేంద్రాలుగా విలసిల్లాయి. చూసేవారికి యూనివర్సిటీని తలపించే తెనాలి
వి యస్ ఆర్ & ఎన్ వి ఆర్
కళాశాల తెనాలికి ఒక ఆభరణం. ఇది ఒకప్పుడు మూడు షిఫ్తులతో పనిచేసింది. తెనాలి
ప్రాంతంలో జెఎంజె మహిళా కళాశాల, అన్నాబత్తుని సత్యనారాయణ కళాశాల వంటి డిగ్రీ కళాశాలలు, సంస్కృత కళాశాలలు, అసంఖ్యాకంగా ఉన్న
జూనియర్ కళాశాలలు, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు, పలు రెసిడెన్షియల్ కళాశాలలు ఇక్కడి విద్యాభివృద్ధికి తార్కాణాలుగా
నిలుస్తున్నాయి. ఇక సమీపంలోని వడ్లమూడి
అతిపెద్ద డీమ్డ్ యూనివర్సిటీ అయినట్టి
విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రధాన కార్యస్థానం. తెనాలిలో 1902 లో
స్థాపించిన తాలూకా హైస్కూల్ మరో ప్రముఖ
విద్యాసంస్థ. 1961- 68 మధ్యకాలంలో నేను
6 నుంచి 12 వ తరగతి వరకు
చదువుకున్నది అక్కడే. సమీపంలోని చిలుమూరులో 1949 లో స్థాపించబడిన రామా రూరల్ కళాశాల గురుకుల పద్ధతిలో
నడుపబడుతున్న ఆదర్శ విద్యాసంస్థ. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు
వస్తుంటారు.
తెనాలిలోని వివేక
విద్యాసంస్థలు, శ్రీ సాయి
విద్యాసంస్థలు, నెహ్రూ
నికేతన్ సంస్థలు ప్రముఖ
విద్యాసంస్థలుగా పేరొందాయి. వివేక విద్యాసంస్థలలో చదువుకునే నిమిత్తం ఏటా
నేపాల్ నుంచి అక్కడి బాలబాలికలు పెద్దసంఖ్యలో వస్తూ ఉండడం విశేషం. ఇక హిందీ విద్యా
ప్రచారానికికూడా జాతీయోద్యమ తొలి దశనుంచీ తెనాలి ఒక నాడీ కేంద్రంగా
ఉండేది. కీ..శే. యలమంచిలి వేంకటప్పయ్య నెలకొల్పిన నిశ్శుల్క మహిళా హిందీ విద్యాలయ, కీ. శే. బోయపాటి
నాగేశ్వరరావు, సుభద్రాదేవి
దంపతులు 1938 లో నెలకొల్పిన
హిందీ ప్రేమీ మండలి మహావిద్యాలయానికి రాష్ట్రం నలుమూలలనుంచి విద్యార్థినీ, విద్యార్థులు
వచ్చి చదువుకునేవారు.
గ్రంథాలయోద్యమానికి కూడా
తెనాలి ప్రాంతం మొదటినుంచీ పట్టుగొమ్మ. 1905 లో పెదపాలెం గ్రామంలో పుతుంబాక సీతారామయ్య, పాతూరి నాగభూషణం
గార్ల కృషితో ఆర్యబాల సమాజం పేరిట ఈ ప్రాంతానికెల్లా మొదటి గ్రంథాలయం
స్థాపించబడింది. గ్రంథాలయోద్యమ వ్యాప్తికి వీరిరువురే కాక, శరణు రామస్వామి చౌదరి,
సంగం జాగర్లమూడి కి చెందిన సర్వజనవిద్యాప్రదాయినీ గ్రంథాలయ
నిర్వాహకులు కొత్త రామకృష్ణయ్య, అయితానగరానికి చెందిన డా. వెలగా వెంకటప్పయ్య తదితరులు చేసిన
సేవలు వెలకట్టలేనివి. తెనాలి ఎందరో
విద్యావేత్తలకు జన్మనిచ్చింది. దేశంలోని పలు యూనివర్సిటీలకు వైస్ - చాన్సెలర్స్ గా
పనిచేసిన వి. యస్. కృష్ణ,
ఆవుల సాంబశివరావు, యలవర్తి నాయుడమ్మ, లంకపల్లి
బుల్లయ్య, కొత్త సచ్చిదానంద
మూర్తి, వి. బాలయ్య, కొలకలూరి ఇనాక్ వంటి విద్యావేత్తలు ఇక్కడివారే.
వీరిలో వి. యస్.కృష్ణ ( వాసిరెడ్డి శ్రీకృష్ణ) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (
యుజిసి ) కి చైర్మన్ గానూ,
కొత్త స్చచిదానంద
మూర్తి వైస్ - చైర్మన్ గానూ కూడా కొంతకాలం
పనిచేశారు.
అమూల్ డెయిరీ తరువాత
ఆశియాలోనే తెనాలి సమీపంలోని సంగం డెయిరీ
రెండవ అతిపెద్ద డెయిరీ. తెనాలి కుమార్
పంపుల పరిశ్రమ కోయంబత్తూర్ లోని సుగుణ, టెక్స్ మో
ల తరువాత అతిపెద్ద పంపుల, విద్యుత్ మోటార్ల
తయారీ సంస్థగా పేరొందింది. తెనాలి రైస్ మిల్లులకూ, టింబర్ డిపో లకూ
ప్రసిద్ధి. సమీపంలోని దుగ్గిరాల దేశంలోనే పెద్ద పసుపు మార్కెట్. తెనాలి ఆరుగాలం
బంగారు పంటలు పండే సుక్షేత్రాలున్న ప్రదేశం. ఇక్కడ పండని ఆహార, వాణిజ్య పంటలు
లేవు. నిమ్మ, సపోటా, కొబ్బరి తోటలూ, తమలపాకు తోటలకూ
తెనాలి ప్రసిద్ధి.
వ్యవసాయానికీ, పశుపోషణకూ, వ్యవసాయాధారిత
పరిశ్రమలకు మాత్రమే కాక మొదట్నుంచీ తెనాలి గ్రామీణ పరిశ్రమ అయినట్టి ఖాదీ, అలాగే కుటీర
పరిశ్రమలైన ఇంకు పెన్నులు,
ఇంకుల తయారీ కేంద్రాలకూ, ఆయుర్వేద మందుల
తయారీ కేంద్రాలకూ పేరొందింది. తెనాలిలో
ఒకప్పుడు తయారైన సోలార్, అశోక, శాస్త్రి, ప్రసాద్ ఇంకు
పెన్నులకు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. తెనాలి లంక గ్రామాలన్నింటిలో రెల్లు
విస్తారంగా లభిస్తుంది. రెల్లుతో అందమైన కుటీరాలు నిర్మించుకోవాలంటే ఎవరైనా తెనాలి
తాలూకా చిలుమూరు ప్రాంతపు రెల్లు కప్పులు
నేసే నిపుణ శ్రామికులనే తీసుకువెళుతుంటారు.
తెనాలి సమీపంలోని
కొల్లూరులో తయారయ్యే ఇటుకలకు
రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉంది. మెత్తటి ఒండ్రు మట్టి వాడకంలోనూ, తయారీలో
నైపుణ్యంలోనూ, ఎర్రటి కాల్పు
లోనూ కొల్లూరు ఇటుకలు శ్రేష్ఠమైనవిగా పేరొందాయి. తెనాలి సమీపంలోని మంచికలపూడిలో
నెలకొల్పిన భారీ పరిశ్రమ కాంటినెంటల్ కాఫీ
లిమిటెడ్ (సిసిఎల్ ) తయారు చేస్తున్న ఇన్ స్టెంట్ కాఫీ దేశ విదేశాలకు ఎగుమతి
అవుతున్నది. తెనాలి సమీపంలోని జంపనిలో సహకార రంగంలో నెలకొల్పిన
ఎన్ వి ఆర్ సుగర్స్ మరో
చెప్పుకోదగిన పరిశ్రమ. ఇప్పటికీ తెనాలి వెండి, బంగారు, ఇత్తడి, అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువుల తయారీకి ప్రముఖ కేంద్రంగా ఉంది. దేశంలోనూ, దేశం వెలుపల
దేవస్థానాలలో మూలవిరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు వెండి, ఇత్తడి తొడుపులు, భుజకీర్తులు, ధ్వజస్తంభాల
వంటివి తయారు చేయించుకోవాలంటే ఎవరైనా తెనాలి రావలసిందే. దేవాలయాలలో విగ్రహాలు, రాజకీయ నాయకుల
విగ్రహాలు, సినీమా స్లైడ్స్
వంటి వాటి తయారీలో తెనాలిది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అగ్రస్థానం.
ఎన్నో శిల్పశాలలతో
ఆధునికాంధ్ర శిల్పకళకు తెనాలి ఒక నాడీకేంద్రంగా ఉందంటే అతిశయోక్తి కాదు. చిత్రకళలో
తెనాలి స్థానం ఏమిటో తెలుసుకొనడానికి సూర్యదేవర సంజీవదేవ్, గోలి శేషయ్య వంటి
వారి పేర్లు చెబితే చాలు. యక్షగాన కళారూపానికి 14 వ శతాబ్ది నుంచే తెనాలి పేరొందింది.
అప్పటినుంచి ఇక్కడ నాట్యం,
నాటకం మొదలైన అభినయకళలు విశేషంగా అభివృద్ధి చెందాయి.
సంగీత రంగంలో చెప్పుకోవాలంటే తెనాలి పక్కనే ఉన్న పెదరావూరుకు చెందిన నారుమంచి
జానకిరామయ్య ను గురించే చెప్పుకోవాలి. 1841 లోనే తమిళదేశంలోని తిరువాయూర్ కి నడిచివెళ్లి
సంగీత బ్రహ్మ త్యాగరాజు వద్ద శిష్యునిగా చేరి కర్ణాటక సంగీతం నేర్చుకుని వచ్చారు
నారుమంచి జానకిరామయ్య. అప్పటికీ ఇప్పటికీ తెనాలి రంగస్థల నటులకి, గాయకులకు, సంగీత కళాకారులకు
పెట్టింది పేరు. నేను కేవలం తెనాలికి సంబంధించిన రంగస్థల,
సినీ కళాకారుల, సాంకేతిక నిపుణుల జాబితా మాత్రమే ఇచ్చినా అదో పెద్ద పుస్తకమే అవుతుంది. ఈ ప్రాంతంలో
ప్రభవించి, తెనాలికి వన్నె
తెచ్చిన విద్యావేత్తల జాబితాకూ అంతే లేదు.
టైపు, షార్ట్ హాండ్
వంటి సాంకేతిక విద్యలలోనూ ఉమ్మడి రాష్ట్రంలో తెనాలి అగ్రగామిగా ఉండేది. రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగులలో సింహభాగం తెనాలి వారే కావడానికి ప్రధానకారణం పెద్ద సంఖ్యలో
ఉన్న తెనాలి టైపిస్టులు, స్టెనోలు. నేను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో 1983 లో సహాయ విభాగాధికారిగా పనిచేసినప్పుడు నాకు
ప్రత్యక్షంగా తెలుసు. మొత్తం సచివాలయం సిబ్బందిలో తెనాలి వారు పదోవంతు ఉండేవారు.
అందుకు కారణం ఆఫీసర్లు, ఇతర ఉద్యోగులకు
తోడు పెద్ద సంఖ్యలో ఉన్న తెనాలి టైపిస్టులు, స్టెనోలే.
మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో రోజూ మూడునాలుగు వందలమంది తెనాలైట్స్ ఒకచోట పోగయ్యేవాళ్లం.
ఈ ప్రాంతపు కవులు, రచయితలు
రాసిపరంగా, వాసిపరంగా తెలుగు
రాష్ట్రాలలోని మరే ఇతర ప్రాంతానికైనా అసూయ కలిగించేటంత మంది ఉన్నారంటే అతిశయోక్తి
కాబోదు. తెనాలి రామకృష్ణకవి, భట్టుమూర్తి ల నుంచి ఆధునిక కవి డా. కె. శివారెడ్డి, దిగంబర కవి
నగ్నముని వరకు గల ఈ ప్రాంతపు కవిపండితులు, రచయితలు
పరిశోధకుల జాబితాకు అంతే లేదు. ఇక ఆ విషయాన్ని అటుంచితే మన తెలుగునేల మీద
మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ సెల్ ఏర్పడింది 1934 లో తెనాలిలోనే. అలాగే తెనాలిలోనే భారత
కమ్యూనిస్టుపార్టీ రెండుగా చీలిన 1964 నాటి తొలి సీపీఎం ప్లీనరీ,
అదే విధంగా ఆ
పార్టీ నుంచి విడిపోతూ మార్క్సిస్టు లెనినిస్ట్ లు (నక్సలైట్లు ) జరిపిన తొలి
సమావేశం కూడా ఇక్కడే జరగడం విశేషం. అభ్యుదయ రచయితల సంఘం ప్రారంభ సభ, అలాగే మొదటి
శిక్షణా శిబిరం తెనాలిలోనే జరగడం మరో
విశేషం. అప్పట్లో తెనాలి వామపక్ష ఉద్యమాలకూ, రైతుకూలీ, శ్రామిక పోరాటాలకూ నాడీకేంద్రంగా ఉండేది.
దావులూరు తదితర గ్రామాలలో వ్యవసాయకూలీలు జరిపిన సమ్మెలు,
తెనాలి లక్ష్మి ప్రెస్ కార్మికుల సుదీర్ఘ సమ్మె ఉమ్మడి
మద్రాస్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించి కర్షకశ్రామికులందరికీ ఆదర్శంగా
నిలిచాయి. ప్రజానాట్యమండలి ద్వారా సామ్యవాద భావాల ప్రచారాన్ని సంప్రదాయ జానపద
కళారీతులతో సాగించడంలో తెనాలి ప్రాంతం అగ్రగామిగా నిలిచింది. ఇన్నిన్ని
ప్రత్యేకతలున్న ఒక ప్రాంతం దేశంలోనే మరొకటి ఏదీ ఉండదేమో అని నేనంటే ఇప్పుడు కూడా
మీరు దానిని ప్రాంతీయాభిమానం అనే అంటారా?
ఇక అసలు విషయానికొద్దాం. ఆ
మధ్య కమలహాసన్ నటించిన ' తెనాలి' అనే సినిమా ఒకటి
వచ్చింది. తమిళం నుంచి తెలుగులోకి
అనువదించబడిన ఆ చిత్రం లో హీరో పేరు తెనాలి. ఇక ఇప్పుడు తెనాలి కిరీటంలో మరో
కలికితురాయి చేరింది. అదేమిటంటే సుప్రసిద్ధ అల్లోపతిక్ (ఇంగ్లిష్) మందుల తయారీ
సంస్థ కాడిలా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ( అహ్మదాబాద్, గుజరాత్) వారు
షుగర్ వ్యాధికి తెనాలి పేరిట ఒక 20 మిల్లీ గ్రాముల టాబ్లెట్ తయారు చేస్తున్నారు. ఇది
వయోజనులైన టైప్ - 2 మధుమేహ రోగులకు
ఉద్దేశించినది. చిన్నపిల్లలు దీనిని వాడరాదట. ప్రతి టాబ్లెట్ లో 20 మిల్లీగ్రాముల
టెనెలిగ్లిప్టిన్ ( Teneligliptin)
అనే
సంశ్లేషిత ఔషధం ఉంటుందట. మరి ఆ సంస్థ ఈ
టాబ్లెట్లకు ' తెనాలి' ( Tenali ) అనే ట్రేడ్ నేమ్
ఎందుకు పెట్టిందో అందరూ ఆలోచించాలి. ఇదంతా శతాబ్దాలుగా తెనాలికున్న కీర్తి
ప్రతిష్ఠల వల్లనేనంటాను నేను. తెనాలి రామకృష్ణకవి కాలమైన 16 వ శతాబ్ది
నాటికే తెనాలికి ఆ కీర్తిప్రతిష్ఠలు
ఉండేవంటాను నేను. సరదాకైనా మీరు కాదనగలరా ?
ఉండండుండండి .. ఇప్పుడే
వెళ్లి తెనాలి పేరుకి పేటెంట్ హక్కులు రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే మరింతమంది మా
తెనాలి బ్రాండ్ నేమ్ ని కొట్టేసే అవకాశం
ఉంది. కాదంటారా ?? ( ఈ టాబ్లెట్ పేరు
గురించి ముఖపుస్తక నేస్తం శ్రీమతి శిల్ప రావి పంపిన వాట్స్ యాప్ సందేశానికి నా
తక్షణ స్పందనగా ఇది రాశాను)😃😃😃😃😃😃😃😃🤣😃🤣
-- మీ..
రవీంద్రనాథ్.
No comments:
Post a Comment