28 January 2023

షరియా మరియు దాని అమలు THE SHARIAH AND ITS APPLICATION

 


ఇంటర్నెట్‌లో దావా/ధార్మిక ప్రచారం పై మౌలానా వహీదుద్దీన్ కొన్ని కథనాలను చదివిన తర్వాత ఒక పాఠకుడు తన  ప్రతిస్పందనను ఇ-మెయిల్ ద్వారా పంపాడు. ఇ-మెయిల్ లో మౌలానా వహీదుద్దీన్ అభిప్రాయాలను తిరస్కరించడమే కాకుండా మౌలానా వహీదుద్దీన్  దృక్కోణం, దివ్య ఖురాన్‌కు చాలా విరుద్ధంగా ఉందని పేర్కొన్నాడు.

పాఠకుడు ఉదాహరించిన  దాని ప్రకారం, మౌలానా వహీదుద్దీన్ ఇలా అంటాడు: ఇతర దేశాలు చేసే అకృత్యాలకు వ్యతిరేకంగా ముస్లింలు సహనంతో వ్యవహరించాలి మరియు దావా పనిలో నిమగ్నమై ఉండాలి.

అయితే దివ్య ఖురాన్‌లో, ఈ దృక్కోణానికి పూర్తి విరుద్ధంగా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెప్పాడు: పీడన(పిత్నా) సమసిపోనంతవరకూ, ధర్మం పూర్తిగా దైవానిదే కానంత వరకూ వారితో పోరాడండి.-(8:39)

అయితే మనం ఎవరిని నమ్మాలి?  అల్లాహ్ నా లేదా మౌలానా వహీదుద్దీన్ నా?

ఇది విచిత్రంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి, ఇది పాఠకుడు పూర్తిగా అపార్థం చేసుకొన్న భావన.

కొన్ని హదీసులలో మక్కాలోని ఇస్లాం యొక్క ప్రారంభ దశలో, మక్కాలోని  అన్యమతస్థులు ముస్లింలపై క్రూరమైన హింసను ప్రారంభించినప్పుడు, ఈ ఘోరమైన అన్యాయానికి ప్రతిస్పందిస్తూ, తమను హింసించేవారితో యుద్ధం చేయడానికి ప్రవక్త(స) యొక్క అనుమతిని విశ్వాసులు  కోరినారు. కానీ ప్రవక్త(స) వారిని ఓపిక పట్టమని ప్రోత్సహిస్తూ ఇలా అన్నారు: దేవుని సందేశాన్ని తెలియజేసేందుకు మాత్రమే దావహ్ చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వలేదు”.

ఇక్కడ లోపం, దివ్య ఖురాన్‌లోని ఆయతులను తప్పుగా అన్వయించడంలోనే ఉంది.

ముస్లింలు మక్కాలో  రక్షణ దశ stage of defence లోఉండి సహనం మరియు శాంతి తో తమ దవాహ్ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉన్న తరుణంలో, తమ దావా బాధ్యతలను నిర్వర్తించడానికి వెల్లడించిన ఆయతులను పాఠకుడు ఇక్కడ తప్పుగా ప్రస్తావిస్తున్నాడు.  మక్కా ఆయతులను పాఠకుడు తప్పుగా అన్వయించడం వల్ల పొరపాటు పడ్డాడు. పాఠకుడు మక్కాలో ఉన్న పరిస్థితులను  (డిఫెన్సివ్)మదీనాలో ఉన్న శాంతియుత (peaceful)పరిస్థితులకు అన్వయిస్తున్నాడు.

ఆధునిక కాలంలోని ముస్లింలు ఎదుర్కొంటున్నట్లుగా ముహమ్మద్ ప్రవక్త(స) మరియు అతని సహచరులు మక్కాలో అన్ని సమస్యలు మరియు కష్టాలను ఎదుర్కొన్నారని చరిత్ర చెబుతుంది. ప్రవక్త(స) తన సహచరులను సహనం మరియు పిడను తప్పించుకునే మార్గాన్ని అనుసరించమని కోరినప్పుడు, దివ్య ఖురాన్/దివ్య వాణి పూర్తిగా అవతరించలేదు. దివ్య ఖురాన్ ఒకేసారి అవతరించింది కాదు. దివ్య  ఖురాన్ 23 సంవత్సరాల వ్యవధిలో వేర్వేరు సందర్భాలలో సూరాల/దఫాల వారిగా అవతరించింది. పరిస్థితులకు అనుగుణంగా ఆదేశాలు/వహి  ప్రవక్త(స)మీదా అవతరింపబడ్డాయి.

ఉదాహరణకు, ప్రారంభ దశలో, ప్రవక్తకు సహనం పాటించడం ద్వారా దవాహ్ చేయమని ఆజ్ఞ ఇవ్వబడింది-(74: 2-7).

ప్రవక్త(స) వివాహానికి ముందు వ్యాపారం చేసి సంపాదించాడు తరువాత పరిస్థితులకు తగినట్లుగా వలస వెళ్ళాలనే ఆదేశం వెల్లడి చేయబడినది-(16:41).

తదనంతరం, పరిస్థితులు మరింత మారినప్పుడు, యుద్ధం చేయాలనే ఆదేశం వెల్లడి చేయబడింది-(2:190).

దివ్య ఖురాన్ అవతరించినప్పుడు, దివ్యజ్ఞానం యొక్క క్రమం సంఘటనల క్రమంతో సరిపోలుతుందని ఇది చూపిస్తుంది. కానీ తరువాత, 23సంవత్సరాల వ్యవధిలో వెలుబడిన అన్నిఆయతులు, వివిధ పరిస్థితులకు సంబంధించినవి. చివరకు అవి సేకరించబడి పూర్తి  పుస్తకం(దివ్య ఖురాన్) వెలుబడినది. పూర్తి పుస్తకం(దివ్య ఖురాన్), నేటి వరకు తరువాతి ముస్లిం తరాల చేతుల్లో సురక్షితంగా ఉంది.

ప్రకృతి నియమం ప్రకారం, పరిస్థితులు మారుతాయి అనే  వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఉన్న పుస్తకం వివిధ సమయాల్లో వెలుబడిన మరియు సేకరించిన ద్యోతకాలతో  కలసి దివ్య ఖురాన్ రూపంలో ఉంది. ఈ గ్రంథాలలో వివిధ ఆదేశాలు, అన్ని రకాల పరిస్థితులకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి. అన్నీ కలిపి ఒకే పుస్తకం(దివ్య ఖురాన్)గా  సేకరించబడ్డాయి.

తరువాతి కాలంలోని ముస్లింలు దివ్య ఖురాన్ నుండి మార్గదర్శకత్వం ఎలా పొందాలి?

ఈ ప్రశ్నకు సమాధానం, దివ్య ఖురాన్ ఆయతుల అధ్యయనం, వహి/ద్యోతకం యొక్క కారణాల వెలుగులో చేయాలి (అస్బాబల్-నుజుల్). అనగా, మొదటగా మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్న వారు,  ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఉన్న వ్యవహారాల స్థితిని నిష్పాక్షికంగా అద్యయనం చేయాలి. తరువాత,  ఆ పరిస్థితిలో వెల్లడైన ఆయతులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు సమాధానం  దొరికినప్పుడు, దానిని ప్రస్తుత పరిస్థితికి వర్తింపజేయాలి. అప్పుడు గత మరియు ప్రస్తుత పరిస్థితుల మధ్య సారుప్యత ఖచ్చితంగా అర్ధం అవుతుంది.

దీని గురించి మరింత  అవగాహన కోసం, ప్రవక్త(స) కాలం యొక్క నాలుగు వేర్వేరు దశలను పరిగణనలోకి తీసుకోవాలి:

(ఎ) మక్కన్ కాలపు  మొదటి అర్ధభాగం;

(బి) మక్కన్ కాలపు రెండోవ అర్ధభాగం;

(సి) మదీనా కాలపు  మొదటి అర్ధభాగం;

(డి) మదీనా కాలపు  రెండవ అర్ధభాగం .

ప్రాథమికంగా ఈ నాలుగు కాలాలు మానవ చరిత్రలో పునరావృతమవుతాయి. దివ్య ఖురాన్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, ప్రస్తుత పరిస్థితులకు సమాంతరాలను సులభంగా కనుగొనవచ్చు: చరిత్ర యొక్క తరువాతి కాలాల్లో దివ్య ఖురాన్ నుండి మార్గదర్శకత్వం పొందాలంటే ఇది చాలా అవసరం.

పైన చెప్పినట్లుగా, ఈ రోజు మన వద్ద ఉన్న దివ్య ఖురాన్ గ్రంధం  దాని పూర్తి రూపంలో ప్రవక్త(స) కాలం నాటి ముస్లిములకు అందుబాటులో లేదు.బదులుగా దివ్య ఖురాన్ సూరాలుగా/భాగాలుగా (విడతలు) వెల్లడి చేయబడింది. ఆ సమయంలో, దివ్య ఖురాన్ యొక్క కొన్ని సూరాలు/భాగాలు మాత్రమే బహిర్గతమయ్యాయి. అవి ఆ పరిస్థితులకు సంబంధించినవి అంటే, అప్పటి వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా  ఆదేశాలు విశ్వాసులకు ఇవ్వబడినవి. ఈ విధంగా విశ్వాసులకు తమ పనులను అర్థం చేసుకోవడంలో ఎటువంటి సమస్య పొందలేదు మరియు తదనంతరం ప్రశ్నించకుండానే వాటిని నిర్వహించడానికి తమను తాము అంకితం చేసుకున్నారు.

ఉదాహరణకు, దావా పనిపై పూర్తి శ్రద్ధ అవసరం అయినప్పుడు, దివ్య ఖురాన్ లో ఈ ఆయత్ వెల్లడి చేయబడింది:

వివేకంతో మరియు తేలికపాటి ఉపదేశంతో ప్రజలందరినీ నీ ప్రభువు మార్గం వైపు నడిపించు. (16:25)

అందువల్ల ప్రవక్త(స) యొక్క అనుచరులందరూ దావా కార్యక్రమంను పూర్తి అంకితభావంతో నిర్వహించారు. అదేవిధంగా, పరిస్థితులకు సహనం మరియు దృఢత్వం అవసరం అయినప్పుడు, దివ్య ఖురాన్ లో ఈ ఆయత్ వెల్లడి చేయబడింది:

(ప్రవక్తా!)  స్థిర సoకల్పులైన ప్రవక్తలు ఓర్పు వహించినట్లే నీవు కూడా ఓర్పు వహించు. (46:35)

తదనంతరం, విశ్వాసులు పూర్తి భక్తి మరియు ఏకాగ్రతతో సహనం యొక్క వైఖరిని అవలంబించారు. అదే విధంగా, ఇతర పక్షాల దూకుడు నేపథ్యంలో, రక్షణ సమస్య తలెత్తినప్పుడు, ఈ ఆయత్ దివ్య ఖురాన్ లో వెల్లడి చేయబడింది:

దైవ మార్గం మీతో పోరాడే వారితో మీరూ పొరాడండి. కాని మితిమీరకండి. మితిమీరే వారిని దేవుడు ఇష్టపడడు. (2:190)

ఈ ఆజ్ఞను స్వీకరించిన తరువాత, విశ్వాసులందరూ హృదయపూర్వకంగా యుద్ధ రంగంలో నిమగ్నమయ్యారు.

ఇదే రకంగా 23సంవత్సరాలపాటు ప్రవచనాత్మక కాలం అంతటా కొనసాగింది. ప్రతిసారీ దివ్య ఖురాన్‌లో పరిస్థితులకు సంబంధించి అవసరమైన భాగం మాత్రమే అవతరించింది.

మొదటిదశ  లో  విశ్వాసులు పరిస్థితికి సంబంధించి ఇచ్చిన నిర్దిష్ట ఆజ్ఞను అమలు చేయడంపై మాత్రమే శ్రద్ధ వహించారు.వివిధ మరియు భిన్నమైన ఆజ్ఞలలో ఏది వర్తించాలో నిర్ణయించాల్సిన అవసరం వారికి  లేదు.

కానీ, తర్వాతి కాలంలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు, వివిధ సందర్భాలలో అవతరించిన వివిధ సూరాలను సేకరించి ఒక పుస్తకం(దివ్య ఖురాన్)గా రూపొందించారు. అంటే, ఆదేశాలు మరియు వాటి నేపథ్యం ఒకదానికొకటి వేరు చేయబడ్డాయి.

ఆ తర్వాత, లోతైన పరిశీలన మరియు అధ్యయనం ద్వారా, నిర్దిష్ట పరిస్థితులలో వారికి ఏ ఆదేశాలను వర్తిస్తాయో  తెలుసుకోవలసిన బాధ్యత ముస్లింల పైనే ఉంది. అందువల్ల దివ్య ఖురాన్ యొక్క సంబంధిత ఆయత్ కనుగొనడం మరియు దానిని అచంచలమైన భక్తి మరియు అంకితభావంతో అనుసరించాలి.

విశ్వాసులు "దివ్య ఖురాన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్దగా వినండి. నిశ్శబ్దంగా ఉండండి. అలా చేస్తే మీరూ కరుణకు నోచుకోవచ్చు." అని కోరబడ్డారు.-(7:204). అంటే, వారు దివ్య ఖురాన్ యొక్క పూర్తి భాగాన్ని చదవాలి మరియు ఆజ్ఞను హృదయపూర్వకంగా అమలు చేయాలి.

తరువాత కాలం లో ముస్లింలపై  హదీసులలో పేర్కొన్నట్లుగా అనుమితి inference (దివ్య ఖురాన్, 4:83) మరియు ఇజ్తిహాద్ (ప్రయత్నించడం) యొక్క అదనపు బాధ్యత మోపారు. అంటే,వారికి(ముస్లిములకు) తాము ఎదుర్కొనే వ్యవహారాల స్థితికి సంబంధించి ఏ దైవిక ఆదేశం ఇవ్వబడిందో గుర్తించడానికి, అత్యంత నిజాయితీతో, చిత్తశుద్ధితో మరియు దైవభీతితో ఆలోచించడం, ఆపై ఆజ్ఞను  ఏ మాత్రం విముఖత చూపకుండా అమలు చేయడానికి ప్రయత్నించడం చేయాలి.

అంటే,  ఇస్లాం యొక్క మొదటి దశలో, దావహ్ అవసరమైన సమయంలో, సహనం ప్రదర్శించాలి.  అలాగే   యుద్ధం అవసరమైనప్పుడు యుద్ధం చేయాలనే ఆదేశం వెల్లడి చేయబడింది. దీనితో ప్రజలు ఎటువంటి గందరగోళాన్ని ఎదుర్కోలేదు. కానీ తరువాతి కాలం లో ముస్లింలు సహనం, దావా మరియు యుద్ధం యొక్క ఆదేశాలను ఒకే పుస్తకం(దివ్య ఖురాన్)లో కనుగొన్నారు.

వైవిధ్యమైన ఆదేశాలలో ఏవి వాటి  నిర్దిష్ట పరిస్థితులకు సంబంధించినవి అని స్వంతంగా కనుగొనడం ఇప్పుడు ముస్లింల వంతు అయినది. ఇంతకుముందు పరిస్థితులు మరియు ఆదేశాలు ఒకదానితో ఒకటి సరిపోతాయి కాని ఇప్పుడు  ఆదేశాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. కాని ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఒక ఆదేశాన్ని మాత్రమె వర్తింపజేయాలనే  డిమాండ్ పెరిగింది.

ప్రస్తుత దివ్య ఖురాన్ సంకలనంలో వహి/దైవవాణి వెల్లడి/దోత్యకం  యొక్క కాలక్రమానుసారం chronological order అనుసరించబడలేదు.

దివ్య  ఖురాన్ యొక్క ప్రస్తుత అమరిక క్రమం,  వహి/ద్యోతకం యొక్క క్రమం ఆధారంగా ఉండకపోవడం విశ్వాసులను పరీక్షించే విషయం. ముస్లింలు ఒక నిర్దిష్ట పరిస్థితిలో, ఏ ఆదేశంను  అమలు చేయాలనుకొంటున్నారో తెలుసుకొని  దానిని నిష్పక్షపాతంగా అమలు చేయవలసి ఉంటుంది.ఈ పరీక్ష మొదటి దశలోని ప్రజలకు ఎదురైనది. తరువాతి కాలంలోని ముస్లింలు తమ  పరిస్థితులకు వర్తించే మరియు దేవుడు కోరుకునే నిర్దిష్ట ఆదేశం కనుగొన్నారు.

ప్రవక్త(స) యొక్క ఆవిర్భావం,  అతని సమకాలీనులకు వారు నిజమైన మార్గదర్శిని గుర్తించగలరో లేదో చూడడానికి ఒక పరీక్ష అయితే ద్యోతకక్రమం కాని విధంగా దివ్య  ఖురాన్ యొక్క అమరిక ప్రజలు తాము  నిజమైన మార్గదర్శకత్వాన్ని కనుగొనగలరా లేదా అనే దానిని పరీక్షించడానికి మరొక పరిక్ష. మొదటి దశ ప్రజలు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు తరువాతి తరం  ముస్లింలు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

ప్రవక్త(స) మరియు అతని కాలపు విశ్వాసులు మొదట్లో మక్కాలో నివసించారు. ఆ సమయంలో మక్కాలోని విగ్రహారాధకులు  ఆధిపత్య స్థానాన్ని అనుభవించారు. వారు ప్రవక్త(స) మరియు ఇతర ముస్లింలను హింసించేవారు. ఆ పరిస్థితుల్లో విశ్వాసులు దేనిని ఆశ్రయించాలో  చెప్పమని దేవుడిని అడిగారు: నమ్ముకున్నవారు సదా దైవాన్నే నమ్ముకోవాలి” అని అల్లాహ్ అన్నాడు.-(14:12). దీనితో ప్రత్యర్థుల అన్యాయం, అణిచివేతలను లెక్కచేయకుండా సహనం అనే మార్గానికి కట్టుబడి ముస్లిములు కట్టుబడి ఉండాల్సి వచ్చింది.

ఈ విధంగా, సమయానుకూలమైన మార్గనిర్దేశం ద్వారా, విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లో తాము ఎలాగా ఉండాలో,  తమ విధానం ఏమిటో తెలుసుకున్నారు. అవతలి పక్షం అన్యాయానికి పాల్పడినప్పటికీ, వారు ఏకపక్షంగా సహన వైఖరిని కొనసాగించాలని వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు.

ప్రవక్త(స) మరియు అతని సహచరులు మక్కా వదిలి మదీనాకు వలస వెళ్ళినప్పుడు  పరిస్థితులు మారాయి. కొత్త పరిస్థితులకు అనుగుణంగా దైవాదేశాలు కూడా మారాయి. హింసకు గురైనప్పుడు సహనం పాటించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకత్వం, ఇప్పుడు మారిపోయింది.

ఈ సందర్భంగా దివ్య ఖురాన్‌లో ఇచ్చిన ఆదేశం ఏమిటంటే: "కయ్యానికి కాలుదువ్విన వారితో యుద్ధం చేయడానికి అనుమతి ప్రధానం చేయబడినది. " (22:39)

హింసను ఎదుర్కోవడానికి కొన్నిసార్లు రక్షణ అవసరమని ఇది చూపిస్తుంది. అయితే ఇతర సమయాల్లో ఓపిక తప్ప ఎలాంటి ప్రతిచర్య అవసరం లేదు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో సహనం పాటించాలి, ఆత్మరక్షణ కోసం ఏ పరిస్థితుల్లో యుద్ధం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతోంది?

ఈ ప్రశ్నలకు సమాధానo  మొదటి దశ లో విశ్వాసులు ఎలాంటి నిర్ణయం తీసుకోనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమాధానాలు భగవంతునిచే వెల్లడి చేయబడుతూనే ఉన్నాయి. కానీ తరువాతి కాలంలో ముస్లింలకు ఈ పరిస్థితి లేదు. వారికి తమ పరిస్థితులకు సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి, కానీ వారి స్వంత అన్వేషణ ద్వారా వాటికి సమాధానాలు కనుగొనవలసి ఉంటుంది.

తరువాతి కాలంలోని ముస్లింలకు  పరీక్ష,  ప్రవక్త(స) ఆజ్ఞను గుర్తించడంలో ఉంది. దివ్య ఖురాన్ రెండు రకాల ఆదేశాల ఆయతులను ఒకే పుస్తకం లో పొందుపరిచినప్పుడు ఏ ఆజ్ఞలను ఏ పరిస్థితికి వర్తింపజేయాలో మరియు ప్రస్తుతానికి ఏ ఆజ్ఞలను రద్దు చేయవచ్చో కనుగొనడంలో   లోతుగా, నిష్పాక్షికంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవరించవలసిన బాధ్యత విశ్వాసులదే. ఆదేశంయొక్క ఈ స్వభావం ఇంతకు ముందు ప్రత్యక్షంగా వహి/ద్యోతకం ద్వారా నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు అది ఇజ్తిహాద్(వివేచన) ద్వారా నిర్ణయించబడాలి.

ఈ విషయం లో మరొక బిన్న కోణాన్ని పరిశీలించుదాము:

ప్రవక్త(స) మరియు అతని సహచరులు మక్కా నగరంలో నివసించినప్పుడు మక్కాలో ఉన్న విగ్రహారాధకులు, ప్రవక్త(స) మక్కా విడిచి, మదీనాకు వలస వెళ్ళిన  తరువాత  మరియు మక్కా పై ప్రవక్త(స)విజయం సాధించే వరకు  కూడా మక్కాలో నివసించిననారు.

కానీ ఈ రెండు దశల్లో,  రెండో దశలో వారి (విగ్రహారాధకుల) తో వ్యవహరించే విధానం మారిపోయింది. మొదటి దశలో ఈ విగ్రహారాధకులకు సంబంధించి విశ్వాసులకు ఇవ్వబడిన ఆదేశం, శాంతియుత మార్గాలను అవలంబించడం ద్వారా వారిని హెచ్చరించడం మాత్రమే అని చరిత్ర చూపిస్తుంది:

 "లేచి హెచ్చరించు, వివేకంతో వారిని  ప్రభువు మార్గంలోకి పిలవండి."

 ఈ ఆదేశం ప్రకారం, ప్రవక్త(స) మరియు అతని సహచరులు మక్కాలోని అవిశ్వాసులకు దివ్య ఖురాన్ ఆయతులను వినిపించడం ద్వారా దావా నిర్వహించేవారు:

"అల్లాహ్  తప్ప వేరే దేవుడు లేడని చెప్పండి మరియు మీరు మోక్షాన్ని పొందుతారు”

కానీ వలసలు మరియు మక్కా విజయం తరువాత, పరిస్థితి మారిపోయింది.

ఇప్పుడు ‘అత్ తౌబా/పశ్చాత్తాపం' పేరుతో దివ్య ఖురాన్‌లోని తొమ్మిదవ అధ్యాయం వెల్లడి చేయబడింది.

ఇది "మీరు ఒప్పందాలు చేసుకున్న విగ్రహారాధకులకు అల్లాహ్ మరియు అతని దూత ద్వారా క్షమాబిక్ష ప్రసాదించబడినది” అని ప్రకటించబడినది.

ఈ సురా అవతరించిన తర్వాత, హజ్ (తీర్థయాత్ర) సమయం వచ్చినప్పుడు, దైవప్రవక్త(స) ఈ ప్రకటనను బహిరంగంగా ప్రకటించడానికి మక్కాకు తన సహచరుల ప్రతినిధి బృందాన్ని పంపారు.

విగ్రహారాధకులకు సంబంధించి దావహ్ లేదా సందేశం అవసరమైనప్పుడు, దావాతో వ్యవహరించే ఆయతులు వెల్లడి చేయబడినవని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ విధంగా, ఏమి చేయాలో మరియు ఎప్పుడు చేయాలో సూచించడానికి వహి/దైవ వాణి యొక్క జ్ఞానం సరిపోతుంది.

కానీ ఆ తర్వాతికాల  ముస్లింల పరిస్థితి వేరు. ఇప్పుడు దివ్య ఖురాన్ మొత్తం రెండు రకాల ఆయతులతో కలిపి ఒకే పుస్తక  రూపంలో మన చేతుల్లో ఉంది. అందువల్ల, ముస్లింలు తమ స్వంత ఇజ్తిహాద్ (వివేచన)ఉపయోగించి  నిర్దిష్ట పరిస్థితులలో తమకు ఉద్దేశించిన ఆదేశాలను కనుగొనవలసి ఉంటుంది.

ఇది తరువాతి కాలం ముస్లింలకు ఒక  పరీక్ష. పరిస్థితుల పరంగా దేవుడు కోరుకునే నిర్దిష్ట ఆజ్ఞను కనుగొనడంలోనే  వారి విజయ సామర్థ్యం ఉంది. కాని మారిన పరిస్థితులలో కావాల్సిన ఆదేశాలను గుర్తించడంలో వారి వైఫల్యం కన్పిస్తూ ఉంది. ఉదాహరణకు, వారి వాస్తవ స్థితికి  అనుగుణంగా సహనం మరియు దావా యొక్క ఆయతులు వర్తిస్తాయి. కాని వారు దివ్య ఖురాన్‌లోని పోరాట వాక్యాలను ప్రస్తావిస్తూ ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నారు, అంటే వారు అనుసరించే చర్య వారు దైవిక పరీక్షలో విఫలమైనట్లే అని తెలియజేస్తుంది.

ఈ వైఫల్యం చాలా తీవ్రమైనది. ఇది ఒక ప్రవక్త(స) ను  నిజమైన దేవుని ప్రవక్తగా గుర్తించడంలో విఫలమవడంతో పోల్చవచ్చు. గుర్తించడంలో వైఫల్యం వల్ల కలిగే నష్టం  చాలా తీవ్రమైనది అయితే గుర్తించడంలో విజయం వల్ల వచ్చే లాభం చాలా గొప్పది.

మార్గదర్శకత్వం మరియు అజ్ఞానం యొక్క రహస్యం:

దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: "దేవుడు దీని ద్వారా (దివ్య ఖురాన్) ఎంతో మందిని మార్గవిహీనుల్ని చేస్తాడు. మరెంతో మందికి సన్మార్గం చూపుతాడు." (2:26)

దివ్య ఖురాన్ నిస్సందేహంగా, దేవుని నుండి వచ్చిన సత్యం. కొందరు దాని నుండి మార్గనిర్దేశాన్ని కనుగొంటారు, మరికొందరు తప్పుదారిన నడుస్తారు? ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం ఆదేశాన్ని అర్ధం చేసుకోనటం లో తేడా. దివ్య ఖురాన్‌ను సరిగ్గా నిశితంగా అధ్యయనం చేస్తే, పాఠకుడికి మార్గదర్శకత్వం లభిస్తుంది. దీనికి విరుద్ధంగా, దివ్య ఖురాన్‌ ఆదేశాన్ని తప్పుగా అర్ధం చేసుకొని అద్యయనం చేస్తే  అది ప్రజలు తప్పుదారి పట్టడానికి కారణం అవుతుంది.

దివ్య ఖురాన్‌లోని వివిధ భాగాలను సరైన దృక్కోణంలో అధ్యయనం చేయడం అంటే ఆయా  పరిస్థితుల  వెలుగులో ఆయతులను  సరిగ్గా అర్థం చేసుకోవడానికి గాను  వాటిని లోతుగా అధ్యయనం చేయడం. దివ్య ఖురాన్‌లోని ఏ ఆయతులు, ఏ ప్రత్యేక సందర్భాలలో అవతరించబడ్డాయో తెలిపే వివరాలు  అనేక హదీసు మరియు తఫ్సీర్ పుస్తకాలలో నమోదు చేయబడ్డాయి. ఈ హదీసులు ప్రారంభ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, తరువాతి కాలంలో ఇలాంటి పరిస్థితులలో వాటి సరైన అనువర్తనానికి సంబంధించి నమ్మదగిన మార్గదర్శకంగా కూడా ఉపయోగపడతాయి

హదీసుల ప్రకారం దివ్య ఖురాన్ లోని ప్రారంభకాల ఆదేశాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి, తద్వారా అవి  తరువాత కాలం లో సరిగ్గా వర్తించబడతాయి.

దివ్య ఖురాన్‌లోని చాలా ఆదేశాలు క్లుప్తంగా ఉంటాయి.

ఉదాహరణకు దివ్య  ఖురాన్ ఇలా చెబుతోంది: విశ్వాసులారా, ఒక దుర్మార్గుడు మీకు ఒక వార్తను తీసుకువస్తే, ముందుగా దాని సత్యాన్ని విచారించండి, తర్వాత  మీ వల్ల  జరిగిపోయిన దానిపై పశ్చాత్తాపపడకుండా ఉండేందుకు (49:6)

హదీసుల  ప్రకారం దివ్య ఖురాన్ లోని ఈ ఆయత్  ఒక నిర్దిష్ట సంఘటన తరువాత వెల్లడైంది. కానీ ఆ ఆయత్ ఆ సంఘటన గురించి లేదా దానిలో పాల్గొన్న వ్యక్తుల గురించి ప్రస్తావించలేదు. కాబట్టి, ఆయత్ యొక్క వాస్తవ అర్ధం మరియు సందేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ నిర్దిష్ట సంఘటన బహిర్గతం అవటానికి గల కారణాన్ని దృష్టిలో ఉంచుకుని దానిని అధ్యయనం చేయడం చాలా అవసరం.

ఈ విధంగా, హదీసులలో వివరంగా ప్రస్తావించబడిన ఆ సంఘటన యొక్క నేపథ్య జ్ఞానo  మనకు తెలుస్తుంది. దాని ఆధారంగా  మనం సంబంధిత ఆయతులో వెల్లడి చేయబడిన ఆజ్ఞ యొక్క వాస్తవ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు.

ఒక ఆదేశం యొక్క అసలు సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, తరువాతి కాలంలో జరిగే ఇలాంటి సంఘటనలకు దానిని అన్వయించడం చాలా సులభతరం అవుతుంది. దివ్య ఖురాన్‌లో ప్రస్తావించబడినటువంటి పరిస్థితిలో, దివ్య ఖురాన్ ఆదేశం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాము.

దివ్య ఖురాన్ ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నట్లే, తప్పుదారి పట్టించేవారికి కూడా  మూలంగా ఉంటుందని ఇంతకు ముందు ప్రస్తావించబడిన దివ్య ఖురాన్ యొక్క ఆయత్ చెబుతుంది.  

అయితే, దారితప్పిన ఈ వ్యక్తులు ఎవరు? వీరు దివ్య ఖురాన్‌ను  సందర్భం ప్రకారం సరిగ్గా అధ్యయనం చేయని వ్యక్తులు. వీరి దృష్టిలో దివ్య ఖురాన్‌ను అధ్యయనం చేయడం అంటే తమ స్వంత ఇష్టాలు మరియు కోరికల వెలుగులో దానిని అధ్యయనం చేయడం, అంతే కాని వహి వెలుగు లో అద్యయనం చేయడం కాదు.

వహి/ద్యోతకానికి గల కారణాలను ప్రస్తావిస్తూ దివ్య ఖురాన్‌లోని ఆయతులను అధ్యయనం చేస్తే, ఇస్లాం యొక్క లక్ష్యం,  ఇస్లాం వ్యతిరేకులను నిర్మూలించడం కాదు, ధార్మిక ప్రచారం (దావా) ద్వారా వారిని  ఇస్లాం లోకి ప్రవేశించడానికి సహాయం చేయడం అనే వాస్తవికత మనకు తెలుస్తుంది. నిజంగా, దివ్య ఖురాన్ యొక్క ఈ ఆయత్  ఈ విషయంలో మనకు స్పష్టమైన మార్గదర్శకాన్ని ఇస్తుంది:

 అల్లాహ్ వైపు (సర్వ జనులను) పిలుస్తూ, మంచి పనులు చేస్తూ, “నేను దైవ విదేయులలో ఒకడను” అని పలికేవాని మాటకన్నా మంచి మాట మరెవరిదీ కాగలదు? మంచి-చెడు ఎన్నటికి సమానం కాజాలవు. నీవు (చెడుకు)సమాధానం దానికన్నా మేలైన విధంగా ఇవ్వు. ఆతరువాత నువ్వే చూస్తావు! నీకు బద్దవిరోదిగా ఉన్న వ్యక్తి నీ ఆత్మీయ మిత్రుడైపోతాడు. అయితే ఈ భాగ్యం సహనమూర్తులకు  మాత్రమే వరిస్తుంది. ఒకవేళ షైతాన్ నీ మనసులో ఏదైనా శంకను నూరిపోస్తే, నీవు అల్లాహ్ శరణు వేడుకో, నిశ్చయంగా అయన అంతా వినేవాడు, అన్ని తెలిసినవాడు."-(41:33-36)

దివ్య ఖురాన్ నుండి మార్గనిర్దేశాన్ని పొందాలంటే, వహి/వెల్లడి యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. హదీసుల సహాయం లేకుండా దివ్య ఖురాన్ యొక్క ఆయతులను అధ్యయనం చేస్తే, ప్రతి ఆయత్ ఒక సంపూర్ణమైన ఆదేశాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మనకు వహి/ద్యోతకాల నేపథ్యాన్ని వివరించే హదీసుల వెలుగులో దివ్య ఖురాన్‌ను అధ్యయనం చేసినప్పుడు, అవి నిర్దిష్టమైన అన్వయాన్ని కలిగి ఉన్నాయని మనకు తెలుస్తుంది.

ప్రవక్త (స) జీవించిన కాలంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడల్లా దానికి సంబంధించి ఒక వహి/ ద్యోతకo  వచ్చేది.

అటువంటి పరిస్థితిలో దివ్య ఖురాన్‌లోని ఏదైనా వాక్యాన్ని సంపూర్ణ అర్థంలో తీసుకోని,   దానిని తరువాత రోజు పరిస్థితులకు వర్తింపజేయడం సరైనది పద్ధతి కాదు. కావున వహి/ద్యోతకానికి గల కారణాల వెలుగులో దివ్య ఖురాన్‌లోని వాక్యాలను అధ్యయనం చేయడం చాలా అవసరం. నేపథ్యాన్ని తెలుసుకొన్న తర్వాత, తరువాతి కాలంలో ఉత్పన్నమయ్యే ఏదైనా ఇలాంటి పరిస్థితికి మనం వాటిని అన్వయించవచ్చు. ఈ సూత్రం ప్రకారం, దివ్య ఖురాన్ ఆయతులను వాటి సరైన సందర్భంలో తీసుకోవడం మార్గదర్శకానికి మూలం, అయితే వాటిని రివర్స్ చేయడం అతిక్రమణకు మూలం.

సంక్షిప్తంగా, దివ్య ఖురాన్ అనేది వివిధ మరియు వైవిధ్యమైన ఆదేశాల injunctions యొక్క సంగ్రహం compendium. ఉదాహరణకు, ఒక చోట దివ్య ఖురాన్‌లో ఈ ఆదేశాన్ని మనం కనుగొంటాము: "బహుధైవారాధకులను పట్టించుకోకు" (15:94). మరొక చోట: "విగ్రహారాధకులు మీకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే వారితోనూ పోరాడండి."-(9:16) అనే ఆదేశాన్ని కనుగొంటాము.

ఈ రెండు ఆదేశాలు స్పష్టంగా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి నేటి పాఠకుడు ఏ ఆదేశాన్ని అనుసరించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది?.

వహి/ద్యోతకం నేపథ్యం, దీనికి  సమాధానాన్ని అందిస్తుంది. దివ్య ఖురాన్‌లోని అన్ని ఆదేశాలు, నిర్దిష్ట సందర్భాలలో వెల్లడి చేయబడ్డాయి.  ఆయతుల నేపథ్యంను  వివరించే హదీసులు  ఆయతులు,  ఏ సందర్భంలో ఏ నిషేధాజ్ఞను వెల్లడించాయో తెలియజేస్తాయి. ఈ విధంగా, ఆయతుల నేపథ్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, దివ్య ఖురాన్ ఆదేశాల యొక్క మొదటి అనువర్తనాన్ని మనం కనుగొనవచ్చు. మొదటి అప్లికేషన్/ నేపథ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, రెండవ అప్లికేషన్/ నేపథ్యాన్ని గురించి ఖచ్చితమైన జ్ఞానం కలిగి ఉండటం చాలా సులభతరం అవుతుంది. మొదటి అప్లికేషన్ యొక్క సరైన అవగాహన రెండవ అప్లికేషన్‌లో పూర్తి ఖచ్చితత్వానికి మార్గం సుగమం చేస్తుంది.

ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, పరిష్కారాల కోసం దివ్య ఖురాన్ పిలుపునిచ్చే పరిస్థితులను  మనం కనుగొన్నప్పుడు, దేశాల నేపథ్యంతో వ్యవహరించే హదీసులను కూడా మనం పూర్తిగా అధ్యయనం చేయాలి. ప్రవక్త(స) యొక్క సహచరులు ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు,  దివ్య ఖురాన్‌లో ఏ ఆయతులు అవతరింపజేయబడ్డాయో తెలుసుకోవడానికి ఇది సహాయపడినది.

ఈ విధంగా, రెండు పరిస్థితుల మధ్య సారూప్యత,   మనం ఎదుర్కొనే పరిస్థితులలో ఏ ఆయత్/ఆయతులు మనకు సూచించబడ్డాయో తెల్పుతుంది.   అంటే, మొదటి సందర్భం/ అప్లికేషన్‌ యొక్క వెలుగులో మనం రెండవ అప్లికేషన్‌ను నిర్ణయించాలి.

మూలం:మౌలానా వహీదుద్దీన్ ఖాన్

తెలుగు సేత: ముహమ్మద్ అజ్గర్ అలీ.

No comments:

Post a Comment