13 December 2023

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లిం పురుషులు & మహిళల పాత్ర Role of Muslim Men & Women in India's Freedom Movement

 భారతదేశంలోని అన్ని తరగతులు,వర్గాల పురుషులు మరియు మహిళల త్యాగం మరియు సుదీర్ఘ పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన భారత దేశం స్వాతంత్ర్యం పొందడం జరిగింది. భారత జాతీయోద్యమ చరిత్రలో భారతీయ ముస్లింల పాత్రను వివరించక పోతే  అది అసంపూర్ణంగా ఉంటుంది

భారత దేశం లో ముస్లింలు దేశ స్వాతంత్ర్యం కోసం ఇతర వర్గాలతో భుజం భుజం కలిపి పోరాడారు ఫరైజీ మరియు వహాబీ ఉద్యమాలు బ్రిటీష్ వారిని తరిమికొట్టడానికి ప్రారంభమైనవి. ముస్లిములు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. ముస్లిములు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి పోరాట యోధులుగా చెప్పబడతారు.

భారత స్వాత్రంత్య ఉద్యమ  చరిత్రలో జూన్ 23, 1757లో బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పలాషి (ప్లాసీ), యుద్ధం లో తొలిసారిగా బ్రిటిష్ వారిని ఎదిరించాలని పిలుపు ఇచ్చి నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా భారతీయ పాలకులను మేల్కొల్పారు.. కాని ప్లాసీ, యుద్ధం లో నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా ఓడిపోయాడు మరియు 24 సంవత్సరాల వయస్సులో ఉరితీయబడ్డాడు

పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన 1780 మరియు 1790 లలో మొదటి స్వాతంత్ర్య పోరాటం మైసూరియన్ పాలకుడు, హైదర్ అలీ మరియు అతని కుమారుడు టిప్పు సుల్తాన్, అద్వర్యం లో జరిగింది. 1799లో జరిగిన నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను లార్డ్ వెల్లెస్లీ చంపాడు.

చివరి మొఘల్ చక్రవర్తి, బహదూర్ షా జఫర్, 1857లో మొదటి భారత  స్వాతంత్ర్య పోరాటానికి(సిపాయుల తిరుబాటు) నాయకత్వం వహించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన బఖ్త్ ఖాన్ 1857 తిరుగుబాటులో తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించాడు. అనుభవజ్ఞుడైన ఆర్మీ-మాన్, భక్త్ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సుబేదార్‌గా పనిచేశాడు. బఖ్త్ ఖాన్. బలమైన మరియు శక్తివంతమైన తిరుగుబాటు కార్యకలాపాలు బ్రిటీష్ పాలకులను బయపెట్టినవి.. 1859 మేలో బ్రిటీషర్లు బఖ్త్ ఖాన్ ను కాల్చి చంపారు.

స్వాతంత్ర్య పోరాటానికి ముస్లింలు మసీదులను ఉపయోగించారు. ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర మసీదులో ఒక ఇమామ్ భారత స్వాతంత్ర్యం గురించి ప్రసంగిస్తున్నప్పుడు, బ్రిటిష్ సైన్యం ఆ మసీదులోని ముస్లింలందరినీ కాల్చిచంపింది.

గదర్ పార్టీకి చెందిన బర్కతుల్లా, సయ్యద్ రెహమత్ షా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. పారిశ్రామికవేత్త మరియు బొంబాయి లో  కోటీశ్వరుడు అయిన  ఉమర్ సుభానీ, స్వాతంత్ర  ఉద్యమ సమయం లో  ఖర్చుల కోసం గాంధీజీకి ఖాళీ చెక్కును అందించాడు మరియు స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. మౌలానా హస్రత్ మోహానీ తన కవిత్వంతో యువ హృదయాలలో స్వేచ్ఛా శోభను నింపాడు.

షాజహాన్‌పూర్‌కు చెందిన ముహమ్మద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్, కాకోరి (లక్నో) కుట్ర కేసులో ఉరిశిక్ష పొందాడు. ఉరి తీయక ముందు ముహమ్మద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ ను అంతిమ కోరిక అడిగినప్పుడు, “ తన మృత శరీరం పై కప్పే వస్త్రం లో తన మాతృభూమి యొక్క కొంచెం మట్టిని కోరుకొన్నాడు.

'ఫ్రాంటియర్ గాంధీ' అని పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మహాత్మా గాంధీ ప్రధాన అనుచరుడు. గఫార్ ఖాన్ 1919లో రౌలట్ చట్టాలపై ఆందోళన సమయంలో కాంగ్రెస్  రాజకీయాలలోకి ప్రవేశించాడు. మరుసటి సంవత్సరం ఖిలాఫత్ ఉద్యమంలో చేరాడు. 

 భారతదేశం యొక్క గొప్ప స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి విద్యా శాఖ మంత్రి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన చివరి శ్వాస వరకు భారతదేశానికి సేవ చేస్తూనే ఉన్నాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కేవలం 16 సంవత్సరాల వయస్సులో భారతదేశ స్వాతంత్ర్యంలో మొదటిసారి పాల్గొన్నాడు.

కేరళకు చెందిన మహ్మద్ అబ్దుర్ రహిమాన్, గాంధీ ప్రారంభించిన  ఉప్పు సత్యాగ్రహా౦ లో 7 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. మహ్మద్ అబ్దుర్ రహిమాన్ ముస్లిం లీగ్ పార్టీ యొక్క రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలను సమీకరించాడు. 1945 నవంబర్ 23న కొడియాత్తూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన వెంటనే తుది శ్వాస విడిచారు.

భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ ప్రేరణతో, అబ్బాస్ అలీ తన యుక్తవయస్సులో తన విద్యను పూర్తి చేసిన తర్వాత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు. అబ్బాస్ అలీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లేదా 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో చేరాడు. బ్రిటిష్ వారిచే అబ్బాస్ అలీ కోర్టు మార్షల్ చేయబడ్డాడు మరియు మరణశిక్ష విధించబడ్డాడు.

సయ్యద్ మహ్మద్ షర్ఫుద్దీన్ క్వాద్రీ 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొన్నాడు ప్రతి పోరాటంలో మహాత్మా గాంధీకి గా మద్దతు ఇచ్చాడు మరియు మహాత్మా గాంధీ తో పాటు  జైలులో బంధించబడ్డాడు. 

ప్రతిరోజూ వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు జైలు పాలవుతున్నప్పుడు, అసఫ్ అలీ ముందుకు వచ్చి వారికి బెయిల్ కోసం వారి న్యాయ పోరాటాలు చేశారు. అసఫ్ అలీ, జవహర్‌లాల్ నెహ్రూతో పాటు జైలులో కూడా ఉన్నాడు. అసఫ్ అలీ 'క్విట్ ఇండియా ఉద్యమం'లో పాల్గొన్నాడు. 1 ఏప్రిల్ 1953, అసఫ్ అలీ భారతదేశ దౌత్య ప్రతినిధిగా పనిచేస్తున్నప్పుడు బెర్న్ (స్విట్జర్లాండ్)లో మరణించారు. అసఫ్ అలీ గౌరవార్థం 1989లో భారత దేశం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది..

1886 డిసెంబర్ 22న బీహార్‌లోని పాట్నా జిల్లాలో జన్మించిన మౌలానా మజరుల్ హక్ 1897 కరవు సమయంలో తన సామాజిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందారు. సహాయ నిరాకరణ మరియు ఖిలాఫత్ ఉద్యమాలు మరియు చంపారన్ సత్యాగ్రహాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. మౌలానా మజరుల్ హక్ జనవరి 1930లో మరణించాడు. మౌలానా మజరుల్ హక్ విద్యను ప్రోత్సహించడం కోసం తన మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. మౌలానా మజరుల్ హక్ గౌరవార్థం, ఏప్రిల్ 1988లో, పాట్నాలో మౌలానా మజరుల్ హక్ అరబిక్ మరియు పర్షియన్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

'హీరో ఆఫ్ జలియన్‌వాలాబాగ్‌గా పేరు గాంచిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, 1919 మార్చి 30న చారిత్రక జలియన్‌వాలాబాగ్‌లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులను దూషిస్తూ ఉపన్యాసం ఇచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వం డా. కిచ్లూను చర్చలకు ఆహ్వానించింది, కానీ వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరించింది. 

మగ్‌ఫూర్ అహ్మద్ అజాజీ బీహార్‌కు చెందిన భారతీయ రాజకీయ కార్యకర్త. కళాశాల విద్య అనంతరం మగ్‌ఫూర్ అహ్మద్ అజాజీ మహాత్మా గాంధీని అనుసరించి, 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. మగ్‌ఫూర్ అహ్మద్ అజాజీ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తర్వాత, విదేశి వస్తువులను బహిష్కరించడం మరియు తగులబెట్టడం, ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం, వ్యక్తిగత సత్యాగ్రహం, సైమన్ కమీషన్ వ్యతిరేకత మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు.

యూసుఫ్ మెహర్ అలీ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామ్యవాద నాయకుడు. యూసుఫ్ మెహర్ అలీ నేషనల్ మిలీషియా, బాంబే యూత్ లీగ్ మరియు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు మరియు అనేక రైతు మరియు ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాత్ర పోషించాడు. యూసుఫ్ మెహర్ అలీ అతను "సైమన్ గో బ్యాక్" మరియు "క్విట్ ఇండియా" అనే నినాదాలను సృష్టించాడు మరియు మహాత్మా గాంధీతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగమయ్యాడు. యూసుఫ్ మెహర్ అలీ అజ్ఞాత విప్లవ ఉద్యమంలో పాల్గొన్నాడు మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో ముందంజలో ఉన్నాడు.

అబిద్ హసన్ సఫ్రానీ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నేతాజీకి నమ్మకమైన సహాయకుడు, INA మేజర్ మరియు తరువాత, స్వతంత్ర భారతదేశపు తొలి దౌత్యవేత్తలలో ఒకరు. "జై హింద్" అనే నినాదాన్ని  సృష్టించాడు.

సహాయ నిరాకరణ ఉద్యమం మరియు స్వదేశీ ఉద్యమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఆనాడు షుగర్ కింగ్ గా ఉన్న జనాబ్ సాబుసిద్దిక్ తన వ్యాపారాన్ని బహిష్కరణ రూపంలో వదులుకున్నాడు. 

ఖోజా మరియు మెమన్ కమ్యూనిటీలు ఆ సమయంలో అతిపెద్ద వ్యాపార సంస్థలను కలిగి ఉన్నాయి మరియు విదేశి వస్తు బహిష్కరణకు మద్దతుగా తమ సంస్థలను మూసివేసారు.  

ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు జర్నలిజం రంగంలో కూడా చురుకుగా ఉన్నారు. మౌలానా ఆజాద్ తన కలాన్ని బ్రిటిష్ వారిపై ప్రయోగించాడు. నిజానికి, భారత స్వాతంత్య్ర పోరాటంలో బహిరంగంగా అమరులైన మొదటి జర్నలిస్టు కూడా ఒక ముస్లిం - మౌలానా బకర్

ముస్లిం మహిళల సేవలను,త్యాగాలను  ప్రస్తావించకుండా భారత జాతీయ ఉద్యమ చరిత్ర అసంపూర్ణంగా ఉంటుంది. 

1857తిరుగుబాటులో దాదాపు 225 మంది ముస్లిం మహిళలు ప్రాణాలు అర్పించినట్లు అంచనా.

ముస్లిం విప్లవకారుల సహకారం 19వ శతాబ్దపు మొదటి అర్ధభాగం నుండి చూడవచ్చు. 

1857-58లో ఢిల్లీలో ఉరితీయబడిన ముస్లింల సంఖ్య 27,000. 1857తిరుగుబాటు సమయంలో, అస్ఘరీ బేగం (ఖాజీ అబ్దుర్ రహీమ్ తల్లి, థానా భవన్, ముజఫర్‌నగర్ విప్లవకారుడు) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు మరియు సజీవ దహనం చేయబడింది. 1857 తిరుగుబాటులో దాదాపు 225 మంది ముస్లిం మహిళలు ప్రాణాలు అర్పించినట్లు అంచనా.

అవధ్ విప్లవ రాణి బేగం హజ్రత్ మహల్, మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో అలుపెరగని నాయకురాలు, బ్రిటీష్ పాలకుడు సర్ హెన్రీ లారెన్స్‌ను కాల్చి చంపి, 1857 జూన్ 30న చిన్‌హాట్ వద్ద జరిగిన నిర్ణయాత్మక యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించింది. 

స్వాతంత్ర్య పోరాటం సమయం లో బి-అమ్మ  నాయకత్వం లోని వందలాది మహిళలు బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా తమ పురుషులతో కలిసి పోరాడారు..

అబాదీ బేగం (మౌలానా ముహమ్మద్ అలీ తల్లి), అమ్జాదీ బేగం (మౌలానా ముహమ్మద్ అలీ భార్య), అమీనా త్యాబ్జీ (అబ్బాస్ త్యాబ్జీ భార్య), బేగం సకీనా లుక్మానీ (డాక్టర్ లుక్మానీ భార్య మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ కుమార్తె), నిషాత్-ఉన్-నిసా ( బేగం హస్రత్ మోహనీ), సాదత్ బానో కిచ్లేవ్ (డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లేవ్ భార్య), జులేఖా బేగం (మౌలానా ఆజాద్ భార్య), మెహర్ తాజ్ (ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కుమార్తె), జుబైదా బేగం దౌదీ (షఫీ దౌదీ భార్య, బీహార్ జాతీయవాది). )  మరియు అనేక ఇతరులు భారత స్వాత్రత్య ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. .

స్వాతంత్ర్య ఉద్యమంలో 'గ్రాండ్ ఓల్డ్ లేడీ'గా ప్రసిద్ధి చెందిన అరుణా అసఫ్ అలీ. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో భారత జెండాను ఎగురవేసి పేరుగాంచింది. 1932లో, రాజకీయ ఖైదీల పట్ల అమానవీయ ప్రవర్తనకు తీహార్ జైలులో నిరాహారదీక్ష చేసింది, ఇది వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచింది.

 దేశంలోని ఇతర మతాల ప్రజలతో కలిసి తమ దేశం కోసం పోరాడిన ఇలాంటి ధైర్యవంతులు అయిన ముస్లిం మహిళలు  ఇంకా చాలా మంది ఉన్నారు.

"జై హింద్", "క్విట్ ఇండియా", "సైమన్ గో బ్యాక్", "ఇంక్విలాబ్ జిందాబాద్", "సర్ఫరోషి కి తమన్నా, అబ్ హమారే దిల్ మే హై", "సారే జహాన్ సే అచ్ఛా హిందుస్తాన్ హమారా" అనే ప్రసిద్ధ దేశభక్తి నినాదాలు భారతీయులలో సాధారణంగా ఉపయోగించబడతాయి. ఈ నినాదాలను స్వాతంత్ర్య పోరాట సమయం లో  ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు రూపొందించారు. 

 

No comments:

Post a Comment