10 January 2023

చరిత్రలో ఇస్లాం Islam in History

 ఒక హదీసు  ప్రకారం, ప్రవక్త ముహమ్మద్(స) దివ్య ఖురాన్‌లోని ప్రతి ఆయత్ రెండు స్థాయిల అర్థాలను కలిగి ఉందని గమనించారు, ఒకటి స్పష్టంగా మరియు మరొకటి దాచబడింది. అంటే, సాహిత్యపరమైన అర్థాన్ని దాటి, ఏకాగ్రతతో, లోతైన దాని ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవడానికి మనం పంక్తుల మధ్య (between the lines) చదవాలి.

 

దివ్య ఖురాన్ యొక్క అవతరణ సమయంలోనే ప్రజలకు అది పూర్తిగా అర్థమైంది. ఉదాహరణకు, ‘వారికి చెప్పు:  ఆ అల్లాహ్ ఒక్కడే (అద్వితీయుడు). (ఖురాన్, 112:1) అనే ఆయత్ నేటిలాగే ఇస్లాం ప్రారంభ కాలపు ముస్లింలు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కాలం గడిచే కొద్దీ అర్థంలో తేడా ఉండదు. కానీ, మరింత లోతుగా ఆలోచించినప్పుడు, పంక్తులలో దాగి ఉన్న దివ్య ఖురాన్ సూక్ష్మ నైపుణ్యాలు వెల్లడి అవుతాయి. అటువంటి నిశిత అధ్యయనం ప్రతి కాలంలోనూ ఉంటుంది, తద్వారా ప్రతి యుగంలోనూ కొత్త అర్థాలు వెల్లడవుతూనే ఉంటాయి.

 

ఒక హదీసు ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త ఇలా  అన్నారు: "దివ్య ఖురాన్ యొక్క అద్భుతాలు ఎప్పటికీ అంతం కావు." (మిష్కత్ అల్-మసాబిహ్, వాల్యూం-1, పేజి-659). ఈ హదీథ్ ఖురాన్ యొక్క ప్రాముఖ్యత కలిగిన లేదా పంక్తుల మధ్య ఉన్న అంశాన్ని సూచిస్తుంది. దివ్య ఖురాన్  ప్రతి తదుపరి యుగంలో కొత్త అర్థాలను వెల్లడిస్తుంది.  ఈ ప్రక్రియ డూమ్స్‌డే/అంతిమ దినం  వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.

 

దివ్య ఖురాన్‌లోని 2:193, 8:39 అనే రెండు ఆయతులలో  కితాల్-ఎ-ఫిత్నా, అంటే మతపరమైన హింసను రద్దు చేయడం గురించి మనం పూర్వం తెలుసుకొన్నాము. దివ్య ఖురాన్‌లోని ఈ ఆయతులను అధ్యయనం చేసినప్పుడు, మతపరమైన హింసను రద్దు చేసి, దాని స్థానంలో పూర్తి మతపరమైన స్వేచ్ఛను తీసుకురావాలనేది దేవుని ప్రణాళిక అని మనం కనుగొన్నాము. తద్వారా దేవుని సేవకులు హింసకు భయపడకుండా ఏకేశ్వరోపాసన చేయవచ్చు.

 

ఫిత్నా నిర్మూలన

ఏడవ శతాబ్దం మొదటి త్రైమాసికంలో ఇస్లాం ఉద్భవించింది. ఆ సమయంలో ప్రపంచమంతటా రాచరికం ఉండేది. ఆ యుగపు రాజకీయ పాలకులు  మతపరమైన స్వేచ్ఛా ఆలోచనలు తమ అధికారానికి ముప్పుగా భావించారు. రాజకీయ ఏకీకరణను సాధించడానికి, మతపరమైన హింస నిరంకుశ పాలకుల చేతుల్లో ఆయుధంగా మారింది మరియు  కొత్త భావజాలం అభివృద్ధి చెందలేదు.

 

రాజ్యం ఆమోదించిన మతం వృద్ధి చెందినది. మేధో పురోగతికి అవసరమైన స్వతంత్ర ఆలోచన చాలా క్రూరంగా అణచివేయబడింది. రాచరిక పాలన కాలంలో, శాస్త్రాలు అభివృద్ధి చెందలేదు లేదా వ్యక్తులకు మత స్వేఛ్చ  లేదు. వ్యతిరేకించినవారు క్రూరంగా అణిచి వేయబడ్డారు.

 

 దివ్య ఖురాన్ ప్రాచీన కాలంలోని మతపరమైన అణచివేతను ఈ విధంగా సూచిస్తుంది:

“కందకం వాళ్ళు నాశనమయ్యారు. అందులో ఇందనం రగిలించబడిన అగ్ని ఉండేది. అప్పుడు వారు ఆ కందకం వద్ద కూర్చొని ఉన్నారు. తాము విశ్వాసుల పట్ల జరుగుతున్న అమానుష కాండను (వేడుకగా) తిలకించేవారు. విశ్వాసులతో వారి శత్రుత్వానికి ప్రధాన కారణం, వారు శక్తిమంతుడు, సౌత్రనీయుడయిన అల్లాహ్ ను విశ్వసించడం తప్ప మరొకటి కాదు.”-(85:4-8)

 

ఖబ్బబ్ ఇబ్న్ అల్ అరత్ చెప్పిన మక్కన్ హదీసు ప్రకారం ప్రవక్త(స) కాబా గోడ నీడలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మేము(విశ్వాసులు) ప్రవక్త(స)తో ఇలా అన్నాము: "మీరు మా కొరకు దేవుణ్ణి ప్రార్థించలేరా?" ప్రవక్త(స) ఇలా జవాబిచ్చారు: మీ కంటే ముందు వెళ్ళిన వారు (ఇతర ధర్మం పై వారి విశ్వాసం కారణంగా) భరించలేని పరీక్షలను ఎదుర్కొన్నారు. వారిలో ఒకరిని విచారణకు తీసుకువచ్చి, ఒక గొయ్యి తవ్వి, ఆపై నిలబడి ఉన్న భంగిమలో, అతని తల గొయ్యి పైన ఉంచి పాతిపెడతారు. అప్పుడు అతను రెండు భాగాలుగా విడిపోయే వరకు అతని తల గుండా ఒక రంపo తో కోస్తారు.  అయినప్పటికీ అతడు విశ్వాసం నుండి వైదొలగలేదు.

 

ప్రజలను  చర్మం అంతా బయటకు వచ్చే వరకు మరియు వారి శరీరాల ఎముకలు బహిర్గతమయ్యే వరకు ఇనుప దువ్వెనలతో గీస్తారు. అయినప్పటికీ ఈ హింసాత్మక చర్యలు వారి విశ్వాసాన్ని నిరోధించలేవు. ఒక యాత్రికుడు సనా నుండి హద్రమావ్ట్‌కు (అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి) దేవుడు రక్షిస్తాడు అని  భయం లేకుండా ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా అతనికి దేవుని రక్షణ లబిస్తుంది. (అంటే మత స్వేచ్ఛ యొక్క యుగం ఖచ్చితంగా వస్తుంది). యాత్రికుడు తన గొర్రెల కోసం తోడేలుకు భయపడడు. అయినా, నీవు ఎందుకు బయపడుతున్నావు?” (సహీహ్ బుఖారీ, కితాబ్ అల్-మనకీబ్, అధ్యాయం, అలమాత్ ఆన్ నుబువహ్ ఫిల్ ఇస్లాం).

 

పైన పేర్కొన్న హదీసు “ప్రవక్త (స) యొక్క దైవ  మిషన్ ఆశయం మతపరమైన హింసకు ముగింపు పలకడం, దేవుని సేవకుల కోసం మార్గాన్ని సులభతరం చేయడo  మరియు మతపరమైన స్వేచ్ఛ ప్రసాదించడం.” అని స్పష్టం చేస్తుంది. ఈ ముఖ్యమైన పరివర్తన దైవ ప్రణాళికలో భాగంగా జరగాల్సి ఉంది. అందుకే దివ్య ఖురాన్ ప్రవక్త(స) ను దేవునికి ముందుగానే ప్రార్థించమని ఆదేశించింది:

 

దేవుడు ఎవరిపైనా అతని శక్తికి మించిన భారం మోపడు.అతను సంపాదించినదే అతనికి లబిస్తుంది. మా “ప్రభూ”! నీవు మా పూర్వికులపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ!దేనిని ఎత్తుకోనే శక్తి మాలో లేదో దానిని మాపై వేయకు.” (2:286)

 

ఈ ప్రార్థన విశ్వాసుల కోసం దేవుడు స్వయంగా వెల్లడించాడు మరియు అది దైవిక శాసనం లాంటిది. దేవుడు, బలవంతపు రాజకీయ వ్యవస్థలో మార్పును నిర్ణయించాడు, తద్వారా ఏకేశ్వరోపాసన ఆచరించవచ్చు.  ఏకేశ్వరోపాసన ఆచరించమని ప్రజలకు పిలుపు ఇవ్వబడుతుంది. ప్రజలకు మతపరమైన స్వాతంత్ర్యం ఉంటుంది.

 

ఈ దైవిక శాసనం సర్వశక్తిమంతుడి సహకారం తో వాస్తవంగా మారింది. ఈ దైవిక ప్రణాళికకు అనుగుణంగా, దివ్య ఖురాన్ విశ్వాసిని "హింసలు (ఫిత్నా) ఆగిపోయే వరకు వారితో యుద్ధం చేయమని ఆదేశించింది.

 

పీడన(ఫిత్నా) సమసిపోనంత వరకూ, ధర్మం పూర్తిగా దైవానిదే కానంత వరకూ  వారితో పోరాడండి. తరువాత వారు గనుక దారికి వస్తే దేవుడు వారి ఆచరణా విధానాన్ని చూస్తాడు. ఒక వేళ వారు లక్ష్యపెట్టక పోతే, దేవుడు మీ రక్షకుడని తెలుసుకొoడి. ఎంత మంచి రక్షకుడాయనా! ఎంత మంచి సహాయకుడాయన!” (8:39-40)

 

హింస ద్వారా మతపరమైన బలవంతం అనేది దేవుని సృష్టి ప్రణాళికకు పూర్తిగా వ్యతిరేకం. దేవుడు మానవాళిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వాక్ మరియు చర్య స్వాతంత్ర్యం అనుభవించాలి. ప్రపంచంలో స్వేచ్ఛను అణిచివేసిన వ్యవస్థను అంతం చేసేలా దేవుడు విశ్వాసులకు సహాయం చేసాడు. మతం పూర్తిగా భగవంతుని సృష్టి ప్రణాళికకు అనుగుణంగా ఉండే స్థితిని కలిగి ఉండాలి. దేవుడు విశ్వాసులను  దైవిక స్వభావం యొక్క అర్థంలో మతాన్ని స్థాపించమని ఆజ్ఞాపించారు కాని షరియా అర్థంలో కాదు. అరేబియాలో ఖురైష్ పాలనలో ఉన్న మతపరమైన అణచివేత శాశ్వతంగా ముగిసింది.

 

ఆ రోజుల్లో, అరేబియా పొరుగున సస్సానిడ్ మరియు బైజాంటైన్ అనే రెండు గొప్ప సామ్రాజ్యాలు ఉండేవి. పురాతన కాలంలో ఇవి రాజకీయంగా బలవంతపు వ్యవస్థకు గొప్ప చిహ్నాలుగా ఉన్నాయి. అయితే విశ్వాసులు ఈ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. రెండవ ఖలీఫా ఉమర్ ఫరూక్ ఖలీఫాత్  కాలంలో, ఈ రెండు నిరంకుశ సామ్రాజ్యాల వెలుగు శాశ్వతంగా ఆరిపోయింది.

 

ఫ్రెంచ్ చరిత్రకారుడు, హెన్రీ పిరెన్నే, ఏడవ శతాబ్దపు అరబ్ ముస్లింలు సస్సానిడ్ మరియు బైజాంటైన్ సామ్రాజ్యాలను జయించకపోతే, మానవజాతి నిరంకుశత్వం నుండి ఎప్పటికీ విముక్తి పొందకపోయేదని మరియు ప్రపంచం విస్తృతమైన మేధో విప్లవంతో స్వేచ్ఛ పొందేది కాదని అన్నాడు.

 

ప్రవక్త ముహమ్మద్(స)యొక్క సహచరుడు మరియు రెండవ ఖలీఫా కుమారుడు అయిన అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ ఒక సందర్భంలో ఇలా అన్నాడు: " భూమిపై నుండి ఫిట్నా(పీడన) శాశ్వతంగా రద్దు చేయబడే వరకు మేము, దివ్య ఖురాన్ ఆదేశాల ప్రకారం పోరాడాము,." (సహీహ్ అల్-బుఖారీ)

 

ఫిట్నా లేదా పురాతన రాజకీయ బలవంతపు వ్యవస్థకు, ఖలిఫాత్ కాలంలోనే తీవ్రమైన దెబ్బ తగిలింది. ఇస్లాం యొక్క మొదటి దశలో మత స్వేచ్ఛ, ముస్లింల చర్యల ద్వారా మరియు తరువాతి దశలలో ముస్లింయేతర దేశాల క్రియాశీల భాగస్వామ్యం ద్వారా పుంజుకుంది. ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమార్ధంలో, మొదట లీగ్ ఆఫ్ నేషన్స్ ద్వారా మరియు తరువాత ఐక్యరాజ్యసమితి ద్వారా, ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా మత స్వేచ్ఛ అందరి ప్రాథమిక హక్కు అని, ఎట్టి పరిస్థితుల్లోనూ మత స్వేఛ్చ ను రద్దు చేయలేమని ప్రకటించాయి.

 

మత స్వేచ్ఛ యుగం:

ఇస్లామిక్ చరిత్ర మొదటి దశ లో అనగా  ప్రవక్త ముహమ్మద్(స) జీవిత కాలం లో అరేబియాలో ఫిట్నా అంతం మరియు దానితో పాటు మత స్వేచ్ఛ తీసుకురాబడినది.  తన చివరి రోజులలో, తన చివరి హజ్ యాత్ర  సందర్భంగా, ప్రవక్త ముహమ్మద్(స) తన సహచరులందరి సమక్షంలో అంతిమ ప్రసంగం చేసారు. ప్రవక్త(స) తన అంతిమ ప్రసంగంలో దేవుడు “అతనిని-సమస్త మానవాళికి దయగా" పంపాడు మరియు (ప్రవక్త)సహచరులు ఈ శాంతి సందేశాన్ని ప్రతిచోటా ప్రజలందరికీ తెలియజేయాలి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ (స) తన జీవిత చరమాంకంలో ఇచ్చిన ఈ సూచనకు కట్టుబడి, అతని సహచరులు అరేబియా సరిహద్దులను దాటి చాలా దూరం ప్రయాణించారు. ప్రవక్త (స) సహచరులు తమ జీవితాంతం తమ ప్రవక్త(స) ఆజ్ఞను పాటిస్తూ గడిపారు.

 

ఆ తరువాత, ప్రవక్త(స) సహచరుల వారసులు మరియు  వారసుల శిష్యులు, ఇస్లాం బోధనలను ప్రపంచంలోని ఎక్కువ భాగానికి వ్యాప్తి చేసారు. ఈ దావహ్ ప్రక్రియ, పూర్తిగా శాంతియుత పద్ధతిలో జరిగింది. ఇస్లాం భావజాలo  ప్రజల హృదయాలను గెలుచుకొంది. బ్రిటిష్ చరిత్రకారుడు, సర్ ఆర్థర్ కీత్ అభిప్రాయం లో  ఈజిప్షియన్లు, ఖడ్గం ద్వారా కాదు దివ్య ఖురాన్ ద్వారా జయించబడ్డారు.

 

ఇది ఈజిప్షియన్ల విషయంలోనే కాదు, ఇస్లాం ప్రవేశించిన ప్రపంచం లోని అన్ని ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇస్లాం యొక్క శాంతియుత వ్యాప్తికి సంబంధించిన వివరణాత్మక వృత్తాంతం బ్రిటీష్ చరిత్రకారుడు, T.W ఆర్నాల్డ్  ద్వారా 1896లో ప్రచురింపబడిన 508 పేజీల “ది ప్రీచింగ్ ఆఫ్ ఇస్లాం” లో ఇవ్వబడింది. దైవిక సందేశం మరియు రాజకీయ కార్యకలాపాలను వేరు వేరుగా ఉంచడం ఇస్లాం విధానం. దావా ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో కొనసాగాలంటే, రాజకీయ ఘర్షణలను నివారించాలి.

 

ప్రవక్త ముహమ్మద్(స) యొక్క అంతర్దృష్టి, మత స్వేచ్ఛను అరికట్టడానికి ఏ లౌకిక పాలకుడూ ప్రయత్నించరని తెలిపింది.  సమస్య ఎప్పుడైనా తలెత్తితే, అది ఏదో ఒక తప్పుడు విధానాన్ని అవలంబించడం వల్ల లేదా విశ్వాసులు స్వయంగా ఏదైనా తప్పు చేయడం వల్ల కావచ్చు. అందుకే ప్రవక్త(స) ముస్లింలకు ముందస్తు హెచ్చరికగా చాలా ముఖ్యమైన మార్గదర్శకాలను ఇచ్చారు.

 

హదీసు పుస్తకాలలో, తరువాతి కాలంలోని ముస్లిం పాలకులలో అవినీతి చోటుచేసుకుందని సూచించే పెద్ద సంఖ్యలో హదీసులు ఉన్నాయి, అయినప్పటికీ ముస్లింలు రాజకీయ సంస్కరణల పేరుతో అవినీతి పాలకులపై యుద్ధం చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించారు. ముస్లింలు అట్టి వారి నుండి దూరంగా ఉండాలని అంటే  రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మరియు తమను తాము విద్య, దావహ్, దివ్య ఖురాన్,  హదీసుల సేవ మొదలైన రాజకీయేతర రంగాలలో తమ కార్యకలాపాలను కొనసాగించాలని, రాజకీయ ఘర్షణ మార్గాన్ని విడిచిపెట్టాలని  సూచించాయి.

 

ఒక హదీసు ప్రకారం  ఇబ్న్ జుబైర్ ప్రారంభించిన తిరుగుబాటు (ఫిత్నా) లో, ప్రజలు చంపబడుతున్నారని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇబ్న్ ఉమర్‌తో చెప్పారు.  ఇబ్న్ ఉమర్ మరియు ఒక సహాబి,  ఇబ్న్ జుబైర్ కు వ్యతిరేకంగా సైనిక ప్రచారంలో పాల్గొనడానికి నిరాకరించారు.

 

దానితో ఆ ఇద్దరు వ్యక్తులు  అలా చేయకుండా ఉండటానికి కారణం  ఏమి ఏమిటని? అడిగారు.

ఇబ్న్ ఉమర్ (రెండవ ఖలీఫా) కుమారుడు ఇలా జవాబిచ్చాడు: "ఒకరి సోదరుడి రక్తాన్ని ఎప్పుడూ చిందించకూడదని దేవుని స్పష్టమైన ఆదేశం కారణంగా, నేను ఈ యుద్ధంలో పాల్గొనడం లేదు. ఇది చట్టవిరుద్ధం." అన్నాడు.

 

అంతాట ఆ ఇద్దరూ ఇలా బదులిచ్చారు: "హింసలు (ఫిత్నా) ఆగిపోయే వరకు పోరాడమని దేవుడు మనల్ని ఆదేశించలేదా?"

 

అప్పుడు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ ఇలా సమాధానమిచ్చాడు: మేము ఫిట్నా ఆగిపోయే వరకు పోరాడాము. మతం, దేవుని కోసం మాత్రమే మారింది, ఇప్పుడు మీరు ఫిట్నా తిరిగి వచ్చేలా పోరాడాలనుకుంటున్నారు మరియు మతం ఇకపై, దేవుని కోసం కాదు. (ఫతుల్ బారీ, కితాబ్ అట్-తఫ్సీర్, వాల్యూం-8, పేజి.32, కితాబ్ అల్-ఫితాన్ వాల్యూం-13, పేజి. 49).

 

దేవుడు ఆదేశించిన విధంగా హింసకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం దాని పరిధిలో మరియు నిర్దిష్ట స్వభావంతో పరిమితం చేయబడిందని ఈ వృత్తాంతం నుండి మనం తెలుసుకుంటాము.

 

విశ్వాసులకు తమ విశ్వాసాన్ని ఆచరించే స్వేచ్ఛను ఇవ్వడానికి సిద్ధంగా నిరంకుశ పాలకుకు లేరు. ప్రవక్త(స) యొక్క సహచరులు అటువంటి అణచివేతకు వ్యతిరేకంగా, మొదట అరేబియాలో, ఆపై ఆసియా మరియు ఆఫ్రికాలోని ప్రధాన ప్రాంతాలలో యుద్ధం చేసి, దానిని అంతం చేయడంలో విజయం సాధించారు. అప్పటి నుండి, ఇస్లాంలోని విశ్వాసులు తమ మతాన్ని ఆచరించడానికి మరియు ఇతరులకు ఇస్లాం పిలుపు ఇచ్చి ఆహ్వానించడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నారు.          

 

మతపరమైన బలవంతానికి వ్యతిరేకంగా విశ్వాసులు మత స్వేచ్ఛ వాతావరణంలో జీవించడం ప్రారంభించారు. అయితే ఉమయ్యద్‌ల పాలనలో, అవినీతి తెగులు ప్రారంభమైనప్పుడు, కొంతమంది ముస్లింలు, అవినీతి ఖలీఫాలను తరిమికొట్టి, వారి స్థానంలో సద్గురువులు మరియు న్యాయమైన వ్యక్తులను నియమించాలని కోరుకున్నారు. కానీ, వారి చర్యలు ప్రతికూలతను ఇచ్చాయి. ప్రవక్త ముహమ్మద్ (స) తన ఉమ్మా ను రాజకీయేతర రంగాలకు పరిమితం చేయాలని మరియు రాజకీయ సంస్థలలో అవినీతికి సంబంధించి ఎగవేత విధానాన్ని policy of avoidance ఎంచుకోవాలని స్పష్టంగా ఆదేశిస్తూ, ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.

 

హదీసు పుస్తకాలలో ఫిట్నా అనే శీర్షిక క్రింద ఈ విషయంపై అనేక హదీసులు కలవు. ఇస్లామిక్ శాస్త్రాల అభివృద్ధి తర్వాత (సంప్రదాయాలపై వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి), స్థాపించబడిన ముస్లిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని మత పండితులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

 

ప్రసిద్ధ హదీసు సేకరణ కర్త, ఇమామ్ అల్-నవావి, సహి ముస్లింలో నమోదు చేయబడిన ఫిట్నాకు సంబంధించిన హదీసుపై వ్యాఖ్యానించారు: రాజకీయ పాలకులతో మనం ఎలాంటి ఘర్షణకు దిగకూడదని ఈ హదీసులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మన బాధ్యత పూర్తిగా వ్యక్తిగతంగా సలహాలు ఇవ్వడానికే పరిమితం అవుతుంది. ముస్లిం పండితుల ఏకాభిప్రాయం ప్రకారం, పాలకులు అవినీతిపరులు మరియు నిరంకుశంగా ఉన్నప్పటికీ తిరుగుబాటు మరియు సాయుధ ఘర్షణలాంటి చర్యలు చట్టవిరుద్ధం (హరామ్). (సహీహ్ ముస్లిం, అన్-నవావి వ్యాఖ్యానంతో, కితాబ్ అల్-ఇమారా, వాల్యూం. 12, పేజి.229).

 

ఈ వ్యాఖ్యానం అసలు ఉద్దేశ్యం మేధోపరమైన మరియు సైద్ధాంతిక బలవంతపు ఉపయోగాన్ని అంతం చేయడం, తద్వారా దేవుని సేవకులు దేవుని పట్ల  తమ భక్తిని నిర్వహించడానికి మరియు స్వేచ్ఛా వాతావరణంలో దేవుని సందేశాన్ని తెలియజేయడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు. ముస్లిం పాలకులపై యుద్ధం చేయడం వల్ల బలవంతపు వ్యవస్థ పునరుద్ధరణకు దారి తీస్తుంది. ఫలితం ఫిట్నా మళ్లీ కొత్త వేషంలో కనిపించడం. అందుకే ప్రవక్త ముహమ్మద్(స) అటువంటి చర్యను ఖచ్చితంగా నిషేధించారు మరియు ఇస్లామిక్ షరియా ప్రకారం, స్థాపించబడిన ముస్లిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చట్టవిరుద్ధమని ఇస్లామిక్ పండితులు ఏకాభిప్రాయానికి వచ్చారు. అనివార్య పరిస్థితుల్లో కూడా, ముస్లింలు శాంతియుతంగా పోరాడాలే తప్ప  హింసాత్మక ఉద్యమాలను ప్రారంభించడం పూర్తిగా మానుకోవాలి.ఇది నిస్సందేహంగా ముఖ్యమైన ఇస్లామిక్ ఉత్తర్వు. దాని వెనుక గొప్ప జ్ఞానం ఉంది.

 

ఈ సమస్యకు పరిష్కారం, ఇస్లాంలో నిర్దేశించినట్లు పాలకులలో  ఏదైనా చెడు కనిపిస్తే, వ్యక్తిగతంగా సలహాలు ఇవ్వడం మరియు బహిరంగంగా ఖండించడం లేదా సాయుధ ఘర్షణలను నివారించడం అనేది అనుసరించాల్సిన పద్ధతి. ఈ సలహా ఇస్లాం ద్వారా ఇవ్వబడింది, తద్వారా మతాన్ని ప్రచారం చేయడం మరియు స్థిరీకరించడం అనే పని రాజకీయేతర రంగాలలో ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

ఇస్లాం యొక్క మొదటి దశలో హదీసుల సంకలనం ఉమయ్యద్ సామ్రాజ్యం కాలం నుండి అబ్బాసిద్ సామ్రాజ్యం వరకు కొనసాగింది. కానీ ఈ కాలంలోని ఇస్లామిక్ పండితులు పాలకులకు వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాన్ని ప్రారంభించలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ, వారు హదీసులను సంకలనం చేస్తూనే ఉన్నారు. వారు అనుసరించిన తెలివైన విధానం ఫలితంగానే ఈ రోజు మనం ప్రవక్త యొక్క అమూల్యమైన హదీసులను  సంకలన రూపంలో కలిగి ఉన్నాము.

 

హదీసు సంకలన కర్తలు గనక ఆ నాటి ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారు అబ్దుల్లా ఇబ్న్ జుబైర్, హుస్సేన్ ఇబ్న్ అలీ, నఫ్స్ జకియా మొదలైన వారి స్థితినే ఎదుర్కొనేవారు. హదీసు సేకరణ కర్తలు కనుక  రాజకీయ జిహాద్‌లో నిమగ్నమై ఉంటె అది వినాశకరమైన ముగింపుకు దారి తీసేది. సంబంధిత వ్యక్తులందరూ పాలకులచే హత్య చేయబడతారు. హదీసు సేకరణ కర్తలు  సేకరించిన అమూల్యమైన హదీసులను మనం కోల్పోయే వారము.

 

దివ్య ఖురాన్ మరియు హదీసుల అధ్యయన వాస్తవ లక్ష్యం, రాజ్యం  కంటే వ్యక్తి యొక్క ఇస్లామీకరణ. రాజ్య స్థాయిలో ఇస్లాం ఆధిపత్యం అనేది దాని అసలు లక్ష్యం కాదు.దివ్య ఖురాన్ విశ్వాసులకు, రాజకీయ అధికారం అనేది భగవంతుడిచ్చిన వరం అని, అది సాధించాల్సిన లక్ష్యం కాదని స్పష్టంగా పేర్కొంది.

 

అందుకే దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: మీలో విశ్వసించి ఎవరు సత్కార్యాలు చేస్తారో, వారికి దేవుడు వాగ్ధానం చేసాడు-వారి పూర్వీకులకు భువిలో అధికారం ఇచ్చినట్లే వారికి కూడా అధికారం ఇస్తానని, తానూ వారి కోసం వారి జీవన ధర్మాన్ని స్థిరపరుస్తానని, వారు ఎదుర్కొంటున్న భయాందోళలను, తరువాత శాంతిభద్రతలుగా పరివర్తనం చేస్తానని(వాగ్ధానo చేసాడు). వారు కేవలం నన్నే ఆరాదిస్తారు. దేనిని నాకు సాటి కల్పించరు.  దీని మీదట కూడా ఎవరయినా తిరస్కార వైఖరికి ఒదిగితే – అలాoటి వారే అవిదేయులు. (24:55).

 

ఇదే విషయం హదీసులలో కూడా చెప్పబడింది: మీరు ఎలా ఉంటారో, మీ పాలకులు కూడా అలాగే ఉంటారు. (మిష్కత్ అల్-మసాబిహ్)

 

నిజానికి ఈ హదీసు ప్రకృతి నియమం గురించి చెబుతుంది. ఒక దేశం యొక్క రాజకీయ శక్తి దాని ప్రజలపై ఆధారపడి ఉంటుంది. ప్రజల ఆమోదం ఉన్న ఏ వ్యవస్థ అయినా శాశ్వతంగా కొనసాగుతుంది, అయితే, ప్రజలు మెచ్చని  వ్యవస్థ స్థిరంగా ఉండదు. ఇస్లామిక్ సమాజంలో, ఇస్లాం-వ్యతిరేక రాజకీయ పాలన సాధ్యం కాదు. ఇస్లామిక్ సంస్కరణ కోసం వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇస్లాం ఆదేశించింది. ఏ సమాజంలోనైనా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇస్లాంను అనుసరిస్తుంటే, అటువంటి సమాజం స్వయంగా ఇస్లాం మీద ఆధారపడిన రాజకీయ అధికారం కిందకు వస్తుంది.

 

దావా క్రియాశీలత మరియు రాజకీయ ఘర్షణల మద్య ఈ విభజన కీలకమైనది. ఈ విభజన కారణంగానే ఇస్లాం ఆవిర్భావం తర్వాత వెయ్యి సంవత్సరాల పాటు ఇస్లాం మత ప్రచారం నిరాటంకంగా కొనసాగింది.

 

 

 

ఈనాడు ప్రపంచమంతటా మత స్వేచ్ఛ మానవుల యొక్క తిరుగులేని హక్కుగా పరిగణించబడింది. నేడు, ఎవరికి నచ్చిన మతాన్ని విశ్వసించే మరియు ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు మానవులకు స్థిరపడిన హక్కుగా మారింది. ఈ స్వేచ్ఛకు పొందడంలో, ఏ విధమైన హింసలో పాల్గొనకూడదు. హింసను స్వీకరించడం వల్ల ప్రపంచంలోని ఏ భాగమైనా ఒకరి మతాన్ని ఆచరించడం మరియు ప్రచారం చేయడం అసాధ్యం.

 

ఆధునిక సమాచార మార్పిడి ఇస్లాం వ్యాప్తిని చాలా ప్రభావవంతం చేసింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఇతర కమ్యూనికేషన్ మార్గాలు ఇస్లాం సందేశం యొక్క ప్రపంచవ్యాప్త వ్యాప్తికి అన్ని ద్వారాలను తెరిచాయి. ప్రస్తుత యుగంలో దావా యొక్క పని చాలా సులభతరం చేయబడింది. దావా పని భూమి అంతటా సూర్య కిరణాల వ్యాప్తి వలె వేగంగా మరియు సులభంగా వ్యాపిస్తుంది.

 

ఇస్లాం యొక్క శాంతియుత ప్రచారం:

ఈసా మరియు అతని అనుచరులను ప్రస్తావిస్తూ, దివ్య ఖురాన్ మనకు ఇలా చెబుతుంది: తరువాత ఈసా వారిలోని  తిరస్కరధోరణిని పసిగట్టినప్పుడు “దైవమార్గం లో నాకు సహాయపడగల వారెవరు? అని అడిగాడు. దానికి హవారిలు, “దైవ సహాయకులంగా మేమున్నాం. మేము దైవాన్ని విశ్వసించాము. మేము విదేయులమయ్యామన్న దానికి మీరే  సాక్షి. (3:52) ఈసా పిలుపుకు శిష్యులు ఇచ్చిన ప్రతిస్పందన చాలా సముచితమైనది, అదే ప్రతిస్పందనను ముస్లింలు కూడా డిమాండ్ చేశారు.

 

దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: విశ్వసించిన ప్రజలారా! మీరు సహాయకులు అవండి. మర్యం కుమారుడగు ఈసా తన సహచరులతో, దైవ మార్గం లో నాకు సహాయపడేవారెవరు? అని అడిగినప్పుడు, అల్లాహ్ కు సహాయకులుగా మేమున్నాను’ అని చెప్పినట్లుగా! అప్పుడు ఇస్రాయిల్ సంతతి వారిలో కొందరు విశ్వసిoచగా, మరికొందరు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి- వారి శత్రువులకు వ్యతిరేకంగా-తోడ్పడ్డాము. అందువలన వారే ఆధిక్యత వహించినారు.-(61:14)

 

లోతుగా ఆలోచిస్తే, ఈ ఆయత్ ముస్లిం ఉమ్మా (కమ్యూనిటీ) యొక్క రెండవ దశ చరిత్రకు సంబంధించినది.  అప్పుడే ఫిట్నా ఆగిపోయి మతస్వేచ్ఛ ప్రపంచంలోకి ప్రవేశించింది. ఈసా అనుచరులు అనుసరించిన విధానాన్ని ముస్లింలు కూడా అవలంబించవలసి వచ్చింది. దావాలో ఈసా అనుచరులు అనుసరించిన ఆచరణాత్మక నమూనా, నిస్సందేహంగా ప్రవచనాత్మక నమూనా కూడా. దీనిని  క్రైస్తవులనుంచి  ముస్లింలు  కూడా దత్తత తీసుకోవడం ఎంతో  విలువైనది.

 

ఈసా తన అనుచరులను ఎలాంటి సహాయంచేయమని అడిగాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. హదీసులలోనే మనకు సమాధానం దొరుకుతుంది. ఇబ్న్ హిషామ్ ఇలా వ్రాశాడు: "అబూ బకర్ అల్-హుజాలీ ఒక రోజు, హుదైబియా యొక్క శాంతి ఒప్పందం తర్వాత, ప్రవక్త(స) తన సహచరుల వద్దకు వచ్చి, ' విశ్వాసులారా! దేవుడు నన్ను ప్రపంచంలోని అన్ని దేశాలకు దయగా పంపాడు, కాబట్టి, ఈసా  శిష్యులు ఈసాతో విభేదించినట్లు విభేదించవద్దు’.

 

ప్రవక్త(స) సహచరులు అడిగారు: ఓ దేవుని దూత, ఈసా శిష్యులు, ఈసా  ప్రవక్త నుండి ఎలా భిన్నంగా ఉన్నారు?’

 

ప్రవక్త(స) ఇలా సమాధానమిచ్చారు: నేను మిమ్మల్ని ఆహ్వానించిన నట్లే ఈసా తన శిష్యులను ఆహ్వానించాడు. దగ్గరి ప్రాంతాలకు పంపబడిన వారు సంతోషంగా అంగీకరించినా, దూర ప్రాంతాలకు పంపిన వారు మాత్రం వెళ్లేందుకు ఇష్టపడలేదు. అప్పుడు ఈసా  దాని గురించి దేవునికి ఫిర్యాదు చేసాడు. దేవుని ప్రత్యేక సహాయం వారిపైకి దిగివచ్చింది మరియు శిష్యులు తాము పంపబడిన సంఘం యొక్క భాషలో మాట్లాడటం ప్రారంభించారు.

 

ఈ సంఘటన బైబిల్‌లో నమోదు చేయబడింది.

కాబట్టి మీరు వెళ్లి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి.(మత్తయి, 28:19).

సకల జనులకు ముందుగా సువార్త ముందుగా ప్రకటింపబడవలయును. (మార్కు, 13:10).

మరియు-మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను సువార్త ప్రకటించూడి. (మార్కు, 16:15).

 

ఈసా యొక్క ఈ ఆదేశాలకు,  విధేయతతో, అతని అనుచరులు పాలస్తీనాను విడిచిపెట్టారు. ఈసా ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత, వారు వివిధ నగరాలు మరియు దేశాలలో విస్తరించారు. వారు తమ మతాన్ని శాంతియుతంగా ప్రచారం చేశారు మరియు వారి విశ్వాసాన్ని స్వీకరించిన వారు కూడా దైవిక సందేశాన్ని ప్రచారం చేయడంలో శాంతి మార్గాన్ని అవలంబించారు. ఈ విధంగా, క్రైస్తవ మతం యొక్క వ్యాప్తి తరతరాలుగా కొనసాగింది.

 

ఈసా ప్రవక్త  అనుచరుల నెమ్మది ప్రవర్తన మూలంగా క్రైస్తవ మతం ఆవిర్భవించిన రెండు వందల సంవత్సరాల వ్యవధిలో, అనేక తూర్పు దేశాలకు వ్యాపించింది. తదనంతరం, క్రైస్తవులు ఐరోపాలోకి ప్రవేశించారు. ఇక్కడ వారు మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు నిశ్శబ్దంగా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. యూరోపియన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్ 337 A.D.లో క్రైస్తవ మతంలోకి మారారు మరియు క్రైస్తవాన్ని తన సామ్రాజ్యం యొక్క అధికారిక మతంగా ప్రకటించారు. మెజారిటీ యూరోపియన్లు క్రైస్తవ మతంలోకి ప్రవేశించారు.

 

ఈసా కాలం లో “అతని అనుచరులను తమ శత్రువులపై విజయం సాధించాలని దేవుడు ఆదేశించాడని” దివ్య ఖురాన్ మనకు చెబుతోంది.

“అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: ఓ ఈసా! నేను వెనక్కి రప్పించు కొబోతున్నాను. నిన్ను నా వైపునకు లేపుకోబోతున్నాను. తిరస్కారుల (కాలుష్యం) నుండి పవిత్రపరుస్తాను. నిన్ను అనుసరించినవారికీ వారికి. నీ తిరస్కారులపైన ప్రళయదినం వరకూ ఆధిక్యతను వోసగుతాను. ఆతరువాత అందరు మరలి రావలసింది నా వైపే, అప్పుడు నేను మీ మద్యవిభేదాల గురించి తీర్పు చెబుతాను.” (3:55).

 

అదేవిధంగా: దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: విశ్వసించిన ప్రజలారా! మీరు సహాయకులు అవండి. మర్యం కుమారుడగు ఈసా తన సహచరులతో, దైవ మార్గం లో నాకు సహాయపడేవారెవరు? అని అడిగినప్పుడు, అల్లాహ్ కు సహాయకులుగా మేమున్నాను’ అని చెప్పినట్లుగా! అప్పుడు ఇస్రాయిల్ సంతతి వారిలో కొందరు విశ్వసిoచగా, మరికొందరు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి- వారి శత్రువులకు వ్యతిరేకంగా-తోడ్పడ్డాము. అందువలన వారే ఆధిక్యత వహించినారు.-(61:14)

 

ఇప్పుడు  ఈసా  అనుచరులు ఎలా ఆధిపత్యం చెలాయించారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఖచ్చితంగా ఇది యుద్ధం మరియు హింస ఫలితంగా వచ్చింది కాదు. క్రైస్తవులు తమ మత ప్రత్యర్థులతో సాయుధ ఘర్షణలకు పాల్పడ్డారని దివ్య ఖురాన్ ద్వారా కానీ, చారిత్రక రికార్డుల ద్వారా కానీ నిర్ధారించలేము.

 

చారిత్రక రికార్డుల ప్రకారం, క్రీస్తు అనుచరుల సంఖ్య ఆధిపత్య స్థానాన్ని పొందేవరకు పెరుగుతూనే ఉంది.  వారి సంఖ్య చాలా వేగంగా పెరగడo  దేవుని ప్రత్యేక సహాయంతో జరిగిందని దివ్య ఖురాన్ పేర్కొంది: "మేము మర్యం కుమారుడు ఈసాకు సువార్తను ఇచ్చాము మరియు అతని అనుచరుల హృదయాలలో కరుణ మరియు దయను ఉంచాము" (57:27).

 

ఈసా, ఇంజీల్ (బైబిల్‌) లో వ్యక్తీకరించబడిన భావాలను మీకు తిరిగి చెబుతున్నాను: వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా-మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని  ద్వేషించువారికి  మేలు చేయుడి. మిమ్మల్లి శపించువారిని దీవించుడి. మిమ్ములను భాదిoచువారి కొరకూ ప్రార్ధన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండోవ చెంపను కూడా తిప్పుము. నీ పై బట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగిని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపకుము.నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సోత్తు ఎత్తుకొని పోవువాని యెద్ద దాని  మరల అడగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయడి.

 

మిమ్మును  ప్రేమించు వారిని మీరు ప్రేమిoచినఎడల మీకేమి మెప్పు కలుగును?  పాపులు కూడా తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువారికే  మేలు చేసిన యెడల మీ కేమి మెప్పు కలుగును?పాపులును అలాగే చేతురు గదా.  మీరెవారియెద్ద మరల పుచ్చుకోనవలేనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులు తామిచ్చినంత మరల పుచ్చుకోనవలేనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.

 

మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలం గొప్పదైయుండును.మీరు సర్వోన్నత్తుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞత లేనివారి యెడలను దుష్టులయెడలను ఉపకారియై ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై ఉన్నట్టు మీరును కనికరముగలవారై ఉండుడి.

 

తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు ఇవ్వబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీమీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యడి, అప్పుడు మీకియ్యబడును; అణిచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కోలుతురో ఆ కొలత తోనే మీకు మరల కొలవబడునని చెప్పెను. (లూకా 6:27-38)

 

ఈసా/క్రీస్తు యొక్క ఈ ఉచ్చారణ ధార్మిక  మిషన్ ఉన్న వ్యక్తి ఎలాంటి పాత్రను కలిగి ఉండాలో సూచిస్తుంది. ఏదైనా దావా మిషన్ విజయవంతం కావడానికి దాయి మరియు మదు (అడ్రస్ చేయబడిన వ్యక్తి) కి మధ్య ఒక అనుకూలమైన వాతావరణాన్ని అవసరం. అందుకు దాయి ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా అత్యున్నతమైన నీతి నియమావళికి కట్టుబడి ఉండాలి.

 

 నీ పై బట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపకుము” (లూకా, 6:29) మన ప్రవర్తన ఎలా ఉండాలో ఇక్కడ చెప్పబడింది. తనకు మరియు మదుకు మధ్య ఎలాంటి వివాదాలు ఉండకుండా,  ఉండేందుకు దాయి  తాను చేయగలిగినదంతా చేస్తాడు, దాయి విధి దావా సందేశాన్ని అందించడమే. అందుకే అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించే బాధ్యతను దాయి  తీసుకుంటాడు. ఇటువంటి విధానం క్రైస్తవ మతానికి కొత్త కాదు.  ప్రవక్తలందరి మిషన్లలో ఇది సాధారణ లక్షణం. ఈ ఏకపక్ష అనుకూల వైఖరి దావా పనిలో విజయం సాధించడానికి చాలా ముఖ్యమైనది.

 

క్రైస్తవులు ఈ బోధనా పద్దతిని  హృదయపూర్వకంగా స్వీకరించారు. శాంతియుత మతమార్పిడి ద్వారా  క్రైస్తవ మతం అసాధారణంగా వ్యాప్తి చెందిడినది. శాంతియుత మతమార్పిడితో పాటు  సామాజిక సేవలో నిమగ్నమై, క్రైస్తవ ప్రచారకారులు సామాన్య జనులకు దగ్గిరైనారు. ఈ ప్రత్యేకమైన దావా శైలి యొక్క ఫలితం క్రైస్తవ మతం ప్రపంచం అంతటా వ్యాపించి, గొప్ప ప్రపంచ మతంగా మారింది.

 

క్రైస్తవo  వ్యాప్తి గురించి సహి ముస్లింలో ఒక హదీసు కలదు: క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో ఉండే వరకు ప్రళయకాలం రాదని ప్రవక్త(స) చెప్పినట్లు తాను విన్నానని ముస్తౌరిద్ ఖరాషి తెలిపాడు. ప్రవక్త(స) యొక్క ఈ మాటలు అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ (ప్రవక్త యొక్క సీనియర్ సహచరుడు మరియు ఈజిప్ట్ విజేత మరియు గవర్నర్)కి తెలియజేయబడినప్పుడు అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్,  ముస్తౌరిద్‌ను ఇలా అడిగాడు: 'మీరు చెబుతున్న ఈ హదీసు స్వభావం ఏమిటి?' ముస్తౌరిద్ ఇలా సమాధానమిచ్చాడు: ' నేను ప్రవక్త(స) నుండి విన్నదాన్ని మాత్రమే వివరిస్తాను.' అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ ఇలా అన్నాడు: 'మీరు అలా చెబితే (అంటే అది ప్రామాణికమైన హదీసు అయితే) క్రైస్తవులు నిస్సందేహంగా ప్రతికూల సమయాల్లో అత్యంత సహనంతో ఉంటారు, తమ బలహీనుల  మరియు నిరాశ్రయుల సంరక్షణలో ఇతరుల కంటే మెరుగుగా  ఉంటారు.  ' (సహీహ్ ముస్లిం, కితాబ్ అల్-ఫితాన్)

 

పైవివరాల ద్వారా ప్రవక్త(స) మరియు అతని సహచరులు తీసుకువచ్చిన విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం దావా మార్గంలోని అన్ని అడ్డంకులను తొలగించడమేనని, తద్వారా దేవుని మతాన్ని ఆచరించడానికి మరియు ఆహ్వానించడానికి ప్రజలను ప్రోత్సహించే అనుకూల పరిస్థితులు నెలకొంటాయని తెలుస్తుంది,  ఇతరులు కూడా ఈవిధనాన్ని తరతరాలుగా కొనసాగించారు.

 

ఈ విప్లవం యొక్క మొదటి దశలో  నిర్బంధ వ్యవస్థను అంతం చేయబడి ప్రపంచంలో మత స్వేచ్ఛ స్థాపించబడినది. రెండవ దశలో  ముస్లింలు సార్వత్రిక స్థాయిలో ఇస్లాంను వ్యాప్తి చేయనారభించారు. ఇప్పుడు ముస్లింలు తమ చరిత్రలో మూడవ మరియు చివరి దశలో ఉన్నారు. మత స్వేచ్ఛ యొక్క పురోగతి దాని అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ముస్లింలు ప్రజలకు సత్యాన్ని తెలియజేసే పనిని కొనసాగించాలి మరియు దానికి  వారు శాంతియుత పద్ధతులను అనుసరించడం అత్యవసరం. దివ్య ఖురాన్ మతపరమైన విజయానికి ప్రకాశవంతమైన ఉదాహరణ క్రీస్తు అనుచరులది అని సాక్ష్యం ఇస్తుంది.

 

అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ ప్రకారం దావా పని మార్గంలో ఉన్న అడ్డంకులు శాశ్వతంగా తొలగించబడ్డాయి. అడ్డంకులు మళ్లీ కనిపిస్తే, ఇది ఖచ్చితంగా ముస్లింలు అనుసరించే కొన్ని అనాలోచిత విధానాల ఫలితంగా ఉంటుంది. ముస్లింలు ఎలాంటి తప్పుడు మార్గాన్ని అవలంబించకుండా ఉండగలిగితే, అంతిమ దినం/డూమ్స్‌డే వచ్చే వరకు సత్యం/ఇస్లాం  యొక్క పిలుపుకు అసలు అడ్డంకి ఎప్పుడూ రాదు.

 

ఇస్లామిక్ అభివృద్ధిలో ముస్లిమేతరుల పాత్ర:

ఇస్లాం ప్రకృతి యొక్క మతం, మరియు దాని మార్గంలో నడవడం వివక్షత లేనిది, సమాజంలోని ప్రతి విభాగానికి అందులో స్థానం ఉంది మరియు సరళత్వం దాని లక్షణం.

 

ప్రవక్త ముహమ్మద్ (స)ప్రకారం: సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మతాన్ని [ఇస్లాం] ఫజీర్ (నిజమైన ముస్లిం కాని వ్యక్తి) ద్వారా కూడా బలపరుస్తాడు.” (సహీహ్ అల్-బుఖారీ.)

 

ఈ ప్రపంచంలో, సహజ ప్రక్రియ వివిధ అంశాల ప్రమేయంతో ప్రారంభమవుతుంది. మొత్తంగా మానవాళి ఒకదానిపై ఒకటి ఆధారపడిన శరీరంవంటిది  మరియు ఇస్లాం కూడా దీనికి మినహాయింపు కాదు.

 

ఇస్లాం అనేది మానవ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న భావజాలం మరియు మానవాళి ప్రమేయం లేకుండా మానవ అభివృద్ధి ప్రక్రియ ముందుకు సాగదు.

 

ప్రవక్త ముహమ్మద్ (స) తన మొదటి పదమూడు సంవత్సరాల ప్రవక్తత్వాన్ని మక్కాలో గడిపారు. ఆ సమయంలో మక్కాలో గిరిజన వ్యవస్థ ఉండేది. ఆధునిక కోణంలో వ్యవస్థీకృత రాజ్యం లేదు. ప్రతి ఒక్కరు గిరిజన ముఖ్యుల రక్షణ పొందడం తప్పనిసరి. ప్రవక్త(స) ఇద్దరు స్థానిక గిరిజన పెద్దల రక్షణను పొందారు - అబూ తాలిబ్ మరియు ముతీమ్ బిన్ ఆది, ఇద్దరూ ముస్లిమేతరులు.

 

మక్కాలో పదమూడు సంవత్సరాలు గడిపిన తరువాత, ప్రవక్త మదీనాకు వలస వెళ్ళారు. ఇది చాల ప్రమాదకరమైన ప్రయాణం. ప్రవక్త(స)ప్రత్యర్థులు ప్రవక్త శిరస్సును తీసుకువచ్చే వారికి వంద ఒంటెల బహుమతిని ప్రకటించారు. అయినప్పటికీ, ప్రవక్త తన ప్రత్యర్థి సమూహంలోని సభ్యుడు “అబ్దుల్లా బిన్ ఉరైకిత్” ని తన  ప్రయాణానికి మార్గదర్శిగా ఎంచుకున్నారు. అబ్దుల్లా బిన్ ఉరైకిత్ తన వృత్తిలో నిజాయితీ గల వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. అబ్దుల్లా బిన్ ఉరైకిత్ ముస్లిమేతరుడు మరియు మక్కాలో ముస్లిమేతరుగా మరణించాడు.

 

ప్రవక్త(స) యొక్క వలస తరువాత, ప్రవక్త(స) మరియు అతని ప్రత్యర్థుల మధ్య వరుస సాయుధ పోరాటాలు జరిగాయి. ఇస్లామిక్ చరిత్రలో ఘజ్వా అల్-అహ్జాబ్ అని పిలువబడే ప్రవక్త(స) ప్రత్యర్థుల సాయుధ పోరాటo  చాలా వినాశకరమైనది. దివ్య ఖురాన్ కూడా దీనిని ఇస్లామిక్ చరిత్రలో అత్యంత భయానక క్షణాలలో ఒకటిగా పేర్కొంది. ఆ సమయంలో, ముస్లింలు తమ ప్రత్యర్థులపై చాలా నిస్సహాయంగా మారారు. ఈ అత్యంత క్లిష్ట పరిస్థితులను సులభతరం చేసినది ఒక మదీనావాసి  నిర్వహించిన మధ్యవర్తి పాత్ర.

 

మదీనాను శత్రు దళాలు చుట్టుముట్టిన రాత్రి మదీనాకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త(స) వద్దకు వచ్చాడు. అతను ఇలా అన్నాడు, “నేను నా హృదయంలో ముస్లిం అయ్యాను, కానీ అది నేను ఇంకా బహిరంగపరచలేదు. కాబట్టి ముష్రిక్‌లు మరియు యూదులు ఇద్దరూ నాపై నమ్మకం ఉంచారు. ఈ వ్యక్తి మాత్రమే రెండు పక్షాల మధ్య శాంతిని నెలకొల్పగల పాత్రను పోషించగలడని గ్రహించిన ప్రవక్త(స), "మా ఇరుపక్షాలలో నమ్మకం ఉన్న వ్యక్తి మీరు మాత్రమె” అని అన్నారు.

 

మదీనావాసి రెండు పక్షాల మధ్య చర్చలు జరపడం ప్రారంభించాడు మరియు రెండు పక్షాల మద్య శాంతికి మార్గం సుగమం చేసాడు. మదీనావాసి ప్రయత్నాల కారణంగానే శత్రువులు మదీనా నగరం ముట్టడిని ఎత్తివేసి తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇస్లామిక్ చరిత్రలో ఇస్లాం అభివృద్ధిలో ముస్లిమేతరులు పోషించిన పాత్రకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇస్లామిక్ అభివృద్ధిలో ముస్లిమేతర ప్రమేయం ఒక వ్యక్తి స్థాయి నుండి మొత్తం సమూహ స్థాయికి కూడా విస్తరించబడింది.

 

పాశ్చాత్య నాగరికత అభివృద్ధి చెందినప్పటికీ, ఇది ఇస్లాంకు అనేక అంశాలలో సహాయపడుతుంది. ఉదాహరణకు పాశ్చాత్య నాగరికత చివరకు మతపరమైన హింసను అంతం చేసింది మరియు మత స్వేచ్ఛ మరియు దావా కోసం తలుపులు తెరిచింది. అదేవిధంగా, పాశ్చాత్య నాగరికత, ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలను అభివృద్ధి చేసింది, ఇది ముస్లింలకు ప్రపంచ స్థాయిలో దావా పని చేయడం లో తోడ్పడినది.  అలాగే, పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు, ఇస్లాం విశ్వాసాలను శాస్త్రీయ ప్రాతిపదికన నిరూపించడానికి మార్గం సుగమం చేశాయి.

 

మునుపటి కాలంలో, ఇస్లాం యొక్క సత్యాలు ప్రత్యక్ష ఆధారాల ద్వారా రుజువు కావని భావించబడింది. కానీ ఆధునిక శాస్త్రం, ఇస్లాం యొక్క సత్యాలు ప్రత్యక్ష ఆధారాల ద్వారా  రుజువు అవుతాయని అనడం సాధ్యం చేసింది. ఈ పరిణామం ఇస్లామిక్  శాస్త్రీయ సిద్ధాంతాలు, సత్యాన్ని నిరూపిస్తాయని రుజువు చేసాయి.

 

ముస్లిమేతరులు కూడా ఇస్లాం యొక్క అభివృద్దికి అనేక విధాలుగా సహాయకారిగా ఉన్నారు. ఇస్లామిక్ అభివృద్ధి అనేది ఒక సార్వత్రిక ప్రక్రియ, ముస్లిం మరియు ముస్లిమేతర శక్తులన్నీ దానిని నెరవేర్చుటకు దోహదం చేస్తాయి.

 

 

ఇస్లాం అభివృద్ధిలో ముస్లిమేతరుల  పాత్ర కొనియడతగినది, దీని వలన ముస్లింల హృదయాలు ఇతరుల పట్ల ద్వేషం, శత్రుత్వం మరియు అపనమ్మకం కాకుండా ప్రేమతో నిండిపోయేల మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పట్ల ముస్లింలకు  సానుభూతిని కలిగేట్టుగా చేస్తుంది.

 

ఇస్లాం మతానికి ముస్లిమేతరుల సహకారం ఇస్లామిక్ చరిత్ర అంతటా కొనసాగింది. ప్రస్తుత కాలంలో ముస్లిమేతరులు చేసిన  రచనలు, ముఖ్యంగా శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో, గతంలో కంటే చాలా ఎక్కువ

 

శాస్త్రీయ ఆవిష్కరణలు అంటే ఏమిటి? నిజానికి అవి ప్రకృతి యొక్క ఆవిష్కరణలు. ప్రకృతి, లేదా దివ్య ఖురాన్ పదాలలో, "ఆకాశాలు మరియు భూమి యొక్క అన్ని విషయాలు" దేవుని సంకేతాలు. దీని ప్రకారం, విశ్వంలోని అన్ని విషయాలు ఇస్లామిక్ బోధనలకు శాస్త్రీయ వాదనగా పనిచేస్తాయి.

 

ప్రకృతి యొక్క ఆవిష్కరణలు నిజానికి దైవిక వాస్తవాల ఆవిష్కరణలు. ఇవి ఇస్లాం బోధనల సత్యానికి సాక్ష్యమిస్తున్నాయి. నేను వ్రాసిన ఇతర పుస్తకాలలో ఈ విషయం గురించి చాలా వివరంగా చెప్పాను. ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను.

 

దివ్య ఖురాన్‌లో ఒక ఆయతు ఉంది: అందుకే, ఈ రోజు మేము నీ  పార్ధివ శరీరాన్ని నీ భావితరాల వారికి ఒక సూచనగా భద్రపరుస్తాము-యదార్ధమేమిటంటే జనులలో అనేకులు మా సూచనల పట్ల అలసత్వం ప్రదర్సిస్తారు. (10:92)

 

ఇది ఈజిప్టు పాలకుడు, మోషే ప్రవక్త యొక్క సమకాలీనుడైన ఫారోను సూచిస్తుంది. ఫారో సముద్రపు లోతైన నీటిలో దేవునిచే మునిగిపోయాడు. ఆ సమయంలో దేవుడు ఫారో శరీరాన్ని కాపాడాలని నిర్ణయించాడు, అది భవిష్యత్తు తరాలకు దేవునికి చిహ్నంగా ఉంటుంది.

 

ఏది ఏమైనప్పటికీ, దివ్య ఖురాన్ అవతరించబడిన సమయంలో లేదా వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా, ఫారో శరీరానికి సంబంధించి ఎవరికీ ఎటువంటి జ్ఞానం లేదు; అది ముస్లిం ప్రపంచానికి కూడా పూర్తిగా తెలియదు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు ఈ సంరక్షించబడిన శరీరం కనుగొనబడలేదు. కాని దివ్య ఖురాన్ యొక్క ఈ ఆయత్ అక్షరాల రుజువైనది. అయితే, ఈ పనిని ముస్లిమేతరులు నిర్వహించారు.

 

ఫ్రెంచ్ పండితుడు, ప్రొఫెసర్ లోరెట్, కింగ్స్ వ్యాలీలోని థెబ్స్‌లో ఫారో యొక్క మమ్మీ మృతదేహాన్ని కనుగొన్నాడు.  అక్కడ నుండి, ఫారో మమ్మీ మృతదేహాo,  కైరోకు రవాణా చేయబడింది. ప్రొఫెసర్ ఇలియట్ స్మిత్. జూలై 8, 1907న దాని చుట్టూ ఉన్న గుడ్డను  తొలగించాడు. ఇలియట్ స్మిత్ తన పుస్తకం, ది రాయల్ మమ్మీస్” (1912)లో ఈ ఆపరేషన్ మరియు శరీర పరీక్ష గురించి వివరంగా వివరించాడు.

 

జూన్ 1975లో, ఫారో మృత దేహాన్ని పరిశీలించేందుకు డాక్టర్ మారిస్ బుకైల్ ను ఈజిప్టు అధికారులు అనుమతించారు. నిపుణుల బృందంతో కలిసి శవపరీక్షలో ఫారో మమ్మీ మృత దేహాo పై  ప్రత్యేక పరిశోధనలు చేశారు. రేడియోగ్రఫీ, కార్బన్-14 డేటింగ్ మరియు ఎండోస్కోపీ వంటి అనేక ఆధునిక పద్ధతుల ద్వారా, మమ్మీ శరీరం యొక్క ఖచ్చితమైన కాలం రుజువు చేయబడినది. పాశ్చాత్య నిపుణుల బృందం అనేక సంవత్సరాల పాటు అధ్యయనం మరియు పరిశోధన తర్వాత, ఈ శరీరం ఖచ్చితంగా మోషే కాలానికి చెందినదని శాస్త్రీయంగా నిరూపించబడింది.

 

ఈ ఫారో మునిగిపోవడం వల్ల లేదా అతను మునిగిపోయిన క్షణం ముందు చాలా హింసాత్మక షాక్‌ల వల్ల మరణించాడని కూడా ఎటువంటి సందేహం లేకుండా నిర్ధారించబడింది.

 

ఫ్రెంచ్ రచయిత, డా. మారిస్ బుకైల్, తన పుస్తకం, ది బైబిల్, ది ఖురాన్ మరియు సైన్స్‌” లోని 'ది ఎక్సోడస్' అనే అధ్యాయాన్ని ఈ ఉత్కంఠభరితమైన పదాలతో ముగించారు:

 

పవిత్ర గ్రంథాల యథార్థత యొక్క రుజువు కోసం ఆధునిక డేటాలో వెతుకుతున్న వారు ఈజిప్షియన్ మ్యూజియం, కైరోలోని రాయల్ మమ్మీల గదిని సందర్శించడం ద్వారా ఫారో యొక్క శరీరంతో సంబంధం ఉన్న దివ్య ఖురాన్ ఆయతుల యొక్క అద్భుతమైన రుజువును  కనుగొంటారు. (p 241)

 

మూలం: మౌలానా వాహిద్దీద్దీన్ ఖాన్

తెలుగు సేత: ముహమ్మద్ అజ్గర్ అలీ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment