11 August 2024

తెనాలి-చినరావూరు రావిచెట్టు

 


తెనాలి మునిసిపాలిటీ 1909 లో ఏర్పడిన నాటి నుంచీ మా చినరావూరు అందులో ఒక భాగంగా ఉంటూ వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ 1959 వ సంవత్సరంలో ఏర్పడిన కారణంగా,అప్పటికి యాభై ఏళ్ల క్రితమే చినరావూరు తెనాలి మునిసిపాలిటీలో విలీనం అయిపోయినందున చినరావూరు ఎప్పుడూ ఒక గ్రామపంచాయతీగా లేదు. ఒకప్పుడు మునిసిపాలిటీలో ఒక వార్డుగా ఉంటే ప్రస్తుతం చినరావూరు పరిధి తెనాలి పట్టణంలోని మూడు వార్డులకు విస్తరించింది. ప్రస్తుతం చినరావూరు నడిబొడ్డున ఉన్న ఒక రావి చెట్టు కారణంగా (రావి +ఊరు = రావూరు) రావూరు అనే గ్రామనామం ఏర్పడి, ఒకప్పుడు దీని సమీపంలోని పెద్ద గ్రామాన్ని పెదరావూరు అనీ , దీన్ని చినరావూరు అనీ అనడం మొదలైంది. మన గ్రామ నామాలలో వేము (వేపచెట్టు) మీదుగా వేమూరు, మద్ది చెట్టు మీదుగా మద్దూరు, మేడి చెట్టు మీదుగా మేడూరు మొదలైన పలు గ్రామనామాలు వృక్షాల పేరిట ఏర్పడినట్లే రావూరు' కూడా రావి చెట్టు మీదుగా ఏర్పడింది.

రెండువందల యాభై ఏళ్ల క్రితం చేబ్రోలు నుంచి వచ్చిన దేవభక్తుని వారి రైతు కుటుంబాలు కొన్ని ఇక్కడ స్థిరపడి, చినరావూరు చెరువు తవ్వించి, దాని ఒడ్డున ఒక రావిచెట్టు నాటారని కొందరు పెద్దలు చెపుతారు. బహుశా అప్పుడే చినరావూరు గ్రామం రూపుదాల్చి ఉంటుంది. 1812 నాటికే చింతపల్లి జమీందారు శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయడు పాలనలోని కొండవీటి సీమలోని అంతర్భాగమైన కూచిపూడి సముతులోని 44 గ్రామాలలో చినరావూరు, పెదరావూరు గ్రామాలు రెండూ ఉన్నాయి. (C.P.Brown Local Records, Madras, M.313, L.R.Vol.5, Pages 409 - 412).

బహుశా క్రీ.శ. 1750 ప్రాంతాలలో మా చినరావూరు రావిచెట్టు నాటబడి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. అయితే ఆ వృక్షం మొదట్నుంచీ ఎన్నెన్నో ఉత్పాతాలను తట్టుకుని ధీరోచితంగా నిలబడ్డదని కొందరు చెపుతారు. నాకు తెలిసినంతలోనే ఇలాంటివి రెండుసార్లు సంభవించాయి. ఒకసారి పెద్ద పిడుగు పడిన కారణంగా ఆ వృక్షం యొక్క దాదాపు సగభాగం నాశనమైపోయింది. మరొకసారి కొందరు దుండగులు పూటుగా మద్యం సేవించి, దాని తొర్రలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. అప్పుడు కూడా మా రావి చెట్టు పాక్షికంగా దెబ్బతింది. అయితే ఆ రెండు సందర్భాలలోనూ మా రావి చెట్టు తిరిగి కొద్దికాలంలోనే కోలుకుంది.భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని మొదటి శ్లోకంలో అశ్వత్థ వృక్షం (రావి చెట్టు) అవ్యయ వృక్షంగా పేర్కొనబడింది ( భగవద్గీత 15-1). అవ్యయము అంటే తరగనిది, నశించనిది అని అర్థం. చిరజీవి అయినా కాకున్నా రావి చెట్టు వందల ఏళ్ళు జీవిస్తుందనేది మాత్రం వాస్తవం.

మా చినరావూరుకి ఒక లాండ్ మార్క్గా మారిన ఈ రావిచెట్టు చినరావూరు నడిబొడ్డున ఠీవిగా నిలిచి ఉంటుంది. మా రావి చెట్టు దగ్గర ఎప్పుడూ పూజలూ పునస్కారాలు మాత్రం జరిగేవి కాదు. దాని చుట్టూ నిర్మించిన గట్టు మీద ఒకప్పుడు గ్రామ పెద్దలంతా చేరి కాలక్షేపం చేసేవారు. పెద్దలంతా కాలధర్మం చెందడం, గ్రామస్థులలోని నేటి తరానికి అక్కడ కూర్చునేటంత తీరిక లేకపోవడం కారణంగా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

కొన్నేళ్ళ పాటు పేకాట రాయుళ్ళు, పులి జూదగాళ్ళు ఆ అరుగుల మీద చేరేవాళ్ళు. ఒకప్పుడు విశాలంగా ఉన్న రావిచెట్టు తొర్ర తాగుబోతులకు నెలవుగా ఉండేది. అయితే కాలక్రమంలో దానిలోపల వేళ్ళు పెరిగి, ఆ తొర్ర ఇరుకైపోయి, ఎవరూ దాని లోపలికి ప్రవేశించే వీలు లేకుండా మూసుకు పోయింది. ప్రస్తుతం ఎవరైనా బాటసారులు, బయటి గ్రామాల ప్రజలు ఆ చెట్టుకింద కాలక్షేపంచేస్తూ కనిపిస్తుంటారు.

దాదాపు 250 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన మా చినరావూరు రావి చెట్టు వెనుకటి కాలానికి చెందిన కనీసం పది తరాల ప్రజలకైనా ఒక తీపి గురుతు కాగలిగిందని పేర్కొనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 

-- మీ.. ముత్తేవి రవీంద్రనాథ్ - Ravindranath Muthevi

 

No comments:

Post a Comment