23 January 2023

ప్రవక్త(స) బోధనలను వర్తమానానికి వర్తింపజేయడం Making the Prophet’s Teachings Relevant Today

 

ముహమ్మద్ ప్రవక్త(స) గురించి సాధారణ ప్రజలకు  ఉన్న అభిప్రాయం ఏమిటంటే, ప్రవక్త(స)లక్ష్యం తన రాజకీయ అధికారం ద్వారా ప్రజలను లొంగదీసుకుని, వారందరూ తన ధర్మాన్ని అనుసరించేటట్లు  బలవంతం చేయడం ద్వారా ప్రజలను పాలించడం. ప్రవక్త(స) యొక్క జీవిత చరిత్ర రాసిన ముస్లిం రచయితలు వ్రాసిన తమ పుస్తకాలలో ప్రవక్త(స) గురించి చిత్రీకరించిన ఈ అవగాహన సత్యం  కాదు. ముస్లిం చరిత్రకారులు తమ  సీరాలో, ప్రవక్త(స) నిరంతరం ప్రజలపై యుద్ధం చేస్తూ, వారి భూభాగాలను జయించి, వారి ద్వారా  బలవంతంగా విధేయత పొందిన యోధునిగా చిత్రీకరించారు.

అయితే మౌలానా వహీదుద్దీన్ ఖాన్ తన పుస్తకం “ముతాలా-ఎ-సీరత్” (ప్రవక్త జీవితం యొక్క అధ్యయనం)లో, ప్రవక్త (స) యొక్క ఈ చిత్రీకరణ  నిజం కాదు  అన్నారు, ఒకవేళ ఇదే జరిగితే ప్రవక్తత్వం యొక్క ఉద్దేశ్యం నెరవేరకుండా ఉండేది. దివ్య ఖురాన్,  ప్రవక్త(స) యొక్క సందేశాన్ని ప్రజల జీవితాన్ని చీకటి నుండి వెలుగు ఇచ్చేదిగా వివరిస్తుంది. 

“ఓ విశ్వసించిన వారలా! దైవప్రవక్త  మీకు జీవితానిచ్చే విషయం వైపు  పిలిచినప్పుడు మీరు దైవం మరియు దైవ ప్రవక్త పిలుపునకు సానుకూలంగా స్పందించండి.తెలుసుకోండి. మీరంతా అయన వద్దకే సమీకరించబడతారు”.-(8:24).

ఆధ్యాత్మిక జ్ఞానోదయం యుద్ధం మరియు హింస ద్వారా అందించబడదు.కరుణ,శ్రేయస్సు మరియు హృదయపూర్వక సలహాల ద్వారా అందించబడుతుంది. ఇది ప్రజలో దేవుని దైవ భీతిని మేల్కొల్పడం ద్వారా, వారిలో జవాబుదారీతనాన్ని కలిగించడం ద్వారా, మంచి ఆలోచనలు, మoచి పనుల ద్వారా, ప్రజలను సంస్కరించడం ద్వారా, ప్రజల హృదయాలను మరియు మనస్సులను గెలుచుకోవాలి. ప్రవక్త(స) చూపిన ఓపిక, పట్టుదల, శ్రద్ధ మరియు గొప్పతనం ప్రజలను  చేరుకోవడానికి మరియు వారి విశ్వాసం పొందటానికి వీలు కల్పించింది. ప్రవక్త(స) యొక్క బలం శాంతిని కాపాడటంలో ఉంది మరియు కత్తిని పట్టుకోవడంలో కాదు. ప్రవక్త (స) తన శత్రువులను తన మహోన్నతమైన వ్యక్తిత్వం   ద్వారా వారి శత్రుత్వాన్ని స్నేహంగా మార్చుకున్నారు.

“నీవు (చెడుకు)సమాధానం దానికన్నా మేలైన విధంగా ఇవ్వు. ఆ తర్వాత నువ్వే చూస్తావు! నీకు బద్ధ విరోధిగా ఉన్న వ్యక్తి నీ ఆత్మీయ మిత్రుడైపోతాడు,”-(ఖురాన్ 41:34).

 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు సృష్టికర్తను పరిచయం చేయడానికి మరియు దేవుని సృష్టి ప్రణాళిక గురించి తెలియజేయడానికి వచ్చారు. ప్రజలు సజీవుడైన దేవుడిపై విశ్వాసం ఉంచడంలో సహాయపడటం మరియు గొప్ప శక్తికి మూలం ఎవరు? అన్న విషయాన్నీ  తెలియపరచడానికి వచ్చారు. ప్రవక్త(స) తన సందేశాన్ని సమకాలీనులకు తెలియజేయడమే కాకుండా, దానిని తాను స్వయంగా గ్రహించారు. దీనిని ప్రవక్త(స) జీవించిన విధానంలో మరియు ప్రవక్త(స) చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రవక్త(స)ప్రవర్తన నుండి   మనం గ్రహించవచ్చు.

ప్రవక్త (స) ప్రవచనాత్మక మిషన్ ప్రారంభంలో ప్రవక్త(స) వద్దకు  ఒక దేవదూత వచ్చాడు. ప్రవక్త(స) వినయవంతునిగా మారారు. ప్రవక్త(స) పరలోకం యొక్క శాశ్వతమైన ప్రపంచాన్ని ఎప్పటికీ మరచిపోవద్దని, దేవునికి జవాబుదారీగా ఉండమని ప్రజలకు సలహా ఇస్తారు.

ప్రతి క్షణం దేవుని సాక్షాత్కారంతో జీవించిన వ్యక్తి యొక్క స్వరూపం ప్రవక్త(స)యొక్క  స్వంత జీవితం. ప్రవక్త(స) దేశాధినేతగా ఉన్నప్పుడు, ప్రవక్త(స) తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎగతాళిగా మాట్లాడినప్పటికీ, ప్రవక్త(స) అతనిని మందలించలేదు. ప్రవక్త(స)తనకు అప్పుగా ఇచ్చిన వ్యక్తికి డబ్బును డిమాండ్ చేసే హక్కు పూర్తిగా ఉందని విశ్వసించినాడు.

ప్రవక్త(స)ఔన్నత్యం, వ్యక్తిగత కీర్తి భావం లేకుండా ప్రజల మధ్య జీవించాడు. ఒకసారి ప్రవక్త(స) మరో ఇద్దరు సహచరులు ప్రవక్త(స)ఒంటె ఎక్కేందుకు వంతులు వేసుకొన్నారు.. నడవడానికి ప్రవక్త (స)వంతు వచ్చినప్పుడు, ప్రవక్త(స)సహచరులు తమ స్థానంలో ఒంటెను ఎక్కమని ప్రవక్త(స)ను అభ్యర్థించారు. కానీ ప్రవక్త(స) "నడవడంలో మీరు నాకంటే బలవంతులు కారు లేదా మీ ఇద్దరి కంటే దేవుని ప్రతిఫలం నాకు తక్కువ కాదు." అని  చెబుతూ నడవడం కొనసాగించాడు:

ప్రవక్త(స) తన దైవిక మిషన్‌లో వివేకంతో విజయం సాధించగలిగారు. ప్రవక్త (స) తన దైవ ప్రణాళికలో ముందుకు సాగడానికి అడుగడుగునా వివేకాన్ని అనుసరించాడు. ఉదాహరణకు, మక్కాలో ప్రవక్త(స) మిషన్‌పై వ్యతిరేకత పెరిగినప్పుడు, విరోధులు చివరకు ప్రవక్త(స)ను చంపడానికి పథకం వేశారు. ప్రవక్త(స) తన అనుచరులతో అవిశ్వాసులతో ఘర్షణను నివారించి, శాంతియుతంగా మరొక నగరానికి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది వాస్తవికత యొక్క రూపం. ముస్లింలు మరియు ఇతర వర్గాల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడల్లా ప్రవక్త(స) సాద్యమైనంత వరకు ఘర్షణ నివారిoచి చర్చలకు  ప్రాధాన్యం ఇచ్చే వారు.

శక్తి మరియు వనరులను సంరక్షించడానికి మరియు ఒకరి ఉన్నత లక్ష్యాన్ని నెరవేర్చడానికి వాటిని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి వివాదాస్పద స్థానం నుండి దూరంగా వెళ్లే సూత్రాన్ని ప్రవక్త(స) విశ్వసించాడు. ప్రవక్త(స) ముస్లింలను ఇస్లాం మతం గురించి దురభిప్రాయాలను సృష్టించే ఏ చర్యను అయినా  నిషేధించారు. దివ్య ఖురాన్ ప్రకారం  మునుపటి ప్రవక్తల సూచనల  విశ్వాసులకు మార్గదర్శకంగా ఉన్నాయి. వాటిని పాటించాలి. ఒక ముస్లిం,  ఆచరణాత్మక మరియు సామాజిక వ్యవహారాల్లో ప్రజలతో సహకరించే విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన సహచరులతో తీర్థయాత్ర చేయడానికి మక్కా వైపు వెళుతుండగా, మక్కా నాయకులు వారి మక్కా ప్రవేశాన్ని అడ్డుకున్నారు. రోజుల తరబడి చర్చల తరువాత, ప్రవక్త(స) తన ప్రత్యర్థులతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మరియు వారి షరతులన్నింటినీ అంగీకరించారు. చాలా మంది ముస్లింలు ఆ సమయంలో ఇది అవమానకరమైన ఒప్పందమని, తమ హక్కులను వదులుకోరాదని  మరియు అన్యాయాన్ని భరించరాదని అన్నారు. కాని ప్రవక్త(స) శాంతిని  కోరి అన్యాయమైనప్పటికి  హుదైబియా ఒప్పందాన్ని అంగీకరించారు. ప్రవక్త(స) మక్కా తీర్థయాత్ర చేయకుండా మదీనాకు తిరిగి వచ్చారు. ఫలితం-  శాంతి ఒప్పందం, రెండు వైపులా అన్ని శత్రుత్వాలను నిలిపివేసింది.

ముస్లింలు హుదైబియాలో రాజకీయంగా ఓడిపోయినప్పటికీ, యుద్ధ బెదిరింపులు లేకుండా ఇస్లాం సందేశాన్ని విజయవంతంగా తెలియజేయడానికి అవకాశం లభించింది. ఒప్పందం తరువాత  రెండు సంవత్సరాలలోనే, మక్కా వ్యతిరేకులలో ఎక్కువ మంది ఇస్లాం మతంలోకి వచ్చి ప్రవక్త(స) అనుచరులయ్యారు. శాంతియుతంగా విరోదానికి/ప్రతిపక్షాలకు ముగింపు పలికారు. ప్రవక్త యొక్క సున్నత్, సమస్యలను నివారించడం, భవిష్యత్తులో న్యాయాన్ని సాధించి, లక్ష్యం చేరుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే మార్గాలను కనుగొనడం.

ప్రవచనాత్మక మిషన్ యొక్క లక్ష్యం గురించి తెలుసుకునే ముందు మనం ప్రవక్త(స) కాలం నాటి  చారిత్రక పరిస్థితులను  అర్థం చేసుకకోవాలి. ఏడవ శతాబ్దపు అరేబియా పరిస్థితులు ప్రవక్త(స) మదీనా  నగర-రాజ్యాన్ని స్థాపించడానికి అనుమతించాయి. ప్రవక్త (స) సున్నత్ ప్రకారం  శాంతియుత చర్చలు విఫలమైన తర్వాత రక్షణ కోసం మాత్రమే యుద్ధంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. 

ప్రవక్త(స) యొక్క మిషన్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజలు దేవుని ఆధారిత జీవితాలను గడపడానికి, వారి ఆత్మకు ఆధ్యాత్మిక పోషణను అందించడానికి, వారి నైతికతను పరిపూర్ణంగా చేయడానికి గాను  వారికి మార్గనిర్దేశం చేయడం మరియు స్వర్గంలో స్థిరపడగల సామర్థ్యం గల విధంగా వ్యక్తులగా  శుద్ధి చేయడం. ప్రవక్త(స) జీవితం,  ప్రవక్త(స) చూపిన ప్రతి ఉదాహరణ- శాంతి, సహనం అనుసరించడానికి విలువైనవి.

పూర్వపు ప్రవక్తలు ఒకే దేవుడిని నమ్మినందుకు  హింసించబడ్డారు, కానీ నేడు మనకు మత స్వేచ్ఛ మరియు ఆలోచనా స్వేచ్ఛ ఉంది. ప్రాచీన యుగంలోని ప్రవక్తలు వారి స్థానిక సమాజాన్ని మాత్రమే ప్రభావితం చేయగలిగితే, నేడు ఆధునిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా దైవిక సందేశాన్ని తెలియజేయడానికి మనకు అవకాశం ఉంది.

అదేవిధంగా, శాస్త్రీయ ఆవిష్కరణలు,  విశ్వం యొక్క సృష్టి మరియు ప్రకృతి నియమాల గురించి మనకు అద్భుతమైన ఆలోచనలను అందిస్తాయి. అవి సృష్టికర్తపై మనకున్న విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.ఈ పరిణామాలు  ఈ రోజు విశ్వాసులు దైవిక సందేశాన్ని మరింత ఉత్సాహంతో తెలియజేయాలని  ప్రవచనాత్మక మిషన్‌ను కొనసాగించాలని సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుకుంటున్నాడని సూచిస్తున్నాయి. ఇది శాంతియుతమైన మేధోపరమైన మరియు ఆధ్యాత్మిక క్రియాశీలత, దీనికి ప్రస్తుత కాలంలో ముస్లింలు తమను తాము అంకితం చేసుకోవాలి.

 


రచయిత్రి మరియా ఖాన్:

ఇస్లామిక్ పండితురాలు. శాంతి కార్యకర్త.

తెలుగు అనువాదం: ముహమ్మద్ అజ్గర్ అలీ.


No comments:

Post a Comment